సంస్కరణలే శ్రీరామరక్ష

Fri,June 7, 2019 12:19 AM

వృత్తిదారుల నుంచే కొంతమంది వ్యవసాయదారులు పుట్టుకొచ్చారు. కానీ వారికి తమ చేతుల్లోకి వచ్చిన భూమికి సంబంధించి హక్కుపత్రాలు మాత్రం రాలేదు. వాటితో వారికి అంత అవసరమూ ఏర్పడలేదు. అందుకోసం ప్రయత్నించనూ లేదు. కారణం క్రయవిక్రయాలన్నీ సాదాబైనామాల ద్వారానే సాగాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా సుమారు 12 లక్షల దరఖాస్తులు కేవలం సాదాబైనామాకు చెందినవే కావడం గమనార్హం.
ravi-knr
పూటకు అన్నం దొరికితే చాలని పొలం పచ్చగా ఉండాలని..
నటరాజునకు మొక్కిన ఆ బీదవాని కష్టానికి
కటాక్షించెను ఆ బోళాశంకరుడు కానీ
నటనతో, మాటలతో మాయచేసే ఆ రెవెన్యూ అధికారుల
లూటీలో భూమిని కోల్పోయి, ఆ భువిలో కలిసిపోయేనతడు.

నా వాట్సప్‌కు వచ్చిన వ్యాఖ్యలివి. చదువగానే అధికార యంత్రాంగం ఎంతగా అవినీతి మయమైందో అర్థమైనా అది అందరికీ తెలిసిందే కదా అనుకొని వదిలేశాను. అయితే కొద్దిరోజులుగా నమస్తే తెలంగాణ ధర్మగంట పేరుతో రోజువారీగా ప్రచురితమవుతున్న కథనాలను చదువుతుంటే తెలుస్తున్నది పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో? మరీ ముఖ్యంగా రెవె న్యూ వ్యవస్థ ఎంతగా పతమైనందో? ఆ వాట్సప్ సందేశంలో గూడుకట్టుకున్న మనోవ్యథ. ప్రకృతి ఒడిదొడుకులను తట్టుకుంటూ.. దళారీ వ్యవస్థను దాటుకుంటూ.. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా ఆ నేలతల్లినే నమ్ముకున్న వ్యక్తి ఎన్నితిప్పలు పడుతున్నడో బోధపడుతున్నది. తన భూమిపైన తనకే హక్కులేక ఎంతటి మానసిక క్షోభను అనుభవిస్తున్న డో తెలుస్తుంటే హృదయం ద్రవించిపోతున్నది. అంతేనా రెవెన్యూ వ్యవస్థలోని లోపాలు, కొంతమంది అధికారుల ధనదాహం, నిర్లక్ష్యం వెరసి ఎన్ని జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయో కళ్లకు కడుతున్నది. అది వ్యక్తికేగాక మొత్తం సామాజిక వ్యవస్థను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నదో, కుటుంబ సంబంధాలను ఎంతలా విచ్ఛిన్నం చేస్తున్నదో విశదీకరిస్తున్నది. వాటికి ముగింపు పలుకాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తేటతెల్లం చేస్తున్నది. అందుకే మొదట రెవెన్యూ వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతికి బీజం ఎక్కడుంది? అడ్డూ అదుపూ లేకుండా అది ఎందుకు అవిచ్ఛిన్నం గా విస్తరిస్తున్నది? అనే అంశాలను విశ్లేషిద్దాం.

ఇక్కడ మనం తొలుత భూమికి, మనిషికి మధ్యనున్న అవినాభావ సంబంధం తెలుసుకోవాలి. మట్టిపై మనిషికుండే నెనరును ఆకళింపు చేసుకోవాలి. ఏ వ్యక్తయినా కూడు, గూడు, గుడ్డ కోసమే తాపత్రయపడుతా డు. వాటికోసం సమస్త జీవితాన్ని ధారపోస్తాడు. ఆ మూడింటికీ కావాల్సింది భూమే. నేలంటే ఒక నిండు జీవితం, బతుకుపై నమ్మకం, భద్రత, సామాజిక గౌరవం. దానికోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడు. ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తాడు. అందుకు చరిత్రలో ఉదాహరణలు కోకొల్ల లు. తెలంగాణ సాయుధ పోరాటమే ఒక నిలువెత్తు నిదర్శనం. ఆ కాలం మారింది కదా అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ప్రతిదీ వ్యాపారమయమవుతున్న ఆధునిక సమాజంలోనూ పెట్టుబడి మూలధనంగా, అన్నింటికంటే లాభదాయకమై, కచ్చితమైన రాబడిగల మారక వస్తువుగా ఆ భూమే చలామణి అవుతున్నది. ఎవుసం కుంటుపడినా, ఫలసాయం రాకున్నా భూమి రేటు రెట్టింపుస్థాయిలో పెరుగడమే ఇక్కడ గమనార్హం. ఇక్కడ మరొక అంశం భూమికీ, మనిషికీ బంధం సజీవమైంది. పుట్టిన తర్వాత మొదలై, కన్ను మూసేదాకా కొనసాగుతుంది. వ్యక్తులు మారుతుంటారు. కానీ, భూమి అలాగే ఉంటుంది. కేవలం చేతులు మాత్రమే మారుతుంది. వీటన్నింటినీ అవగతం చేసుకున్నప్పుడే ఆ అంశాలపై అవగాహన ఉన్నప్పుడే.. ఆ కోణంలో చూసినప్పుడే మట్టి కోసం మనిషి పడే తండ్లాట, అది తనకు దక్కకుండా చేజారిపోతున్నదనే క్షణంలో గురయ్యే మానసిక క్షోభ అర్థమవుతుంది. అంతటి ప్రాధాన్యం కలిగి ఉన్న భూమికి సంబంధించిన రికార్డులు పారదర్శకంగా లేకపోవడం, యజమానుల హక్కులకు భద్రత కరువవడం, క్రయవిక్రయాలు సజావుగా సాగకపోవడం, పారదర్శకత లోపించడం, అంతులేని అవినీతికి తావుండటం, అధికారుల నిర్లక్ష్యం దాగి ఉండటం శోచనీయం.

వృత్తిదారుల నుంచే కొంతమంది వ్యవసాయదారులు పుట్టుకొచ్చారు. కానీ వారికి తమ చేతుల్లోకి వచ్చిన భూమికి సంబంధించి హక్కుపత్రాలు మాత్రం రాలేదు. వాటితో వారికి అంత అవసరమూ ఏర్పడలే దు. అందుకోసం ప్రయత్నించనూ లేదు. కారణం క్రయవిక్రయాలన్నీ సాదాబైనామాల ద్వారానే సాగాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా సుమారు 12 లక్షల దరఖాస్తు లు కేవలం సాదాబైనామాకు చెందినవే కావడం గమనార్హం. వారసత్వంగా భూము లు ఒకతరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతూ వచ్చాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు బీటలు వారడంతో ఉన్న చిన్న కమతాలు మరింత చిన్నవిగా మారిపోయాయి. ఇక్కడే భూసమస్యలకు బీజం పడింది. తెలంగాణ ప్రాంతంలో 1936లో తెలంగాణలో భూమి సెటిల్‌మెంట్ సర్వే చేయించారు. గ్రామ నక్షలను రూపొందించారు. ఆ తర్వాత ఇప్పటికీ ఆ దిశగా ఏ ప్రభుత్వమూ మారిన పరిస్థితులకు అనుగుణంగా పాలన, రెవె న్యూ విధానాలను మార్చేందుకు ముందుకుపోలేదు. ఆ తర్వాతి కాలంలో తీసుకొచ్చిన రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 1971 (ఆర్‌వోఆర్) చట్టం, రెవెన్యూ అధికారుల లంచగొండితనం, నిర్లక్ష్యంతో ఉన్న సమస్యలు మరింత జఠిలమయ్యా యి. కబ్జాలో ఒకరుంటారు, సర్వే నంబర్‌లో వేరొకరి పేరుంటుంది, క్షేత్రస్థాయిలో అక్కడ మరొకరి భూమి ఉంటుంది. ఇలాంటి సమస్యలు అనేకం.

ఇక పట్టణాల సంగతికి వస్తే ఈ ఏడు దశాబ్దాల కాలంలోనే తెలంగాణ లో అనేక గ్రామాలు పట్టణాలుగా, నగరాలుగా, మహానగరాలుగా విస్తరించాయి. వాటిని ఆనుకొని ఉన్న అనేక వ్యవసాయ భూములు ప్లాట్లుగా, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా రూపాంతరం చెందాయి. అయితే అక్కడా దశాబ్దాల కాలం కిందట నాటి రెవెన్యూ వ్యవస్థ, పట్టణ ప్రణాళికలే అమలవుతుండటం గమనార్హం. ఫలితంగా పట్టణాలు అనేక భూకబ్జాలకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. మరోవైపు అడుగడుగునా లోపాలతో కూడిన వ్యవస్థను ఆసరాగా చేసుకొని అధికారులు అవినీతికి తెరలేపారు. నేడు భూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఇంటి పర్మిషన్, నల్లా కనెక్షన్ ఇలా ప్రతిదానికీ ప్రతిచోటా చేతులు తడుపాల్సిన దుస్థితి నెలకొన్నది.
మరి ఈ భూ సమస్యలకు అంతెక్కడ? వాటిని పరిష్కరించేదెట్లా? భూ హక్కులకు భద్రత కల్పించేదెట్లా? అన్నవి ఇప్పుడు మనముందున్న ప్రశ్నలు. అందుకు సామాన్యులు మొదలు మేధావుల వరకూ చెబుతున్న సమాధానం ఒక్కటే. అది రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన. సంస్కరణలతో అది సాధ్యం. కాలం చెల్లిన విధానాలకు, కోరలు లేని చట్టాలకు స్వస్తి పలుకాలన్నదే అందరి వాదన. మారిన భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని సరికొత్త వ్యవస్థకు ప్రాణం పోయాలి. పారదర్శకతను పెంచాలన్నదే ప్రతిఒక్కరీ అభిప్రాయం. అప్పుడే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అదే తెలంగాణ ప్రభుత్వం ఆశయం. అదే భూ హక్కులకు శాశ్వత భరోసా. భవిష్యత్ తెలంగాణకు శ్రీరామ రక్ష.

166
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles