HomeEditpage Articles

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

Published: Tue,February 14, 2017 01:23 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్ష-ప్రధాన మంత్రులుగా మహిళలే ఎన్నిక కావాలని కోరుకుందాం.

మహిళా సాధికారత.. మహిళలకు భరోసా.. అధికారంలో భాగస్వామ్యమే లక్ష్యంగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో మూడు రోజుల మహిళా సదస్సు అమరావతిలో జరిగింది. ఈ నేపథ్యంలో గతంలోకి తొంగి చూస్తే.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు రాణించడం, చాలా రంగాల్లో పురుషులను అధిగమించడం గత శతాబ్దంలోను, ముఖ్యంగా ఈ శతాబ్దంలో గమనించవచ్చు. ఇతర రంగాల కంటే కూడా, మహిళలు, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగడమే కాకుండా, పలు దేశాల్లో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఓటుహ క్కు ఇవ్వండని పురుషులను ఒకనాడు అడిగిన మహిళలే, అనేక హక్కులను తమకే కాకుండా, పురుషులకు కూడా వారే కలిగించే స్థాయికి ఎదిగారు. ప్రపంచ వ్యాప్తం గా ప్రజాస్వామ్యం, సమానత్వం, దినదినాభివృద్ధి చెందుతున్నదనడానికి ఇంతకంటే నిదర్శనం మరోటి లేదు.

1960లో ప్రపంచంలోనే మొదటిసారి ఒక మహిళ (సిరిమావో బండార నాయకే) శ్రీలంక ప్రధానమంత్రిగా అధికారం చేపట్టి అంతర్జాతీయంగా సంచలనం కలిగించింది. ఆ తర్వా త ఎందరో మహిళలు, సుమారు వంద మందికి పైగా, ప్రధానులుగానో, అధ్యక్షులుగానో, ఎన్నో దేశాల్లో అధికారం చేపట్టారు. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. మొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచినట్లయితే, ఆ దేశ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలయ్యేది. కారణాలేవైనా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ముందు వరుసలో ఉండే అమెరికాలో ఇంతవరకు మహిళకు అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశం రాలేదు. ప్రస్తుతం వర్తమాన ప్రపంచ దేశాల్లో సుమారు 20 మం దికి పైగా దేశాధినేతలుగా ఉన్నారు. ఈ సంఖ్య మునుముందు పెరుగుతుంది.

భారతదేశంలో నెహ్రూ కుటుంబీకులు, పాకిస్థాన్‌లో భుట్టో కుటుంబీకులు, బంగ్లాదేశ్‌లో ముజిబుర్ రెహ్మాన్ కుటుంబీకులు అధికారంలో ఉన్నారు. 20 వ శతాబ్దపు విశ్వవిఖ్యాత మహిళగా ఇందిరాగాంధీ భారత ప్రధానిగా రెండు విడుతలుగా బాధ్యతలు నిర్వహించింది. 1984లో దారుణ హత్యకు గురైంది. గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ప్రపంచవ్యాప్త మన్ననలను పొందింది. బంగ్లాదేశ్ విమోచన కారణభూతురాలైంది. అపర దుర్గగా ప్రతిపక్షాల మెప్పును కూడా పొందింది. ఆమె కోడలు ప్రధాని కాలేకపోయినా పదేళ్లు యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్నది. అలానే ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతిగా అరుదైన గౌరవం పొందారు. స్పీకర్ పదవిని అలంకరించిన మీరాకుమార్, సుమిత్రా మహాజన్ ప్రపంచంలోనే అలాంటి పదవులు పొందిన అతి కొద్దిమందిలో ఒకరు.

ఇజ్రాయిల్ దేశం వ్యవస్థాపకుల్లో ఒకరైన గోల్డా మీర్, మొదట్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, భర్తతో పాటు ఉద్యమంలో పాల్గొనేది. రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేది. 1948లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి అయింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్‌లో ఇజ్రాయిల్ రాయబారిగా గోల్డా మీర్‌ను నియమించింది ప్రభుత్వం. దరిమిలా దేశానికి తిరిగొచ్చిన ఆమె లేబర్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండగా, అప్పటి ప్రధాని హఠాన్మరణంతో, తన డ్బ్భైయవ ఏట, 1969లో ఇజ్రాయిల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగింది. 1978లో చనిపోయింది.

బ్రిటన్ మొట్టమొదటి మహిళా ప్రధాని మార్గరేట్ థాచర్ రసాయన శాస్త్ర పరిశోధకురాలిగా, బారిస్టర్‌గా పనిచేసి,1953లో ఆ దేశ చట్ట సభ హౌజ్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైంది. వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించింది. ఆమె ప్రవేశపెట్టిన ప్రభుత్వరంగ సంస్కరణలు నేటికీ పలు దేశా ల్లో అమల్లో ఉన్నాయి. ఆమెను విమర్శించిన వారు సహితం వాటిని కొనసాగించారు. తనకు స్ఫూర్తి తన తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తో పాటు మార్గరెట్ థాచర్ అని నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలు కవిత అమరావతిలో పేర్కొనడం గమనించాలి.

జుల్ఫికర్ అలీ భుట్టో కూతురు బెనజీర్ భుట్టో, తండ్రి వారసురాలిగా, 1988-90, 1993-96 మధ్యకాలంలో రెండు పర్యాయాలు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేసింది. ప్రపంచంలోని ముస్లిం దేశాల్లో ఆమె కంటే పూర్వం ఏ మహిళ కూడా ప్రధాని కాలేదు. బెనజీ ర్‌కూ ఆ ఖ్యాతి దక్కింది. బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైన బేగం ఖలీదా, బేనజీర్ తరువాత ఇస్లాం దేశాలలో ఆ పదవిని చేపట్టిన రెండవ మహిళ.
ఇలా ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్ష-ప్రధాన మంత్రులుగా మహిళలే ఎన్నిక కావాలని కోరుకుందాం.
Vanam

1022
Tags
 ,