HomeEditpage Articles

కావాల్సింది చాణక్య నీతా, విదుర నీతా?

Published: Wed,April 19, 2017 11:53 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

రిజర్వేషన్ల చర్చను గమనించినప్పుడు ముఖ్యమంత్రిది విదుర నీతి కాగా బీజేపీది చాణక్య నీతి అయినట్లు అర్థమైంది. ఇతర పేదల వలె ముస్లిం పేదల అభివృద్ధి సమాజ స్థిరతకు, వారు తక్కిన సమాజంతో ఒకటి కావటం జాతి నిర్మాణానికి దోహదం చేస్తుందనేది విదురనీతి. ఆ రెండు అవగాహనలూ లేక విచ్ఛిన్నమార్గంలో అధికారం పొందజూడటం చాణక్య నీతి. అది సమాజాన్ని అస్థిరపరిచి, జాతి నిర్మాణ కృషినీ భంగపరుస్తుంది.

ashok
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ విధానం ఉంది. కొత్త విధానల కోసం డిమాండ్లు వస్తున్నాయి. ఎక్కడి సామాజిక పరిస్థితులు అక్కడివి. రాజ్యాంగంలో ఇదమిత్థంగా ఏదీ లేని స్థితి. న్యాయస్థానాల తీర్పులు తేడాలుగా ఉన్నాయి. వాటిలోనే జడ్జీలు మార్పుచేర్పులకు అవకాశాలు వదిలారు. ఇవన్నీ గమనించినపుడు తమతమ పరిస్థితులను బట్టి రిజర్వేషన్ల అవకాశం రాష్ర్టాలకు ఎందుకు వదలరాదన్నది కేసీఆర్ ప్రశ్న. మరొకవిధంగా చెప్పాలంటే ఇది ఫెడరలిస్టు ప్రశ్న.

ఎప్పుడైనా ఒక విషయం ఎంత ముఖ్యమో దాని వెను క ఉండే ఆలోచనా ధోరణి కూడా అంత ముఖ్యమవుతుంది. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ముఖ్యమవుతుంది. ఎందుకంటే ఒక విషయం దానికదిగా పరిమితమవుతుంది. దాని వెనుక ఉండే ఆలోచనా ధోర ణి ఇంకా అనేక విషయాలను ప్రభావితం చేస్తుంది. ఆ విధంగా ఈ నెల 16 నాటి అసెంబ్లీ చర్చను పరిశీలించండి. ముస్లిములలోని పేదలకు రిజర్వేషన్లు హాట్ టాపిక్ అయినందున అందరి దృష్టి అందు గురించిన వాదోపవాదాలు, అంకెలు, చట్టపరమైన విషయాల చుట్టూ తిరిగి ఉండవచ్చు. అది సహజమే కూడా. కానీ ఆ వేడి తగ్గినాక సావధాన చిత్తంతో చదివి అర్థం చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. కేసీఆర్ చూపిన విశాల దృష్టి, లోతైన అవగాహన ఏమిటో అపుడుగాని మన దృష్టికి రావు. విదు ర నీతి అంటున్నది దానికే.

ఇపుడు వివరాలను చూసి ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. చర్చలోకి పోయేముందు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి అన్న మాటలు కొన్నింటిని గమనించండి.. పేదరికం, కటిక దారిద్య్రంలో ఉన్నపుడు, నిరాదరణకు గురైనపుడు కొందరిని ప్రత్యేకంగా చూడాల్సి వస్తది. దళితులు, గిరిజనులు, బీసీల్లోని అనేక కులాలు, ముఖ్యంగా ఎంబీసీ కులా లు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. మా కోసం ఏదైనా టానిక్ ఇచ్చినట్లుగా ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. వారిది సమంజసమైన కోరిక. నాగరిక సమాజం మెచ్యూరిటీతో ఆలోచించాలి. అపుడే సమాజంలో సమతుల్యత వస్తుంది. తెలివిగల సమాజం చర్చల ద్వారా ఆలోచనలు పంచుకోవటం ద్వారా ముందుకు వెళ్తుంది. కాని పక్షంలో అనాగరికంగా కొట్టుకుని, చంపుకుని, హింసకు గురవుతుంది.

విశాల దృష్టి అని పైన పేర్కొన్న దృక్పథాన్ని సూచించే మాటలు కేసీఆర్ ప్రసంగంలో మరికొన్ని ఉన్నాయి. అవి కేవలం ముస్లిం పేదల రిజర్వేషన్లు, లేదా గిరిజనుల రిజర్వేషన్లకు, మునుముందు పెంచగలమనే ఎస్సీ, బీసీ రిజర్వేషన్లకు పరిమితమైనవి కావు. అవి ఈ విధంగా ఉన్నా యి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేకరకాలుగా సమాజంలో మార్పులు వచ్చాయి. జనాభా నాలుగు రెట్లు పెరిగింది. అక్షరాస్యత పెరిగింది. హక్కుల కోసం ఆయావర్గాలు పోరాటాలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం ఉండేది. ఇపుడు పలు రాష్ర్టాల్లో ఉన్నది.. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశపు ప్రత్యేకత.

ఈ మాటలలోని దృక్పథం, అర్థాలు ఎటువంటి మార్మికత లేకుండా సూటిగా కన్పిస్తున్నవే. దేశం మారింది. సమాజం మారింది. సామాజిక తరగతులు మారాయి. పేదరికం ఇంకా విస్తృతంగా ఉంది. పేద వర్గాల కు అక్షరాస్యతల వంటి రూపాల్లో ఆధునిక అర్హతలూ పెరిగాయి. హక్కు ల కోసం, పేదరికం నుంచి బయటపడటం కోసం పోరాటాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయి అన్న ఆయన ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమా న్ని కూడా ప్రస్తావించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా నాగరిక సమాజం పరిణతి అయిన రీతిలో సామరస్యపూర్వకమైన పరిష్కారాలు కనుగొనాల ని, ఆ విధంగా ముందుకుపోవాలన్నది కేసీఆర్ చెప్పిన ఆలోచన. అట్లా చేయనట్లయితే అనాగరికంగా కొట్టుకొని, చంపుకుని, హింసకు గుర యే దుస్థితి రాగలదని కూడా హెచ్చరించారాయన.

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత అంటూ ఆ భిన్నత్వాలను బీసీలు, ఎంబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అల్పసంఖ్యాక మతవర్గాల రూపంలో ప్రస్తావించారు. వీరిలో ముస్లిం పేదల విషయాన్ని బీజేపీ వివాదాస్పదంగా మార్చచూడటంతో ఆయన, పైన చెప్పిన తన దృక్పథాన్నే ఈ అంశానికి కూడా వర్తింపజేస్తూ ప్రశ్నల రూపంలో వ్యక్తం చేసిన ఆలోచనలను గమనించండి. ముస్లిం రిజర్వేషన్లు పెంచవద్దని కొందరు వాదిస్తున్నరు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వొద్దు?

వారేం పాపం చేశారు? వాళ్లు ట్యాక్సులు కడుతలేరా? వాళ్లు దేశ పౌరులు కారా? ఈ దేశ సభ్యులు కారా? వారికి ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వొద్దు? ఎందుకు అడ్డుకుంటరు? వారిలో పేదరికం ఉంది. వాళ్లు దేశ జనాభాలో 1/5 ఉంటరు. ముస్లిం దేశాలకన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నరు. వితండవాదంతో, మతపిచ్చి పట్టుకుని, ఒక వర్గం సచ్చిపోతున్నా పట్టించుకోవద్దనడం ఎంతవరకు కరెక్టు? ఈ మాటలన్న ముఖ్యమంత్రి, రిజర్వేషన్లు పేదరికం కారణంగానే తప్ప మతం ప్రాతిపదికగా కాదని తన ప్రసంగంలో పదేపదే స్పష్టం చేశారు.

పైన పేర్కొన్న పలు అంశాలను, వాటి వెనుక గల దృక్పథాన్ని, అదే విధంగా ఏ పద్ధతిలో సమస్యల పరిష్కారం ద్వారా సమాజం, దేశం ముందుకుపోవాలి, మన భిన్నత్వంలోంచి ఏకత్వ సాధన ఏ విధంగా అన్న అవగాహనను గమనించినందువల్లనే కేసీఆర్ అనుసరించజూస్తున్నది విదురనీతి అవుతున్నది. ఈ మాటలన్నది ఆయన కావటం ఎవరికైనా ఇష్టం లేకపోతే పక్కన ఉంచండి. కాని విషయాన్ని పక్కన ఉంచలేము. అటువంటపుడు ఆయా అంశాలపైన దృక్పథంపైన మన ఆలోచనలు ఏమిటో నిర్ధారించుకోవాలి.

ఇందుకు భిన్నంగా బీజేపీ తీసుకుంటున్న వైఖరి ఏమిటి? అందువల్ల సమస్యల పరిష్కారం, ఆధునిక భారతంలో ఆయా వర్గాల ఆకాంక్షలు నెరవేరటం, భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక స్థిరత్వం, జాతి నిర్మాణం సాధ్యమయేవేనా? బీజేపీ మాటలను ఎంత జాగ్రత్తగా ఎన్నిమార్లు పరిశీలించినా వాటిలో ఈ విధమైన సమగ్ర దృక్పథమన్నదే కన్పించదు. సంకుచితమైన అధికార లక్ష్యాలు మినహా. అందుకే వారి పద్ధతిని చాణ క్య రాజకీయ నీతి అనవలసి వస్తున్నది. ఈ విధమైన చాణక్య రాజకీ యం ఎందుకోసమో వేరే చెప్పనవసరం లేదు. వారు అధికారం కోసం ప్రయత్నించటాన్ని ఎవరూ ఆక్షేపించలేరు. కాని అందుకోసం అనుసరించే పద్ధతి మన సమాజంలోని అన్నివర్గాల బాగుకు, దేశంలోని భిన్నత్వాల నుంచి ఏకత్వ సాధనకు సానుకూలంగా ఉందా లేక హానికరంగానా అన్నది ఉపేక్షించలేని విషయం. వైవిధ్యాలు గల వర్ధమాన సమాజాలలో, ముఖ్యంగా మాజీ వలస దేశాలలో, జాతి నిర్మాణాలు (నేషన్ బిల్డింగ్) ప్రపంచమంతటా పెద్ద సవాలుగా ఉన్నాయి. ఈ సవాలును నాయకత్వాలు స్వాతంత్య్రోద్యమాల కాలంలోనే అంతటా గుర్తించాయి.

పేదరికం సమస్యలు ఒకవైపు సామాజికాభివృద్ధికి, మరొక వైపు జాతి నిర్మాణాలకు సమస్యలవుతున్నాయి. సామాజిక వైవిధ్యాల భిన్నత్వం నుంచి ఏకత్వ సాధన మరొక సమస్యగా ఉంది. ఈ మూడు విధాలైన ప్రశ్నలను పరిణతి గల రీతిలో పరిష్కరించుకుని ముందుకుపోలేక, కేసీఆర్ మాటలలో చెప్పాలంటే, అనాగరికంగా కొట్టుకొని, చంపుకుంటు న్న సమాజాలు అనేకం ఉన్నాయి. బీజేపీ చాణక్యం ఇటువంటి పరిస్థితులకే దారితీయగలదు తప్ప, వారు స్వయంగా తమకు ఎంతో ప్రియమైనదిగా చెప్పుకునే జాతి నిర్మాణానికి మాత్రం కాదు. కనుక వారు విదురనీతికి మారటం అవసరం.

చర్చలో ముందుకువచ్చిన రెండు ఫిలాసఫీలలో ఇది ఒకటి అనుకుం టే, రెండవది రాష్ర్టాలలో గల భిన్నమైన వాస్తవాలను కేంద్రం గురించి గౌరవించకుండా అధికారాలను తన చేతిలో కేంద్రీకరించటం. అదే ఈ రిజర్వేషన్ల విషయంలోనూ లోగడ యూపీఏ పాలనలో, ప్రస్తుతం ఎన్డీయే హయాంలో కన్పిస్తున్నది. ముఖ్యమంత్రి ప్రస్తావించిన ఏబీసీడీ రిజర్వేషన్లు అందుకు ఒక నానుతున్న ఉదాహరణ. ఇదిపుడు ఎట్లా విశ్వరూపం దాల్చుతున్నదో కూడా సీఎం వివరించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ విధానం ఉంది. కొత్త విధానాల కోసం డిమాండ్లు వస్తున్నాయి. ఎక్కడి సామాజిక పరిస్థితులు అక్కడివి. రాజ్యాంగంలో ఇదమిత్థంగా ఏదీ లేని స్థితి. న్యాయస్థానాల తీర్పులు తేడాలుగా ఉన్నాయి. వాటిలోనే జడ్జీలు మార్పుచేర్పులకు అవకాశాలు వదిలారు. ఇవన్నీ గమనించినపుడు తమతమ పరిస్థితులను బట్టి రిజర్వేషన్ల అవకాశం రాష్ర్టాలకు ఎందుకు వదలరాదన్నది కేసీఆర్ ప్రశ్న. మరొకవిధంగా చెప్పాలం టే ఇది ఫెడరలిస్టు ప్రశ్న. దీనిపై జాతీయస్థాయిలో ఇంతవరకు దృష్టి కేం ద్రీకరించి చర్చ జరుగలేదు. జరుగవలసిన అవసరం ఉన్నది. కాలం ఇట్లాగే గడిచి ఒకరోజు అశాంతికి దారితీయకముందే పరిష్కారం కనుగొనాలనటం కూడా విదురనీతే అవుతుంది.

703
Tags
 ,