నెహ్రూకు విధేయుడు పటేల్‌


Sat,September 21, 2019 12:39 AM

సర్దార్‌ పటేల్‌ స్వతంత్రంగా, ప్రధానికి తెలియకుండా, ప్రధాని నెహ్రూ ఆమోదం లేకుండా చాటుమాటున ఏవైనా నిర్ణయాలు చేశారనడం పటేల్‌ సమున్నత వ్యక్తిత్వాన్ని కించపరుచడమే-పటేల్‌ను గౌరవించడం కాదు. కశ్మీర్‌, హైదరాబాద్‌ తదితర అంశాలపై ప్రధాని జవహర్‌లాల్‌ అభిప్రాయాలే తన అభిప్రాయాలని, తమ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఉన్నాయని ప్రచారం చేస్తున్న వారు నీచులని పటేల్‌ స్పష్టం చేశారు.


జమ్ము కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ ఆర్టికల్‌, 35-ఎ ఆర్టికల్‌ రద్దుతో పాటు రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన ప్రాథమికహక్కులనూ రద్దు పరిచినారా అన్న అనుమానం కలుగడం సహజం. నలభై ఐదురోజుల నుంచి శ్రీనగర్‌ లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు గృహనిర్బంధం అనుభవిస్తున్నారు. వీరిలో ఇద్దరు గతంలో బీజేపీతో చేతులు కలిపినవారే.


రజ్వీని మించినోళ్లు, నాజీల నేస్తగాళ్లు... అంటూ కూనిరాగం తీస్తూ అడుగుపెట్టాడు మిత్రుడు యాదగిరి. మూడేండ్ల కింద ట ఒక రాహుకాలంలో (రాత్రివేళ రాహుకాలం ఉంటుందా అన్న అనుమానం ఉండొద్దు) హఠాత్తుగా నోట్ల రద్దు జరిగినప్పుడు యాదగిరి పడ్డ ఆందోళన సహేతుకమైనదని గత మూడేండ్లలో ఘనంగా రుజువైంది. యాదగిరి మేధావి కాడని చిన్నచూపు చూడొద్దు. ఆయన కూనిరాగం లల్లాయ్‌ పాట అని కొట్టేయడానికి వీలులేదు. ఆ కూనిరాగంలో అర్థం ఉంది, బలం ఉంది, అన్నిటినిమించి చారిత్రక వాస్తవాలున్నాయి. నరరూప రాక్షసుడు, తెలంగాణ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చిన మతోన్మాద కిరాతకుడు రజ్వీ పోయిండు పీడపోయింది అని సంబురపడ్డ వాళ్లకు ఆశాభంగం తప్పడం లేదు. డెబ్బయి ఏండ్లకే నాటి రజ్వీని మించినోళ్లు ఈరోజు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, సూరత్‌ నుంచి చిరపుంజి వరకు రాజ్యం చేస్తున్నారు-రంకెలు వేస్తున్నారు. ‘నీకూ నీవారు లేరు, నాకూ నావారు లేరు, చల్‌ మోహనరంగ...’ అన్నట్లు, అమెరికా అధ్యక్షుడు (పాపులర్‌ వోటింగ్‌లో ఓడిన, జాతి ద్వేషంతో, విపరీత అసహనంతో అమెరికా అమెరికన్లది అంటూ అక్కడి లక్షలాది భారతీయుల జీవితాలతో చెలగాటమాడుతున్న, రాను న్న ఎన్నికలలో భారతీయుల వోట్ల కోసం గాలం వేస్తున్న) డొనాల్డ్‌ ట్రంప్‌ వీళ్లకు చెలికాడు ఇప్పుడు. 2020 అధ్యక్ష పదవి ఎన్నికల తరువాత ట్రంప్‌ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో క్రికెట్‌ ఆడి ఇస్లామాబాద్‌లో బిర్యానీ తింటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.

ఈమధ్య న్యూయా ర్క్‌ టైమ్స్‌ పత్రిక ఈ దేశంలోని హిట్లర్‌ భక్తుల పట్టికను ప్రకటించింది. ఇక్కడి హిట్లర్‌ భక్తులు పిరికిపందలు-బ్రిటిష్‌ పాలకులు అరెస్టు చేయగా నే క్షమార్పణ పత్రాలు రాసిచ్చి బయటపడ్డవాళ్లు. ‘పటేల్‌సైన్యం’ రాగానే హైదరాబాద్‌ సంస్థా నం విముక్తి జరిగిందని, ఏడవ నిజామ్‌ రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ లొంగిపోయాడని లోకల్‌ చేలాలు చంకలు కొట్టుతున్నారు. అప్పటి దేశ వ్యవహారాల మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు సొంత సైన్యం లేదు. పటేల్‌ సైన్యం, మోదీ సైన్యం, అమిత్‌షా సైన్యం ఉండవు. ఉన్నది ఒక్కటే-అది భారత సైన్యం. ఆరోజు (1948 సెప్టెంబర్‌ 13 నుంచి 17 వరకు నాలుగు రోజులు) హైదరాబాద్‌ సంస్థానం మీద దాడి (ఆపరేషన్‌ పోలో) చేసింది, ఈరోజు భారత్‌-పాక్‌ సరిహద్దుల వద్ద సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తున్నది భారత సైన్యం. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సమ్మతి, అనుమతి లేకుండా పటేల్‌ స్వయంగా హైదరాబాద్‌ సంస్థానం మీదికి నాలుగు దిశల నుంచి సేనలను పంపాడని లోకల్‌ చేలాలు గల్లీగిత్తలు చేస్తున్న ప్రచారం అర్ధరహితమైనది. మతోన్మాదం ప్రకోపించినప్పుడు మస్తిష్కం మొద్దుబారి ఇంగితజ్ఞానం నశించడం సహజం. నెహ్రూ ప్రధా ని. నెహ్రూ నిర్ణయాలను, విధానాలను ఆయన మంత్రివర్గసభ్యుడుగా క్రమశిక్షణ గల విధేయుడుగా సర్దార్‌ పటేల్‌ సామర్థ్యంతో, పరిపాలనాదక్షతతో అమలు జరిపారు.

సర్దార్‌ పటేల్‌ స్వతంత్రంగా, ప్రధానికి తెలియకుండా, ప్రధాని నెహ్రూ ఆమోదం లేకుండా చాటుమాటున ఏవైనా నిర్ణయాలు చేశారన డం పటేల్‌ సమున్నత వ్యక్తిత్వాన్ని కించపరుచడమే-పటేల్‌ను గౌరవించడం కాదు. కశ్మీర్‌, హైదరాబాద్‌ తదితర అంశాలపై ప్రధాని జవహర్‌లాల్‌ అభిప్రాయాలే తన అభిప్రాయాలని, తమ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఉన్నాయని ప్రచారం చేస్తున్న వారు నీచులని పటేల్‌ స్పష్టం చేశారు. జవహర్‌లాల్‌కు తాను విధేయుడినని జవహర్‌ లాల్‌కు రాసిన ఒక లేఖలో పటేల్‌ వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది- ‘..My services will be at your disposal, I hope, for the rest of my life and you will have unquestioned loyalty and devotion from me in the cause for which no man in India has sacrificed as much as you have done. Our combination is unbrakable and there lies our strength..’ జవహర్లాల్‌ పట్ల తన విధేయత శంకించరానిదని, దేశం కోసం జవహర్‌ లాల్‌ చేసినంత త్యాగం ఈ దేశంలో ఇంకెవరూ చేయలేదని పటేల్‌ అన్నారు.

అసహనంతో, మత దురభిమానంతో, విద్వేషపూరిత ధోరణులతో మనిషికి మనిషికి మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిత్తి మార్గంలో నడిపిస్తున్న వీళ్లు పటేల్‌ తమ ‘మడికట్టు మఠం’ వాడనుకుంటున్నారు. మానవతావాది, మహా నాయకుడు పటేల్‌ తానేమిటో ఈ మాటల్లో చూపించాడు- :‘...Religion is a matter between man and his maker and its mixing with politics would be dangerous...ours is secular state, we cannot fashion our policies or shape our conduct in the way Pakistan does it. We must see that our secular ideals are actually realised in practice...’ జాతిపిత గాంధీ ఎనభై ఏండ్ల కిందటనే ఎంతో దూరదృష్టితో ఊహించాడు పటేల్‌ను రానున్న రోజుల్లో మతోన్మాదులు తమవాడుగా చిత్రించి దేశ విచ్ఛిత్తికి కుట్ర జరుపుతారని. అందువల్ల గాంధీజీ తన తరువాత తన భాష మాట్లాడేవాడు నెహ్రూ ఒక్కడే అని విశ్వసించి దేశ సమైక్యత పరిరక్షణ దృష్ట్యా స్వతంత్ర భారత ప్రధాని పదవికి జవహర్‌లాల్‌ అన్నివిధాల అర్హుడని నిర్ణయించాడు. గాంధీజీ మార్గదర్శకత్వంలో తానే సారథి అయి బార్డోలి రైతు ఉద్యమా న్ని నిర్వహించిన పటేల్‌కు బాగా తెలుసు తెలంగాణ ప్రజా ఉద్యమాల విలువ, ప్రాధాన్యం, ప్రభావం. నాలుగు రోజుల సైనిక చర్యతోనే (విచిత్రాతి విచిత్రం ఏమిటంటే సైనిక దళాలతో- ముందు వైమానిక బలంతో-నాలుగు దిశల నుంచి హైదరాబాద్‌ సంస్థానంపై దాడి చేసి దానిని ‘ఇది సింప్లీ పోలీసు చర్య’ అని అన్నారు ప్రపంచానికి ఏమీ తెలియన ట్లు).

రెండు వందల ఏండ్ల నిజామ్‌ రాచరిక వ్యవస్థ కుప్పకూలిందని, ఏడవ నిజామ్‌ రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భారత సేనాని జనరల్‌ జె.ఎన్‌.చౌధరి ముందు దండం పెట్టి లొంగిపోయాడని రాజకీయ దురంధరుడు, పరిపాలనా దక్షుడు పటేల్‌ భావించి ఉండరు-ఈరోజు లోకల్‌ చేలాలు వసపిట్టలవలె వాగుతున్నారు ‘పటేల్‌ సైన్యం’తోనే హైదరాబాద్‌ విముక్తి జరిగిందని! దాదాపు యాభై ఏండ్ల తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ప్రజా ఉద్యమాల ఫలితంగా నిజామ్‌ రాచరిక పరిపాలనా వ్యవస్థ బాగా బలహీనపడి నైతిక బలాన్ని కోల్పోయింది. మహా పండితుడు సురవరం ప్రతాపరెడ్డి, షోయబుల్లాఖాన్‌ వంటి జాతీయవాదులు, దేశభక్తులైన పత్రికా సంపాదకులు, పత్రికా రచయితలు మతోన్మాది రజ్వీ మూకల బెదిరింపులకు, హెచ్చరికలకు భయపడకుండా కలం బలాన్ని ప్రదర్శించడం వల్ల ఏడవ నిజామ్‌ ప్రభుత్వం నిర్వీర్యమైంది. కాళోజీ, దాశరథి, వట్టికోట, మగ్దూమ్‌ వంటి మహాకవులు గళమెత్తి, కలమెత్తి అక్షరశక్తితో ప్రతిఘటించడం వల్ల తెలంగాణ ప్రజలలో అపూర్వ చైతన్యం రేకెత్తి, రగుల్కొని ఏడవ నిజామ్‌ ప్రభుత్వం వెన్నెముక విరిగింది; తెలంగాణ తల్లులు, ఆడబిడ్డలు సైతం తెగించి వడిసెలను వజ్రాయుధాలుగా ఉపయోగించడం వల్ల, ప్రపంచ ప్రఖ్యాత తెలంగాణ సాయుధ పోరాటం వేలాది పోరాటయోధులను ఉద్యమజ్వాలల్లో ఆహుతి చేయడంవల్ల నిజామ్‌ రాచరిక పరిపాలనా వ్యవస్థ, సైనిక యంత్రాంగం జీవచ్ఛవాలై కుప్పకూలాయి. ఈ కఠోర వాస్తవాలను రజ్వీ నాయకత్వంలోని మతోన్మాదులు గుర్తించలేకపోయారు. ఆ రోజైనా, ఈ రోజైనా, రేపైనా మతోన్మాదులు వాస్తవాలను, ప్రజాబలాన్ని, ఉద్యమశక్తిని గుర్తించలేరు. నిజామ్‌ ప్రభుత్వ సైన్యాధిపతి జనరల్‌ ఇద్రూస్‌ మతోన్మాది రజ్వీకి భిన్నంగా ఆలోచించి తన సైన్యం గెలువలేదని ముందే చెప్పి నిజామ్‌ ప్రభువు ఆగ్రహానికి గురైనాడు. ఏమైనా, తెలంగాణ ప్రజా ఉద్యమాల తాకిడితో వెన్నెముక విరిగి, సర్వాంగ వైకల్యం ప్రాప్తించిన నిజామ్‌ రాచరిక ప్రభుత్వం నాలుగు రోజుల్లోనే పరాజయం పాలై శరణాగతి మంత్రం పఠించింది-స్వతంత్ర భారత ప్రభుత్వం కోరింది హైదరాబాద్‌ సంస్ధానం విలీనాన్ని మాత్రమే-సంస్థానం ప్రజల, విశేషించి తెలంగాణ ప్రజల విముక్తిని కానే కాదు. భారత ప్రభుత్వం కోరిక నెరవేరింది.తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం సాధించుకుని, విముక్తి పొందడానికి, స్వాతంత్య్ర సమీరాలను పీల్చడానికి 2014 జూన్‌ 2 వరకు పోరాడక తప్పలేదు.
Prabhakar
నిజామ్‌ పరాజయం పటేల్‌ విజయం కాదు-తెలంగాణ ప్రజల విజ యం. 1948 సెప్టెంబర్‌ 17 నాటి నుంచి హైదరాబాద్‌ సంస్థానంలో జనరల్‌ చౌదరి నాయకత్వాన సైనిక ప్రభుత్వం ఏర్పడింది; ఇవాళ్టి కశ్మీ రు వలె అప్పటి తెలంగాణ జీవించేహక్కును సైతం కోల్పోయి ఒక పోలీ సు ఉన్నతాధికారి నంజప్ప నాయకత్వంలో పోలీసు శిబిరంగా, నిర్బంధశాలగా మారింది. జనరల్‌ చౌదరి పాలన తరువాత ఒక సివిలియన్‌ అధికారి ఎమ్‌.కె.వెల్లోడి పాలన వచ్చింది-ఏడవ నిజామ్‌ రాజుకు పటేల్‌ ఆమోదముద్రతో రాజ్‌ప్రముఖ్‌ పదవి లభించింది. తెలంగాణ ప్రజలు తమ విముక్తి పోరాటాన్ని, స్వాతంత్య్ర సమరాన్ని కొనసాగించ క తప్పలేదు. ఒక్క రజ్వీ పోతే ఈరోజు ఎందరో రజ్వీలు రంగం మీద కన్పిస్తున్నారు. అప్పటి రజ్వీ దాపరికం లేకుండా మతోన్మాదం జండా ఎత్తి ముందుకొచ్చాడు. ఇప్పటి రజ్వీలు ప్రజాస్వామ్యం ముసుగుతో కత్తులు దూస్తున్నారు-వీళ్లకు తొందరెక్కువ. నిజామ్‌ పాలనలో ఎన్నడూ తెలంగాణకు వరుసగా నలభై ఐదు రోజులు తాళం పడలేదు. ముస్లిం నిజామ్‌ రాజువలె ట్రావెన్‌కూర్‌-కొచ్చిన్‌ హిందూరాజు తనది స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్నారు. ఆ హిందూరాజు మీద ఈగ వాల లేదు! 1948 జనవరి 30 రోజు సాయంత్రం ఢిల్లీలో ఒక మతోన్మాది పిస్టల్‌ గుళ్లకు బలి కావడానికి కొన్ని నిమిషాల ముందు వరకు పటేల్‌తో చర్చలలో, అంతకుముందు కె.ఎమ్‌.మున్షీతో చర్చలలో గాంధీజీ హైదరాబాద్‌ సంస్థానంపై బలప్రయోగాన్ని (అది ఏ రూపంలో ఉన్నప్పటికీ) గట్టిగా వ్యతిరేకించారు. జమ్ముకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ ఆర్టికల్‌, 35-ఎ ఆర్టికల్‌ రద్దుతో పాటు రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన ప్రాథమికహక్కులనూ రద్దు పరిచినారా అన్న అనుమానం కలుగడం సహజం. నలభై ఐదు రోజుల నుంచి శ్రీనగర్‌లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు గృహనిర్బంధం అనుభవిస్తున్నారు. వీరిలో ఇద్దరు గతంలో బీజేపీతో చేతులు కలిపిన వారే. ఇందులో ఒకరు అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ నాయకత్వంలోని కేంద్రమంత్రివర్గంలో కీలకమైన విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయమంత్రి!

459
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles