HomeEditpage Articles

శుష్కప్రియాలు-శూన్యహస్తాలు

Published: Sat,February 11, 2017 02:48 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో, పరిపాలనా రంగంలో, పరిపాలనా విధానంలో గత ఏడు దశాబ్దాల నుంచి అమలవుతున్నసంప్రదాయాలను మార్చాలన్న ఉబలాటం కొంతకాలం నుంచి, ముఖ్యంగా గడిచిన రెండున్నరేండ్ల నుంచి ప్రబలంగా వ్యక్తమవుతున్నది. కాలానుగుణంగా మార్పులు జరిగితే, పరివర్తన సంభవిస్తే ఆహ్వానించవలసిందే, సంతోషించవలసిందే.

మార్పు, పరివర్తన సహజమైనవే. కానీ, మార్పు కోసమే మార్పు అన్నది నకారాత్మక ధోరణి. ఇనుమడించిన ప్రయోజనం లేని మార్పు, ఇష్టారాజ్యంగా చేసే మార్పు ప్రగతిశీలమైనది కాదు, గతి నిరోధకమైనది. డ్బ్భై ఏండ్ల దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం తన వార్షిక, సాధారణ బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి రోజున ప్రవేశపెడుతున్నది. అదొక సంప్రదాయమైంది. ఆ సంప్రదాయానికి విఘా తం కలిగించి కేంద్ర ప్రభుత్వం ఈసారి 2017-18 సాధారణ బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. కారణమేమిటో బాధ్యులైన ప్రభుత్వ నాయకులు ఎవరూ చెప్పలేదు. భారత రాష్ట్రపతి కావించిన సుదీర్ఘ ప్రసంగంలో కూడా ఎక్కడా చెప్పలేదు. ప్రస్తుత రాష్ట్రపతి గత కేంద్ర ప్రభుత్వంలో పలు పర్యాయాలు ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక విషయజ్ఞుడు. బడ్జెట్ తేదీని ఎందుకు మార్చవలసి వచ్చిందో, ఆ మార్పు వల్ల దేశ ప్రజలకు కొత్తగా ఎటువంటి లాభాలు జరుగబోతాయో గౌరవనీయ రాష్ట్రపతిజీ తమ ప్రసంగంలో వివరిస్తే ఎంతో మేలు జరిగేది. బ్రిటిష్ పాలన అవశేషాలు ఏవీ లేకుండా చేసి అచ్చమైన మన వేదకాల భారతీయ సంప్రదాయాలను, విధానాలనే ప్రవేశపెట్టాలనుకుంటే ఇప్పుడున్న, ఎంతోకాలం నుంచి ఉన్న ఏప్రిల్-మార్చి బడ్జెట్ సంవత్సరాన్ని చైత్రం (ఉగాది నుం చి) నుంచి ప్రారంభించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలె. అంతేకాదు అక్కడితో ఆగొద్దు. బ్రిటిష్ పాలకులు విడిచి వెళ్లిన పార్లమెంటరీ వ్యవస్థను కూడా నవంబర్ నోట్ల రద్దు రీతిలో రద్దుచేసి రామరాజ్య పద్ధతిలో పట్టాభిషేకాలు జరుపాలె. నవంబర్‌లో నోట్లు రద్దయిన పిదప ఢిల్లీలో ఒక సందర్భంలో ప్రసంగిస్తూ నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థకు నష్టం తప్పవన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు రాష్ట్రప తి. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి వచ్చేసరికి గళం, స్వరం రెం డూ మారాయి. రాష్ట్రపతి మన్‌కీబాత్ అందులో ప్రతిధ్వనించలేదు. అం దులో వినిపించింది ప్రధానమంత్రి మన్‌కీబాత్. పాలకులు సూటిగా అంగీకరించకపోయినా నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పట్లో కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలింది. నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు తగ్గిందని ఆర్థిక సర్వేలో అధికారవర్గాలు అంగీకరించక తప్పలేదు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో నిజానికి ప్రత్యేక చర్చ ఏదీ జరుగలేదు. ప్రజల బాధలను, వారికి, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని దూరంచేసే మార్గాలు, చర్యలు ఏవైనా జనరల్ బడ్జెట్‌లో కనిపించాలె, కానీ కనిపించలేదు. మోదీజీ తమ గంభీర ప్రసంగాల్లో బాత్‌రూం స్నానాల గురించి మాట్లాడి వ్యంగ్య వైభవాన్ని ప్రదర్శించారు గానీ నోట్ల రద్దు పీడితుల బాధలను ప్రస్తావించలేదు తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు దాగవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అన్న పద్యం ఈ సందర్భాన జ్ఞాపకం వస్తున్నది.

బడ్జెట్‌ను విశ్లేషించడానికి బడ్జెట్ పత్రాల కట్టలను చదువాల్సిన అవసరం లేదు. బడ్జెట్‌ను ఎవరు ఆహ్వానిస్తున్నారో, ఎవరు మెచ్చుకుంటున్నారో చూస్తే చాలు అని ఒక మిత్రుడు అన్నాడు. ఈ సూత్రాన్నే పాటిం చి చూస్తే మొన్నటి కేంద్ర ప్రభుత్వ వార్షిక జనరల్ బడ్జెట్ దేశంలోని పారిశ్రామిక, వాణిజ్య అధిపతులందరికీ, భారీ కార్పొరేట్ సంస్థలన్నిటికీ అమితానందం కలిగించింది. వారందరూ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలకు, భారీ పారిశ్రామిక వాణిజ్య రంగాలను ప్రోత్సహించి గిలిగింతలు పెట్టడానికి మోదీజీ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన చర్యలకు, పన్ను తగ్గింపులకు జైజైలు పలికారు. ఈ బడ్జెట్‌ను చూసి, దాని గురించి విని బిక్కమొహం వేసింది దేశంలోని కోట్లాదిమంది సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే. నోట్ల రద్దు కలిగించిన నష్టాలను, కష్టాలను దూరంచేసే మార్గాలు ఏవీ ఈ బడ్జెట్‌లో లేవు. విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం తదితర కీలక రంగాలు ఇందులో అలక్ష్యానికి గురయ్యాయి. దేశ ప్రజల గుండెల్లో తమ స్థానం పదిలంగా ఉందంటున్న పాలకులకు బహుశా అన్నివైపులా భద్రతారాహిత్యం కనిపిస్తున్నది. నేషనల్ సెక్యూరిటీ సర్వీస్‌కు ఈ బడ్జెట్‌లో కేటాయింపు వంద రెట్లు పెరుగడం విపరీతం. ఒక కేంద్రమంత్రి పరిధి మొత్తం దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. కానీ, ఒక లోకల్ కేంద్రమంత్రి ఎప్పుడూ ఇక్క డే ఉండి మోదీ ప్రభుత్వపు చీఫ్ పీఆర్‌వోగా వ్యవహరిస్తుంటాడు. కేం ద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఇన్ని కోట్లు వస్తున్నాయని, అన్ని కోట్లు వస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఆ కోట్ల నిధులను ఇతర రంగాలకు తరలిస్తున్నదని ఆయన ఖాతాలు విప్పుతుంటాడు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొంటూ అత్యంత సమర్థవంత నాయకత్వంతో అనతికాలంలో సాధిస్తున్న బహుముఖ విజయాలన్నీ మోదీ ప్రభుత్వానివే అన్నది ఈ లోకల్ కేం ద్రమంత్రి ప్రచారం తాత్పర్యం, మాటల టిప్పణి. ఈయన ఫెడరల్ వ్యవస్థ సూత్రాలకు విఘాతం కలిగిస్తూ, పారలల్ ప్రభుత్వం నడుస్తున్నదా అన్న అనుమానం కలిగిస్తూ స్థానిక ఉన్నతాధికారులను కూర్చోబెట్టి, సమీక్షలు జరిపి ఆదేశాలు కూడా జారీ చేస్తుంటాడు. గతంలో ఎన్నడూ కేంద్ర మంత్రులు ఇక్కడే తిష్టవేసి జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో ఈ లోకల్ కేంద్రమంత్రికి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక నిధుల ప్రవాహం కనిపించింది. ఆ ప్రవాహం త్రివేణిలో ఎన్నడూ కన్పించని సరస్వతీ నది వంటిది. హైదరాబాద్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వ మర్యాదలు, సత్కారాలు పొందిన కేంద్రమంత్రులు, కేంద్ర నాయకులు తెలంగాణ అభివృద్ధి కోసం అన్నీ చేస్తాం అం టూ నోరూరిస్తారు. మాటలే కానీ చేతలేమీ ఉం డవు. శుష్కప్రియాలు శూన్యహస్తాలు. ఇది తెలంగాణ రాష్ర్టానికి మొదటి నుంచీ కలుగుతున్న అనుభవం.

మొదట రాచరిక పాలనలో, తర్వాత అరవై ఏండ్ల ప్రజాస్వామ్యం ముసుగులో కొనసాగిన దోపిడీ, అణచివేత పాలనలో అక్రమాలకు, అన్యాయాలకు గురైన తెలంగాణ ప్రజలకు తగి న న్యాయం చేసే రీతిగా రాష్ట్ర విభజన చట్టం రూపొందలేదు. ప్రారంభంలోనే ఆ చట్టానికి తూట్లు పొడిచే కుట్రలు జరిగాయి. స్వతంత్ర భారతంలో కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల ను, అవరోధాలను ఎదుర్కోలేదు. అరవై ఏండ్ల పోరాటాల ఫలితంగా అవతరించిన తెలంగాణ రాష్ర్టానికి, ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదు లు కలిగించే కుట్రలు ముమ్మరంగా జరిగాయి. మొదటినుంచి త్రిముఖ ప్రతిపక్షం, కోర్టు స్టే ఆర్డర్లు, కేంద్రం శుష్కప్రియాలు.. శూన్యహస్తాలు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజాకోటి సంక్షేమం కోసం అహర్నిశలు ఆరాటపడే ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి క్రాంతి దర్శనం, మార్గదర్శకత్వం లేనట్లయితే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన చతికిలపడేది. ప్రగతికి ప్రతిబంధకమైన నోట్ల రద్దును తెలంగాణ ప్రభుత్వం నీలకంఠుని వలె తన గళంలో నియంత్రించి నిరంతరాయంగా తన పురోగమనాన్ని కొనసాగిస్తున్నది. కేంద్ర పాలకుల శుష్కప్రియాలు.. శూన్యహస్తాల కారణంగా ఇంతవరకు మూడేండ్లు గడుస్తున్నా హైకోర్టు విభజన జరుగలేదు, నదీజలాల గరిష్ఠ వినియోగం తెలంగాణలో సాధ్యం కావడం లేదు, ఉద్యోగుల విభజన తతంగం రామానందసాగ ర్ రామాయణం సీరియల్ వలె ఎడతెగకుం డా కొనసాగుతున్నది, తొమ్మిదవ, పదవ షెడ్యూళ్ళ సంస్థలు, ఆస్థుల పంపకం అటక దిగి కిం దికి రావడం లేదు. అమరావతిలో సింగపూర్‌ల నిర్మాణం జరుగుతు న్నా ఆంధ్రా పాలకులు హైదరాబాద్ భవనాలను ఖాళీ చేయడం లేదు. ఇదీ కొత్త రాష్ట్రం తెలంగాణ పట్ల కేంద్ర పాలకుల, పెద్దల ఆదరాభిమా నం! దీనికంతకూ పరాకాష్టగా ఇటీవల ప్రధానమం త్రి కార్యాలయం తెలంగాణ అఖిలపక్షం అపాయింట్‌మెంట్‌ను కారణాలేవీ చెప్పకుండా నే రద్దు చేయడం.

Prabhakar-Raoప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించే అఖిలపక్ష బృందానికి నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన స్వయంగా చొరవ తీసుకుని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పడుతున్న తపనకు ఇదొక నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరి తీసుకున్న అపాయింట్‌మెంట్‌ను ప్రధాని కార్యాలయం రద్దు చేయడం శుష్కప్రియాలకు, శూన్యహస్తాలకు మరో ప్రబల నిదర్శనం. కేంద్ర నాయకులకు ఇక్కడి ప్రజా సమస్యల పట్ల, వాటి పరిష్కారం పట్ల ఎంతమాత్రం శ్రద్ధాసక్తులు లేవని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పకతప్పదు. ఢిల్లీలో, ఇతర స్థలాల్లో, ఎన్నికలు జరుగుతున్న ఏడు రాష్ర్టాల్లో ఎంతో సమయాన్ని కేటాయిస్తున్న భారత ప్రధానమంత్రికి తెలంగాణ రాష్ట్రంలోని ఒక ముఖ్యవర్గం (పేదవర్గం) సమస్య పరిష్కారాని కి సమయం లేకపోవడం దురదృష్టం. తెలంగా ణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన ఒక మహోద్యమ ఏకైక ప్రతినిధి, ప్రజల ముఖ్యమంత్రి. ఢిల్లీ పాలకులకు అవగతం కావలసిన అక్షరసత్యం ఇది. తెలంగాణ విషయంలో ఢిల్లీ పాలకులకు అవగతం కావలసిన మరో అంశం ఉంది. దాదాపు డ్బ్భై ఏండ్ల అణచివేతకు, దోపిడీకి గురైన, అన్ని రం గాల్లో ఘోరంగా నష్టపడ్డ తెలంగాణ రాష్ర్టానికి స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఇవ్వాలె. ప్యాకేజీ కూడా ఇవ్వాలె. తమ రాష్ర్టానికి స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ సదుపాయాలు, ప్రయోజనాలు అన్నీ చేకూరుతున్నాయని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. అయినా, ఆయన ప్యాకేజీ కూడా (అవ్వ, బువ్వ)రెండూ కావాలంటున్నారు. కేంద్ర పాలకులు పొరుగు రాష్ర్టానికి గుప్త దానాలు చేస్తూ తెలంగాణను విస్మరించడం అన్యాయం.

1025
Tags
 ,