తెలంగాణలో ‘నవలా’మణులు


Mon,September 12, 2016 01:03 AM

నవలా ప్రక్రియలో తెలంగాణ రచయిత్రుల సంఖ్య పరిమితమే అయినప్పటికీ వీరి నవలల్లో ప్రజా జీవితం, సమాజ సంఘర్షణలు, ఉద్యమాలను, నిరంతర పోరాట స్ఫూర్తితో జీవిత అనుభవ లోతుల్ని స్పృశించడం చేస్తున్నారు. అంతేకాకుండా వీరు వస్తు వైవిధ్యం, శిల్పం, విలక్షణమైన శైలితో నవలా రచనలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.


తెలంగాణ గ్రామాల్లోని సామాజిక పరిస్థితుల్ని, క్రమంగా ప్రజల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని చిత్రించిన నవలలు అనేకం వచ్చాయి. ఈ కాలంలోనే రచయిత్రులు కూడా నవలలు రాయడం ప్రారంభించారు. స్త్రీల సాంఘికాభివృద్ధిని కాంక్షి స్తూ నాటి నుంచి నేటి వరకూ ఉద్యమాలు జరుగుతుండటం, స్త్రీ వాద ఉద్యమ ప్రభావంతో స్త్రీల వ్యక్తిత్వాలతో, కుటుంబంలోను, సమాజంలోనూ స్త్రీకి జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం లాంటివి రచయిత్రుల నవలల్లో చోటుచేసుకున్నాయి. అలాగే మహిళల పేరుతో వచ్చిన నవలా సాహిత్యం కూడా చెప్పుకోదగినంతగా ఉండటం విశేషం.

1950 నుంచి తెలంగాణ ఉద్యమం గురించి కథలు, నవలలు రావడం వేగాన్ని పుంజుకున్నాయి. అయితే 1960-70 దశాబ్దాన్ని తెలుగు సాహిత్యంలో మహిళా నవలల దశాబ్దంగా భావించబడిన కాలంలో స్త్రీలు కలం పట్టి తమ మనస్సులోని భావాలన్నింటిని అక్షరబద్దం చేసి విరివిగా నవలాసాహిత్య ప్రక్రియలో తమ స్థానాన్ని పటిష్ఠం చేసుకున్నారు. ఈ అపురూపమైన దశకాలలో ఘనతను సాధించిన నవలామణులు తెలంగాణ నుంచి పొల్కంపల్లి శాంతాదేవి, ఇల్లందుల సరస్వతీదేవి, మాదిరెడ్డి సులోచన, బొమ్మ వేమాదేవి లాంటి వారు నవలా వికాసంలో ఘనతను సాధించారు. అయితే మాదిరెడ్డి సులోచన, పొల్కంపల్లి శాంతాదేవి, ఇల్లందుల సరస్వతీ దేవి నవలలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, నవ్య, ప్రగతి తదితర పత్రికల్లో సీరియల్ నవలలుగా ప్రచురించబడ్డాయి.

అంతే కాకుండా 1960-80 మధ్య వెలువడిన మహిళా రచయితల రచనలు చదువుకొని ఎదుగుతున్న యువతరం బాలబాలికల్లో, స్త్రీలలో, నూతన జీవితాన్ని సాకారం చేసుకోవడానికి, తాము ఉన్నత చదువులు చదువుకోవడానికి, స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు వీరి జీవితాలను మలుపు తిప్పడంలో మహిళా రచయితల నవలలు నిర్వహించిన పాత్ర ఎనలేనిది. తెలంగాణ తొలి తెలుగు నవలా రచయిత్రి, సీతాపీరాటమ్మ నల్లగొండ జిల్లా నివాసి. వీరు 1924వ సంవత్సరంలో శోభీవతి అనే నవల రాశారు. ఆ తర్వాత కనిపించే నవలా రచయిత్రి ఇల్లందుల సరస్వతీదేవి. హైదరాబాద్‌లో స్థిరపడిన వీరు అనేక కథలు, 20 నవలలు రాయగా నీ బాంఛెన్ కాల్మొకా, పెళ్లికూతుళ్ళు, దరిచేరిన ప్రాణాలు మొదలైనవి. నీ బాంచెను కాల్మొ క్తా నవలలో తెలంగాణలో వినోభా బావే జరిపిన ఉద్యమాన్ని చిత్రించడంతో పాటు, అట్టడుగు వర్గాల వారు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను కళ్ళకు కట్టేలా వర్ణించారు. అంతేకాకుండా తెలంగాణ గొప్పతనాన్ని చాటే ఉద్దేశంతో త్యాగమూర్తులు గ్రంథాన్ని వెలువరించారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతలు.

జిలాని బాను రాసిన నవల ఐవాన్ గజల్. ఈ నవలలోని సంఘటనలు కథలోని మార్పులు బ్రిటిష్ వారి అధికారం పోయి హైదరాబాద్ సంస్థానపు రాజకీయ వ్యవస్థలోని వచ్చిన మార్పులతో ముడిపడిన పరిస్థితులను చిత్రించారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన పొల్కంపల్లి శాంతాదేవి 150కి పైగా కథలు, 60 నవలలు రాశారు. వీరి నవలా రచన 1970లో నౌకాగమనంతో ప్రారంభమయ్యింది. వీరు రచించిన నవలలు కొన్ని బాటసారి, చండీప్రియ, అష్టదళం, పెళ్లిమంటలు, మాయలేడి, సంధ్యా కళ్యాణం.. మొదలైనవి.

1935 సంవత్సరంలో శంషాబాద్‌లోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మాదిరెడ్డి సులోచన బోధనావృత్తిలో ఉండి దాదాపు 150 కథలు, 2 నాటికలు, 10 ఏకాంకిక లు, 72 నవలలు రాశారు. నవలల్లో 10 సినిమాలుగా కూడా వచ్చా యి. 1965లో జీవనయాత్ర అనే మొదటి నవలను రాశా రు. పంతులమ్మ, దేవుడిచ్చిన వరా లు, ప్రేమలు, పెళ్ళిళ్లు, న్యాయం నిదురపోయింది, తరంమారింది, జననీ జన్మభూ మిశ్చ.. మొదలగు నవలలైతే తరంమారింది (1975)అనే నవల పూర్తి తెలంగాణ మాండలికంతో పాటు నుడికారాలుతో, రెండు తరాల మధ్య భావజాల సమస్యలు తెలంగాణ సంస్కృతినీ చెప్పే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగల పాటలు, నానుడిలు ఈ నవలలో కనిపిస్తాయి.

నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ హేమాదేవి 1932లో జన్మించారు. వీరి అసలు పేరు రుక్మిణి. వీరు దేవిరమ, యమున అనే కలం పేర్లతో 1960ల నుంచి 40కి పైగా నవలలు, కథలు, విస్తృతంగా రాశారు. వీరి మొదటి నవల (1960) భావన భార్గవి, నవధాన్యాలు, లవ్‌స్టోరీ, తపస్విని, కుంకుమ పూలు, నవభారతి మొదలైనవి వీరి నవలలు. వనజ అడవి పుత్రిక నవలను 1995వ సంవత్సరంలో రాశారు. ఇది విప్లవోద్యమంలో, దళాలలో పనిచేసిన ఒక మహిళ ఆత్మకథ. వనజ (పద్మక్క) ఉద్యమ జీవితాన్ని ఈ నవలలో చక్కని శైలితో చిత్రించారు.

తెలంగాణ రచయిత్రుల్లో ముదిగంటి సుజాతరెడ్డి గారిది ప్రత్యేకమైన స్థానం. నల్లగొండ జిల్లాలోని స్త్రీ పరిశోధకుల్లో అద్వితీయులు ముదిగంటి వారు. వీరు విమర్శ, కథ, నవల, చరిత్ర వంటి అనేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. కథకురాలుగానే కాకుండా నవలాకారిణిగా ప్రసిద్ధిపొందినవీరు 1990 నుంచి కథారచన, నవలా రచన ప్రారంభించారు. మలుపు తిరిగిన రథచక్రాలు, సంకెళ్లు తెగాయి, ఆకాశానికి విభజన రేఖల్లేవ్ వీరి మూడు నవలలు. స్త్రీ, పురుషు ల సామరస్యాన్ని కాంక్షిస్తూ ఆకాశానికి విభజన రేఖల్లేవ్ అనే నవలను రాయగా, మంగలి జీవితాలను, మంగలి వృత్తిని చేసుకునే కుటుంబం నుంచి అధికార స్థాయికి ఎదుగడం, కుల సంకెళ్ళను తెంచ డం, కుల వైరుధ్యాలను సంకెళ్ళు తెగాయి అనే నవల చర్చిస్తుంది. వీరిది మలుపు తిరిగిన రథ చక్రాలు అనే నవల మొదటిది. ఇందులో 1946-86 మధ్య కాల పరిస్థితులను తెలంగాణలో ఉద్యమ పరిణామాలను చిత్రించిన కాలాన్ని గమనిస్తే నవల వెలువడటానికి సుమారు నాలుగు దశాబ్దాల కాలం పట్టిందనే విషయాన్ని గమనించదగినది.

ఇటీవలి కాలంలో ముస్లిం జీవితాలను గూర్చి అద్భుతంగా కథలు రాస్తున్న రచయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి). వాళ్ళ జీవితాలతో మమేకమై, భాషతో తాదాత్మ్యం చెంది వాస్తవికంగా ఆ జీవితాలను విశదీకరిస్తున్న రచయిత్రి. ఈమె ప్రసి ద్ధి నవల ఆమె అడవిని జయించింది. దళిత స్త్రీ కేంద్రంగా దళిత రచయిత్రి జాజుల గౌరి రాసిన నవల వొయినం. ఈ నవలలో తనదైన శిల్పంతో తెలంగాణ యాసతో దళిత జీవితాలను, దళిత స్త్రీలు వ్యవసాయ వృత్తిలో, కుటుంబంలో ఎదుర్కొనే పరిస్థితులను, అవమానాలను, కష్టాలను దాటుతూ ఎదిగిన తీరు కనిపిస్తుంది.

శాంతి ప్రబోధ రాసిన నవల జోగిని, కె.రమాదేవి (పి.చంద్) కార్మికుల జీవితం, గురించి ముఖ్యంగా సింగరేణి కార్మికుల ఆరాట పోరాటాలను అక్షరబద్దం చేశారు. దండకారణ్య విప్లవోద్యమంలో పనిచేస్తూ తన అనుభవాలను సాహిత్యం చేస్తున్నవారు సాధన. వీరు కథలతో పాటు రెండు నవలలు రాశారు. అడవిలో అన్నలు అనే పేరుతో అరుణతారలో సీరియల్‌గా వచ్చిన నవలను 1988లో సరిహద్దు పేరు తో పుస్తకాన్ని తీసుకొచ్చారు. అలాగే వీరు రాసిన మరొక నవల రాగో( (1980) గిరిజన మహిళల జీవితంతో పాటు, ఆదివాసీ స్త్రీల దుర్భరమైన జీవితాలను, అలాగే ఆదివాసీ సమాజంలో స్త్రీ ప్రాధాన్యాన్ని, పీడనను, విప్లవోద్యమంలోని సంస్కృతీ, లక్ష్యాలను ఈ నవలలో చిత్రించారు.

కిరిణ్‌బాల ఏ సీమ దానివో, అమృతలత సృష్టిలో తియ్యనిది, కె.సూర్యముఖి మనుషులు మారినవేల, జీవన చిత్రాలు అనే నవలు రాయగా.. టి.శశిరేఖ, కులానికి సమాధి, వావిలికొలను రాజ్యలక్ష్మి కూడా నవలా రచనను కొనసాగిస్తున్నారు. నవలా ప్రక్రియలో తెలంగాణ రచయిత్రుల సంఖ్య పరిమితమే అయినప్పటికీ వీరి నవలల్లో ప్రజా జీవితం, సమాజ సంఘర్షణలు, ఉద్యమాలను, నిరంతర పోరాట స్ఫూర్తితో జీవిత అనుభవ లోతుల్ని స్పృశించడం చేస్తున్నారు. అంతేకాకుండా వీరు వస్తు వైవిధ్యం, శిల్పం, విలక్షణమైన శైలితో నవలా రచనలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

1464
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles