HomeEditpage Articles

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

Published: Thu,February 16, 2017 01:52 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావిధానం మీద కూడా పటిష్టమైన ఆలోచన చేస్తుందని, పాఠశాల స్థాయిలో భాషా బోధనకు పటిష్టమైన విధానం రూపొందించి ఆచరణలో పెడుతుందని ఆశిద్దాం.

దేశంలోని అన్ని రాష్ర్టాలలోనూ భాషకు సంబంధించి జరుగుతున్న చర్చలలో అతి ముఖ్యమైన అంశం మాధ్యమం ఏ భాష ఉండాలి మాతృభాషా, ఆంగ్లమా? అన్నది. మాతృభాష ఉం డాలన్న వాదన, ఆంగ్ల భాష చాలా అవసరం అన్న వాదన.. రెండూ సరైనవే. ప్రపంచ భాషగా రూపొందిన అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిషు అవసరాన్ని అన్నిదేశాలూ గుర్తించాయి. ఆ భాష పట్ల వ్యతిరేకత చూపిన ప్రాచ్య తూర్పు దేశాలు (చైనా, జపాన్), లెక్కచెయ్యని మధ్య తూర్పు దేశాలు (ఇరాన్, సౌదీ వంటివి), బీదరికపు, వెనుకబాటు సమస్యలతో సతమతమవుతూ ఆంగ్ల భాషను పట్టించుకోని ఆఫ్రికా ఖండపు దేశాలు, తమ భాషల పట్ల ఆదరణ చూపించే యూరప్ దేశాలు.. అన్నీ ఇప్పుడు ఆంగ్ల భాష నేర్చుకోవాలనీ, వారి యువతకు నేర్పాలనీ తహతహలాడుతున్నాయి. దీనికి కారణం సాంకేతికత అద్భుతంగా పెరిగి ప్రపంచాన్ని ఒక్క తునకగా మార్చిన ప్రపంచీకరణ. ఇప్పుడు ఆంగ్ల భాష అవసరాన్ని గుర్తించని దేశమే లేదంటే అతిశయోక్తి కాదు.

భారతదేశ పరిస్థితి పై దేశాల కంటే భిన్నమైనది. ఒక్కో రాష్ర్టానికి ఒక్కో భాష ఉన్న దేశం మనది. అందుకే స్వాతంత్య్రాంతరం చాలా భాగం ఆసియా దేశా లు ఆంగ్లభాషను వదిలి మాతృ భాషా మా ధ్యమాన్ని ప్రవేశపెట్టుకున్నా మన దేశంలో ఉన్నత విద్య ఆంగ్ల భాషా మాధ్యమంలో నే కొనసాగింది. అయితే ఇప్పుడు తరచూ వినిపిస్తున్న వివాదం ఇంగ్లిష్ వారు దేశాన్ని వదిలివెళ్లినా, భాషా బానిసత్వాన్ని మాత్రం మనం వదలలేదని. ఈ అంశం మీద వాదించుకుంటు న్న రెండు వర్గాల మధ్య అంతరం గమనిస్తే ఒక ఆశ్చర్యకరమైన విష యం బయటపడుతుంది. మాతృభాష మాధ్యమమే ఉత్తమం అని వాదిస్తున్న మేధావులంతా సాంస్కృతికంగా, విద్యా విషయాల్లో, ఆర్థికంగా ఉన్నతవర్గాలకు చెందినవారు; తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించినవారు. వారి పిల్లల్లో 90 శాతం అమెరికా, ఇతర దేశాల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. ఇక ఆంగ్ల మాధ్యమం కావాలని పట్టుబడుతున్నవారు వెనుకబడిన వర్గాలవారు. వారి పూర్వీకులు అయితే చదువులేనివారు, లేకపోతే మాతృభాష మాధ్యమంలో చదువుకొని అతి సామాన్యమైన ఉద్యోగాలు చేస్తున్నవారు, ఆర్థికంగా, సాంస్కృతికంగా బలహీనవర్గాలకు చెందినవారు.

మరి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం 80 శాతానికి పైగా ఉన్న ఈ వర్గాలకు సహాయం చేసే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతోంది. కానీ మన మేధావుల్లో కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మాతృభాషలో చదువుకుంటే సాంస్కృతికంగా ఎదుగుదల ఉంటుంది. భాష అనేది భావావేశాలకు సంబంధించింది కనుక మనిషి మనసు ఎదగాలంటే చుట్టుపక్కల, ముఖ్యంగా కుటుంబంలో మాట్లాడే భాష, రోజులో ఎక్కువ సమయం విని, ఉపయోగించే భాష వల్లనే జరుగుతుం ది. అంతేకాదు, సొంత సంస్కృతిలో భాగమవ్వాలంటే మాతృభాష తప్పనిసరిగా నేర్వాలి. ఊరికే చదువటం, రాయటం మాట్లాడటమే కాదు, మాతృభాషా సాహిత్యంతో కూడా పరిచయం ఉండాలి. ఒక పద్యం, కథ, నవల విని, చదివి ఆనందించగలిగినంత భాషా పాండిత్యం ఉండాలి. అప్పుడే మనిషి ఎదుగుదల సంపూర్ణమవుతుంది.

ఇక ఆంగ్ల భాష. అది పరాయి భాష. దేశంలో ఉన్నత విద్యావంతుల మధ్య తప్ప వినిపించని భాష. అవసరాలకు ఉపయోగపడే భాష. రాష్ర్టా ల మధ్య మాధ్యమంగా ఉపయోగించే తప్పనిసరి భాష. గుండెలోతుల్లోంచి కాక నాలిక చివరి నుంచి వచ్చే భాష. అయితే ఇటువంటి భాషపై పట్టు తెచ్చుకోవాలంటే దానిని ప్రాథమిక దశ నుంచి నేర్చుకోవటం తప్ప వేరే మార్గం లేదు. ఇంగ్లీషు తప్పనిసరి భాషగా ఉంటేనే దేశంలో ఉన్నత విద్యలో రాణించటానికి సాధ్యమవుతుంది. ముఖ్యంగా విద్యా విషయాలలో, ఆర్థికంగా వెనుకబడ్డ వారికీ ఇంగ్లిషు ప్రాథమిక దశ నుంచి బోధించటం అత్యవసరం. కనుక ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుపడం చాలామంచి విషయం. అయితే దీనివల్ల మాతృభాష అధ్యయనం కుంటుపడకుండా పరిష్కార మార్గముంది.

భాషల మీద దృష్టిపెట్టాలంటే ప్రభుత్వం ఇప్పటిదాకా అనుసరిస్తున్న విధానాన్ని కొద్దిగా మార్చుకోవాలి. మన దేశంలో త్రిభాషా విధానం ఉన్నా కూడా ప్రాక్టికల్‌గా చూస్తే పాఠశాల స్థాయి అనంతరం రెండు భాష లు మాత్రమే పాఠ్యాంశాలుగా ఉంటాయి. కనుక ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంటే విద్యార్థులందరికీ మాతృభాషతో పాటు ఆంగ్ల భాష మీద కూడా మంచి పట్టు ఏర్పడుతుంది. ఐదవ తరగతి దాకా రెం డు భాషలు- మాతృభాష, ఆంగ్ల భాష ఇంగ్లిషు మాధ్యమంలో లెక్క లు బోధిస్తే బాగుంటుంది. భాషలు రాకుండా ఒకటవ తరగతి నుంచి సాం ఘిక, సామాన్య శాస్ర్తాలు పెట్టడంతో విద్యార్థులకు భాష రాకపోగా విద్య మీద ఉత్సాహం లేకుండా పోతున్నది. స్వయంగా రాయడం చేతకాక, పరీక్షలలో రాయవలసిన సమాధానాలు కంఠస్థం చేయడం వల్ల వారి సృజనాత్మకత దెబ్బతిని భాషాధ్యయనం కుంటుపడుతోంది. రెండు భాష లూ 5/ 7 సంవత్సరాల పాటు బోధిస్తే విద్యార్థులకు వాటిమీద పట్టు సాధించడం కష్టం కాదు. రెండు భాషలూ, లెక్కలతో పాటు ఐదవ తరగ తిదాకా లలిత కళలు.. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటివి, ఆటలు రోజు వారీగా ఉంటే బాగుంటుంది. లలిత కళలు విద్యార్థుల మనసులను ఉత్తేజపరిచి సృజనాత్మకత పెంచితే ఆటలు ఆరోగ్యానికీ, దేహ దారుఢ్యానికి ఉపయోగపడుతాయి. అంతేకాదు, ఇన్నిరకాలుగా ఆలోచనలు, యాక్టివిటీగా ఉండటంతో విద్యార్థులు ఉత్సాహంగా విద్య నేరుస్తారు. మూడవ భాష.. జాతీయ భాష మూడవ తరగతి నుంచి ప్రవేశపెట్టినా ఇంటర్‌దాకా చదువుకుంటారు కనుక బాగానే పట్టు సాధించే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ తమ మాతృభాష సాంస్కతికాభివృద్ధికి, ఆంగ్ల భాష ఉద్యోగావసరాలకే పనికివస్తుంది. ఒకటవ తరగతి నుంచి చదువుతారు కాబట్టి ఉన్నత విద్య అభ్యసించినా ఆంగ్ల భాషతో ఇబ్బంది ఉండదు.
అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషా విధానం మీద కూడా పటిష్టమైన ఆలోచన చేస్తుంద ని, పాఠశాల స్థాయిలో భాషా బోధనకు పటిష్టమైన విధానం రూపొందించి ఆచరణలో పెడుతుందని ఆశిద్దాం.
KANAKA

900
Tags
 ,