అవినీతి నియంత్రణ సాధ్యమే

Sat,June 15, 2019 11:57 PM

ఎన్ని అవినీతి నిరోధక చర్యలు తలపెట్టినా, చాణక్యుడు చెప్పిన ఒక మాట జ్ఞప్తికి వస్తుంది.చేపకు నీరు ఎంత అవసరమో అవినీతి ఉద్యోగికి అంత అవసరం అని! అది పాత కాలం నాటి మాట అని నిరూపించే సమయం ఆసన్నమైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఉద్యోగుస్థులు తమ వంతు ప్రయత్నం చేస్తున్న తరుణంలో, అధినేత కనుసన్నల్లో అవినీతి నియంత్రణ తప్పక సాధ్యపడుతుందనే నమ్మకం ఏర్పడుతున్నది. నమ్మకం వమ్ము కాకుండా ఉండాలి

అవినీతి అంతం, కేసీఆర్ పంతం అనే స్లోగన్ ఎంతమందిని ఆకర్షించిందో కానీ, తెలంగాణలో రెండవసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ అవినీతి అంతానికి పూనుకున్నారనేది సర్వత్రా వినిపిస్తున్న విషయం. కేసీఆర్ ఆ మధ్య (ఏప్రిల్‌లో) ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల సమావేశంలో తన దృఢ సంకల్పాన్ని తెలియపర్చటమే గాకుండా, దానికి తగ్గ రీతిలో మార్గదర్శక సూత్రాలను గూడా విడమర్చి వెల్లడించారని మీడియా ప్రజలకు తెలియపర్చింది. ఆ సమావేశంలో ఏసీబీ అధికారులు గూడా ఉన్నారని మీడియా యే బహిర్గతపర్చింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖలో పైస్థాయిలోని వివిధ హోదాల్లో మూడునాలుగు సార్లు పనిచేసే అవకాశం నాకు కలిగింది. హైదరాబాద్ రేంజి డీఐజీగా పనిచేస్తున్న నన్ను అనుకోకుండా, అకారణంగా మళ్లీ ఏసీబీకి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు అప్పటి సీఎంను అరమరికలు లేకుండా అదేమిటి సార్! మళ్లీ నేను వచ్చిన చోటికే పంపిస్తున్నారు! నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని కేసుల ఫైళ్లలో నిక్షిప్తమైన నా సంతకంలోని మార్పులను చూసుకోటానికే వీలు కలుగుతుంది.

కానీ నిర్దిష్టమైన రీతిలో త్వరితగతిన కేసుల పరిష్కారానికి మార్గాలు వెతకకుండా, అక్కడ పనిచేస్తున్న వారి పనితీరును మెరుగుపర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నంత కాలం అధికారుల ఈ మ్యూజికల్ చైర్ ఆట వల్ల ప్రజలకు ప్రయోజనం ఆశించిన రీతిలో ఉండదు అని చెప్పగలిగాను. నేను ఉటంకించిన మార్పుల సంగతి ఎలా ఉన్నా, నన్ను మరోచోటికి మార్చటం జరిగింది. శాఖాపరంగా మార్పులు తేవటం కన్నా నాలాంటి అధికారులను మార్చటం తేలికని ప్రభుత్వాలు అనుకోవటంలో తప్పులేదు. ఈ వ్యక్తిగత విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతి భరతం పట్టడానికి పూనుకోవటం, దానికి తగ్గట్లు లొసుగులతో కూడిన కొన్ని ప్రభుత్వ శాఖలను ప్రస్ఫుటంగా గుర్తించటం, కొంత ఆశను రేకెత్తించింది.

అవినీతి అంటు కొడ్యం లాంటిది. చాపకింది నీరులా సమాజం అంతా విస్తరిస్తుంది. సమయానికి తగ్గ చర్యలు ప్రభుత్వాలు తీసుకోకపోతే చాపలే గావు ప్రజానీకం అంతా మునిగిపోతుంది. అభివృద్ధి కూడా కొట్టుకొనిపోతుంది. చిన్న వయసులో హైదరాబాద్ నగరంలో ఏసీపీగా పనిచేస్తున్న నన్ను రికార్డు బాగుందన్న పేరుతో అప్పటి పోలీసు శాఖాధిపతి ఏసీబీకి పంపారు. ఆ గుర్తింపు నాకు సంతోషం వేసింది. కానీ తర్వాత తెలిసింది ఆ ఏసీపీ పోస్టు తనకు ఇష్టుడైన అధికారం కోసం ఇవ్వడానికని! అదీ ఒకరకమైన కరప్షన్ అని ఎవరైనా అనుకుంటే నేను ఏమీ అనలేను. అవినీతి అనేది షేప్ కోల్పోయిన టోపీ లాంటిది. పెట్టుకొనే వాడి అవసరాన్ని బట్టి ఆ టోపికి పేరు పెట్టొచ్చు. ట్రాప్ ఆదాయానికి మించిన అవినీతి ఆస్తులు క్విడ్ ప్రో కో మానసిక అవినీతి అవసరం వరకే అవినీతి , రాజకీయ అవినీతి-ఇలా ఏ పేరున్న తలకైనా ఆ టోపి సరిపోతుంది. భగవంతుడికి అవినీతికి సామీప్యత ఉందేమో అని చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. కానీ అలనాడు ప్రహ్లాదుడు తండ్రితో చెప్పినట్టు-ఇందుగలడు అందులేడు అన్న సందేహం వలదు అన్న అద్భుత ఉవాచ దేవుని పట్ల ఎలా వర్తిస్తుందో-ఎందెందు వెతికినా అందందే కనపడే శక్తిగా అవినీతిని వర్తింపచేస్తూ అభివర్ణించవచ్చు.

రాజకీయ అవినీతిని అంతమొందిస్తేనే ప్రభుత్వంలోని ఉద్యోగుల అవినీతిని అంతమొందిచవచ్చు అనే చర్చ చాలా పెద్దది. ఒక పట్టాన తెగేది కాదు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లోని అవినీతిని అంతమొందించగలవా ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేంత వరకే పరిమితమవటం మంచిదేమో! కేసీఆర్ కొన్ని శాఖలను అంటే రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్ లాంటి శాఖలను ఫోకస్‌లో పెట్టుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా అవినీతి నిరోధక శాఖను అడిగినట్లు పేపర్లో వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా హైలెట్ చేసింది. లోకల్ బాడీల పనితీరును కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా నిర్దేశించటమే గాకుండా తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ యాక్ట్‌ను కూడా పాస్ చేసే విషయాన్ని ఆలోచిస్తున్నదని భోగట్టా. అదేవిధంగా రెవెన్యూ శాఖలోని లోపాలను పూర్తిగా గుర్తించటమే గాకుండా భూ వ్యవహారాలలో రిజిస్ట్రేషన్ శాఖ వారి లింక్‌లను కూడా దృష్టిలో పెట్టుకొని సమగ్ర మార్పులను తెచ్చే ప్రయత్నంలో ఉండటం గమనార్హం.

తెలంగాణ ఏసీబీ బహుశా ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలను దృష్టిలో పెట్టుకొని ఈ శాఖలకు సంబంధించిన పెద్ద పెద్ద తిమింగలాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా పట్టుకొని, కేసులను పెట్టడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చిత్తశుద్ధి ఉన్న అధికారులు అవినీతి నిరోధక శాఖలో ఉండటంతో పాటు, ప్రభుత్వ అండదండలు కూడా ఉన్నాయనే సంకేతం ఇచ్చినప్పుడే ప్రజల్లో విశ్వాసం వస్తుంది. కంటితుడుపు చర్యగా, ప్రభుత్వ చర్యలు ఉంటే మాత్రం, మొత్తం ప్రయోగం వికటించడటమే గాకుండా ప్రజల్లో ఏదో గిమ్మిక్కులే అనే అభిప్రాయం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏసీబీని బలోపేతం చేయటానికి ప్రయత్నించారు. ట్రాప్ చేయటానికి శాఖాధిపతికే పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే వీలును కల్పించారు. స్వయంప్రతిపత్తిని చెప్పకనే చెప్పినట్లుగా కల్పించారు. అందుకే ఒక మంత్రిని ఏసీబీ నియంత్రించే సాహసం అప్పట్లో జరిగింది. రాజకీయ అవినీతిని కొంచెంలో కొంచెం అరికట్టొచ్చు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఆ తర్వాత ఏర్పడ్డ కొద్ది మార్పులూ అటకెక్కాయి. అవినీతి నిరోధక శాఖను బలపరిస్తే ప్రభుత్వ ఉద్యోగుల నైతిక ైస్థెర్యం దెబ్బతింటుందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాల మీదికి ఒత్తిడి తెచ్చి ఏసీబీ చర్యలను కొంతలో కొంత నియంత్రించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, విభజన ఇబ్బందులు చక్కపడ్డాయి అనుకున్న తరుణంలో బహుశా సీఎం ప్రభుత్వ పరంగా ఉండే అవినీతిని కంట్రోల్ చేసే పనిపై దృష్టి పెట్టి ఉండొచ్చు. అవినీతిని నియంత్రించినప్పుడే అభివృద్ధి సాధ్యం అన్న మూల సిద్ధాంతం కేసీఆర్ నమ్మటం వల్ల కాబోలు ప్రభుత్వ చర్యలు గమనంలో ఉన్నాయి.
Ravulapati-Sitaramarao
జిల్లా జడ్జి స్థాయిలో ఉన్న వారితో పాటు ప్రాసిక్యూటర్లను కూడా తెలంగాణ ఏసీబీ అవినీతి కేసుల్లో పట్టుకోవటం నిజంగా సాహసమే. జ్యుడిషియరీ స్వతంత్రంగా వ్యవహరించే వ్యవస్థ. ఏసీబీ చర్యలకు జ్యుడిషియరీ ఆమోదం ఉందోలేదో తెలియదు. కానీ ఈ స్థాయిలో న్యాయవ్యవస్థలోని అవినీతిని కూడా ఏసీబీ వెలికి తీస్తున్నదంటే ఆశ్చర్యకరమైన, ఆమోదయోగ్యమైన పరిణామంగా భావించక తప్పదు.

అవినీతి అంతం అనే స్లోగన్ ప్రోత్సహించటానికి స్ఫూర్తినిస్తుంది. కానీ అంతం అనేది సాధ్యపడదని అందరికీ తెలుసు. అయితే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏసీబీని దూసుకొని పొమ్మని ప్రోత్సహిస్తే చాలు బలమైన నియంత్రణ సాధ్యపడుతుందని ఘంటాపథంగా చెప్పొచ్చు. అవినీతి మీద సీఎం కేసీఆర్ దృష్టి సారించటం వల్ల ప్రభుత్వ పనితీరులో మార్పు సాధ్యపడుతుందనే ఆశ చాలామందికి కలుగుతున్నది.

ప్రభుత్వం ముఖ్యంగా అధినేత ఏసీబీ పనితీరులో ప్రభుత్వ జోక్యం ఉండదన్న సంకేతం ప్రభుత్వంలోని పెద్దలకూ, అధికారులకు చేరేటట్లు చేస్తే చాలు, జరిగే అవినీతిలో సగ భాగం నియంత్రించబడుతుంది. ఆ శాఖలో పనిచేసే వారికి సౌకర్యాలు పెంచటంతో పాటు, ఇంటర్నల్ విజిలెన్స్ మెకానిజం డెవలప్ చేస్తే ఏసీబీ కూడా తప్పులు చేయకుండా కంట్రోల్‌లో ఉంటుంది. కేసులను సత్వరం పరిష్కరించే మార్గాలను కనుగొనటంతో పాటు కోర్టులను పెంచే చర్య కూడా సత్వరం తీసుకోవాలి. సంవత్సర కాలంలో పెట్టిన ప్రతి కేసూ పరిష్కరించబడిన నాడు కొంత అవినీతికి అడ్డు వేసినట్టే. శాఖల్లోనే కాదు ఏసీబీలో కూడా ఆలస్యం అమృతాన్ని విషంగా మారుస్తుంది. అందుకే రెడ్ టేపిజం కనుమరుగు అయ్యే చర్యలు తలపెట్టక తప్పదు.

ఎన్ని అవినీతి నిరోధక చర్యలు తలపెట్టినా, చాణక్యుడు చెప్పిన ఒక మాట జ్ఞప్తికి వస్తుంది. చేపకు నీరు ఎంత అవసరమో అవినీతి ఉద్యోగికి అంత అవసరం అని! అది పాత కాలం నాటి మాట అని నిరూపించే సమయం ఆసన్నమైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఉద్యోగుస్థులు తమ వంతు ప్రయత్నం చేస్తున్న తరుణంలో, అధినేత కనుసన్నల్లో అవినీతి నియంత్రణ తప్పక సాధ్యపడుతుందనే నమ్మకం ఏర్పడుతున్నది. నమ్మకం వమ్ము కాకుండా ఉండాలి.
-(వ్యాసకర్త: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి)

247
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles