విద్యా ముసాయిదా మార్పు తెచ్చేనా?

Sat,June 8, 2019 01:14 AM

ఉన్నత విద్యను వినిమయ వ్యాపార వస్తువుగా మార్చిన ప్రైవేట్ సంస్థలను నియంత్రించే అంశాలు మచ్చుకైనా ముసాయిదాలో లేవు. వాటిని ప్రోత్సహించే ధోరణులే కనిపిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు పబ్లిక్ అనే పదాన్ని ఉపయోగించకూడదని సూచన మాత్రం చేశారు. ఇటీవల ఉనికిలో లేని జియో విద్యాసంస్థకు వెయ్యి కోట్లు, సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ విద్యా సంస్థకు నిధులు ఇవ్వడమే దీనికి తార్కాణం.

dd
నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014లో అధికారంలోకి వచ్చాక దేశ అవసరాలకు అనువైన నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తామన్న హామీ ఇచ్చింది. నాలుగున్నరేండ్ల తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019, మే 31న ముసాయిదాను ప్రకటించింది. తన తొలి పాలనలో ప్రజలకు గుణాత్మక విద్యను అందుబాటులో ఉంచుతామని జీడీపీలో 6 శాతం కేటాయిస్తామని హామీలు ఇచ్చిం ది. అయితే వీటి అమలుకోసం కనీస కార్యచరణను చేపట్టలేదు. మోదీ తన తొలి పాలనాకాలంలో నూతన విద్యా విధాన రూపకల్పనకు టీఎస్‌ఆ ర్ సుబ్రమణ్యం కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫారసులు సంఘ్‌పరివార్ విద్యా సాంస్కృతిక దృక్పథాన్ని సరిగ్గా ప్రతిఫలించలేదన్న కారణంగా వీటిని సమీక్షిస్తూ మరింత మెరుగైన విధానాలను రూపొందించడానికి ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్‌తో కమిటీని వేసింది. దీని గడువును నాలుగు సార్లు పొడిగించి, కాలయాపన చేసింది.

మే 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక విద్యారంగా ప్రక్షాళనకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. దీనిలో భాగం గా కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన నూతన విద్యా విధానం 201 9 ముసాయిదాను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించి, ప్రజలకు అందుబాటులో ఉంచింది. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియోను పెంచుతామని, బోధన అభ్యసనను వినూత్నంగా నిర్వహిస్తామని, మౌలిక సౌకర్యాలకు, పరిశోధన రంగాలకు నిధులను కేటాయిస్తామని తెలియజేసింది. వైజ్ఞానిక దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యాలు, సామాజిక బాధ్యత, నైతికతల నిలయాలుగా ఉన్నత విద్యాసంస్థలను తీర్చిదిద్దుతామని తెలియజేసింది. కానీ మోదీ తొలి ఐదేండ్ల పాలనలో విద్యారంగ నిర్వహణను పరిశీలిస్తే నూతన విద్యావిధానం అమలు సమీప భవిష్యత్తులో కూడా సాధ్యం కాదని బోధపడుతుంది. వర్సిటీలలో స్వేచ్ఛ సృజనాత్మక ఆలోచనలపై ఆంక్షల ఉక్కుపాదం మోపుతూ రెచ్చగొడుతున్నాయి. సామాజిక, సాంస్కృతిక, చారిత్రక అంశాలపై స్వతంత్రం గా పరిశోధనను నిర్వహించే సంస్థలైన భారత సామాజిక శాస్ర్తాల మండలి, భారత చారిత్రక పరిశోధన మండలి వంటి సంస్థలను సంఘ్ పరివార్ శక్తులు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఇటీవల అఖిల భారత వైద్య పరిశోధన మండలి వైద్యశాస్త్రంపై జ్యోతిష్య ప్రభావం సదస్సును నిర్వహిం చి, వైజ్ఞానిక స్ఫూర్తిని ఆపహాస్యం చేశాయి.

రాష్ర్టాలు నిర్వహించే యూనివర్సిటీల నిర్వహణకు నిధుల పరంగా మద్దతు ప్రస్తావన లేదు. వీటిలో వేలాది బోధనా ఖాళీలున్నాయి. కేంద్రం మద్దతు లేకపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని గాలికి వదిలేశాయి. ఇవి స్థాపించిన తొలి నాలుగు దశాబ్దాలలో అద్భుతమైన మానవ వనరులను సృష్టించాయి. ఉన్నత విద్యలో అసమానతల క్రమానుగత శ్రేణిని పెంచి పోషించే ధోరణులు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యా సంస్థలను టైప్-1, టైప్-2, టైప్-3 గ్రేడులుగా విభజించాలని సూచించింది. ఇది విద్యార్థులను అధ్యాపకులను డీమోరలైజ్ చేయడానికి దారి తీస్తుంది. ఇప్పటికే 60 ఉన్నత విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తిని కట్టబెట్టింది. కోర్సుల రూపకల్పనలో స్వేచ్ఛ ఉన్నా వాటి నిర్వహణ కోసం అధికంగా ఫీజులు వసూలు చేయడం ప్రారంభించాయి.

ముసాయిదాలో వైజ్ఞానిక శాస్ర్తాలలో ఆర్యభట్ట, చరక, శుశృత, భాస్కరచార్య వంటి భారతీయ శాస్త్రవేత్తల కృషిని కొనియాడింది. సామాజిక విద్యను అందించిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలను శ్లాఘించింది. మోదీతో పాటు తన సహచర మంత్రులు ప్రవచిస్తున్న కాల్పనిక పురాణాలలో క్ల్లోనింగ్ విమానాల తయారీ, ఇంటర్నెట్, అవయవ మార్పిడీ అంశాలను మాత్రం ప్రస్తావించలేదు. బౌద్ధం తాత్వికధారతో పొరుగు దేశం చైనా సూపర్ పవర్‌గా ఎదుగుతుందని తెలియజేసింది.
ఉన్నత విద్యను వినిమయ వ్యాపార వస్తువుగా మార్చిన ప్రైవేట్ సంస్థలను నియంత్రించే అంశాలు మచ్చుకైనా ముసాయిదాలో లేవు. వాటిని ప్రోత్సహించే ధోరణులే కనిపిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు పబ్లిక్ అనే పదా న్ని ఉపయోగించకూడదని సూచన మాత్రం చేశారు.

ఇటీవల ఉనికిలో లేని జియో విద్యాసంస్థకు వెయ్యి కోట్లు, సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ విద్యా సంస్థకు నిధులు ఇవ్వడమే దీనికి తార్కాణం. రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి నిధులను వైజ్ఞానిక, సాంకేతికశాస్ర్తాలతో పాటు మానవీయ సామాజిక శాస్ర్తాలను కేటాయించాలని సూచించింది. ముసాయిదాలో 1986, 1992 విద్యా విధానాలను మరికొన్ని కమిటీల సూచనలను నామమాత్రంగా ప్రస్తావించింది. కానీ ప్రజాతంత్ర విద్యా రూపకల్పనకు కొఠారి కమిషన్ సూచించిన సిఫార్సులను ప్రస్తావించలేదు. విద్య సమానత్వ సాధనకు చోదకశక్తిగా పనిచేయాలంటే ఉమ్మడి విద్య వ్యవస్థను ఏర్పాటుచే యాలని, జీడీపీలో 6 శాతం కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులను కేంద్రం కేటాయించాలని సూచించింది. 2014లో తన ఎన్నికల మ్యానిఫెస్టోలో జీడీపీలో 6 శాతం కేటాయిస్తానన్న వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయింది. అలాగే శాస్త్ర, సాంకేతిక రంగాలకు 3 శాతం కేటాయిస్తామన్న మోదీ గత ఐదేండ్లలో 0.7 శాతం మాత్రమే కేటాయించారు. ముసాయిదా ప్రస్తుతం విద్యావ్యవస్థకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయిస్తున్న 10 శాతం నిధులను 202 5 నాటికి 20 శాతం పెంచాలని సూచించింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి మూడు దశాబ్దాలు మినహా తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా 10 శాతం కేటాయించలేదు. మోదీ హయాంలో ఇది మరింతగా దిగజారింది. కేంద్ర బడ్జెట్ 2015లో 3.75 శాతం, 2016లో 3.65 శాతం, 2017లో 3.59 శాతం, 2018లో 3.48 శాతం, 2019లో 3 శాతం నిధులను మాత్రమే కేటాయించింది.

యూఎన్‌ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030లో నాలుగవ లక్ష్యం సమ్మిళిత, సమాన నాణ్యత గల విద్యను అందించడం, అందరికి జీవితకాలంపాటు అభ్యసన అవకాశాలను కల్పించాలి. ఈ లక్ష్యసాధనకు ప్రభుత్వమే. విద్యారంగాన్ని నిర్వహించాలి. ఇప్పటికే విద్యాపర అసమానతలతో సమాజం రెండు వర్గాలుగా చీలిపోతున్న ధోరణులు కనిపిస్తున్నాయి. రాజ్యాంగ తాత్త్విక దృక్పథంతో ప్రజాతంత్ర విద్యావిధానాన్ని అమలు కోసం రాజకీయపక్షాలు, పౌర సమాజం దృఢ సంకల్పంతో వ్యవహరించినప్పుడే నాగరికత వికాసంలో, సమ్మిళిత వృద్ధిలో భారత్ శిఖరాయమా న స్థితికి చేరుకుంటుంది.

195
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles