HomeEditpage Articles

ఘన వారసత్వాన్ని కాపాడుకుందాం!

Published: Wed,April 19, 2017 12:07 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ప్రాచీనకాలం నుంచి మొదలుకొని భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడటం వరకు ఎన్నో ఘనతలు తెలంగాణ సొంతం. ఇంతటి ఘనతలు పొందడానికి ప్రధాన కారణం తరతరాలుగా వివిధ రూపాల్లో మనం పొందుతూ వచ్చిన మన ఘన వారసత్వమే. ప్రపంచంలో, భారతదేశంలో తెలంగాణ అంటూ మనకు ఒక ఉనికి ఏర్పడిందంటే అందుకు కారణంమన వారసత్వమే. అలాంటి వారసత్వం గత ఆరు దశాబ్దాల కాలంలో గత పాలకుల హయాంలో ఎంతగానో నిర్లక్ష్యానికి గురైంది.

ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యం, అధీనంలోని వారసత్వ కట్టడాల విషయానికి వస్తే వారికి తగిన రీతిలో ప్రోత్సాహకాలు లభించడం లేదు. ఈ ప్రోత్సాహకాలు ఎలా ఉండాలన్న విషయమై కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఒక నివేదిక అందించాం. ఆ నివేదికలోని సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.


ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18వ రోజును మనం ప్రపంచ వారసత్వ కట్టడాల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్‌గా లేదా వరల్డ్ హెరిటేజ్ డేగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కాకతాళీయమే అయినప్పటికీ ఈ దినోత్సవానికి రెండురోజుల ముందు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించిన సమగ్ర చట్టం తేవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా ఆ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది వివిధ పురావస్తు, చారిత్రక ప్రాధాన్య కట్టడాల పరిరక్షణకు ఎంతో తోడ్పడగలదు. హైదరాబాద్‌లో మాత్రమే గాకుండా రాష్ట్రవ్యాప్తంగా వారసత్వ కట్టడాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా చట్టం తీసుకువచ్చిన ఘనత తెలంగాణకు దక్కింది. ఇతర రాష్ర్టాలకు చెందిన వారు కూడా ఈ ప్రతిపాదనను ఇప్పటికే హర్షించారు. తెలంగాణలో ఈ చట్టం చక్కగా అమలైతే ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

వారసత్వ కట్టడాలను పరిరక్షించడం అంటే మన మూలాలను అన్వేషిస్తూ, వాటిని కాపాడుకోవడమే. ఒకనాటి చరిత్ర, సంస్కృతి, కళాత్మకత, విజ్ఞానం, నిర్మాణ కౌశల్యం, విద్య, నైతిక విలువలు లాంటివన్నీ ఈ వారసత్వ కట్టడాల్లో అణువణువునా దాగి ఉంటాయి. ఒకసారి వాటి ని గనుక కోల్పోతే ఇక వాటిని తిరిగి సాధించలేం. వెల కట్టలేని సామూహిక జ్ఞాపకాల ఖజానాలు ఆ కట్టడాలు. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. ఎన్నెన్నో కథలు.. గాథలు.. అనుభూతులు. ఎంత డబ్బు వెచ్చించినా మరోచోట మరోవిధంగా వాటిని పొందలేం.ఎన్నెన్నో కట్టడాలు.. హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో వారసత్వ కట్టడాలున్నాయి. ఎన్నో కోటలు, సంస్థానాధీశుల భవనాలు, గడీలు, ఆలయాలు, మసీదులు, చర్చీలు, నవాబుల భవనాలు, స్థానిక ఆర్కిటెక్చర్‌కు అద్దంపట్టే ఇతర కట్టడాలు అనేకం ఈ వారసత్వ కట్టడాల పరిధిలోకి వస్తాయి. నిజానికి నోటిఫై కాని వారసత్వ భవనాలు సైతం అనేకం ఉన్నాయి. నోటిఫై అయినా, కాకున్నా, ఆయా వారసత్వ కట్టడాల పరిరక్షణకు దోహదపడే విధంగా చట్టం ఉండాలి.

తెలంగాణపై వివక్ష.. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉమ్మడి రాష్ట్రంలో 138 వారసత్వ కట్టడాలుంటే, వీటిలో సీమాంధ్ర ప్రాంతంలో 131 ఉండగా, తెలంగాణలోనివి 7 మాత్రమే. ఇందుకు ప్రధాన కారణం ఈ జాబితా కొన్ని దశాబ్దాల కిందట రూపొందించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలోనే ఈ జాబితా రూపొందింది. అప్పటికీ తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిజాం రాజ్యంలో భాగం గా ఉండింది. అందువల్ల తెలంగాణ ప్రాంతంలోని కట్టడాలకు ఆ జాబితాలో చోటుదక్కలేదు. మరో ముఖ్య కారణం గత ఆరు దశాబ్దాలుగా నాటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంపై కనబర్చిన నిర్లక్ష్యం. రాష్ట్ర విభ జన జరిగేవరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. స్వరాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈ జాబితాలోకి మరిన్ని కట్టడాలను చేర్పించేందుకు కృషిచేయాలి. ఈ జాబితాలో చేర్చేందుకు అర్హత కలిగిన కట్టడాలు తెలంగాణలో 100 నుంచి 300 దాకా ఉంటాయని అంచనా. ఆయా కట్టడాలను కేం ద్ర జాబితాలోకి చేరిస్తే రాష్ర్టానికి వాటి నిర్వహణ, సంరక్షణ భారం తగ్గడమే కాకుండా వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కలిగేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర జాబితాలోకి పోగా, మిగిలిన వాటిలో మరిన్నింటిని రాష్ట్ర జాబితాలోకి చేర్చే అవకాశం లభిస్తుంది. తెలంగాణలో ఎన్నో కట్టడాలు జాతీయస్థాయిలో వారసత్వ కట్టడాలుగా నోటిఫై కావాల్సి ఉన్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ప్రైవేట్ సంస్థలు కృషి చేయాలి.

సమగ్ర చట్టం అమల్లోకి వస్తే.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా లో (హెచ్‌ఎండీఏ పరిధిలో) మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రతిపాదిత నూతన చట్టం వీలు కల్పించగలదనే ఆశాభావం హెరిటేజ్ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నది. వివిధ జిల్లా, మండల కేంద్రాల్లో ఉన్న సంస్థానాధీశుల భవనాలు, గడీలు, కోటలతో పాటు పాలనావ్యవస్థలో కీలకపాత్ర పోషించిన తహశీల్ కార్యాలయా లు, కచేరీలు, దవాఖాన, బందీఖాన, ఇన్‌స్పెక్షన్ బంగళాలు, కలెక్టర్ బంగళా లాంటివాటిని కూడా ఈ చట్టం కింద కాపాడుకునేందుకు వీలు కల్పించాలి. ఇవి ప్రజల జీవితంలో, సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. అలాంటి భవనాలను కూలగొట్టకుండా, కట్టడాల శైలి దెబ్బతినకుండానే వాటిని విద్యాలయాలుగా, పర్యాటక కేంద్రాలుగా, దవాఖానలుగా, వాణిజ్యపరంగా ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలి.

చౌమహ ల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్ లాంటి వాటిని వాడటం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలాంటి వాటితో విలువ పెరుగడమే కాకుం డా చూట్టూరా బలమైన ఆర్థికవ్యవస్థ నిర్మితమవుతుంది.పునరుద్ధరణ.. వారసత్వ కట్టడాల పునరుద్ధరణ కూడా ఎంతో ముఖ్యమైంది. శిథిలావస్థకు చేరుకున్న పబ్లిక్ గార్డెన్స్ గేట్‌ను ఇటీవలే పునరుద్ధరిస్తున్నారు. ఒకప్పుడు వైస్రాయ్ రెసిడెన్సీగా ఉండే కోఠిలోని ఉమెన్స్ కాలేజీని పునరుద్ధరించుకుంటున్నాం. కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారంతో మెరుగులు దిద్దుకుంటున్నాం. ఎన్నో సంస్థల కృషి.. దేశంలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రభు త్వం మాత్రమే గాకుండా మరెన్నో ప్రభుత్వేతర సంస్థలు తమ వంతు కృషిచేస్తున్నాయి. జాతీయస్థాయిలో ఇంటాక్ ఈ పని చేస్తున్నది. రాష్ట్రం లో హైదరాబాద్ ప్రధానంగా దృష్టి వహిస్తూ ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ కృషిచేస్తున్నది. ఇరవై ఏండ్లుగా ప్రభుత్వంతో చర్చిస్తూ, డిమాం డ్ చేస్తూ, పోరాడుతూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది.

పర్యాటక రంగానికి ఊతం.. వారసత్వ కట్టడాలుగా గుర్తింపు లభిస్తే అవి ఉన్న ప్రాంతాలకు పర్యాటకపరంగా మంచిపేరు ప్రఖ్యాతులు లభిం చే అవకాశం ఉన్నది. స్థానికంగా వివిధరకాలుగా వాణిజ్య అవకాశాలు కూడా విస్తృతమవుతాయి. రాజస్థాన్‌లోని జైపూర్, జైసల్మేర్, ఉదయ్ పూర్, జోధ్‌పూర్ లాంటివి ఇందుకు ఉదాహరణలు. పర్యాటకం కారణంగా అక్కడి ప్రజల ఆదాయం పెరిగింది. స్థానిక ఆర్థికవ్యవస్థలు బలోపేతమయ్యాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. ఆయా కట్టడాల, ప్రాంతాల వాస్తవ స్వరూప స్వభావాలు దెబ్బతినకుండానే ఈ విధమైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉన్నది.

వారసత్వానికి ప్రాధాన్యమిస్తూ ప్రణాళికలు.. వారసత్వ అంశానికి ప్రాధాన్యం ఇస్తూ నగరాభివృద్ధి ప్రణాళికలు రూపొందాలి. గత ప్రభుత్వాల హయాంలో వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. అప్ప ట్లో వారసత్వ భవనాల పరిరక్షణ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అవి నానాటికీ మరింత శిథిలమవుతున్నాయి. ఇష్టం వచ్చిన రీతిలో ఆకాశహర్మ్యాలు వెలిశాయి. వాణిజ్య ప్రకటనల హోర్డింగ్స్ నగర అందాలను దెబ్బతీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో లేదా వాడుకలో ఉన్న భవనాల నిర్వహణ సరిగా లేదు. తగినంతగా బడ్జెట్ కేటాయింపు లు చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికై నా ఈ పరిస్థితి మారాలి. ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యం, అధీనంలోని వారసత్వ కట్టడాల విషయానికి వస్తే వారికి తగిన రీతిలో ప్రోత్సాహకా లు లభించడం లేదు. ఈ ప్రోత్సాహకాలు ఎలా ఉండాలన్న విషయమై కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఒక నివేదిక అందించాం. ఆ నివేదికలోని సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలోనే ప్రపంచ వారసత్వ దినోత్సవం కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఓయూలోని చారిత్రక ప్రాధాన్య కట్టడాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతుందని కోరుకుందాం.
vedhakumar

715
Tags
 ,