గాలిలో మేడలు

Sat,July 13, 2019 12:35 AM

ఐదేండ్ల మోదీజీ పాలనలో ఆర్థిక వ్యవస్థ స్థాయిలో పెరుగుదల కేవలం 0.85 (డిస్మల్ 85) మాత్రమే. తిరోగమన దశలో భారత క్రికెట్ జట్టు స్పీడుతో పరుగెత్తుతున్న మోదీజీ ప్రభుత్వం మరో ఐదేండ్లలో 2024 ఎన్నికల నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుందంటే నమ్మడం కష్టమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెరిగినా ఉపాధి అవకాశాలు హెచ్చకుంటే, సర్వీసులు మెరుగుపడకుంటే ఫలితం శూన్యమని ఆర్థికవేత్తల అభిప్రాయం. మోదీజీ నోట్లరద్దుతో దేశంలోని జాతీయబ్యాంకులు, జాతీయ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నాయి. చతికిలపడ్డ జాతీయ బ్యాంకులను ఆదుకోవడానికే ఆర్థికమంత్రి తమ బడ్జెట్‌లో రూ.70 వేల కోట్ల కేటాయింపు పెట్టారనుకోవాలి. గత ఐదేండ్ల మోదీజీ పాలనలో అవకతవక విధానాల ఫలితంగా, లోపభూయిష్ట చర్యల కారణంగా ప్రైవేటు, పబ్లిక్ పెట్టుబడులు బాగా తగ్గాయి. ఆర్థికమంత్రి తమ ప్రసంగాన్ని ముగించకముందే దేశంలో ఆర్థిక మార్కెట్లు కుప్పకూలి పెట్టుబడిదారులకు కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం సంభవించింది.

Prabhakar-Raooo
ఆకాశానికి నిచ్చెనలు వేయడం, పునాదులు లేని సౌధాలు నిర్మించడం, గాలిలో మేడలు కట్టడం, గగనంలో కుసుమా లు వికసించినట్లు, పరిమళాలు వెదజల్లినట్లు చూపించడం, ఎండమావుల్లో కుండపోతల వర్షాలు కురిసిన భ్రమలు కలిగించడం, అరచేతిలో వైకుంఠం చూపించ సాహసించడం సాధ్యమా అన్న సందే హం కలుగడం సహజమే. సాధ్యమే, సుసాధ్యమే అని ఇటీవల రెండవసారి కేంద్రంలో అధికారం కైవసం చేసుకున్న మోదీజీ ప్రభుత్వం (బీజేపీ ఆధిపత్యంలో ఎన్డీయే ప్రభుత్వం) ప్రకటించిన ఆర్థిక సర్వే, ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 జూలై 5న 17వ లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2019-20 సంవత్సరపు సాధారణ బడ్జెట్ లోకానికి చాటిచెప్పాయి. ఒక మహిళామణి దేశం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కాదు, బహుశా చివరిసారి కాబోదు. మొరార్జిదేశాయి మొండి గా రాజీనామా ఇచ్చి నిష్ర్కమించిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా చేపట్టి 1970లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో 1971 యుద్ధ మేఘాల ఛాయలు కనిపించాయి. అప్పటి, దాదాపు యాభై ఏండ్ల కిందటి భారత ప్రభుత్వ బడ్జెట్‌ను రూపొందించడంలో ఇందిరాజీకి ఉన్న ఫ్రీ హ్యాండ్ నిర్మలాజీకి లేదన్నది జగమెరిగిన సత్యం. అయితే, లండన్‌లోని ఒక ప్రైవేటు కంపెనీ జాబ్‌లో చేకూరిన సేల్స్‌గర్ల్ నైపుణ్యాన్ని నిర్మలాజీ మొన్నటి బడ్జెట్‌లో కొంతవర కు ప్రదర్శించగలిగారు.

2019 ఎన్నికల ప్రచారంలో మోదీజీ కావించిన ప్రసంగాల సారాంశం, నినాదాలు నిర్మలాజీ బడ్జెట్ ప్రసంగానికి ప్రేరణ గా ఉపకరించాయని కామన్ సెన్స్ ఉన్న వాళ్లందరు క్షణాల్లో అర్థం చేసుకోగలుగుతారు. స్వతంత్ర భారతంలో గత 16 లోక్‌సభల చరిత్రలో ఆర్థిక మంత్రులందరు తమ బడ్జెట్ ప్రసంగ పత్రాలను బ్రీఫ్‌కేసులో భద్రం గా, గోప్యంగా పెట్టుకొని వచ్చేవారు, అయినా లీకులు జరుగవలసిన వాళ్లకు జరుగుతుండేవి. మొన్న నిర్మలాజీ ఒక ఎర్రబట్ట సంచీలో ప్రసంగ పత్రాలను తెచ్చారట. అదొక న్యూస్. నిర్మలాజీ 2 గంటల 15 నిమిషా లు అనర్గళంగా, ఆగకుండా బడ్జెట్ ప్రసంగం చదివారన్నది మరో వార్త. ఇందిరాజీ ఏ సందర్భంలో ఏ రంగు చీర కట్టుకున్నారో మీడియా వాళ్లు రిపోర్ట్ చేసేవారు. బడ్జెట్ ప్రసంగం చదువుతున్నప్పుడు నిర్మల చీర కట్టా రో మీడియా రాయలేదు. ఇటువంటి న్యూస్ వల్ల దేశంలోని కోట్లాది సామాన్యులకు ఒరిగేదేముంది! గతంలో ఆర్థికమంత్రులు తమ బడ్జెటు ప్రసంగాల్లో మహనీయుల సూక్తులను కోట్ చేసేవారు. ఈ సంప్రదాయానికి విఘాతం కలిగించకుండా నిర్మలాజీ కూడా సంస్కృతం, హిం దీ, ఉర్దూ, తమిళ భాషల్లో కొటేషన్లను చేర్చారట. అత్తగారింటి తెలుగు భాషను ఆమె మరిచిపోయినట్లున్నారు. విశేషించి ఆమె తెలంగాణ, హైదరాబాద్ గృహలక్ష్మి. భక్తకవులు పోతన, పాల్కుర్కి సోమన, రామదాసు (గోపన్న), ఆధునిక ప్రజా కవులు కాళోజీ, దాశరథి, మగ్దూమ్ తెలంగాణ మహనీయులని, వీరి ప్రతిమాట సూక్తుల పేటిక అని బహుశా నిర్మలాజీకి, ఆమె బడ్జెటు ప్రసంగం రాసినవాళ్లకు తెలియదేమో. ఈ విధంగా తెలంగాణను అవమానించినా, తమ బడ్జెట్ ప్రతిపాదనల్లో, కేటాయింపుల్లో తెలంగాణకు శూన్యహస్తం చూపినా అమాయక తెలంగాణ ప్రజలు తమవెనుక పరుగెత్తి వస్తారని మోదీయులు భావిస్తున్నారే మో! తెలంగాణ ప్రజలు తిరుగబడితే డిపాజిట్లు దక్కవన్నది చరిత్రే.

నిర్మలాజీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన దానికంటే చెప్పకుండా మరుగు పరిచినవి చాలా ఉన్నాయని ఆర్థిక విషయజ్ఞులు అంటున్నారు. కొత్తగా ఎన్నికైన, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కనీస విశ్వాసం లేనివారితో నిండి ఉన్న, జాతిపిత గాంధీజీని హత్య చేసిన వ్యక్తి దేశభక్తుడని అంటున్నవాళ్లు కూర్చుని ఉన్న 17వ లోక్‌సభలో చప్పట్లు, కేరింతల మధ్య రసవత్తరంగా, మనోహరంగా కొనసాగిన మేడమ్ నిర్మలాజీ ప్రసంగంలో దేశ ప్రజలు, ముఖ్యంగా కోట్లాది సామాన్యులు, రెక్కాడితేకాని డొక్కనిండని నిరుపేదలు జవాబులు కోరుతున్న అంశాలు, ప్రశ్నలు చాలా ఉన్నాయి. చాతుర్యం తొణికిసలాడుతూ కొనసాగిన ఆర్థికమంత్రి ప్రసంగంలో ఎక్కడా అంకెల జోలి లేదు. తమ ప్రభుత్వ ఆదాయం ఎంతో, వ్యయం ఎంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడి ఎంతో, పోబడి ఎం తో, ఏ రంగానికి ఎంతమొత్తం కేటాయించారో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మోదీజీ ప్రభుత్వం వద్ద ఉన్న అంకెలేవీ సరిగ్గా లేవని, ఆ విషయం మేడమ్‌కు బాగా తెలుసని, అందుచేతనే వాటిని ఉదహరించలేదని ఒక ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. అభివృద్ధి రేటు ఇంతని, అంతని ఎన్నికలముందు మోదీజీ ప్రభుత్వం ప్రకటించిన అంకె అబద్ధమని, అభివృద్ధి రేటు అంతగా లేదని ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారుగా నిన్నమొన్నటి వరకు వ్యవహరించిన అరవింద్ సుబ్రహ్మణ్యం స్వయంగా అన్నాడు. మేడమ్ ప్రసంగంలో జాబ్ అన్నమాట ఎక్కడా లేదు.

మోదీజీ ప్రభుత్వం దేశంలోని కోట్లాది యువతీయువకుల, విశేషించి విద్యావంతులైన యువతీయువకుల తీవ్ర నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపడం లేదు, చూపగలిగే సంకల్పం, సామర్థ్యం మోదీజీ ప్రభుత్వానికి లేదంటే అతిశయోక్తి కాదు. గత 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య మోదీ పాలనలో భయంకర స్వరూపం ధరించింది. యువతీయువకులు దేశమంతటా పకోడీలు, పల్లీలు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. ప్రధాని మోదీజీయే నిరుద్యోగం, పేదరికం, దారిద్య్రం సమస్య మీదినుంచి అమాయక ప్రజల దృష్టిని జాతీ య భద్రత బూచి చూపి మళ్లిస్తున్నప్పుడు ఆర్థికమంత్రి ప్రసంగంలో ఆ ప్రస్తావన ఎందుకు ఉంటుంది? హద్దు దాటి ప్రసంగిస్తే తనకు నిరుద్యోగ సమస్య ఎదురవుతుందని తమిళ సోదరి నిర్మల అమ్మాళ్‌కు బాగా తెలుసు. మన మహాకవి గురజాడ సొంతలాభం కొంత మానుకొమ్మన్నాడు గాని మొత్తం మానుకొమ్మనలేదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు. మాటలకు ఓట్లు రాలుతాయని మోదీజీ బల్లగుద్ది నిరూపించారు. ఆ ధీమాతోనే మేడమ్ పేలవమైన, ప్రయోజనరహితమైన, దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపని బడ్జెట్‌ను రూపొందించి, ప్రజల ముందు పెట్టి తమాషా చూస్తున్నారు.

మోదీజీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ కఠోర యదార్థాలు ఆందోళ న కలిగిస్తూ దేశ ప్రజలను వెక్కిరిస్తున్నాయి. 2014 మే నెలలో మోదీజీ మొదటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ 1.25 ట్రిలియ న్ డాలర్ల (అప్పటికీ మన లెక్కలన్నీ డాలర్లలో ఉండటం విచిత్రం) స్థాయిలో ఉన్నది. అప్పటినుంచి మోదీజీ ఐదేండ్ల పాలనలో 2019 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2.7 ట్రిలియన్ డాలర్ల స్థాయికి వచ్చిందని (మోదీజీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అంకె అబద్ధం కాకపోతే) అంటున్నారు. ఐదేండ్ల మోదీజీ పాలనలో ఆర్థిక వ్యవస్థ స్థాయిలో పెరుగుదల కేవలం 0.85 (డిస్మల్ 85) మాత్రమే. తిరోగమన దశలో భారత క్రికెట్‌జట్టు స్పీడుతో పరుగెత్తుతున్న మోదీజీ ప్రభుత్వం మరో ఐదేండ్లలో 2024 ఎన్నికల నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుందంటే నమ్మ డం కష్టమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెరిగినా ఉపాధి అవకాశాలు హెచ్చకుంటే, సర్వీసులు మెరుగుపడకుంటే ఫలితం శూన్యమని ఆర్థికవేత్తల అభిప్రాయం. మోదీజీ ఉధృతంగా ప్రచా రం చేస్తున్నట్లు, ఈ ప్రచారానికి అనుగుణంగా ఆర్థికమంత్రి తమ మృదు మధుర ప్రసంగంలో వివరించినట్లు 5 ట్రిలియన్ డాలర్ల స్థాయి జాతీ య ఆర్థిక వ్యవస్థ స్వర్గానికి సోపానం కాబోదు. తన మొదటి బడ్జెట్ ప్రతిపాదనలతో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమన మార్గం నుంచి నవభారత నిర్మాణం లక్ష్యంగా పురోగమన మార్గంలోకి వస్తుందని ఆమె అనుకుంటే అది ఆత్మవంచన అవుతుందని ఆర్థికవేత్తలు సంఖ్యల సత్యాలను ఉదహరిస్తున్నారు. మోదీజీ ప్రభుత్వం ప్రచారంలోకి తెస్తున్న అంకెలు నిజాలనుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ 2018-19 చివరి క్వార్టర్‌లో కేవలం 5.8 శాతం పెరుగుదలనే సాధించింది. ఈయేడు (2019-20లో) వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుతుందని ఆర్థికమంత్రి వ్యక్తపరిచిన ఆశాభావం సహేతుకంగా, వాస్తవాలకు సమీపంలో లేదని ఆర్థికవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ లెక్కన 2019-20 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక లోటును జీడీపీలో 3.3 శాతానికి తగ్గించడం ఏ విధంగా సాధ్యమవుతుందో ఆర్థికమంత్రి తమ ప్రసంగంలో వివరించలేదు.

మోదీజీ నోట్లరద్దుతో దేశంలోని జాతీయబ్యాంకులు, జాతీయ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నాయి. చతికిలపడ్డ జాతీయ బ్యాంకులను ఆదుకోవడానికే ఆర్థికమంత్రి తమ బడ్జెట్‌లో రూ.70 వేల కోట్ల కేటాయింపు పెట్టారనుకోవాలి. గత ఐదేండ్ల మోదీజీ పాలనలో అవకతవక విధానాల ఫలితంగా, లోపభూయిష్ట చర్యల కారణంగా ప్రైవేటు, పబ్లిక్ పెట్టుబడులు బాగా తగ్గాయి. ఆర్థికమంత్రి తమ ప్రసంగాన్ని ముగించకముందే దేశంలో ఆర్థిక మార్కెట్లు కుప్పకూలి పెట్టుబడిదారులకు కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. మోదీజీ ప్రభుత్వం ఒక వంక విదేశీ పెట్టుబడులకు మన ద్వారాలు, కిటికీలు అన్నీ తెరిచి, ప్రభు త్వరంగ సంస్థల అమ్మకానికి నడుం బిగించి తన అవసరాల కోసం విదేశాల్లో అప్పులు చేయాలనుకుంటున్నది. భారత ఆర్థిక వ్యవస్థ ఇంతటి క్లిష్ట పరిస్థితిని 1991లో కూడా ఎదుర్కోలేదు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ దేశంలోని ఏ వర్గానికి సంతృపి కలిగించలేదనడంలో ఆశ్చర్యం లేదు. ఓటేసినప్పుడే ఉండాలి బుద్ధి అని కవి కాళోజీ అన్నాడు. అది లేకపోవడం వల్లనే అన్ని సమస్యలు, భూకమతాలున్న వారిలో 85 శాతం మంది చిన్న రైతులు కాగా మోదీ పాలనలో, ఈ చిన్న, సన్నకారు రైతుల్లో 50 శాతం మందికే వ్యవసాయ రుణాలు అందాయి. ఈ దేశం లో ప్రస్తుతం ఆదాయ పన్ను చెల్లిస్తున్న వాళ్లల్లో అత్యధిక సంఖ్యాకులు రెండున్నర లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు. ఈ తక్కు వ ఆదాయవర్గాల సంక్షేమానికి మోదీజీ ప్రభుత్వం కేటాయింపులు పెరుగడం లేదు, తగ్గుతున్నాయి. బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగాల కేటాయింపులు పెరుగలేదు. మోదీజీ మొన్నటి ఎన్నికల్లో జాతీయ భద్రత నినాదంతో ఆవేశం, ఉద్రేకం కలిగించి గెలుపొందారు. కానీ, ఈ బడ్జెట్‌లో సైన్యం ఆధునీకరణ, ఆయుధ సేకరణకు, సైనికుల సంక్షేమానికి ప్రాధా న్యం లభించలేదు. రక్షణకు కేటాయింపు పెరుగలేదు అని అంటూ ఒక సైనికాధికారి అసంతృప్తి వ్యక్తపరిచాడు. ఒక్క రాఫెల్ విమానం ఉంటే చాలు, పాకిస్తాన్‌ను పచ్చడి చేయడానికి అని మోదీజీ భావిస్తున్నారేమో, ఈ బడ్జెట్ గుట్టు విప్పితే ఏమున్నది గర్వకారణం, పేదోళ్ల బతుకులతో పెద్దోళ్ల పరిహాసం అంటూ యాదగిరి ముక్తాయింపు పలికాడు!

341
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles