కాలానికి రంగులద్దుకోవాలి

Mon,May 25, 2015 01:37 AM

మలిసందెల మడతల్లో
ఓ మూలన దాగిన వెలుగుచుక్కల్ని
మదిపోరలతో లాగుతూ వెలికి తెచ్చుకోవాలి
జీవితచిత్రాన్ని మనమే గీసుకోవాలి !
ఉషస్సుల కోసం ఆ వంకా ఈ వంకా తిరుగుతూ
పాదాలు చీరుకుపోయినా
మనసు గీసుకుపోయినా
రుధిరపు బిందువుల రోదనా బింబాలను
భుజంపై భారమైనా మోయాలి !
వెలుగుల వేటకై వెళ్ళే బాటసారిపై
ఒక్కసారిగా గుడ్లగూబలు దాడి చేసినా
చాటునే ఉన్న గద్దలు ముక్కులు నూరుతున్నా
విదుల్చుకుని ధైర్యపు కత్తులు ఝుళిపించాలి
విజయతిలకాన్ని మనమే నుదుట దిద్దుకోవాలి !
స్వప్నాల ఛాయలు
కారుచీకట్ల వేపు తరలివెళ్తున్నా
గుండెలు పగిలే నిజాలతో
వేలకిలోల బరువుని గుండెలపై ఒత్తిపెట్టినా
సూదిమొనంత శబ్దమూ గుండె కవాటాలు
దాటి రాకుండా..ఎక్కుపెట్టాలి
వెయ్యేనుగుల మనోబలాన్ని !
పడిలేచే కెరటం చిత్రపు ఊపిరిని
ఆవాహన చేసుకోవాలి అంగాంగాల్లోనూ
ప్రభాత కిరణాలను పట్టుకోడానికి
కీళ్ళు అరిగేలా పరుగెత్తినా
ఆరారు కాలాలూ మర్దనా చేయాల్సిందే
అంతరిక్షపు చిత్రాన్ని వాకిలిలో పరుచుకోవాలి
వెన్నెల గూటిలో కాపురముండాలంటే !
- స్వర్ణలతా నాయుడు
-09958960068

294
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles