కాలం విసిరిన గాలం

Sun,September 2, 2018 11:35 PM

Kaalam-visirina-gaalam
కాలం ఎంత క్రూరమైనది..!?
బలవంతపు ఎడబాటుకు
నన్ను బానిసను చేసి
నా గతం దక్కకుండా
గర్జిస్తున్నది!
కాలం ఎంత కఠినమైనది..!?
కళ్ళముందు పురుడుపోసుకుంటున్న
అరాచకత్వానికి
నన్ను సాక్షిగా నిలిపి
తాను నవ్వుకుంటున్నది..!
కాలం ఎంత కర్కశమైనది..!?
నా వర్తమానం నాకే అందకుండా
దోబూచులాడుతూ
గమ్యం తెలియని గమనంలో
నన్ను రాయిగా, పరాయిగా
రూపాంతరీకరణం చెందే క్రమంలో
నా నుండి నన్నే విసిరి వేస్తున్నది..!
అన్యాక్రాంతుడిని చేసి ఆటాడుకుంటున్నది!
కాలం ఎంత జటిలమైనది..!?
నా భవిష్యత్తును కళ్ళ ముందు నిలిపి
అడియాశల జడివానలో నన్ను తడిపి
మోయలేని భారాన్ని
అందుకోలేని దూరాన్ని
చేరుకోలేని తీరాన్ని
వైఫల్యపు గాలాలతో ఒడిసిపట్టి
ప్రత్యక్షంగా పరాభవిస్తున్నది!
కాలం ఎంత విషపూరితమైనది..!?
చుట్టూ అల్లుకున్న అనుబంధాల
ఆనవాళ్ళని
అంతకంతకూ కనుమరుగు చేస్తూ
దర్పంగా తలయెత్తి
వికటాట్టహాసం చేస్తున్నది!
కాలం విసిరిన గాలం
ఛేదించుకొని
విషం చిమ్ముతున్న మాలిన్యపు
మనోబంధాలకు మసిపూసి
భూత, భవిష్యత్, వర్తమానాలను
గుప్పిటపట్టి
కాల ప్రవాహానికి అడ్డుకట్టవేసి
దాచిపెట్టిన నవ్వుల కిరణాలను
పంచిపెట్టడానికి
నిరాశా మేఘాలను చీల్చుకుని
భాస్కరుడినై ఉదయిస్తున్నా.. ...
- డాక్టర్ మడత భాస్కర్
89193 28582

270
Tags

More News

VIRAL NEWS