న్యాయం గెలుస్తుంది!


Sat,January 12, 2019 10:56 PM

న్యాయమూర్తి పదవి పూలపాన్పు కాదు. అరిటాకు-ముల్లు సామెతలోని అరిటాకులాంటిది. కేసుల తీర్పు విషయంలో సాక్ష్యాధారాల ఆధారంగా ఇరువర్గాల వారిని సంతృప్తి పరుచటం అసాధ్యం. ఈ ప్రక్రియ రాజీ ద్వారా లేదా లోక్ అదాలత్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కేసులో ఓడిపోయినవారి ఆలోచనా దృక్పథం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. సరై న సాక్ష్యాలు లేనందువల్లనో లేదా తాను ప్రవేశపెట్టిన సాక్ష్యాల ద్వారా న్యాయమూర్తిని మెప్పించలేకపోయాననో వివేచన ప్రస్తుత సమాజంలో లేదు. ఏదో జరిగి ఉంటుందని, గెలిచినవాడు లంచమిచ్చి గెలిచాడనే అభిప్రాయం అభిలషణీయం కాదు. ఒక వ్యక్తి 34 ఏండ్లకు జూనియర్ న్యాయాధికారి పదవి చేపట్టినట్లయితే, అతని పదవీవిరమణ దాకా వివిధ హోదాల్లో దినదిన గండంగా గడుపాల్సి వస్తుంది. ప్రతి కేసు ఒక ఛాలెంజ్. ముందు నుయ్యి, వెనుక గొయ్యి మాదిరిగా న్యాయార్థులు ఒకవైపు, వారి తరఫున వకాల్తా చేసే న్యాయవాదులొకవైపు, ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణ మరోవైపు. ఒక్కోసారి న్యాయం ఒకవై పు కనిపించినా, ప్రవేశపెట్టబడిన సాక్ష్యాధారాల ఆధారంగా తీర్పునివ్వాల్సి ఉం టుంది. ఆ సాక్ష్యాలు ఎందుకు నమ్మకూడదో తీర్పులో విశ్లేషించి కారణాలు రాయవల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో ముద్దాయిపై కేసు కొట్టివేసినంత మాత్రాన అతడు నేరానికి పాల్పడలేదనడానికి వీల్లేదు. అదేవిధంగా శిక్ష కు గురికాబడిన వారంతా దోషులనలేం. అందుకే వంద మంది దోషులను నిరపరాధులుగా తీర్పిచ్చినను, ఒక నిరపరాధిని దోషిగా తీర్పివ్వరాదనేది న్యాయపాలిక మూలసూత్రం. వేలల్లో ఉండే కేసుల్లో రోజుకు 80 నుంచి 120 కేసుల దాకా పిలువడం, విచారణ జరుపడం, తీర్పులివ్వడం న్యాయమూర్తికి కత్తిమీద సాము. న్యాయార్థులు దూరప్రాంతాల నుంచి రావటం, తమ కేసు పిలుపు కోసం నిరీక్షించడం, చివరి కి ఏదో ఒక కారణంగా వాయిదా పడటం మామూలైంది.

దీనికి పరిష్కారం న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావడం. ఇరువర్గాలు తుది తీర్పును త్వరితగతిన పొందినప్పుడే న్యాయం జరిగినట్లు. దీనికి అన్నివర్గాలు చేయూతనివ్వాలి. నేను మేజిస్ట్రేట్‌గా చేరిన కొన్ని నెలల్లోనే ఒక క్రిమినల్ కేసు వచ్చింది. దానిలోని ముగ్గురు ముద్దాయిల్లో ఇరువురు తప్పించుకున్నారు. వారిపై నాన్ బెయిలబుల్ వారంట్లు కూడా జారీ అయ్యాయి. మూడవ ముద్దాయి హైదరాబాద్ లోని సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఏడాదికి పైగా ఉంటున్నాడు. కేసును పరిశీలించిన నేను, ముద్దాయిని వాయిదా రోజు హాజరుపరుచవలసిందిగా జైలు సూపరింటెండ్‌కు ఆదేశాలివ్వడం, అతనిని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మరో ఇద్దరు ముద్దాయిల్లేని కారణం చేత కేసును వాయిదా వెయ్యాలనుకుంటున్నాన ని రిమాండ్ ఖైదీకి చెప్పాను. అతను అమాంతం నేలమీద కూర్చొని, తాను రిమాండ్ ఖైదీగా ఏడాదిపైగా జైల్లో ఉన్నానని, తన కేసు విషయం తేల్చేదాకా కదిలే ప్రసక్తి లేదన్నాడు. నేను ఉద్యోగానికి కొత్త. రిమాండ్ ఖైదీ నేను చెప్పే విష యం వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. నాకో ఆలోచన స్ఫురించింది. తప్పించుకున్న ఇద్దరు ముద్దాయిలను కేసు నుంచి వేరు చేస్తూ, రిమాండ్ ఖైదీకి ప్రభుత్వ ఖర్చులతో న్యాయవాదిని నియమిస్తూ, కేసు కాగితాలను అదేరోజు ఆ న్యాయవాదికి అందజేశాను. మరో రెండు నెలల్లో ఆ కేసు నుంచి రిమాండ్ ఖైదీని విముక్తి చేస్తూ తీర్పు చెప్పాను. కేసును పొడిగిస్తే, అనవసరంగా ఆ రిమాండ్ ఖైదీ రుజువు కాని నేరానికి జైల్లో మరికొంతకాలం గడుపవలసి ఉండేది. న్యాయమూర్తికి చట్ట పరిజ్ఞానం మాత్రమే కాకుండా, విచక్షణ, సమయస్ఫూర్తి అవసరం. ఇరువురు న్యాయవాదులు హోరాహోరీగా గొడవపడే సందర్భాలెన్నో. అటువంటి సమయంలో ఓపిక, ఎవ్వరిని నొప్పివ్వక వాతావరణాన్ని చల్లబరిచే అవగాహన ముఖ్యం. కొన్నిసార్లు దోషులను రక్షించడానికి ప్రాసిక్యూటింగ్ ఏజె న్సీ వారే కేసు పరిశోధనను నీరుగార్చవచ్చు.

అప్పుడు బాధిత వ్యక్తికి న్యాయం జరుగదు. రికార్డ్ పరంగా కేసు ఓ రకంగా ఉంటే సాక్షులు కోర్టులో చెప్పే విషయాలు విరుద్ధంగా ఉంటాయి. దీంతో న్యాయమూర్తులు దోషిని గుర్తించినా, బలహీన లేదా విరుద్ధ సాక్ష్యాల కారణంగా నిర్దోషిగా ప్రకటించవలసి ఉంటుంది. నేను అసిస్టెంట్ సెషన్స్ జడ్జిగా పనిచేసే రోజుల్లో ఒకకేసు విచారణలో సందిగ్ధ పరిస్థితులెదుర్కోవాల్సి వచ్చింది. ఒక పేద మైనర్ అమ్మాయి కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. తల్లి, మైనర్ తమ్ముడు ఆ వెదికినా కనిపించలేదు. దాదాపు మూడేండ్లు గడిచినవి. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. మూడేండ్ల తర్వాత, ఆ అమ్మాయి తన తల్లికి ఫోన్ చేసి, తాను వేశ్య గృహంలో బంధింపబడ్డానని, విడిపించమని కోరింది. తల్లి, తమ్ముడు వెంటనే ఆ ఊరిలోని పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడం, పోలీసువారు వేశ్య గృహంపై దాడి జరిపి అమ్మాయిని రక్షించి, వైద్య పరీక్షలు చేయించి, ఏడుగురిపై గ్యాంగ్ రేప్, లైంగిక దోపిడీ, అనైతిక అక్రమ రవాణా కింద కేసు రిజిష్టర్ చేయడం జరిగింది. ఆ కేసు మేజిస్ట్రేట్ కోర్టు నుంచి విచారణ నిమిత్తం నా కోర్టుకు వచ్చింది. విచారణలో తెలిసిన విషయాలేమంటే, కాలేజీకి వెళ్లిన ఆ అమ్మాయిని ఒక ముద్దాయి మాయమాటలు చెప్పి, వరంగ ల్ నుంచి యాదగిరిగుట్టకు తీసుకపోవడం, ఇంకో ముద్దాయితో కలిసి లైంగిక దాడి చేయడం, ఆ తర్వాత మెదక్ జిల్లా లో వేశ్య వృత్తికి మూడో ముద్దాయికి అమ్మడం, కొంతకాలం తర్వాత జగిత్యాలలో నాలుగో ముద్దాయికి అమ్మడం, ఆ తర్వాత పడుపు వృత్తి చేయించడం కోసం వేములవాడలో వేరొకరికి అమ్మడం జరిగింది. ఈ విధంగా మూడేండ్లు గడిచినవి. ఆ అమ్మాయి అవకాశం చూసుకొ ని, తన దగ్గరికి వచ్చిన విటుని మొబైల్ ఫోన్ ద్వారా తల్లికి ఫోన్ చేసింది. దాదా పు 20 మంది సాక్షులను, 30 డాక్యుమెంట్లను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ బలమైన సాక్ష్యం అమ్మాయిది, పోలీస్ అధికారులదే. దాదాపు రెండేండ్ల విచార ణ తర్వాత, 12 లేక 18 మంది సాక్షులు ఎదురుతిరిగినను, అమ్మాయి సాక్ష్యం నిర్ధారణపరుస్తూ ఏడుగురు ముద్దాయిలకు కారాగార శిక్ష విధించాను.

హృదయవిదారకమైన సాక్ష్యం వినేటప్పుడు కూడా న్యాయమూర్తి నిబ్బరాన్ని పాటించాలి. ఏ మాత్రం ఆందోళన కానీ, ప్రాసిక్యూషన్ కేసుకు మద్దతిస్తున్నట్లుగా కానీ ఉండకూడదు. నిష్పాక్షికతను ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రతి న్యాయమూర్తికి తన పదవీకాలంలో ఎన్నోరకాల కేసులు, మనుషులు తటస్థపడుతుంటారు. న్యాయార్తులు, న్యాయవాదులు, సిబ్బంది అందరిని గమనిస్తూ విధులు నిర్వర్తించాలి. మంచి, చెడు అనేది ప్రతి వ్యవస్థలో ఉన్నది. ఏ ఒక్కరికో, వర్గానికో పరిమితం కాదు. న్యాయవ్యవస్థ దీనికి మినహాయింపు కాదు. కరుడుగట్టిన నేరస్తులను, తాను చేయని నేరానికి కేసులో ఇరికించబడ్డవారిని ఒకే విధంగా నిష్పాక్షికంగా విచారించి న్యాయం చేయాలి. న్యాయస్థానాల్లో దొంగ సాక్ష్యం చెప్పేవారు కూడా ఉంటారు. మనస్సును చం పుకొని ఒత్తిడి మూలాన కొందరు దొంగ సాక్ష్యం చెబితే, అవతలి వర్గం వారికి ఏదో విధంగా నష్టం కలుగజేయాలనే ఉద్దేశంతో దొంగసాక్ష్యం చెప్పేవారు మరికొందరు. అన్ని సందర్భాల్లో ఏది నిజమైన సాక్ష్యం, ఏది అబద్ధం సాక్ష్యం అని నిర్ధారించుకోవడం న్యాయమూర్తికి సులువు కాదు. అయితే సినిమాల్లో చూసినట్లుగా కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పి, మనస్సాక్షిని చంపుకున్నందుకు తర్వాత ఒత్తిడికి గురయ్యేవారు తప్పక ఉంటారు. అటువంటి సందర్భం నిజ జీవితంలో న్యాయమూర్తి దృష్టికి రావడం అరుదనే చెప్పవచ్చు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన సాక్షి ద్వారానే, తాను అబద్ధం చెప్పినట్లు న్యాయమూర్తికి తెలిస్తే, ఆ అబద్ధపు సాక్ష్యం వల్ల న్యాయం అందజేయడంలో ఏ విధమైన అన్యాయం జరుగలేదని తెలిస్తే ఎంతో మోదం. అటువంటి సంఘటన నాకు జరిగింది.
t.Murali
ఒక అమ్మాయి, అబ్బాయిపై తనను ప్రేమించాడని, పెండ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి వేరొక అమ్మాయితో పెండ్లి నిశ్చయించుకున్నాడని, ఆ సందర్భాన్ని ప్రశ్నిస్తే తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని కేసు పెట్టింది. అత్యాచార ప్రయత్నానికి సాక్షులుగా కొందరి పేర్లు పేర్కొన్నది. కేసు విచారణ సమయంలో ఒక సాక్షి తాను కెనడా ఆరు నెలల పాటు వెళ్తున్నట్లుగా, తన సాక్ష్యాన్ని త్వరగా నమోదు చేయవలసిందిగా కోర్టును అభ్యర్థించడం, నేను అతని కోరికను మన్నించడం జరిగింది. తాను లైంగికదాడి యత్నానికి సాక్షినని, ముద్దాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పారిపోయాడని చెప్పడం జరిగింది. కానీ నాకెందు కో ఆ సాక్ష్యం నమ్మబుద్ధి కాలేదు. వివిధ కారణాల చేత ఆ కేసులో ముద్దాయిని కేసు నుంచి విముక్తి చేస్తూ తీర్పుచెప్పిన మధ్యాహ్నమే పోస్టులో నాకొక సీల్డ్ కవర్ వచ్చింది. అది తెరిచిచూస్తే, కెనడా వెళ్తున్నానని చెప్పిన సాక్షి నుంచి. దాని సారాంశమేమిటంటే, తాను అమ్మా యి ప్రోద్బలం వల్ల అబద్ధం చెప్పినానని, ఎటువంటి సంఘటన చూడలేదని, తనను యేసు కూడా క్షమించడని. అతని సాక్ష్యం నమ్మి నేను శిక్ష ఖరారు చేసినట్లయితే, ఒక నిర్దోషికి అన్యాయం జరిగి ఉండేది.
(వ్యాసకర్త: విశ్రాంత జిల్లా న్యాయమూర్తి)

810
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles