HomeEditpage Articles

ట్రంప్ కష్టాలు

Published: Fri,February 17, 2017 02:02 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ట్రంప్ అధికారానికి వచ్చిన మొదటి నెలలోనే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రంప్ విధానాల పట్ల నిరసన ప్రదర్శనలు, ఆయన పదవి చేపట్టక ముందు నుంచే మొదలయ్యాయి. ఈ నిరసనలు విధానపరమైనవి. కానీ అధికారానికి వచ్చిన తరువాత ఆయన నిర్ణయాలే సమస్యలు పుట్టిస్తున్నాయి. కొన్ని ముస్లిం దేశాల నుంచి వలసలు నిషేధించడం వల్ల న్యాయ వ్యవస్థ నుంచి సవాలు ఎదురైంది. మొత్తంగా వలసలకే వ్యతిరేకంగా మాట్లాడటాన్ని మిత్ర దేశాలు ఆమోదించలేకపోతున్నాయి.

వ్యాపారానికి, రాజకీయానికి చాలా తేడా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ముచ్చటగా మూడు వారాలైనా గడువకముందే తెలిసి వచ్చింది. రష్యాతో మంతనాల విషయం బయటపడటంతో జాతీయ భద్రతా సలహాదారు మైకెల్ ఫ్లిన్ ఇరవై నాలుగు రోజులలోనే రాజీనామా చేయవలసి వచ్చింది. దేశాధినేత సహచర మంత్రి పుంగవుల కన్నా జాతీయ భద్రతా సలహాదారుకు ఎక్కువ విలువ ఇచ్చే ఈ రోజుల్లో- ట్రంప్ ఆత్మీయుడు అవమానకరంగా తప్పుకోవలసి వచ్చింది. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయం లో ట్రంప్ బృందంలో కీలకపాత్ర పోషిస్తున్న మైకెల్ ఫ్లిన్ అమెరికాలోని రష్యా రాయబారి కిస్‌లియాక్‌తో మంతనాలు జరిపారు. ఆయన రష్యా రాయబారితో ఏ అంశాలు చర్చించారనేది చర్చానీయాంశంగా మారింది. తాను చర్చించిన అంశాలు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు, అధ్యక్ష భవనం సహాయకులకు కూడా వెల్లడించలేదు. ఈ మంతనాల సంగతి బయటకు పొక్కడంతో పెన్స్ తనకున్న సమాచారం ఆధారంగా ఫ్లిన్‌ను వెనకేసుకు వచ్చారు. ఫ్లిన్ జరిపిన చర్చలు దేశాధ్యక్షుడిని రాజీపడే విధంగా చేస్తాయని న్యాయశాఖ ట్రంప్‌ను హెచ్చరించిందన్న విషయం బయటపడటంతో గగ్గోలు పుట్టి ఫ్లిన్ రాజీనామా సమర్పించక తప్పలేదు. వేగవంతమైన ఘటనల కారణంగా తాను ఉపాధ్యక్షుడికి, ఇతరులకు పూర్తి పాక్షిక సమాచారం అందించవలసి వచ్చిందని ఫ్లిన్ తన రాజీనామా లేఖలో సమర్థించుకున్నారు. ఫ్లిన్ ఏ విధంగానైనా సమర్థించుకోవచ్చు కానీ, అది ఆయన ఒక్కడి సమస్య కాదు. ఈ వివాదం ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకున్నది. అది బిగుసుకోకుండా బయటపడటం ట్రంప్ ఎదుర్కొంటున్న సమస్య.

క్రిమియాను ఆక్రమించుకున్న తరువాత నాటో దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటున్నది. అందువల్ల అమెరికా అధ్యక్ష పదవిలో తనకు అనుకూలమైన అభ్యర్థి రావాలని కోరుకుంటున్నది. ట్రంప్ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నప్పుడు రష్యా ఆయనకు తోడ్పడుతున్నదనే వార్తలు వచ్చాయి. రష్యా గూఢచారవర్గాలు డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారి ఈ-మెయిల్స్, ఇతర కీలక సమాచారం ట్రంప్‌కు చేరవేశాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ శిబిరం రష్యాతో మంతనాలు జరిపి తాము గెలిస్తే ఆంక్షలు ఎత్తివేస్తామనే హామీ ఇచ్చారా అనే అనుమానాలు కలుగడం సహజం. ఈ ఆరోపణలు బలపడితే ఒక శత్రుదేశం తమ అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడాన్ని అమెరికా ప్రజలు జీర్ణించుకోలేదు. అమెరికా పౌరులు విదేశీ రాయబారులతో మంతనాలు జరుపడం చట్టప్రకారం నేరం. నైతికం గా కూడా సమర్థనీయం కాదు. చర్చలు జరుపడం సాధారణమే అని అనుకున్నా, ఆయన ఈ విషయంలో పారదర్శకత పాటించకపోవడం పెద్ద తప్పుగా కనిపిస్తున్నది. అమెరికా ప్రజలు నాయకు లు చేసే చిన్నపాటి తప్పులను క్షమిస్తారు. కానీ వారి మాటలలో, చేతలలో నిజాయితీ ఉండాలని ఆశిస్తా రు. అసత్యాలు చెప్పినట్టు, నిజాయితీ లేనట్టు బయ ట పడితే ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారుతుం ది. ట్రంప్ చీకటి మాటలు రోత పుట్టించినా క్షమించింది, ఆయన మాటల్లో, చేతల్లో నిజాయితీ కనబరుస్తారనే. ఇప్పుడు ఫ్లిన్ వివాదం వల్ల ఈ పారదర్శకత, నిజాయితీకి ప్రశ్నార్థకమవుతున్నాయి.

ట్రంప్ అధికారానికి వచ్చిన మొదటి నెలలోనే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రంప్ విధానాల పట్ల నిరసన ప్రదర్శనలు, ఆయన పదవి చేపట్టక ముందు నుంచే మొదలయ్యాయి. ఈ నిరసనలు విధానపరమైనవి. కానీ అధికారానికి వచ్చిన తరువాత ఆయన నిర్ణయాలే సమస్యలు పుట్టిస్తున్నాయి. కొన్ని ముస్లిం దేశాల నుంచి వలసలు నిషేధించడం వల్ల న్యాయ వ్యవస్థ నుంచి సవాలు ఎదురైంది. మొత్తంగా వలసలకే వ్యతిరేకంగా మాట్లాడటాన్ని మిత్ర దేశాలు ఆమోదించలేకపోతున్నాయి. నాటో దేశాలు ట్రంప్‌తో విభేదిస్తున్నారు. అమెరికా ఏకాకి అనేది శత్రుదేశాలకు వెల్లడయ్యేట్టుగా ప్రవర్తించడం పెద్ద వ్యూహపరమైన తప్పిదం. ఇరాన్ అణు కార్యక్రమం నిలిపివేయించడానికి ఒబామా ఎంతో దౌత్య చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ట్రంప్ మళ్ళా తట్టిలేపడంతో ఇరాన్ క్షిపణి పరీక్ష జరిపి సవాలు విసిరింది. ట్రంప్ ఇరాన్ చర్యకు స్పందించి, ఆంక్షలు విస్తృతం చేస్తున్నానని ప్రకటించారు. కానీ ఆ వెంటనే ఉత్తర కొరియా కూడా క్షిపణి పరీక్ష జరుపడంతో ఏమీ చేయలేక మౌనం వహించవలసి వచ్చింది. ఎవరి ప్రయోజనాలు వారివని ఇప్పటికే ట్రంప్ తెగేసి చెప్పడంతో, యూరప్ దేశాలు తమలో తాము చర్చించుకుంటున్నాయి. ఆస్ట్రేలియా అధినేతతో సంభాషణ పూర్తి కాకముందే ఆగ్రహంతో ఫోన్ కట్ చేసిన తీరు మిగతా దేశాల వారు ట్రంప్ వ్యవహారాన్ని ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. మెక్సికో సరిహద్దులో గోడ కడుతానని చెప్పడం వరకు సరే. మెక్సికోలోని గొడవలు చేసే వారిని అదుపు చేయడానికి సైన్యాన్ని పంపుతానని ట్రంప్ హెచ్చరించారు. దీంతో మెక్సికో అధ్యక్షుడు నీటో తలబాదుకుంటున్నారు. ఇదంతా ట్రంప్ మొదటి నెలలో జరిగిన కథ. ట్రంప్ ఇప్పటికైనా ఆధునిక రాజ్యాలు, అంతర్జాతీయ సమాజం ఇప్పటి వరకు అనుసరిస్తున్న విలువలను అర్థం చేసుకుంటే మంచిది. అదే మొండితనం ప్రదర్శిస్తే సమస్యలు సంక్షోభాలుగా మారుతయి.

1651
Tags
 ,