విత్తన చిరునామా తెలంగాణ


Sat,January 12, 2019 12:26 AM

2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరుగబోయే 32 ఇస్టా విత్తన కాంగ్రెస్‌కు హైదరాబాద్ వేదిక కానున్నది. అంతరజాతీయ విత్తన సదస్సుతో రాష్ట్ర రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని రైతులు ఇప్పటికే విత్తనోత్పత్తిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం కూడా ఏటా బడ్జెట్‌లో విత్తనరంగ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. పంట కాలనీల తరహాలో విత్తన కాలనీలను ప్రోత్సహిస్తున్నది.
Parthasaradhi
తెలంగాణ ఖాతాలో మరో కలికితురాయి చేరింది. దేశ విత్తన భాండాగారంగా వెలుగొందుతున్న తెలంగాణ ప్రపంచ ప్రఖ్యా త ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ 32వ కాంగ్రెస్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ISTA 94 ఏండ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆసియాలో ఇస్టా కాంగ్రెస్ జరుగుతుంది. అదికూడా హైదరాబాద్‌లో జరుగటం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణం. అంతర్జాతీయ, జాతీ య విత్తన నిపుణులు హైదరాబాద్ సదస్సులో పాల్గొంటారు. దేశ, రాష్ట్ర విత్తనరంగం మరింత అభివృద్ధికి ఈ అంతర్జాతీయ కాంగ్రెస్ ఉపయోగపడుతుంది. రైతులు, విత్తనోత్పత్తిదారులకు ఆధునిక విత్తన సమాచారం అందనున్నది. విదేశాలకు విత్తనం ఎగుమతి చేసే అవకాశాలు పెరుగుతా యి. ప్రభుత్వ, ప్రైవేట్ విత్తనరంగాలు మరింత బలోపేతమవుతాయి.

ప్రపంచ విత్తనరంగంలో భారత్‌ది 5వ స్థానం. ప్రపంచ విత్తన మార్కె ట్లో 4.4 శాతం వాటా ఉన్నది. అమెరికా (27 శాతం), చైనా (20 శాతం), ఫ్రాన్స్ (8 శాతం), బ్రెజిల్ (6 శాతం)తో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికే విత్తన రంగంలో స్వయం సమృద్ధిని పొందిన భారత్ లో విత్తనరంగం వృద్ధిరేటు సాలీనా 12-15 శాతం వరకు ఉన్నది. దేశం లో మొత్తం విత్తన మార్కెట్‌లో వ్యవస్థీకృత విత్తన రంగం ఉంటే ధృవీకరణ/నాణ్యమైన విత్తన మార్కెట్ 25-30 శాతం ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ విత్తన కంపెనీలు ఐదువందలకు పైగానే ఉన్నాయి. ప్రభుత్వరంగంలో రాష్ట్ర విత్తన కార్పొరేషన్లు, కో ఆపరేటివ్‌లు కలిసి 16కు పైగానే ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలతో దేశీయ విత్తన పరిశ్రమలో 90 శాతానికి పైగా ఉన్నాయి. వరి, గోధుమ, అపరాలు, నూనె గింజలు వంటి తక్కువ విలు వ కలిగి, అధిక మొత్తం అవసరం ఉన్న పంటల విత్తనాల ఉత్పత్తి, నాణ్య త, సరఫరాలో పబ్లిక్‌రంగ సంస్థలున్నాయి. తక్కువ మొత్తం అవసరం ఉండి అధిక విలువ కలిగిన విత్తనాలు దేశీయ అవసరాలను తీరుస్తున్నా యి. ప్రపంచ విత్తన వాణిజ్య విలువ అంచనా 50 బిలియన్ అమెరికా డాలర్లు ఉంటే, భారత విత్తన మార్కెట్ 2.7 బిలియన్ డాలర్లుగా ఉన్నది. దేశంలో ఇక విత్తన నాణ్యత పరీక్షించేందుకు గాను 125 నోటిఫైడ్ విత్తన పరీక్ష ప్రయోగశాలలు, 26 విత్తన ధృవీకరణ ఏజెన్సీలు, 6 ఇస్టా ఆమోదం పొందిన ప్రయోగశాలలు, OECD సభ్యత్వం కలిగి ఉన్నది.

దేశం విత్తన రంగంలో ముందున్నది. ఇందులో ప్రధాన పాత్ర తెలంగాణ రాష్ర్టానిది. రాష్ట్రమంతా విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలం. ప్రపంచంలో రెండే పూర్తిగా విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. వాటిలో అమెరికాలోని అరిజనా రాష్ట్రం, రెండోది తెలంగాణ రాష్ట్రం. ఏడాది అం తా నాణ్యమైన విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల వాతావరణం రాష్ర్టాని ది. తేమ, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత నాణ్యమైన విత్తనం తయారీకి అనుకూలంగా ఉన్నాయి. రైతులు క్షేత్రస్థాయిలో వాడుకోవడానికి అవసరమయ్యే నిల్వకు కావాల్సిన అన్నీ మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఉన్నాయి. అం దుకే దేశంలో ఉత్పత్తి అవుతున్న హైబ్రిడ్ వరి విత్తనాల్లో 90 శాతం, హైబ్రి డ్ పశుగ్రాస జొన్న, సజ్జల్లో 100 శాతం తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. పత్తి, మక్కజొన్న, సోయాబీన్, పల్లి పంటల విత్తనోత్పత్తిలో రాష్ట్రం పాత్ర ప్రధానమైనది. అందుకే భారత విత్తన రాజధానిగా ఇప్పటికే హైదరాబాద్‌కు పేరు వచ్చింది. దేశ విత్తన అవసరాల్లో 60 శాతానికి పైగా విత్తనాలను అందిస్తున్నది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్రం ఇప్పటికే ఏర్పాటుచేసింది. 45 లక్షల చదరపు అడుగుల విత్తన గిడ్డంగుల సామర్థ్యం ఉన్నది. అలాగే 1.30 కోట్ల సీఎఫ్‌టీ శీత ల నిల్వ గదులు అందుబాటులో ఉన్నాయి. విత్తన ప్రాసెసింగ్ సామర్థ్యం గంటకు 650 మెట్రిక్ టన్నులకు పైగానే ఉన్నది.

ఒకే ప్రాంతంలో ఇంత ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ ప్రపంచంలో మొదటిస్థానంలో ఉన్న ది. అలాగే మక్కజొన్న కంకులు ఎండబెట్టే సామర్థ్యం 1.2 లక్షల మెట్రిక్ టన్నులు. దాదాపు ఐదు రాష్ర్టాల నుంచి ముడి విత్తనం రాష్ర్టానికి వస్తుంది. వాటిని ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం కేవలం తెలంగాణలోనే ఉన్నది. తెలంగాణలోని విత్తన రంగంలో 17000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదేవిధంగా విత్తనం కోత దశలో లక్షకు పైగానే మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తుంది. రాష్ట్రం నుంచి 20 దేశాలకు విత్తనం ఎగుమతి చేయబడుతున్నది.విత్తనోత్పత్తిలో పెద్దన్నగా ఉన్న రాష్ట్రం ప్రభుత్వ సహకారంతో పలు ప్రతిష్టాత్మక విత్తన సంబంధిత కాంగ్రెస్‌లు, సదస్సులు నిర్వహించింది. 2015లో ప్రతిష్టాత్మక 8వ జాతీయ విత్తన కాంగ్రెస్‌ను సమర్థవంతంగా నిర్వహించింది. ఇప్పటికే తెలంగాణ విత్తన ధృవీకరణలో అంతర్జాతీయ ప్రమాణాల పరస్పర మార్పిడి ప్రాజెక్టులో జర్మనీతో భాగస్వామిగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగా ణే. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆధునిక ప్రమాణాలతో ఇస్టా ప్రయోగశాల నెలకొల్పబడినది. అంతర్జాతీయ విత్తన ధృవీకరణ ఎగుమతికి కీలకమైన OECDలో సంస్థ మన రాష్ట్రంలోని మెదక్ జిల్లా ములుగులో బండమైలారం గ్రామంలో ఆధునిక సౌకర్యాలతో విత్తన పార్కు ఏర్పాటుచే సింది. ఇందులో విత్తన ధృవీకరణ, పరీక్షలు, ఫైటోశానిటరీ, నిల్వ, శిక్షణ, పరిశోధనకు కావాల్సిన మౌలిక వసతులున్నాయి.

2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరుగబోయే 32 ఇస్టా విత్తన కాంగ్రెస్‌కు హైదరాబాద్ వేదిక కానున్నది. అంతరజాతీయ విత్తన సదస్సుతో రాష్ట్ర రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని రైతులు ఇప్పటికే విత్తనోత్పత్తిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం కూడా ఏటా బడ్జెట్‌లో విత్తనరంగ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. పంట కాలనీల తరహాలో విత్తన కాలనీలను ప్రోత్సహిస్తున్నది. ఎగుమతులకు సహాయ సహకారాలు అందిస్తున్నది. ప్రపంచానికి విత్తనోత్పత్తి పాఠాలు నేర్పిన అంకాపూర్ గ్రామం తెలంగాణలోనే ఉన్నది. అదే తరహాలో రాష్ట్రంలోని అన్నీ అనుకూల గ్రామాలను విత్తన గ్రామాలుగా తీర్చిదిద్ది, వాటి ఫలితాలను రైతులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ ప్రధాన కార్యదర్శి)

593
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles