చిక్కుముడులు విప్పాల్సిందే...

Sat,May 18, 2019 12:56 AM

రెవెన్యూశాఖ పనిలో పారదర్శకత ఉండాలంటే డిజిటలైజేషన్‌తో పాటు జవాబుదారీతనం పెంచినప్పడు అలసత్వం, అవినీతి రెండు తగ్గుతాయి. కొత్త రెవెన్యూ చట్టం వార్తలు వస్తున్నవేళ.. సంస్కరణల ప్రతిపాదనలు తయారీకి ముందు మేధోమథనం జరుగాల్సిందే. భూమి హక్కు నిరూపించుకునేందుకు పలురకాల పాత, కొత్త కాగితాలు తెస్తుంటారు. దీనికిబదులు ఒకే కన్‌క్లూజివ్ టైటిల్ ఉండటం ఎంతో వీలుగా ఉంటుంది.

Nagendra-Babu
భూమి చట్టాలు, రెవెన్యూశాఖ సంస్కరణలు, అందులో అవినీ తి, ఆ శాఖ రద్దు తదితర అంశాలు ఇటీవల పెద్దఎత్తున చర్చానీయాంశమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ చర్చ ను మొదలుపెట్టింది సీఎం కేసీఆర్ కావడం విశేషం. వారికి రెవెన్యూ శాఖ, భూ చట్టాల గురించి అవగాహన ఉందన్న విషయం వారి మాటలు, ప్రకటనల ద్వారా వెల్లడైంది. ఇది ఊరట కలిగించే విషయం. మొఘలులు, షేర్షా సూరి, కుతుబ్ షాహీలు, అక్కన్న మాదన్నలు, అసఫ్ జాహీల కాలం నుంచి భూ చట్టాలు రూపొందుతూనే ఉన్నాయి. కాలానుగుణంగా అవి సంస్కరణలకు గురవుతూనే ఉన్నాయి. భూమి, దాని పైహక్కు అనేది గ్రామీణ వ్యవసాయ కుటుంబాలకు అతి ముఖ్యమైనది. భూమికి మనుషులకు విడదీయరాని అవినాభావ సంభం ధం ఉంటుంది. చనిపోయాక కూడా ఆ భూమిలోనే ఖననం కావాలని కోరుకుంటారు. భూమి చట్టాలు, భూహక్కులు సరిగా లేకపొతే వారి క్షోభ మరణం కంటే బాధాకరంగా ఉంటుంది. భూ హక్కులను రైతులందరికీ నూటికి నూరు శాతం ఇవ్వాలని ఎప్పటికప్పుడు పాలనా సంస్కరణలు జరుగుతూనే ఉన్నాయి.

1920-40 మధ్యకాలంలో ప్రతి ఊరుకు సర్వే సెటిల్మెంట్, నక్షా, సేత్వారిల తయారీ వేలాది మంది నిపుణుల ఆధ్వర్యంలో జరిగింది. 195 4-55లో ఖాస్రా పహాణి రాయడం కుడా ఒక రకమైన సంస్కరణే. అప్పట్లో ఖాబిజ్-ఈ-ఖదీమ్ అంటే భూమి అనుభవంలో ఉన్నవారికి పట్టా హక్కులు కల్పించేందుకు మార్గం సుగమం చేయడమే. అప్పుడు ఫీల్ సర్వేననుసరించి పహాణిలో అనుభవదారుడి పేరును ఎక్కించడం జరిగింది. ఈ ఖాస్రా పహాణిలు వీటి తదుపరి వచ్చిన చేస్సాల పహాణిలు (అంటే 1955-58 మధ్యలో రాసిన మూడేండ్ల పహాణిలు) ఇప్పటికీ పలు భూమి తగాదాలు తీర్చడానికి రెవెన్యూ వారికి ఉపయోగపడుతున్నాయి. దీనితర్వాత 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టంతో తోక పట్టా పాస్‌బుక్కులు, 1989లో ఈ చట్టానికి చేసిన సవరణలతో వచ్చిన పట్టా దారు పాస్ పుస్తకాలు, టైటిల్ బుక్స్ ఈ కోవకు చెందినవే.

తెలంగాణలో సంప్రదాయికంగా భూ కొనుగోళ్లు ఎక్కువగా మాట మీ ద జరిగిపోయేవి. కొద్ది సందర్భాల్లో తెల్ల కాగితంపై క్లుప్తంగా రాసుకునే వారు, 1970ల వరకు మాట, నమ్మకం ద్వారానే భూ లావాదేవీలు జరిగేవి. రిజిస్ట్రేషన్ ఖర్చులకు దడిసి ఆ ఆలోచన ఎక్కువగా చేసేవారు కాదు. మరికొన్ని సందర్భాల్లో సిగరెట్, అగ్గిపెట్టె కాగితాల వెనుక రేగడి పాయ కాల్వ పక్కన ఒక ఎకరం భూమి కోసం రూ.260 ముట్టినవి. ఇక నుంచి మీరే దున్నుకోగలరని మాత్రమే రాసుకొని భూమి స్వాధీనం చేసేవారు. సాధారణంగా ఏ వివాదం ఏర్పడేది కాదు. దీనినే సాదాబైనామా అంటున్నారు. దీనికి తాసీల్ కట్టిన రసీదులను జతచేసి భూమి హక్కు పత్రంగా దాచుకునేవారు.

1988లో అప్పటి సీఎం ఎన్టీఆర్ దేవుడిచ్చిన భూమికి పన్ను ఎందు కు? అని శిస్తు రద్దు చేశాడు. దీంతో రైతులకు ఏటా వచ్చే భూమి శిస్తు కట్టిన రసీదులు రాకుండా పోయాయి. జమాబందీ రికార్డు పద్ధతి కుడా పోయిం ది. 1984 గ్రామ పట్వారీ, పటేల్ వ్యవస్థను రద్దు చేశాడు. దీంతో భూ రికార్డుల వ్యవస్థ పాడయింది. ప్రత్యామ్నాయం లేనందువల్ల గ్రామ రెవె న్యూ వ్యవస్థ కుంటుపడ్డది. ఊరికి ఒక పట్వారీ స్థానంలో కొన్ని ఊర్లకు కలిపి ఒక గ్రామ సహాయకుడిని నియమించారు, వీరికి భూమి సంగతులు, చట్టాలపై అవగాహన లేనందునవల్ల పలుచోట్ల భూ రికార్డుల వ్యవ స్థ అస్తవ్యస్తమైంది. భూముల ధరలు కుడా పెరుగడంతో భూమి చిక్కులు క్రమంగా పెరిగాయి. పట్వారీలు సృష్టించే చిన్న సమస్యల స్థానంలో జటిల సమస్యలు పుట్టుకొచ్చాయి. అయితే ఆర్‌ఓఆర్ చట్టం ద్వారా ఫారం-10 దరఖాస్తులు తీసుకొని 5 ఎంక్వయిరీ ద్వారా నామమాత్రపు రిజిస్ట్రేషన్ రుసుంతో కొన్ని లక్షల ఎకరాలకు సాదాబైనామా నుంచి విముక్తి చేసి,13ఎ, 13బీ, 13సీ ద్వారా ఉత్తర్వులు జారీచేసి పట్టాదార్ బుక్కులు, టైటిల్ డీడ్ ఇచ్చారు. అయితే దీనిద్వారా సగం మందే తమ సాదాబైనామాలను క్రమబద్ధం చేసుకోగలిగారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినా పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు.

రెవెన్యూశాఖ పనిలో పారదర్శకత ఉండాలంటే డిజిటలైజేషన్‌తో పాటు జవాబుదారీ తనం పెంచినప్పడు అలసత్వం, అవినీతి రెండు తగ్గుతాయి. కొత్త రెవెన్యూ చట్టం వార్తలు వస్తున్నవేళ.. సంస్కరణల ప్రతిపాదనలు తయారీకి ముందు మేధోమథనం జరుగాల్సిందే. భూమి హక్కు నిరూపించుకునేందుకు పలురకాల పాత, కొత్త కాగితాలు తెస్తుంటారు. దీనికిబదులు ఒకే కన్‌క్లూజివ్ టైటిల్ ఉండటం ఎంతో వీలుగా ఉంటుం ది. భారత ప్లానింగ్ కమిషన్ కుడా ఈ పద్ధతినే సూచించింది. దీనిద్వా రా బీమా సౌకర్యం కల్పించి టైటిల్ గ్యారంటీ స్కీం కుడా అమలుపరుచ వచ్చు. దీంతో భూముల బదిలీ కుడా సులువు అవుతుంది. తద్వారా రియల్టర్ల మోసానికి కళ్ళెం పడు తుంది. భూములపై పెట్టుబడి పెట్టేవారికి భరోసా కూడా కలుగుతుంది. బీహార్ వలె భూ తగాదాలను రెగ్యులర్ కోర్ట్ నుంచి తప్పించి ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్ వేసి సత్వరమే పరిష్కరించవచ్చు. సంప్రదాయక గ్రామీణ పంచాయతీ తీర్చే వ్యవస్థ స్థానంలో రైతు సంఘాలను పద్ధతిగా తీర్చిదిద్దవచ్చు.

ఇప్పుడున్న దాదాపు 128 రకాల చట్టాల అమల్లో వచ్చే సందేహాలకు ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. సందేహాలను కూడా తీర్చాలి. అవసరమైతే సచివాలయంలో దీనికొక సెల్ ఏర్పర్చవచ్చు. పాత సర్వే సెటిల్‌మెంట్ స్థానంలో గ్రామనక్ష, సేత్వారీల ఆధునీకరణకు కొత్త వ్యవస్థను ఏర్పర్చవచ్చు. ప్రతీ భూ హక్కు పత్రానికి లేదా టైటిల్‌కు ఫీల్ మెజర్మెంట్ పుస్తకం వివరాలు జతచేయాలి. అన్నిరకాల భూ హక్కు సమస్యలకు పరిష్కారం దిశగా ప్రభుత్వ యం త్రాంగాన్ని కదిలించాలి. అవసరమైతే ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాముల ను చేయవచ్చు. స్పష్టమైన ఆదేశాలు సూచనలు, ఇస్తూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా జఠిలమైన భూ సమస్యలను పరిష్కారం చూపవచ్చు. అపర భగీరథుడు అకుంటిత కార్యదీక్షాప రుడైన సీఎం కేసీఆర్ రైతుబంధు అమలు, సమగ్ర కుటుంబ సర్వే, ప్రాజె క్టుల రీ డిజైన్ చేసిన తీరులోనే తెలంగాణ భూ సమస్యలను శాశ్వతంగా తీర్చగల సమర్థులు. పక్కా భూ హక్కు పత్రాలతో రైతు కళ్ళలో కాంతులు నింపడం ఆయన వల్ల మాత్రమే కాగల కార్యం. వారే ఈ పని చేయాలి.
(వ్యాసకర్త: విశ్రాంత జాయింట్ కలెక్టర్)

218
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles