సమాజమే కేంద్రంగా పరిశోధనలు

Fri,June 7, 2019 12:17 AM

విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లలో నెలకొన్న అసహజత్వాన్ని అధిగమించేందుకు టైవ్‌‌సు హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుబంధంగా రూపుదిద్దుకొన్న విశ్వవిద్యాలయాల శ్రేష్ఠతను గుర్తించే కొత్త నమూనా ఆహ్వానించదగిన పరిణామం.సంప్రదాయ కొలమానాలకు భిన్నంగా ఈ నమూనాను రూపొందించారు. ఇది భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల విశ్వవిద్యాలయాలకు ఒక ప్రేరణగా చెప్పవచ్చు. ఇదే సందర్భంలో భారతదేశ ఉన్నత విద్యాసంస్థల ప్రస్తుత ర్యాంకింగ్ ఫ్రేం వర్క్‌లోనూ తగిన మార్పులు చేయాలి. ఉన్నత విద్యా సంస్థలలో శ్రేష్ఠత కంటే, సమత్వం అత్యంత ముఖ్యమని ప్రభుత్వాలు గుర్తించాలి. అంటే అన్ని విశ్వవిద్యాలయాలు కనీస విద్యా ప్రమాణాలను మౌలిక వసతులను కలిగి విద్యార్థులందరికీ ఏ విధమైన వివక్ష లేకుండా సమాన విద్యావకాశాలను కల్పించాలి. సమత్వం లేని శ్రేష్ఠత విద్యావ్యవస్థలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుబంధంగా ర్యాంకింగ్ ఫ్రేంవర్క్‌ను రూపొందించుకొని విద్యాసంస్థల ర్యాంకింగ్‌ను ప్రతి ఏడాదికి బదులు నాలుగు లేదా ఐదేండ్లకోసారి స్వతంత్ర సంస్థలచే నిర్వహించాలి.

shenkar
జాతీయ విద్యా విధానం-2019లో గుణాత్మక విద్య ను సాధించే లక్ష్యంతో ముసాయిదాను రూపొం దించింది. ఇందులో వర్సిటీలకు ఇచ్చే ర్యాంకింగ్‌ల ను ప్రపంచ విశ్వవిద్యాలయాల ఆర్థిక, సామాజిక ప్రభావశీలతా ర్యాంకింగ్, యునైటెడ్ నేషన్స్ సభ్యదేశాలు ఆమోదించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న పాత్ర ఆధారంగా జరుగనున్నది. స్థానిక సమాజం లేదా ప్రాంతం ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలకు విశ్వవిద్యాలయాలు స్పందిస్తున్న తీరు, సూచిస్తున్న పరిష్కారాలు ఈ ర్యాంకింగ్‌కు ప్రాతిపదిక కానున్నా యి. భూగ్రహాన్ని అత్యంత సౌకర్యవంతమైన నివాస స్థలంగా మార్చేందుకు, అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వందలాది విశ్వవిద్యాలయాలు నిరంతరంగా జరుపుతున్న కృషి, అవి సూచిస్తున్న పరిష్కారాలు ఇక ముందు వెలుగులోకి రానున్నాయి.

పరిశోధన, పేటెంట్లు, ప్రచురణలు, ప్రతిభావంతులైన బోధనా సిబ్బం ది, విదేశీ విద్యార్థుల సంఖ్య, అంతర్జాతీయ నోబెల్ బహుమతి గ్రహీత లు వంటి అంశాలు సంప్రదాయ కొలమానాలు. ప్రస్తుతం చైనా నుంచి వెలువడే షాంఘై విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌కు ఇంగ్లాండ్ నుంచి ప్రచురించబడే క్యు.ఎస్., టైవ్‌‌సు హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లకు కొల మానంగా పరిగణించబడుతున్నాయి. ఆర్థికంగా, మౌలిక సౌకర్యాల పరం గా శక్తివంతమైన కొన్ని విశ్వవిద్యాలయాలకు మాత్రమే సాధ్యపడే పై అంశాల కారణంగా 100 లోపు ర్యాంకు సాధించడం భార త్ లాంటి అభివృ ద్ధి చెందుతున్న దేశాలకు అందని ద్రాక్ష పండులా మిగిలిపోతున్నది. అత్యంత విశ్వసనీయంగా పరిగణించబడే పై మూడు సం స్థలు వెలువరించే ర్యాంకులు వివిధ దేశాల ఉన్నత విద్యావ్యవస్థల శ్రేష్టతకు కొలమానంగా పరిగణిస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాల ప్రభుత్వాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు 100 లేదా 200లోపు ర్యాంక్ సాధించేందుకు, ఎంపిక చేసుకున్న కొన్ని విద్యాసంస్థలపై నిధుల వర్షాన్ని కురిపిస్తూ వందలాది విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈ ధోరణి ఉన్నత విద్యావ్యవస్థల్లో సమానత్వాని కి భంగం కలిగిస్తున్నది. తీవ్రమైన అసమానతలకు దారితీస్తున్నది. భారతదేశం కూడా ప్రభుత్వరంగంలో 10, ప్రైవేట్‌రంగంలో 10 ఉన్నత విద్యాసంస్థలను ఎంపికచేసి ర్యాంకుల రేసులో నిలిపేందుకు విధాన రూపకల్పనలు చేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వరంగంలో మూడు, ప్రైవేట్ రంగంలో మూడు సంస్థల ఎంపిక పూర్తయింది. ఇప్పటివరకు భౌతికంగా మనుగడలో లేని ఎంపిక ఒక కొత్త వివాదానికి తెరతీసింది. కోటాలో ఈ ఎంపిక జరిపినట్లు వివరణ ఎంతవరకు సమర్థనీయమో ఆలోచించాలి.

స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఎం.ఐ.టీ., ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనా విశ్వవిద్యాలయాలు దశాబ్దాలుగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, మానవీయ శాస్ర్తాలలో అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ఫలితంగా పొందుతున్న నోబెల్ బహుమతులు ఇతర ఫీల్డ్ మెడల్స్ ఆ విద్యాలయాల పరిశోధనా పటిమకు నిదర్శనం. అయినప్పటికీ ఈ విజయాలు అధిక మొత్తాల్లో నిధుల వినియోగం ద్వారా మాత్రమే సాధ్య మైంది. ఈ విశ్వవిద్యాలయాలు తమకు గల పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక బలం, సానుకూలమైన పరిశోధనా వాతావరణం కారణంగా ప్రపంచస్థాయిలో మేధావులుగా గుర్తించబడిన వారిని ఆకర్షిస్తున్నాయి. వారిని పరిశోధకులుగా, బోధనా సిబ్బందిగా నియమించుకోవడం వల్ల శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తిరుగులేని విజయాలను అందుకుంటున్నాయి. దీంతపాటు విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లలో అగ్రస్థానాలలో నిలబడగలుగుతున్నాయి.

ఇదే సందర్భంలో అంతగా ప్రఖ్యాతిగాంచని, తక్కువస్థాయిలో ఆర్థిక వనరులు కలిగిన వివిధ దేశాల్లోని వందలాది విశ్వవిద్యాలయాలు నోబె ల్ బహుమతిస్థాయి పరిశోధనా విజయాలు సాధించాయి. అయినప్పటి కీ స్థానిక ప్రజల జీవితాలను మార్చగలిగిన అనేక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించాయి. అవి సాధిస్తున్న విజయాలు గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఉప సహారా ఆఫ్రికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు అత్యంత నైపుణ్యం గల నర్సులను అభివృద్ధి చేసి సమాజానికి అందించాయి. దీనిద్వారా స్థానిక ప్రజల ఆరోగ్యస్థితిలో గణనీయమైన మార్పు తీసుకొని రాగలిగాయి. భారత్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా అటవీ ప్రాంతాలలోని గిరిజన తెగలను చైతన్యపరుచడంలో విజయం సాధిస్తున్నాయి. ఫిన్లాండ్ విశ్వవిద్యాలయాలు వృత్తి నిబద్ధత, గుణాత్మకతతో కూడిన ఉపాధ్యాయ వ్యవస్థను నిర్మించాయి. దీనిద్వారా ఆ దేశం ప్రపంచంలోనే ఉత్తమ విద్యావ్యవస్థగా నిలిచింది. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర సాధన. ఈ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు గణనీయమైన పాత్రను పోషించాయి. ఈ విధంగా అనేక సాధారణ స్థాయి విశ్వవిద్యాలయాలు సంప్రదాయ పరిమితులకు అతీతంగా లింగవివక్ష, వాతావరణ శాస్త్రం, క్లీన్ ఎనర్జీ, సానిటేషన్, జబ్బులను ఎదుర్కొవడం వంటి అనేక భిన్నమైన సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఈ సేవలను గుర్తించాల్సిన అవసరం ఉన్నది.

విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లలో నెలకొన్న అసహజత్వాన్ని అధిగమించేందుకు టైవ్‌‌సు హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుబంధంగా రూపుదిద్దుకొన్న విశ్వవిద్యాలయాల శ్రేష్ఠతను గుర్తించే కొత్త నమూనా ఆహ్వానించదగిన పరిణామం. సంప్రదాయ కొలమానాలకు భిన్నంగా ఈ నమూనాను రూపొందించారు. ఇది భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల విశ్వవిద్యాలయాలకు ఒక ప్రేరణగా చెప్పవచ్చు. ఇదే సందర్భంలో భారతదేశ ఉన్నత విద్యాసంస్థల ప్రస్తుత ర్యాంకింగ్ ఫ్రేం వర్క్‌లోనూ తగిన మార్పులు చేయాలి.

జాతీయస్థాయిలో విద్యాసంస్థల ర్యాంకింగ్ ద్వారా ఉన్నత విద్యలో గుణాత్మకతను పెంచే ఉద్దేశంతో 2015లో జాతీయ ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్ ఫ్రేం వర్క్‌ను ప్రారంభించింది. బోధన అభ్యసన వనరు లు, పరిశోధనా ఉత్పన్నాలు, పట్టభద్రత పర్యవసానాలు, సంలీనత, చేరువ పరిధి, విద్యాసంస్థపై ప్రజల దృష్టికోణం వంటి అంశాల ఆధారం గా విద్యాసంస్థలకు ర్యాంకులు ఇవ్వబడతాయి. కేవలం గణాంకాల ఆధారంగా లెక్కించదగిన పై అంశాలు విశ్వవిద్యాలయాల వాస్తవ లక్ష్యాలను, క్రియాపరత్వాన్ని సూచించడం లేదనేది ఒక వాదన. ఉన్నత శ్రేణి ఉద్యోగార్హత నైపుణ్యాలు, వ్యవస్థాపకత సామాజిక మూలధన నిర్మాణం, మానవీయ విలువల పెంపుదల, జీవితకాల అభ్యసనం వంటి అంశాలు పరిగణనలో లేకపోవడం శోచనీయం. 2016 నుంచి ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్న ఈ ర్యాంకులలో కేంద్రం ప్రభుత్వం నుంచి అధిక మొత్తాలలో నిధులు పొందుతూ, మెరుగైన మౌలిక వసతులుగల కేంద్ర ప్రభు త్వ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఉత్తమ ర్యాంకులు పొందుతున్నాయి. నిధులు, మౌలిక సౌకర్యాల కొరతతో ఇబ్బందులు పడుతున్న పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ వం టి విశ్వవిద్యాలయాలను కేంద్రీయ విశ్వవిద్యాలయాల జతన చేర్చి ర్యాంకులు తీయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వాలు ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వాలలోని ఉన్నత విద్యాసంస్థలు సింహభాగం విద్యార్థులు నమోదును కలిగి ఉన్నప్పటికీ, యూజీసీ బడ్జెట్లో దాదాపు 65 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలకు కేవలం 35 శాతం నిధులు రాష్ర్టాల ఆధ్వర్యంలోని విద్యాసంస్థలకు కేటాయించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించడమే.

ఉన్నత విద్యా సంస్థలలో శ్రేష్ఠత కంటే, సమత్వం అత్యంత ముఖ్య మని ప్రభుత్వాలు గుర్తించాలి. అంటే అన్ని విశ్వవిద్యాలయాలు కనీస విద్యా ప్రమాణాలను మౌలిక వసతులను కలిగి విద్యార్థులందరికీ ఏ విధమైన వివక్ష లేకుండా సమాన విద్యావకాశాలను కల్పించాలి. సమత్వం లేని శ్రేష్ఠత విద్యావ్యవస్థలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుబంధంగా ర్యాంకింగ్ ఫ్రేంవర్క్‌ను రూపొందించుకొని విద్యాసంస్థల ర్యాంకింగ్‌ను ప్రతి ఏడాదికి బదులు నాలుగు లేదా ఐదేండ్లకోసారి స్వతంత్ర సంస్థలచే నిర్వహించాలి. యునైటెడ్ నేషన్స్ సభ్యదేశాలు 2030 వరకు సాధించాల్సిన విస్తృత విద్యా లక్ష్యం సమత్వం, సమ్మిళితం, గుణాత్మకతతో కూడిన విద్య అందరికీ జీవితకాల అభ్యసనావకాశాలను ప్రోత్సహించడం సాకారమయ్యే దిశలో భారతదేశ ఉన్న త విద్యా ర్యాంకింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఆశిద్దాం.

169
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles