23, ఇంకెంత దూరం!

Sat,May 18, 2019 12:57 AM

నిన్నటితో ముగిసిన ఏడు దశల ఎన్నికల ప్రచారంలో ఎవరేం మాట్లాడి ఓట్లను అర్థించారన్నది ముఖ్య విషయం-గత ఐదేండ్ల నుంచి కేంద్రంలో, పలు రాష్ర్టాల్లో అధికారం నడుపుతున్న పాలక పక్షం బీజేపీ అధినేత, ప్రధాని మోదీ దేశమంతటా ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడినారో, ఏం మాట్లాడలేదో అన్నది చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే ఈ ప్రచారంలో మోదీజీ ప్రస్తావించిన అంశాలు, సమస్యల కంటే ఆయన ప్రస్తావించని అంశాలు, సమస్యలే ప్రధానమైనవి. గత ఐదేండ్లలో తమ ప్రభుత్వాలు, విశేషించి కేంద్రం దేశ ప్రజల పేదరికాన్ని, దారిద్య్రాన్ని, నిరుద్యోగాన్ని, అజ్ఞానాన్ని, విద్యా విహీనతను, అనారోగ్యాన్ని, కశ్మీర్ నుంచి కేరళ వరకు రగుల్కొన్న అసహనాన్ని, అనైక్యతను, సామాజిక ఛిద్రాలను, కోట్లాది రైతుల అసంతృప్తిని దూరం చేయడానికి ఏం చర్యలు తీసుకున్నదో, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఏం చేశారో మోదీజీ చెప్పలేదు.

Prabhakar-Rao
ఉడికేంతవరకు ఉన్నవు, ఉమ్మగిలేంతవరకు ఉండలేవా! అని అమ్మ అనే మాటలు జ్ఞాపకం వస్తున్నయ్. 2019 ఏప్రిల్ 11న మొదటి దశతో మొదలై మే 19న ఏడవ దశతో పూర్తికాబోతున్న 17వ లోక్‌సభ ఎన్నికల కార్యక్రమం మే 23న ఫలితాల ప్రకటనతో సమాప్తమవుతుంది. 23న ఫలితాల ప్రకటనకు మరో నాలుగు రోజులు నిరీక్షించాలె. ఈ నిరీక్షణే దుర్భరమై టెన్షన్ పుట్టిస్తున్నది. వైద్యులు, శ్రేయోభిలాషలు టెన్షన్ మంచిది కాదని హితబోధ చేస్తారు. కానీ, ఎన్నికల రంగంతో ఏదో ఒకవిధంగా సంబంధం ఉన్నవారు, స్టేక్‌హోల్డర్లు ఓపిక పట్టి నిరీక్షించడం కష్టమే. ఓపికతో అంతిమ ఫలితాల కోసం నిరీక్షించాలని, ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ, అంచనాలు తలకిందులై ఆశాభంగం కలిగినా కుంగిపోరాదని, చైత్రం తర్వాత వైశాఖం, గ్రీష్మం మండుటెండల అనంతరం వర్షాగమ నం, వరదలు ముంచెత్తినట్లు 17వ లోక్‌సభ తర్వాత ఇంకెన్నో ఎన్నిక లు రాకతప్పదని, అధైర్యపడి, అంతా మునిగిందని కుప్పకూలవద్దని (పరీక్షల్లో, ఇతర విషయాల్లో అనుకున్నది జరుగలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వింటున్నాం. కానీ, ఈ దేశంలో ఎన్నికల రంగంలో విఫలమైనవారు నైరాశ్యంలో చిక్కుకొని, ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న దుర్ఘటనలు బహుశా ఇంతవరకు వెలుగులోకి రాలేదు.

ఈ పరీక్ష కాకపోతే మరో పరీక్ష అని కొందరు విద్యార్థులు ధైర్యాన్ని నింపుకున్నట్లు, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని రాజకీయులు ధైర్యంగా ఉంటున్నారు) పెద్దలు కొందరు సుద్దులు చెప్పుతుంటారు. కానీ, ఫలితాల కోసం ఎదురుచూసే వారికి తెలుస్తుంది నిరీక్షణలోని బాధ, వేదన. నేను నీవు ఎక్కడ ఉంటామో అక్కడ విజయం తథ్యం అని (యత్రః యోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః తత్ర శ్రీర్వజయో భూతిః ధృవా నీతిర్మతి ర్మమ) కృష్ణ భగవాన్ చేతిలో చేయేసి భరోసా ఇచ్చినప్పటికి, తసల్లి కల్గించినప్పటికి అర్జునుడికి బి.పి. నార్మల్ కాలేదంటారు భారత సంహిత వ్యాఖ్యాన శిరోమణులు. కురుక్షేత్ర సం గ్రామ రంగంలో రథాన్ని నిలిపి తక్షణ కర్తవ్య బోధ చేసినవాడు స్వయం గా కృష్ణుడు-కృష్ణుడు ఒక తత్వవేత్తగా చెప్పుతున్న మాటలను వింటున్న వాడు అర్జునుడు. (వీడియో కాన్ఫరెన్స్‌లో సంజయుడు కూడా కృష్ణుని మాటలను విని ఉంటాడు!). చెప్పేవాడికి వినేవాడు లోకువని మనవా ళ్లు అంటారు. ఏవో కొన్ని సందేహాలను వ్యక్తపరుస్తూ విన్నప్పటికీ అర్జునుడికి భయం ఉండనే ఉన్నది-18వ రోజు చివరికి ఏమవుతుందోనన్న ది భయం.

ఇప్పుడు ఈ ఎన్నికల్లో మే 23న ఎటువంటి ఫలితం వస్తుందోనన్నది అందరి భయం. భయాన్ని బయటపెట్టకుండా, మేకపోతు గాంభీర్యంతో లెక్కలు వేస్తున్నవారు, అంచనాలను ప్రకటిస్తూ గెలుపు ధీమాను వ్యక్తపరుస్తున్నవారు లేకపోలేదు. ఐదు, ఆరు దశల పోలింగ్‌లోనే తమ పార్టీకి రాజయోగం పునరావృత మహర్దశ వచ్చిందని, అప్పటికే మూడు వందల స్థానాల్లో తమ గెలుపు ఖాయమైందని ప్రస్తుత పాలకపక్షం బీజేపీ (ఇది భారతీయ జిన్నా పార్టీ అని ఎవరో అన్నారు) జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాజీ కలకత్తా బీభత్సం నుంచి తిరిగిరాగానే పరిపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. బీజేపీ అధినేత నరేంద్ర మోదీ జీ ఎప్పుడో ఒకసారి అన్నట్లు ఆయన జోలె వేసుకుని తిరిగి గుజరాత్‌కు వెళ్లవలసి వస్తుందని, రెండవసారి ఢిల్లీలో-కేంద్రంలో-ఆయన అధికా రం చేపట్టలేరని ఢంకా బజాయించి చెప్పుతున్నవారున్నారు. ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజార్టీ (కనీసం 272 స్థానా లు) రాదని, ఒకరిమీద మరొకరు ఆధారపడక తప్పని రాజకీయ పరిస్థితి (కూటమి ప్రభుత్వాల ఏర్పాటు అనివార్యమైన పరిస్థితి) ఉత్పన్నమవుతుందని మరొక అంచనా.

ఏమయినప్పటికి, 23 నాటి ఫలితాలపై ఏదీ కచ్చిత జోస్యంగా కని పించకపోవడంతో ఫలితాల కోసం నిరీక్షణ బాధాకరమవుతున్నది-టెన్ష న్ తప్పడం లేదు. ఉమ్మగిల్లే వరకు ఓపిక పట్టాలని అమ్మ ఇచ్చిన సలహా అమ్మతరం వారికి శిరోధార్యమవుతుంది. కానీ, ఇది రాకెట్ యుగం గనుక అన్నీ ఇన్‌స్టెంట్‌గా జరుగాలనుకుంటారు. నిరీక్షణ క్షోభను కొంత తగ్గించడానికే సర్వేలు గిర్వేలు, ఒపినియన్ పోల్స్ గిపినియన్ పోల్స్! యుగాలు మారినా, యుగ స్వభావాల్లో మార్పులొచ్చినా నిరీక్షణ కలిగిం చే వేదనను తట్టుకోలేనివారు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. పోతన కవి భాగవతంలో రుక్మిణి కల్యాణ సమయంలో అమిత వేదన కు, ఏ క్షణంలో ఏమవుతుందోనన్న ఆరాటానికి గురవుతుంది; చెలియలతో సల్లాపాలు, వల్లకీ గుణ వినోదం వంటివన్నీ ఆగిపోతయి. రుక్మిణి తాను వరించిన శ్రీకృష్ణుడికి సాహసించి ఒక బ్రాహ్మణోత్తముని ద్వారా సందేశం పంపిస్తుంది-ప్రయత్నం ఉడుకుతున్న దశలోనే రుక్మిణి మనసు ఉద్విగ్నమైంది. తన ప్రయత్నం సఫలమవుతుందో లేదో, తన సందేశాన్ని కృష్ణుడు వింటాడో లేడోనన్న అనుమానం ఆ కోమలిని పీడిస్తుంది. అంతేకాదు, నిరీక్షణను సహించలేక ఆమె ఘనుడా భూసురుడేగెనో? నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా దలచెనో? విచ్చేసెనో, యీశ్వరుండనుకూలింప దలంచునో తలపడో.. నా భాగ్యమెట్లున్నదో? ఇటువంటి పలు ఆలోచనలతో రుక్మిణి అనేక శంకల, సందేహాల వలయంలో చిక్కుకుంటుంది. కాలం ఏదైనప్పటికీ, నిరీక్షణ కరుకైనది.

160 ఏండ్ల కిందట ఉర్దూ కవీశ్వరుడు మిర్జాగాలిబ్ షాయిరీలో-గజళ్లలో ప్రేయసి కోసం నిరీక్షిస్తూ ప్రియుడు పడిన మానసిక వేదన ప్రత్యక్షర రమ్యంగా వ్యక్తమవుతుంది. వ్రాయునపుడు సిరా యొల్కి పడినయట్లు విరహ నిశలు నా బ్రతుకున మరకలిడెను అంటాడు గాలిబ్. గాలిబ్ కవి విరహవేదన వర్ణనాతీతం. తన ప్రియురాలితో సమావేశం సులభం కాద ని ఆయనకు తెలుసు. నీదు కలయిక సులభమ్ము గాదు! సరియె! అని కూడా ఆయన అన్నాడు. నిరీక్షణలో విసిగి వేసారి, వాడి తల్లడిల్లే సందర్భాలు కూడా ఉంటాయి. అసలు నా వార్త నీ కందునంతలోన మట్టిలో నేను కలిసెడి మాట నిజము.. అన్న షేర్‌లో గాలిబ్ షికిస్త్, నిస్పృహ వ్యక్తమైనాయి. గాలిబ్ గజళ్లను తెలుగు సౌందర్యంతో అందించిన మహాకవి దాశరథి సైతం నిరీక్షణలో వ్యధ భరితుడైన వాడే. దాశరథి విముక్త తెలంగాణ కోసం వేయి గళాలు విప్పినవాడు, తన తెలంగాణ తల్లి శృంఖలాలను తెంచడానికి బాధలెన్నిటినో భరిస్తూ నిరీక్షించాడు; తెలంగాణలో ప్రజారాజ్యం కోసం దాశరథి నిరీక్షణ అసాధారణమైనది! ప్రేయసి, విరహం, తాపం, అలుకల వరకే పరిమితం కాకుండా గాలిబ్ రాసిన కొన్ని కవితలు ఆయన సామాజిక స్పృహకు తార్కాణాలుగా నిలిచాయి.

ఈ రెండు మూడు మాసాల జాతీయ ఎన్నికల రంగాన్ని అవలోకిస్తున్నప్పుడు నాడు గాలిబ్ అందించిన కవితలు ఆణిముత్యాల వలె కనిపిస్తున్నాయి. ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడౌట యెంతో దుష్కరము సుమ్ము! ఎన్నడూ ఒక ప్రజా ఉద్యమం తో సంబంధం లేనివాళ్లు, ప్రజల సమస్యల పరిష్కారంలో అణుమాత్ర మైనా పాత్రలేని వాళ్లు పదిసార్లు పఠించి జీర్ణించుకోవలసిన షాయిరీ ఇది. మనిషి మనిషి కావడం ముఖ్యమని నెరవేరని వాగ్దానాలు చేసి అందలం ఎక్కాలనుకుంటున్నవారు గమనించవలసి ఉంటుంది. ఐదేం డ్ల కిందట ఆకర్షణీయ వాగ్దానాలెన్నిటినో విని, విశ్వసించి, ఐదేండ్లు ఓపికతో నిరీక్షించి బేజారై (కాళోజీ కవి బేజారై ఎన్నో ప్రశ్నలు అడిగాడు!) భీష్మించిన సామాన్యులు చేసిన చరిత్రాత్మక నిర్ణయం ఈ 23న బహిర్గ తం కాబోతున్నది. ఎవరికీ అంతుపట్టని నిర్ణయం ఇది-అంతు తేల్చే నిర్ణయం ఇది. స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్దె, లోపమెరిగిన వాడె పూర్ణుడగు నరుడు.. అని గాలిబ్ అన్నాడు అప్పటి సమాజం గురించి.

ఇప్పటి ఈ ఎన్నికల్లో ఎన్నో పార్టీల పక్షాన, ఆ పార్టీల అభ్యర్థులుగా పోటీ పడుతున్న వాళ్లలో, అందమైన భవిష్యత్తు కోసం ధారాళంగా హామీలు గుప్పిస్తున్న వారిలో ఎందరు తమ లోపాలు తెలిసినవారు? ఇంతవరకు ఇవి తమ లోపాలని ప్రజల ముందు, నిర్ణేతలైన ఓటర్లముందు అంగీకరించి పూర్ణ నరులవుతున్నవారు ఎందరు? నిన్నటితో ముగిసిన ఏడు దశల ఎన్నికల ప్రచారంలో ఎవరేం మాట్లాడి ఓట్లను అర్థించారన్నది ముఖ్య విషయం-గత ఐదేండ్ల నుంచి కేంద్రంలో, పలు రాష్ర్టాల్లో అధికారం నడుపుతున్న పాలక పక్షం బీజేపీ అధినేత, ప్రధాని మోదీ దేశమంతటా ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడినారో, ఏం మాట్లాడలేదో అన్నది చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే ఈ ప్రచారంలో మోదీజీ ప్రస్తావించిన అంశాలు, సమస్యల కంటే ఆయన ప్రస్తావించని అంశాలు, సమస్యలే ప్రధానమైనవి.

గత ఐదేండ్లలో తమ ప్రభుత్వాలు, విశేషించి కేంద్రం దేశ ప్రజల పేదరికాన్ని, దారిద్య్రాన్ని, నిరుద్యోగాన్ని, అజ్ఞానాన్ని, విద్యా విహీనతను, అనారోగ్యాన్ని, కశ్మీర్ నుంచి కేరళ వరకు రగుల్కొన్న అసహనాన్ని, అనైక్యతను, సామాజిక ఛిద్రాలను, కోట్లాది రైతుల అసంతృప్తిని దూరం చేయడానికి ఏం చర్యలు తీసుకున్నదో, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఏం చేశారో మోదీ జీ చెప్పలేదు. భారత సైనిక సాహస చర్యలు, త్యాగాలు, భారత అంతరిక్ష శాస్త్రజ్ఞుల పరిశోధనా ఫలాలు, మేధోమథనం తన విజయాలు అన్నట్లుగా మోదీజీ ప్రచారం జరిపారు. మోదీజీ ఎన్నికల ప్రసంగాలను విన్నప్పుడు నిజంగానే ఈ దేశం భద్రతకు ప్రమాదం పొంచి ఉందన్న భయం కలుగుతుంది. ఏడు దశల ఎన్నికల ప్రచారానికి కలకత్తాలో అమిత్‌షాజీ రోడ్‌షోతో, మోదీజీ బెంగాల్ ప్రసంగాలతో ైక్లెమాక్స్ సీన్ ప్రదర్శితమైంది. 35 ఏండ్లు నిరాటంకంగా అధికారం నడిపిన సీపీఐ(ఎం)ను గద్దె దించడానికి మమతా దీదీ ఇన్ని ఇబ్బందులు పడలేదు. ప్రఖ్యాత సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అభ్యుదయ భావాలు మోదీజీకి, అమిత్ షాజీకి ఎంతమాత్రం నచ్చనివి-మమతా బెనర్జీకి ఎంతో నచ్చినవి. విద్యాసాగరుడి విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో విజ్ఞులు నిర్ణయించాలె.

244
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles