తా వలచింది రంభ...

Sat,June 8, 2019 01:16 AM

17వ లోక్‌సభ ఎన్నికల్లో భారత్ కంటే పాకిస్థాన్ ఎక్కువ ప్రాధాన్యం పొందడం విశేషం. ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును భారత్ పేదరికం కంటే పాక్ ప్రమాదం ఎక్కువగా ప్రభావితం చేసిందంటే అతిశయోక్తి కాదు. పాక్ ప్రమాదాన్ని, టెర్రరిజం ముప్పును ఎదుర్కోవాలంటే తనవంటి గట్టి నాయకుడిని ఎన్నుకోవాలని మోదీజీ భారత ప్రజలకు, ఓటర్లకు నేరుగా చెప్పారు. ఆయన మాటను గౌరవించి దేశ ప్రజలు ఆయనే గట్టి నాయకుడని ఘంటాపథంగా తేల్చిచెప్పారు. తన విదేశీ పర్యటనల వల్లనే ప్రపంచమంతటా భారతదేశం గురించి తెలిసిందని మోదీజీ పదేపదే అంటారు. మోదీజీ కంటే ఎంతో ముందు, ఆయన పుట్టక ముందు, స్వామి వివేకానంద, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్, గాంధీ మహాత్ముడు, జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహా పురుషలెందరో ప్రపంచమంతటా పర్యటించి భారతదేశ ఔన్నత్యాన్ని వివరించారు.

Prabhakar-Rao-Photo
తావలచింది రంభ, తా మునిగింది గంగ.. అంటారు పెద్దలు. తనకు ఇష్టమైనది రంభను మించిన సుందరాంగి; తాను మునిగింది ఊరవతలి మురికి కాలువైనా గంగా ప్రవాహం కంటే పవిత్రమైన ఝరి వలె కన్పిస్తుంది. మిత్రుడు యాదగిరి తండ్రి రంగయ్య తన ముద్దుల మనుమడికి చిలుకకు చెప్పినట్లు చెప్పినాడు ఆ సంబంధం అసలే వద్దని. నాసాలో పెద్ద ఉద్యోగంలో ఉన్న మనుమడు తాత మాటను ఖాతరు చేయలేదు-ఆర్నెల్లకే తలాక్ చెప్పక తప్పలేదు. ఇటీవల, జోరు, హోరు, పోరు ప్రచారం రెండు నెలలు కొనసాగిన తర్వా త 17వ లోక్‌సభ ఎన్నికల వాతావరణం చల్లబడినట్లు, విపరీతంగా చెలరేగిన తూతూమైమై దుమారం తగ్గినట్లు అనిపిస్తున్నది. అసలు బలమేదో, నకిలీ బలమేదో క్రమంగా స్పష్టంగా వెల్లడవుతున్నది.

ఇటీవలి 17వ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో, జాతీయ స్థాయిలో తిట్లు, దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిందలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయని, ఉన్నత ప్రమాణాలు మచ్చుకైనా కన్పించలేదని 1951 నుంచి ఎన్నికల రంగంలో అనుభవం ఉన్నవారు అంటున్నారు; భారత ప్రజాస్వామ్యం ఎటూ నీ పయనం అంటూ వాపోతున్నారు. పాలక పక్షం బీజేపీ ఎన్నికల ప్రచారానికి అన్నీ తానై సారథ్యం వహించిన ప్రధాని మోదీజీ అతి చాకచక్యంతో వ్యవహరించారు; ఆయన అఖండ ప్రచారంలో ఎన్నడూ ఎక్కడా మాట వరుసకైనా తమ గత ఐదేండ్ల పాలనలో సామాన్యుల బతుకులు బాగుపడటానికి తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పలేదు మీ ప్రభుత్వం మా కోసం ఏం చేసిందని నిరుపేద ఓటర్లు అడుగలేదు. తొలిసారి అధికారంలోకి వచ్చేందుకు 2014లో 16వ లోక్‌సభ ఎన్నికల సమయాన మోదీజీ పుంఖానుపుంఖంగా, నాలుగు చేతులతో కుప్పించిన హామీలలో ఒక్కటైనా అమలుకాలేదని ఈ దేశంలోని పేద ప్రజలకు, ఓటర్లకు బాగా తెలుసు. అయినా, కనీసం 2014 ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికైనా 201 9లో తిరిగి ఆయనకే అధికారాన్ని అప్పగించడం మేలని ఓటర్లు భావించి ఉంటారు.

2014 హామీలు నెరవేరేవరకు దేశ ప్రజలు మోదీజీని, ఆయన పార్టీని వదిలిపెట్టకపోవచ్చు! తమ జీవిత సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను ప్రస్తావించకుండా, 2014 ఎన్నికల వాగ్దానాలు, హామీల సంగతి ఏమైందో చెప్పకుండా మోదీజీ పుల్వామా వధ అనంతరం పాకిస్థాన్‌లోకి వీరోచితంగా చొచ్చుకపోయి బాలాకోట్ టెర్రరిస్టు శిబిరంపై బాంబులు కురిపించామని అనర్గళంగా ప్రసంగించినప్పుడు ప్రజలు, ఓటర్లు జోష్‌తో పొంగిపోయారు. కళ్లు మూసుకొని మరో ఆలోచన లేకుండా కమలం బటన్ నొక్కారు. సమయానికి పుల్వామా, బాలాకోట్ ముచ్చట అందకపోతే మోదీజీ ఎన్నికల ప్రచార సభలలో ఏం మాట్లాడేవాడన్న ధర్మ సందేహం యాదగిరి వంటి కొందరికి కలుగకపో లేదు. పుల్వామా కాకపోతే మరో నామా-మోదీజీగామా అవతారమెత్తడానికి ఏదో ఒకటి. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఇక టెర్రరిజం అంతమవుతుందని మోదీజీ దేశ ప్రజలకు భరోసానిచ్చారు. కానీ, టెర్రరిజం నడ్డి విరుగలేదు. నయా రూపంలో, శ్రీనగర్ సమీపంలోనే పుల్వామా దాడి జరిగి మన సీఆర్‌పీఎఫ్ జవాన్లు 40 మంది మరణించడానికి కారణమైంది. పుల్వామా ప్రస్తావన లేకపోతే మోదీ జీ ఎన్నికల ప్రసంగాలు దేశ ప్రజల్లో, ఓటర్లలో దేశభక్తిని రగిలించడం, ఓట్ల పండుగ చేసుకోవడం సాధ్యం కాకపోయేది.

17వ లోక్‌సభ ఎన్నికల్లో భారత్ కంటే పాకిస్థాన్ ఎక్కువ ప్రాధాన్యం పొందడం విశేషం. ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును భారత్ పేదరికం కంటే పాక్ ప్రమాదం ఎక్కువగా ప్రభావితం చేసిందంటే అతిశయోక్తి కాదు. పాక్ ప్రమాదాన్ని, టెర్రరిజం ముప్పును ఎదుర్కోవాలంటే తనవంటి గట్టి నాయకుడిని ఎన్నుకోవాలని మోదీజీ భారత ప్రజలకు, ఓటర్లకు నేరుగా చెప్పారు. ఆయన మాటను గౌరవించి దేశ ప్రజలు ఆయనే గట్టి నాయకుడని ఘంటాపథంగా తేల్చిచెప్పారు. వార్షిక అభివృద్ధి రేటు క్షీణిస్తున్నదని, గత నాలుగున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం ధరించిందని వెల్లడయినప్పటికీ జనం తీర్పు శిరోధార్యం. తా వలచిందే రంభ అన్నట్లు జనం మెచ్చి నవాడే దేశాధినేత. ఆకలిమంటలు దహిస్తున్న వాళ్లకు మతతత్వం, మత బోధనలు తలకెక్కవని స్వామి వివేకానందుడు, గాంధీజీ చెప్పిన మాట కు భిన్నంగా ఈ ఎన్నికల్లో ఇండియన్ ఓటర్లు తీర్పు ఇవ్వడం విచిత్రం. స్వతంత్ర భారతదేశం గత డ్బ్భై ఏండ్లలో చేసిన యుద్ధాలన్నిటిలో గొప్ప ది 1965 భారత్-పాక్ యుద్ధం. అప్పటి ప్రధాని లాల్‌బహద్దుర్ శాస్త్రి జై జవాన్-జై కిసాన్ నినాదంతో ఆ యుద్ధంలో ఘన విజయం సాధించారు పాక్ పాటన్‌టాంకులు పంజాబ్ (భారత్) పొలాలలో ధ్వంసమైనాయి; ఈగల వంటి మన గ్నాట్ విమానాలు భారీ పాక్ యుద్ధ విమానాలను ధ్వంసం చేశాయి; భారత సేనలు లాహోర్ వరకు పురోగమించాయి. పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. అయినా లాల్‌బహద్దుర్ శాస్త్రి విర్రవీగలేదు, రొమ్ము విరువలేదు. ఆయన ఆరడుగుల మనిషి కాడు, అరువై అంగుళాల ఛాతీ లేదు. కానీ, నిజానికి ఆయనే చాలా గట్టి నాయకుడు.
17వ లోక్‌సభ ఎన్నికల నాటికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణతి చెందలేదు కానీ పరిధి పెరిగింది. 1951లో మొదటి సాధారణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి దేశ జనాభా 36 కోట్లు. ఓటర్ల సంఖ్య అంతకన్న చాలా తక్కువ. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ 18 ఏండ్ల వయసున్న యువతీయువకులందరికీ ఓటు హక్కు కల్పించడం వల్ల సగటున ఏటా రెండు కోట్ల చొప్పున ఓటర్ల సంఖ్య దేశమంతటా పెరుగుతున్నది. 17వ లోక్‌సభ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 90 కోట్లు; ఇన్ని కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలో మనదే అన్నటికంటే పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని గర్వపడుతున్నాం. గర్వపడవలసిందే. అయితే, తమ ఓటు విలువైనదని, రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ను పరిరక్షించడంలో తమ ఓటుహక్కు, ఓటు ఆయుధం కీలక పాత్ర నిర్వహించగలుగుతుందని గుర్తించిన, గ్రహించిన చైతన్యవంతులు ఎం దరు అన్నది ముఖ్య ప్రశ్న.

ఓటుహక్కును వినియోగించుకోవాలన్న, వృథా చేయరాదన్న సామాజిక, ప్రజాస్వామ్య స్పృహ ఉన్నవారు ఎంద రు? మొన్నటి ఎన్నికల్లో ఓటు హక్కున్న 90 కోట్ల మందిలో దేశమంతటా కేవలం 60 కోట్ల మంది మాత్రమే (మూడింట రెండు వంతుల మంది మాత్రమే) ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ప్రధాని మోదీకి, ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడికి, ఆయన పార్టీకి చెందిన ఇతర నేతలకు క్లీన్‌చిట్‌లు ఇవ్వడం లో ఎక్కడ, ఎన్నడులేని శ్రద్ధాసక్తులను విధేయతతో ప్రదర్శించిన కేంద్ర ఎన్నికల కమిషన్ 17వ లోక్‌సభ ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించలేకపోయిందన్న విమర్శలు చెలరేగాయి. ఇన్ని విమర్శలు కేంద్ర ఎన్నిక ల కమిషన్ మీద ఇంతకుముందెన్నడు చెలరేగలేదని ఈసీతో గతంలో సంబంధం ఉన్న ఉన్నతాధికారులు విస్మయపడుతున్నారు. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల మొత్తం జనాభా కంటే మన మొత్తం ఓటర్ల సంఖ్య ఎక్కువయినప్పటికీ ఇటీవల ఎన్నికల్లో 67 చిల్లర శాతం ఓటర్లే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, అందులో 37.46 శాతం ఓట్ల తోనే మోదీజీ రెండవసారి అధికారం చేపట్టడం, ఆయన పార్టీ (బీజేపీ) గెలిచిన లోక్‌సభ స్థానాల సంఖ్య 303 దగ్గరే నిలిచి పోవడం మీడియాలో కొందరు అతిశయోక్తులతో ప్రచారం చేస్తున్నట్లు ఘన విజయం కాదు అని నిష్పాక్షిక జాతీయ, అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ పార్టీలో నిలువునా పెద్ద చీలిక సంభవించి మొరార్జీ దేశాయి నాయకత్వంలో మితవాదులందరూ బయటికి వెళ్లి సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఫ్‌ు (ఇప్ప టి బీజేపీ) తదితర పార్టీలతో కూటమి పెట్టి తనను ఓడించడానికి కంకణం కట్టినప్పుడు (మోదీజీ పరిభాషలో చెప్పాలంటే మిలావత్ అయినప్పుడు) ఇందిరాగాంధీ ఒంటరిగా 1971 లోక్‌సభ ఎన్నికల రంగంలో దిగి 43.68 ఓట్లతో 352 స్థానాలు (అప్పుడు లోక్‌సభలో మొత్తం స్థానాలు 518 మాత్రమే) గెలిచారు. అదా ఘన విజయం, ఇదా ఘన విజయం?

తన విదేశీ పర్యటనల వల్లనే ప్రపంచమంతటా భారతదేశం గురించి తెలిసిందని మోదీజీ పదేపదే అంటారు. మోదీజీ కంటే ఎంతో ముందు, ఆయన పుట్టక ముందు, స్వామి వివేకానంద, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్, గాంధీ మహాత్ముడు, జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహా పురుషలెందరో ప్రపంచమంతటా పర్యటించి భారతదేశ ఔన్నత్యాన్ని వివరించారు. 2014 ఎన్నికల్లో 31 శాతం ఓట్లతో మోదీజీ తొలిసారి అధికారం చేపట్టారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన పార్టీకి వచ్చినవి 37 శాతం ఓట్లు. ఐదేండ్ల పాలనలో ఆయనకు, ఆయన పార్టీకి అదనంగా చేరినవి 6 శాతం ఓట్లు మాత్రమే. ఇక తమ పార్టీ బీజేపీ దేశంలో బహిష్కృతం కాదని, తమది ఉత్తర భారతదేశం పార్టీ కాదని మొన్నటి ఎన్నికల్లో గెలువగాదే మోదీజీ ఉత్సాహంతో అన్నారు. ఈ రెండూ నిజం కావు, ఓటు హక్కు వినియోగించిన అరువై కోట్ల మందిలో అత్యధికులు, 63 శాతం మంది మోదీజీకి, ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. దక్షిణ భారతం మోదీజీకి, ఆయన పార్టీకి ఈసారి కూడా వ్యతిరేకంగా నిలిచిందన్నది కఠిన యధార్థం. కమలం వికాసానికి తెలంగాణ కల్మష కాసారం కాదు, కాబోదు. మొన్నటి ఎన్నికల్లో, తెలంగాణలో నాలుగు స్థానాలలో బీజేపీ కట్టినవి పునాదుల్లేని పేకమేడలు. ఎప్పుడు కూలుతాయో తెలియదు. జాతీయవాదం ముసుగేసుకున్న మత దురభిమానం గురించి గాంధీజీ అన్న మాటలు .. I do not want India to rise on the ruin of other nations...

304
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles