HomeEditpage Articles

యోగి పాలన!

Published: Tue,March 21, 2017 01:50 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

మన ప్రజాస్వామిక వ్యవస్థ అన్ని అతివాద పోకడలను జీర్ణం చేసుకుంటూ తన మనుగడను కాపాడుకుంటున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి భావజాలాలను వారు ప్రచారం చేసుకోవచ్చు. కానీ అధికారానికి వచ్చిన తరువాత అందరి నాయకుడిగా వ్యవహరించవలసిందే. యోగీ ఆదిత్యనాథ్ కూడా వ్యవస్థకు అతీతుడేమీ కాదు. విదేశీ పత్రికల సంగతి ఎట్లా ఉన్నా మన
రాజకీయ వ్యవస్థపై మనం నమ్మకాన్ని కోల్పోకూడదు.


ఆదిత్యనాథ్ అన్ని మతాలను గౌరవిస్తాడని ఆశిస్తున్నా. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అన్న బీజేపీ నినాదానికి ఆయన కట్టుబడి ఉండాలె. ఈ నినాదంలోకి- పేదలు, ధనికులు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు- అందరూ వస్తరు. అబ్ జిమ్మేదారీ బడీ హోగయీ హై (ఇప్పుడు బాధ్యత పెరిగింది)... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తన కొడుకు ఆదిత్యనాథ్ గురించి ఆయన తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ చెప్పిన మాటలివి! తన కుమారుడు మత రాజకీయాలకు దూరంగా ఉంటాడని, అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తాడ ని ఆయన గాఢంగా నమ్ముతున్నారు. ఏ తండ్రి అయినా తన కుమారుడు చరిత్రలో ఉత్తముడి గా నిలువాలనే కోరుకుంటాడు. ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా తమ రాష్ట్రం కులమతాల సుడిగుండంలో పడిపోకుండా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. భారతీయ సమాజమంతా ఇవాళ కోరుకుంటున్నదీ అదే. కలహాల కుంపటిలో పడకుండా భారతీయ సమాజం పాశ్చాత్య దేశాలకు దీటుగా అభివృద్ధి చెందాలని కోరుకోవడానికి మించిన దేశభక్తి ఇంకేముంటుంది! 2007లో దళితుల పార్టీగా నిలిచిన మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్‌పార్టీకి ప్రజ లు మెజారిటీ కట్టబెట్టారు. ఆ తరువాత వెనుకబడిన తరగతుల పార్టీగా పేరొందిన సమాజ్‌వాదీ పార్టీని సంపూర్ణ మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్ ప్రజలు అసాధారణ మెజారిటీతో బీజేపీకి పట్టం గట్టారు. మతవాదిగా గుర్తింపు పొందిన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయా పార్టీల సిద్ధాంతాలతో ఏకీభవించలేని వారు కూడా ప్రజాతీర్పును మనసారా గౌరవించవించడమే ప్రజాస్వామ్య సంస్కృతి.

బీజేపీ అధిష్ఠానం యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసిందనే వార్త దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ సమాజం కూడా ఉలిక్కిపడిన మాట వాస్తవం. సీనియర్ రాజకీయవేత్తగా పార్టీలకు అతీతంగా మిత్రులున్న శరద్ పవార్- యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి అయ్యారనే వార్తకు స్పందించి- బీజేపీని ఎదుర్కోవడానికి మిగతా పక్షాలన్నీ ఐక్య సంఘటనగా ఏర్పడాలని సూచించారు. అంతర్జాతీయ పత్రికలు యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి కావడం పట్ల ఒక దేశంలో మతవాది అధికారానికి వచ్చినంతగా స్పందించా యి. ది గార్డియన్ పత్రిక సంపాదకీయమే రాసింది. హాలాండ్‌లో ఇస్లాం వ్యతిరేకిగా పేరొందిన గీర్ట్ విల్డ ర్స్ అతిపెద్ద పార్టీకి నాయకుడయ్యే ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్న దశలో ముస్లిం వ్యతిరేకి అతి పెద్ద (యూపీ) ఎన్నికల్లో గెలుపొందారని వ్యాఖ్యానించింది. బీబీసీ, ది న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్ తమ కథనాలలో ఇదే రీతిలో స్పందించాయి. యోగి ఆదిత్యనాథ్ ఎంపిక పట్ల ఇంతగా ప్రతికూల స్పందన రావడానికి ఆయన గతమే కారణం. ఆయనపై మతకలహాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. లవ్ జిహాద్, మత మార్పిడులు, గోరక్షణ మొదలైన అంశాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఆదిత్యనాథ్ అనేకసార్లు బీజేపీ నాయకత్వాన్ని ధిక్కరించారు. ప్రధాని మోదీకి పూర్తి విధేయుడు కాదు. అయినా ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందీ అంటే, అంతకంతకూ రాజకీయ వ్యవస్థను మతపరంగా మార్చే వ్యూహం అమలవుతున్నదా అనే అనుమానాలు కలగడం సహజం. అయితే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మతరాజకీయాలు పెచ్చరిల్లుతున్న నేపథ్యం యోగి ఆదిత్యనాథ్ ఎంపిక పట్ల ఆందోళన చెలరేగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

ఇతర దేశాల మాదిరిగానే, మన దేశంలోనూ మతోన్మాద పోకడలు ఆందోళన కలిగిస్తున్నా యి. ఏడు దశాబ్దాలుగా మనం నిర్మించుకున్న ప్రజాస్వామిక లౌకిక వ్యవస్థ చెదిరిపోతున్నదనే ఆందోళన దేశ ప్రజలకు కలుగుతున్నది. మన పొరుగు దేశాలతో సహా మతోన్మాదాన్ని ఆవహించుకున్న రాజ్యాలు భ్రష్టుపట్టిపోయిన తీరు చూసిన తరువాత మన దేశంలో ఈ ఉన్మాద పోకడలు భయం గొలుపడంలో ఆశ్చర్యం లేదు. చైతన్యవంతమైన ప్రజలకు ఈ మాత్రం అప్రమత్తత అవసరమే. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పట్ల మరీ అంత భయాందోళనలు అవసరం లేదు. ఇటువంటి అతివాద పోకడలను చవి చూడటం భారతీయ సమాజానికి కొత్తకాదు. 1957లో కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి రావడం పట్ల ఆందోళన చెందినవారున్నారు. భిన్న సామాజిక, సైద్ధాంతిక శక్తులు మన రాజకీయ వ్యవస్థలో ఉనికి చాటుకోవడం, వీలైతే అధికారానికి రావడం సాధారణమైపోయింది. కశ్మీర్‌లో మిలిటెంట్ల పక్షాన వకాల్తా పుచ్చుకున్న పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టడం ఎన్నికలకు ముందు అనూహ్యం. భిన్న సామాజికశక్తులకు అతివాద ధోరణులను వీడి సర్దుబాటు చేసుకోవడం అలవాటైంది. మన ప్రజాస్వామిక వ్యవస్థ అన్ని అతివాద పోకడలను జీర్ణం చేసుకుంటూ తన మనుగడను కాపాడుకుంటున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి భావజాలాలను వారు ప్రచారం చేసుకోవచ్చు. కానీ అధికారానికి వచ్చిన తరువాత అందరి నాయకుడిగా వ్యవహరించవలసిందే. యోగి ఆదిత్యనాథ్ కూడా వ్యవస్థకు అతీతుడేమీ కాదు. విదేశీ పత్రికల సంగతి ఎట్లా ఉన్నా మన రాజకీయ వ్యవస్థపై మనం నమ్మకాన్ని కోల్పోకూడదు.

1621
Tags
 ,