HomeEditpage Articles

ప్రమాద హెచ్చరిక

Published: Thu,January 12, 2017 01:03 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఆర్థిక అసమానత్వం ప్రజాస్వామ్య సూత్రాలకు భంగకరమని ఆయన హెచ్చరించారు. సమాజంలోని ఒక్క శాతం ప్రజలే సంపదను పోగు చేసుకున్నప్పుడు, పట్టణ గ్రామీణ పేదలు, ఉపాధి కోల్పోయిన కార్మికులు తమకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని, ప్రభుత్వం సంపన్నుల ప్రయోజనాలే కాపాడుతున్నదని భావించినప్పుడు రాజకీయాలలో కేంద్రీకరణ
సాగుతుందని హెచ్చరించారు.


అమెరికా అధ్యక్షుడిగా దిగిపోతున్న బరాక్ ఒబామా వీడ్కోలు ప్రసంగంలో తాను ఎనిమిదేం డ్ల పాలనలో సాధించిన విజయాలను చెబుతూనే ప్రజలకు ప్రజాస్వామ్య స్వభావాన్ని, దానిని కాపాడుకోవలసిన అవసరాన్ని ఉద్వేగభరితంగా వివరించారు. తన జీవితంతో, తన భార్య మిషె ల్ జీవితంతో ముడిపడిన షికాగో నగరాన్ని ఆయన తన వీడ్కోలు ప్రసంగానికి వేదికగా ఎంచుకోవడం కూడా హత్తుకునే విధంగా ఉన్నది. అమెరికాలో శ్వేత జాత్యహంకార భావజాలం పదునెక్కుతున్న కాలంలో ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒబామా దేశాధ్యక్షునిగా రెండు పర్యాయాలు ఎన్నిక కావడం చరిత్రాత్మకమే. అయితే ఆయన ఎన్నికైన సమయంతోపాటు దిగిపోతున్న సందర్భం కూడా ఎన్నదగినదే. కరడుగట్టిన శ్వేత జాత్యభిమాన, మత దురభిమాన, కార్పొరేట్ అనుకూల భావజాలం జీర్ణించుకున్న బుష్ పాలనా విధానానికి మహిళలు మొదలుకొని ప్రతి సామాజికవర్గం ఊపిరాడనట్టుగా ఇబ్బంది పడ్డది.

ఒబామా విజయం ఉదారవాదాన్ని, బహుళత్వాన్ని కోరే అమెరికా ప్రజానీకానికి ఊరట కలిగించింది. వారికి ఆనాటి ఒబామా తొలి ప్రసం గం బుష్ పాలన నుంచి విముక్తిని సూచించే ఒక హక్కుల పత్రంగా వినిపించింది. అదే వరుసలో చూస్తే ఒబామా వీడ్కోలు ప్రసంగం- రాబోయే ట్రంప్ పాలన నేపథ్యంలో- ప్రజలను జాగృతం చేసే ఒక హెచ్చరికగా ఉన్నది. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలనే కాదు, ప్రపంచాన్ని పీడిస్తున్న జాడ్యాలను వివరిస్తూ కర్తవ్య బోధ చేసే విధంగా ఈ ప్రసంగం సాగింది. ట్రంప్ ఎన్నిక తరువాత అమెరికా సమాజం గమనం ఏ వైపు ఉంటుందోననే ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో ఒబామా ప్రజాస్వామిక విలువల పట్ల విశ్వాసం నాటడానికి యత్నించారు.

నిరుద్యోగ సమస్యకు, ఆర్థిక సంక్షోభానికి ఇతర సకల రోగాలకు ఉదారవాదం, ప్రజాస్వా మ్యం, మైనారిటీలు బలహీనవర్గాల పట్ల అనుసరిస్తున్న సహనం కారణమనే రీతిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ప్రచారం చేసి విజయం సాధించారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికలు అమెరికాలో భావజాలాల ఘర్షణగా సాగాయి. యూరప్‌లో ఫాసిజం, నాజీజం వంటి జాడ్యాలు తలెత్తి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించిన నాటి పరిస్థితిని ఈ అధ్యక్ష ఎన్నికల వాతావరణం గుర్తుకు తెచ్చింది. ట్రంప్ ముందుకు తెచ్చిన జాత్యహంకార ప్రచారాన్ని, అమెరికాను మళ్ళా ఘనమైన దేశంగా మారుద్దామనే డొల్ల నినాదాన్ని ఒబామా అమెరికా రాజ్య స్థాపన నాటి ఆదర్శాలను, అమెరికా ఉదారవాద సామాజిక విలువలను గుర్తుచేయడం ద్వారా గట్టిగా తిప్పికొట్టారు.

తన ఎనిమిదేండ్ల పాలనలో ఆంతరంగికంగా మహా మాంద్యాన్ని అధిగమించానని, ఉపాధి కల్పన పెంచానని, వాహన పరిశ్రమకు పునరుత్తేజం కలిగించానని ఆయన వివరించారు. క్యూబాతో సత్సంబంధాలు నెలకొల్పడం, ఒక్క తూటా పేల్చకుండానే ఇరాన్ అణు కార్యక్రమాన్ని మూతవేయ డం, 9/11 కుట్రదారుడిని మట్టుపెట్టడం వంటి విజయాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. దేశం నెగ్గుకురావడానికి ఉన్మాదపూరిత విధానాలు అవసరం లేదనేది ప్రజలకు అర్థం చేయించే ప్రయత్నం ఇది. ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయం ఉండదు. మన అమెరికా రాజ్యాంగ నిర్మాతలు కూడా పరస్ప రం విభేదించారు, కానీ రాజీపడ్డారు కూడా. మనం కూడా ఆ విధంగా వ్యవహరిస్తామని ఆశించారు. ప్రజాస్వామ్యంలో సౌహార్ద్రత అవసరం. విభేదాల ను అధిగమించి కలసిసాగాలె. మునిగినా తేలినా ఒక్కటిగానే ఉండాలె అని ఒబామా ఉద్భోదించా రు. రాజ్యాంగ ఆదర్శాలను అమలులోకి తెచ్చుకోవలసింది పౌరులేనని, ప్రజల భాగస్వామ్యం లేకపోతే అమెరికా రాజ్యాంగం ఒక తాళపత్రంగా మిగిలిపోతుందని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యానికి వివిధ రూపాలలో తలెత్తుతున్న ప్రమాదాలను ఒబామా వివరించారు. ఆర్థిక అసమానత్వం ప్రజాస్వామ్య సూత్రాలకు భంగకరమని ఆయన హెచ్చరించారు. సమాజంలోని ఒక్క శాతం ప్రజలే సంపదను పోగు చేసుకున్నప్పుడు, పట్టణ గ్రామీణ పేదలు, ఉపాధి కోల్పోయిన కార్మికులు తమకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని, ప్రభుత్వం సంపన్నుల ప్రయోజనాలే కాపాడుతున్నదని భావించినప్పుడు రాజకీయాలలో కేంద్రీకరణ సాగుతుందని హెచ్చరించారు. వ్యాపారం స్వేచ్ఛగానే కాదు, న్యాయబద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఉద్యోగాలకు ముప్పు బయటి నుంచి రాదని, ఆటోమేషన్ వల్ల వస్తుందని వివరించారు. కొత్త ఆర్థిక వ్యవస్థలో లబ్ధి పొందే కార్పొరేట్ సంస్థలు తమ బాధ్యతలను కూడా గుర్తించే విధంగా, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగేలా కొత్త వ్యవస్థను నెలకొల్పాలని సూచించారు. జాతుల కలహం ప్రజాస్వామ్యానికి మరో ప్రమాదమని కూడా హెచ్చరించారు.

వలస వచ్చిన వారి పట్ల చిన్నచూపు తగదని హితవు చెప్పారు. తమ పార్టీ కార్పొరేట్ సంస్థలకు పన్నులు తగ్గి స్తూ, సంక్షేమ పథకాలకు కోత వేస్తున్నప్పుడు పెదవి విప్పని వారు, అవే విధానాలను ఇతర పార్టీ అనుసరించినప్పుడు వేలెత్తి చూపుతున్నారంటూ ఒబామా రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపారు. పెరుగుతున్న సంకుచితత్వం, టీవీ చానెళ్ళద్వారా వాటి వ్యక్తీకర ణ వల్ల నచ్చిన సమాచారాన్నే స్వీకరిస్తున్నామనీ, వాస్తవాలను గుర్తించ నిరాకరిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. రాజకీయాలు హేతుబద్ధమైన చర్చతో భావజాల ఘర్షణగా ఉండి, ఉమ్మడి లక్ష్యం వైపు పయనించాలని అభిలషించారు. ఒబామా చేసిన హెచ్చరికలు, చెప్పిన హితోక్తులు అమెరికా సమాజానికే కాదు, ఆర్థిక అసమానత్వాన్ని పెం చుతూ, అసహన ఉన్మాద రాజకీయాలను ఆశ్రయిస్తున్న ఇతర దేశాలకూ వర్తిస్తాయి.

3050
Tags
 ,