శత్రువును సంస్కరించే సత్యాగ్రహం


Sat,September 14, 2019 01:21 AM

తన కోసం కాకుండా ఇతరుల కోసం సత్యాగ్రహాన్ని వినియోగించాలి. చిన్నచిన్న ఆయుధాలన్నీ వాడిన పిదప చివరగా దీన్ని ప్రయోగించాలి. దుర్మార్గునికీ, దుర్మార్గానికీ ఉన్న తేడాను సత్యాగ్రహి విస్మరించడు.దుర్మార్గుణ్ణి కూడా ద్వేషించడు. సత్యాగ్రహి చెడు నడతను మంచితో; కోపాన్ని ప్రేమతో జయిస్తాడు.అసత్యాన్ని సత్యంతో, హింసను అహింసతో సాధిస్తాడు.

Venu
మహాత్మా గాంధీజీ ప్రతిపాదించిన సత్యాగ్రహ భావన 113 ఏండ్ల నుంచి దాని ప్రాసంగికత ప్రపంచవ్యాప్తం గా వివిధ దేశాల్లో నిరూపించబడుతూ వస్తున్నది. పలు మత ధర్మశాస్ర్తాల నుంచి, ఎంపిక చేసుకున్న ధర్మాల నుంచి గాంధీజీ రూపొందించిన ఈ శాంతియుత పోరాటం ఎలాంటి నష్టం కలిగించదు. అంతేకాకుండా విభేదించే ఈ రెం డు వర్గాలు ఈ ప్రక్రియ ద్వారా మరింత ప్రయోజనకరంగా మారుతాయి. శత్రువులను సైతం సంస్కరించేదే సత్యాగ్రహం.
1906 సెప్టెంబర్ 11న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ పట్టణంలోని యూదుల థియేటర్ ఎంపైర్‌లో భారత సంతతికి చెందిన 3 వేలమంది కలిశారు. అంతకు కొన్నిరోజుల కిందట ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ చేసింది. ఇటువంటి వారంతా నమోదు కావాలనీ, అలా నమోదైన తర్వాత ఇచ్చే పత్రం ఏ క్షణంలో అడిగినా అధికారులకు చూపాలని, లేకపోతే 100 పౌం డ్ల దండన లేదా 3 నెలల జైలుశిక్ష తప్పదని ఆ రాబోయే చట్టం చెబుతున్నది. తమిళం, తెలుగు, గుజరాతీ, హిందీ వంటి భాషలు మాట్లాడే వీరు పొట్ట పోసుకోవడానికి రకరకాల శ్రమ చేస్తూ అక్కడి యజమానుల కు సేవలు చేస్తూ కూలీలుగా పిలువబడేవారు. వీరికి బారిష్టర్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కూలీ బారిష్టర్. ఆరోజు జరిగిన సమావేశానికి ట్రాన్స్‌వల్ అసోసియేషన్ ఛైర్మన్ అబ్దుల్ ఘానీ అధ్యక్షత వహించారు. నాలుగు భాషల్లో పీడిత భారత సంతతి ప్రతినిధులు ఆగ్రహంతో ప్రసంగించారు. గాంధీ సిద్ధం చేసిన క్రియా ప్రణాళికను హజీహబీబ్ చదువుతూ రాబోయే చట్టానికి సహకరించబోమని ప్రతిపాదించారు. మామూలు సం ప్రదాయానికి విభిన్నంగా తమ ఆమోదాన్ని ఓటుగా వ్యక్తీకరించాలనీ, దానికి దైవమే సాక్షి అని కూడా ప్రకటించారు.

అప్పటికి అక్కడ కూలీలుగా అవమానింపబడే ఈ భారత సంతతికి ఓటుతో సహా ఎటువంటి హక్కుల్లేవు. అక్కడి యజమానులు వీరిని కొట్ట డం చాలా మామూలు. న్యాయస్థానాల్లోనూ వివక్ష ఉన్నది. అప్పటికీ గాం ధీ ప్రతిపాదించిన మార్గం ప్యాసివ్ రెసిస్టెన్స్. ఈ మాట భావాన్ని పూర్తిగా ఇవ్వలేకపోవడమే గాక, గందరగోళం కల్గిస్తున్నది. మరో మాట కోసం అన్వేషణ మొదలైంది, అప్పటికే గాంధీ దక్షిణాఫ్రికా వచ్చి పుష్కరం దాటిం ది. 1903 ఇండియన్ ఒపీనియన్ పత్రిక నిర్వహణ, 1904 ఫీనిక్స్‌లో టాల్‌స్టాయ్ కాలనీ స్థాపనతో గాంధీ కొంత గౌరవం, గుర్తింపు పొంది ఉన్నారు. దశాబ్దం పైగా మథనం జరిగింది. ఎటువంటి ఆవేశంతో, ఆత్రు తతో గాంధీ ఈ ఆలోచన ప్రతిపాదించలేదు. అహింసాత్మకమైన ప్రజల తిరుగుబాటు అది. ప్రత్యేకత ఏమంటే సామూహికమైనా అది వ్యక్తిగతమైన ప్రతిఘటన. దీనికి మంచిపేరు సూచించమని గాంధీ ఒక పోటీని ప్రకటించారు. టాల్‌స్టాయ్ ఫామ్‌లో గాంధీతోపాటు ఉండే బంధువు మగ న్‌లాల్ గాంధీ సదాగ్రహం అనే మాట ప్రతిపాదించాడు. దీన్ని గాంధీ సత్యాగ్రహం అని కొద్దిగా మార్చారు. ఇక్కడ సత్యం అంటే నిజం మాత్ర మే కాదు, ప్రేమ అని కూడా. అలాగే స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ, ప్రక్షాళన కూడా! బ్రిటిషువారు కొంతమంది ఈ విధానాన్ని గౌరవించడం కూడా ప్రారంభించారు. అది ప్రపంచస్థాయికి పెరుగడమే కాదు, క్రమం గా మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండేలా, లేక్ వలేసా వంటి నాయకులకు గొప్ప శాంతియుతమైన ఆయుధంగా మారింది.

..సత్యాగ్రహం అంటే సత్యాన్ని గ్రహించడం. సత్యాన్ని గ్రహించిన వాడు సత్యాగ్రహి. ఆ మరణాంతం సత్యాగ్రహి బాధలను సంతోషంగా సహిస్తాడు. ఎల్లప్పుడు పోరాడటానికే కాదు, రాజీపడటానికీ సిద్ధంగా ఉం టాడు. రాజీ అంటే భయం గానీ, అవమానం గానీ కాదు. గౌరవప్రదమైనదే రాజీ. అటువంటి రాజీ అవకాశాన్ని వదులుకోకూడదు. ఇంకోలా చెప్పాలంటే సత్యాగ్రహి.. ఆకస్మిక భయానికి లొంగడు, అగౌరవాన్ని సహించడు, ఇతరులను భయపెట్టడు, ప్రతిపక్షాన్ని అవమానించడు. న్యాయమార్గాన్ని విడనాడడు, అసాధ్యపు షరతులను ప్రతిపాదించడు, మరీ ఎక్కువ కోరికలు కోరడు, అట్లని వాటిని తగ్గించడు...
తన కోసం కాకుండా ఇతరుల కోసం సత్యాగ్రహాన్ని వినియోగించాలి. చిన్నచిన్న ఆయుధాలన్నీ వాడిన పిదప చివరగా దీన్ని ప్రయోగించాలి. దుర్మార్గునికీ, దుర్మార్గానికీ ఉన్న తేడాను సత్యాగ్రహి విస్మరించడు. దుర్మార్గుణ్ణి కూడా ద్వేషించడు. సత్యాగ్రహి చెడు నడతను మంచితో; కోపాన్ని ప్రేమతో జయిస్తాడు. అసత్యాన్ని సత్యంతో, హింసను అహింసతో సాధిస్తాడు.
ఇలా సాగుతుంది సత్యాగ్రహ భావన. ఈ వివరాలు గాంధీ రచనల్లో వివరంగా లభిస్తాయి. 2006 లో సత్యాగ్రహ భావనకు శతవార్షిక సందర్భంగా పబ్లికేషన్ డివిజన్ కోసం డాక్టర్ సవితాసింగ్ సత్యాగ్రహ అనే విలు వైన గ్రంథాన్ని, ఎన్నో ఫొటోల తో, ఆధారాలతో రచించారు.

1906 నాటికి దక్షిణాఫ్రికాలోని భారత సంతతి వారు ఒక భాష వారు కాదు, ఒక సంస్కృతి వారు కాదు, వారిలో ఐక్యత లేదు. ఇటువంటి నేపథ్యంలో గాంధీ ఒక ప్రయోగాన్ని దక్షిణాఫ్రికాలో చేశారు. ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లి రాజీపడటం, అగౌరవంగా జీవించడం సాధ్యం కాని గాం ధీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ నాయకుడిగా ఎదిగాడు. అక్కడ ఆయన కుటుంబ జీవితం పెద్ద సౌఖ్యంగా లేదు. ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు. అక్కడ బట్టలుతికేవారు కూడా లేరు. తనే ఆ పని నేర్చుకొని, భార్యకు నేర్పాడు. ఇద్దరు పిల్లలను సంరక్షిస్తూ, భార్యకు మంత్రసాని పని కూడా చేసిన పరిస్థితి ఆయనది.దక్షిణాఫ్రికా అనుభవం, స్థితప్రజ్ఞత గాంధీకి భారతదేశ రాజకీయ రం గంలో బాగా తోడ్పడ్డాయి. సత్యాగ్రహ ఆయుధం మరింత ప్రభావవంతంగా ఇక్కడ ప్రయోగించారు. ఇందులో హింస ఉండదు. కనుక శత్రువు కూడా భయపడకతప్పదు. ఫలితంగా శత్రువు కూడా దారికి వస్తాడు. ఈ సత్యాగ్రహ ప్రక్రియలో దుర్మార్గులు, బాధితులు క్రమంగా మెరుగవుతా రు. ఖండించేవారు, గేలి చేసేవారు ఉండవచ్చు కానీ సవ్యంగా, సమగ్రం గా సత్యాగ్రహాన్ని ప్రయోగిస్తే ఫలితం ఉంటుంది. 1989 ఏప్రిల్-జూన్ నెలల్లో చైనాలోని బీజింగ్ నగరం తియన్మాన్ స్కైర్‌లో జరిగిన విద్యార్థు ల శాంతియుత ప్రదర్శనకు స్ఫూర్తి అటెన్ బరో తీసిన గాంధీ సినిమా అనేది గాంధీ ప్రభావానికి ఇటీవలి గొప్ప ఉదాహరణ!

365
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles