కుంభమేళాపై కొన్ని అపోహలు


Thu,February 14, 2019 01:14 AM

ప్రయాగకు వెళ్లి చూడండి. అక్కడికి ఒక వైపునుంచి గంగానది, మరొకవైపు నుంచి దాని ఉపనది అయిన యము నా నది ప్రవహించి వస్తాయి. గంగలో యమున విలీనమవుతుంది. విలీనమయే చోటును త్రివేణీ సంగమం అంటారు. ఆ రెండు నదులలో కలిసే మూడవ నది సరస్వతి అన్నది విశ్వాసం. సరస్వతి ఇప్పుడు కనిపించదు సరికదా దాని ఆనవాళ్లు అయినా లేవు. అటువంటిది ఒక్కటి ఉండి ఈ రెండు నదుల తో సంగమించినట్లు వేదాలు, పురాణాలలోనూ నిర్ధారిత రూపంలో చెప్పలేదు. సైంటిస్టుల పరిశోధనలు ఇంకా ఒక్క కొలిక్కి రాలేదు. కనుక ప్రస్తుతానికి సరస్వతి అన్నది, త్రివేణి అన్నది ఒక భావన మాత్రమే. ఈ విషయం ఎట్లున్నా, కుంభమేళాకు ప్రతిరోజూ కొన్ని లక్షల మంది తరలివస్తారు. వారిలో బహుశా 90 శాతం మంది గ్రామీణులే. రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలతో, సామాజిక వ్యవస్థతో నిమిత్తం గలవారు. స్థానిక అలహాబాద్ వాసులు సంగమానికి వెళ్లి స్నానాలు చేయటం తక్కు వ. తమకు ఇండ్లలో సరఫరా అయ్యేది గంగనీరే అయినప్పుడు ప్రత్యేకంగా సంగమానికి వెళ్లటం ఎందుకున్నది వారి సమాధానం. కానీ వీరు నగరవాసులు కావటం, నదినీరు గ్రామీణుల వ్యవసాయానికి ఎంత ముఖ్యమో వీరి నగర జీవితాల అనుభవానికి బోధపడకపోవటం అందు కు కారణమని భావించాలి. ఇక్కడికి ప్రతిరోజు వచ్చే లక్షలాది మంది గ్రామీణులు ఎన్నో ఇబ్బందులకు ఓర్చుతూ, మైళ్ల కొద్దీ దూరం సామాన్లతో నడిచివెళ్లి, మౌనంగా స్నానాలు చేసి, తిరిగి మౌనంగా నడిచిపోతా రు. గంగా, యమునలకు గాని త్రివేణి పేరిట గాని విగ్రహాలు, గుడులు ఏమీ ఉండవు. వారి దృష్టిలో గంగా మయ్యా (గంగా మాత) మాత్రమే ఉంటుంది. గంగా మయ్యా అంటూ ఒకటీ అరా మంది అరుదుగా తప్ప నినాదాలు కూడా చేయరు.

వారు నడిచే దారుల వెంట, మేళా ప్రాంతమంతటా లెక్కలేనంత మంది మఠాధిపతులు, గురూజీలు, బాబాలు శిబిరాలు వేసుకొని, రణగొణ ధ్వనుల లౌడ్ స్పీకర్లతో హడావుడి చాలా చేస్తారు. కానీ గ్రామీణ సందర్శకుల్లో అటువైపు చూసేవారికన్నా చూడనివారే ఎక్కువ. చూసేవారిలో అనేకులు ఆ డేరాలలో రాత్రిళ్లు ఆశ్రయం కోసం, భోజన సదుపాయం కోసం వెళ్తారు. వారి దృష్టి యావత్తూ గంగా మయ్యా పైన మాత్రమే. గంగా, యమునల సంగమం ఎప్పుడు జరిగిందో ఇంకా పరిశోధన జరుగలేదు. కానీ మొదటి ప్రస్తావన రుగ్వేదంలో ఉన్నది. అందులో సితాసిత సంగమ అన్నారు. అనగా తెల్లని (సిత) నీరుగల గంగ, నల్లని (అసిత) నీరుగల యుమునల సంగమం అని. అందులో సరస్వతి ప్రస్తావన, త్రివేణి అని గాని, ప్రయాగ అని గాని ప్రస్తావనలు లేకపోవటం గమనించదగ్గది. రుగ్వేదంలో అగ్ని, జలం వంటి ప్రకృతి శక్తుల ఆవాహనలు అధికంగా ఉండటం తెలిసిందే. గంగ, యమునలు రెండూ జల సంబంధ శక్తులు. కనక జల వనరులుగా ప్రస్తావనీయం అయ్యాయి. ఆ రెండింట సంగమ ప్రదేశం ప్రయాగగా మారటం ఆ తర్వాత కొన్ని వం దల సంవత్సరాలకు రుగ్వేద అనంతరం కాలంలో జరిగింది. ప్ర అనగా గొప్ప. యాగ అన్నది యాగం. సంగమ ప్రదేశంలో ప్రజాపతి ఒక మహాయాగం నిర్వహించినందున అది ప్రయాగ అయినట్లు మహాభారతం చెప్తున్నది. ఆ ప్రదేశాన్ని సితాసిత సంగమ అని రుగ్వేదం పేర్కొనక ముందు గాని, ఆ తర్వాత అది ప్రయాగగా మారే సమయం వరకు గాని, దానిని పవిత్రంగా భావించి స్నానాలు చేసేవారా లేదా అనేది తెలియదు. మహాభారత రచన క్రీ.పూ. 400 నుంచి క్రీ.శ. 400 మధ్యకాలంలో జరిగిందన్నది పరిశోధకుల అభిప్రాయం అయినందున ప్రజాపతి యజ్ఞకాలం గాని, ఆ ప్రదేశం ప్రయాగ కావటం గాని ఆ కాలానిద ని భావించాలి. ప్రజాపతి తన మహాయాగాన్ని సంగమ ప్రదేశంలో ఎందుకు చేసిన ట్లు? ఆయన సాధారణ యాగాలు అనేకం చేశాడు. కానీ ఇది మహా యా గం, లేదా ప్రయాగ. దానికి వెనుక మతపరమైన కారణాలు కనిపించవు.

సంగమ ప్రాంతం మహా సారవంతమైన నేల. వ్యవసాయానికి మహా యోగ్యమైనది. జలమే జీవనమనే మాట మొదటినుంచి ఉంది. బృహదారణ్యకోపనిషత్తు అయితే సత్యమన్నదే జలం నుంచి ఆవిష్కారమైనట్లు తత్వీకరించింది. ఆగస్త్య పురాణం, పద్మ పురాణం, మహా భారతం వం టివి ప్రయాగ ప్రాంతపు సారవంతమైన భూమిని ఫలదీకరణకు, ఉత్పత్తికి ప్రతీకగా తీసుకుంటూ, ఆ రెండు నదుల మధ్య భాగం భూ మాత రెండు ఊరువులని, ప్రయాగ ప్రదేశం జననేంద్రియం వంటిదని అన్నాయి. ప్రయాగలోని ప్ర అనే అక్షరానికి నాగలితో వెనుక ముందులకు దున్నటం అనే అర్థం కూడా రావటం గమనార్హం. ఆ విధంగా గంగా-యమునల మధ్య భాగంలో ప్రజా పతి మాహాయాగంతో ఒక వ్యవసా య మహాయాగం మొదలై ఉండాలి. ఇది వట్టి ఊహాగానం కానక్కరలే దు. వ్యవసాయిక సమాజాల విస్తరణ క్రమంలో ఇది జరిగినట్లు తోస్తుంది. అయిదు నదుల మధ్య ప్రాంతం పంజాబ్ అయినట్లు ఈ రెండు నదు ల మధ్యప్రాంతం దొవాబ్‌గా మారింది. దీనినే తర్వాత ఆర్యావర్తమన్నా రు. బయటి నుంచి వచ్చిన ఆర్యులు, స్థానికులైన జాతుల మధ్య ఘర్షణలు, క్రమానుగత సంగమం ఇక్కడే జరిగింది. మౌర్య, గుప్త, మొఘల్ సామ్రాజ్యాలు వర్ధిల్లాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య ప్రయాగ ప్రాముఖ్యత పెరుగుతూ పోయింది. ఇది సంస్కృతిగా మారి, సహజంగా నే మత విశ్వాసాలు వచ్చిచేరి ఉంటాయి. అగ్ని లేదా జలం వంటి ప్రాకృతిక శక్తుల పట్ల మానవుని సంబంధాలు ఒకవైపు జీవితా ఉపయాగాలు, మరొకవైపు భయాల్లో మొదలై, భక్తి విశ్వాసాలుగా, ఆరాధనములుగా మారటం, అదంతా సంస్కృతి రూపం తీసుకోవటం సహజ పరిణామక్రమం. అది అంతటా జరిగేదే. మన వద్ద ఏదో ఒక దశలో మత విశ్వాసాలు కూడా చేరి ఉంటాయి.

అయినప్పటికీ, మొదలు చెప్పినట్లు, ఈ రోజున గంగస్నానాలు ఆచరించే కోట్లాది మంది గ్రామీణులో కన్పించేది ఆ నదీమ తల్లుల పట్ల భక్తి మాత్రమే. అందులోనూ గంగ మయ్యా అనే మాట తప్ప, దానికి ఉప నది అయిన యమున మాట విన్పించదు. కాకపోతే రెండు నదులు కలిసే చోట సంగమ స్నానాలను కూడా ఆచరిస్తారు. పోతే, ప్రయాగ క్షేత్రం ప్రాచీనకాలంలో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిచెందినా కొద్దీ, భక్తుల ఆత్మహత్యల క్షేత్రంగా కూడా మారింది. ఆత్మహత్య మహా పాపమని వైదిక సాహిత్యం ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత కొన్ని పురాణాలు సామాజిక విశ్వాసాలు కలిసి ఆత్మహత్యలను ప్రాచుర్యంలోకి తెచ్చాయి. పుణ్యతీర్థంలో ప్రాణ త్యాగం వల్ల పాపాలు పోతాయని, పుణ్యలోకం ప్రాప్తిస్తుందని, పునర్జన్మ ఉండదని, లేదా మరుజన్మలో రాజ్యాధికారం వంటి గొప్ప సుఖభోగాలు ప్రాప్తిస్తాయని రకరకాలుగా నమ్మి ఆ పని చేసేవారు. ఆ పనిచేసిన వారిలో సామాన్య భక్తుల నుంచి రాజుల వరకు సైతం ఉండినట్లు అనేక పురాణాలు, విదేశీయాత్రికుల కథనాలు, మొఘల్ రాజులూ బ్రిటిష్ పాలకుల రికార్డులు అనేకం వివరంగా పేర్కొన్నాయి. గంగ ఒడ్డున గల ఒక మహావట వృక్షం పైనుంచి దూకి ఈ పని ఎక్కువగా చేస్తుండేవారు. ఆ చెట్టు చుట్టు అక్బర్ చక్రవర్తి కోటను కట్టి షాజహాన్ చక్రవర్తి ఆత్మహత్యలను నిరోధించినా, బ్రిటిష్ పాలనలో నిషేధం విధించే వరకు అనేక వందల ఏండ్ల పాటు ఈ సంప్రదాయం దాదాపు నిరంతరం అన్నట్లు కొనసాగింది.
Ashok
ఆత్మహత్యలకు భక్తు లు అనుసరించిన కొన్ని ఇతర పద్ధతుల గురించి చదివితే ఒళ్లు గగొర్పొడుస్తుంది. ఉదాహరణకు కొందరు తమ శరీర మాంసాన్ని తామే కత్తులతో కోసి పక్షులు, జంతువులకు వేస్తూ ప్రాణం తీసుకునేవారు. రాజులలో ఒకరైతే తన వంద మంది భార్యలతో కలిసి ప్రాణత్యాగం చేశాడు. రికార్డులలో నేటికీ ఉన్నందున ఇవేవీ కల్పిత గాథలు కావు. అటువంటి ఆత్మహత్యలు కొన్ని ఇతర క్షేత్రాలలోనూ ఉండినా, అందుకు అన్నింటికన్న చాలా పెద్ద కేంద్రం ప్రయాగ కాగా, దీని ప్రభావం మరికొన్ని చోట్ల కు విస్తరించినట్లు కనిపిస్తుంది.

1106
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles