ఓరుగల్లు పత్రికలు.. ఉద్యమ వేదికలు

Mon,May 30, 2016 01:45 AM

వరంగల్ జిల్లాలోని పాకాల గిరిజన ప్రాంతంలో 24 మంది గిరిజనులను కాల్చివేసి వారిని మిలిటరీ ట్రక్కులకు కట్టి ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వార్తను కాకతీయ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్న పి.ఎన్.స్వామిగారు పత్రికకు అందించగా ప్రచురితమైన వార్త నిజాం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.

వరంగల్ జిల్లా వివిధ ఉద్యమాలకు ఊపిరిలూదింది. అలాగే వరంగల్ జిల్లాలోని పత్రికారంగం ఉద్యమాలెన్నింటికో వేదికగా నిలిచింది. నిజాం వ్యతిరేకోద్యమం, తెలంగాణోద్యమం వంటి ప్రజాస్వామిక ఉద్యమాలెన్నింటికో వరంగల్ జిల్లాలోని పత్రికలు ఊతమిచ్చాయి. పందొమ్మిదో శతాబ్దంలో తెలంగాణలో స్వతంత్ర రచనలతో తెలుగు పత్రికలు ప్రారంభమైనవడానికి తగిన దాఖలాలు లేవు. పూర్వ హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ, ఇంగ్లీషు పత్రికలే ముందు వెలువడినట్లు తెలుస్తున్నది. ఇరవయ్యో శతాబ్దిలో తెలంగాణలో వెలువడిన మొదటి విలక్షణ మాసపత్రిక హితబోధిని. దీని తర్వాత తొమ్మిది సంవత్సరాలకు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ మరో రెండు పత్రికలు నీలగిర, తెనుగు వెలువడినాయి.

తెనుగు: వరంగల్ జిల్లా పత్రికారంగానికి పురుడుపోసిన పత్రిక ఇది. ఈ పత్రిక 1922, ఆగస్టు 27న మారుమూల ప్రాంతమైన, ఇనుగుర్తి గ్రామం నుంచి వెలువడింది. ఈ పత్రిక సంపాదకులు ఒద్దిరాజు సోదరులు. వీరు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవరంగారావు. ఎలా సేకరించేవారోగాని, నిజాం దేశ వార్తలు శీర్షికన ఆసక్తికరమైన వార్తల్ని ప్రచురించేవారు. ఇరవయ్యో శతాబ్ది తొలి దశకాల్లో వెలువడిన తెనుగు పత్రిక నిజాం దమన నీతిని పత్రికా ముఖంగా వెలువరించడంలో చూపిన తెగువ, చొరవ తర్వాతి పత్రికలకు మార్గదర్శకమైనది. తెలంగాణ సాంస్కృతిక వికాసానికి పట్టుగొమ్మగా నిలిచిన పత్రిక తెనుగు

ఆంధ్రాభ్యుదయం: వరంగల్ నుంచి 1923 సంవత్సరం జూన్ లో కోకల సీతారామ శర్మ గారు ఆంధ్రాభ్యుదయం మానస పత్రికను సాహితీ నేపథ్యంతో వెలువరించారు. దేశాభిమానం, ఆంధ్రాభిమానం సమానంగా కలిగిన పత్రిక ఆంధ్రాభ్యుదయం. ఈ పత్రికలో తెలంగాణ పట్ల తమ అభిమానాన్ని సంపాదకులు ఇలా వ్యక్తంచేశారు. ఘనత వహించిన ఈ నిజాము రాష్ట్రం నిర్జీవక్షేత్రం కాదు. ఆంధ్రులు పవిత్ర రక్తధారలు ప్రవహించిన సకర్మక్షేత్రం. ఆంధ్ర పరాక్రమ జ్యోతి వెలిగించిన దివ్యక్షేత్రం. ఈ పవిత్ర భూమినవతరించిన మహా కవుల జీవితము నాంధ్ర దీశీయులకు వెల్లడించుటయు, జీర్ణములై కాలప్రవాహమున లీనముగానున్న యుత్తమ (తాళపత్ర) రాజ గ్రంథములను, చారిత్రక సంబంధ విషయములగు తామ్ర, శిలాశాసనములను, దానపత్రము లర్జించుట నిజాం రాష్ట్ర వాసులమైన మన ఆంధ్రుల విధి అంటూ తెలంగాణ పౌరులకు కర్తవ్యబోధ చేశారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఇక్కడి ఘనమైన సారస్వత చరిత్ర పట్ల ఆంధ్రాభ్యుదయం పత్రిక ఆపారమైన ఆదరాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నుంచి వెలువడినవే శేషాద్రి రమణ కవులు రచించిన వ్యాసాలు. ఈ జంట రచయితలు నిజాం రాష్ట్ర పరిశోధనోద్యమం పేరుతో రాసిన వ్యాసాన్ని ప్రచురించినారు. ఈ వ్యాసం ఉద్యమానికి ఊతమిచ్చేదిగాను, ప్రభుత్వానికి చురకలు పెట్టే పద్ధతిలోను సాగింది

శోభ: వరంగల్ నుంచి 1947 సంవత్సరంలో ఉగాది పర్వదినాన దేవులపల్లి రామానుజరావుగారి సంపాదకత్వంలో సాహిత్య మాస పత్రికగా శోభిల్లిన పత్రిక శోభ ఈ పత్రిక ప్రారంభించే కాలానికి తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న నిజాం నిరంకుశ పాలన, ప్రజలపై అత్యాచారాలు, అరాచకత్వం మితిమీరిపోవడమే కాకుండా ప్రజలు తెలుగులో మాట్లాడుకోలేని దుస్థితి కొనసాగుతుండేది. ఇలాంటి పరిస్థితుల్లో రామానుజరావుగారు నిజాం పాలనలో ఉర్దూ ముసుగువేసిన తెలంగాణ తల్లిని విముక్తి చేయాలనే ధృడ సంకల్పంతో శోభ పత్రికను వెలువరించారు. ఈ పత్రిక ఘాటైన సంపాదకీయాల ద్వారా నిజాం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ప్రజలిన చైతన్య పరచడంలో కృతకృత్యమైనది.

కాకతీయ: ఈ పత్రిక 1948 అక్టోబర్ అనగా సర్వధారి నామ సంవత్సర దీపావళినాడు జాతీయ వారపత్రికగా వరంగల్ నుంచి పాములపర్తి సదాశివరావు, పి.వి.నరసింహారావు ఆధ్వర్యంలో రాజకీయ నేపథ్యంలో వెలువడింది. తెలంగాణలో పోలీసు చర్య తరువాత కేంద్ర ప్రభుత్వం పంపిన మిలిటరీ దళాలు నాడు మిలటరీ అధికారి సంజప్ప ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం సుబా ప్రాంతంలో తిరుగుతూ కమ్యూనిస్టులను, వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని కనిపిస్తే కాల్చివేత విధానంలో మారణకాండను సృష్టించారు. వరంగల్ జిల్లాలోని పాకాల గిరిజన ప్రాంతంలో 24 మంది గిరిజనులను కాల్చివేసి వారిని మిలిటరీ ట్రక్కులకు కట్టి ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వార్తను కాకతీయ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్న పి.ఎన్.స్వామిగారు పత్రికకు అందించగా ప్రచురితమైన వార్త నిజాం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
పత్రికలపై ఆంక్షలు కొనసాగుతున్న కాలంలో అలాంటి వార్తను ప్రచురించినందుకు 1948 సంవత్సరంలో పళనియప్పన్ అనే కలెక్టర్‌గారు పాములపర్తి సదాశివరావుగారిని రమ్మని కబురు చేశారు.

సమయపాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చే యనటాంగాలో వెళ్లి 15 నిమిషాలు వేచిచూసినా కలెక్టర్ గారు కార్యాలయానికి రాకపోవడంతో వెనక్కితిరిగి వచ్చేశారు. ఇది వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఈ విషయం తెలుసుకొన్న పళనియప్పన్ దువ్వం తాలూకుదారు (డిప్యూటీ కలెక్టర్)ను పంపించి సదాశివరావుగారిని మళ్లీ పిలిపించి అలాంటి వార్త ప్రచురణను ఖండించారు. మార్కిస్టు మేధావి అయిన సదాశివరావు గారు మొదట ముద్రించిన వార్తను, దాంతోపాటు కలెక్టర్ ఖండించిన తీరును రెండింటినీ కాకతీయ పత్రికలో మరోమారు ముద్రించారు. ఈ విధమైన వాస్తవాలను నిర్భయంగా ప్రచురిస్తూ నిజాం పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది కాకతీయ పత్రిక. ఈ పత్రిక ఆగిపోయిన చాలా కాలం తర్వాత తిరిగి పక్షపత్రికగా వి.ఎల్.నరసింహారావుగారు, పి.వి.రంగారావు ఈ పత్రికను కొంతకాలం నిర్వహించారు.
వెలుగు: జనగామ కేంద్రంగా 1952 సంవత్సరంలో మండవ మధుసూదన రావు, చౌడవరావు విశ్వనాథం గార్ల నిర్వహణలో రాజకీయ నేపథ్యంతో వెలువడి నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చిన పత్రిక వెలుగు తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వానికి నిరసనగా మండువ మధుసూదనరావుగారు మొట్టమొదటిసారిగా 1947లో జనగామ తాలూకా పోలీసుస్టేషన్ ముం దు జాతీయపతాకాన్ని ఎగురవేసి నిజాం సైనికుల చేతిలో బం దీయై సుమారు 14 నెలలు కారాగార వాసానికి గురైనారు. ప్రజల సంక్షేమం కోసం రూపొందించబడిన చట్టాలు స్వాతం త్య్రం వచ్చిన తర్వాత కొందరు స్వార్థపరుల ప్రయోజనానికి మాత్రమే ఉపయోగపడటం చూసి మండువ మధుసూదన్‌గారు బాధపడి గ్రామీణ ప్రజల్లో చైతన్యం తేవడం కోసం వెలుగు పక్ష పత్రికను వెలువరించారు.

జనధర్మ: యం.యస్.ఆచార్యగా ప్రసిద్ధులైన మాడభూషి శ్రీనివాసాచార్యగారి సంపాదకత్వంలో తేదీ 1958.28.11వ తేదీన వరంగల్ నుంచి వార పత్రిక ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలో జరిగిన ప్రతి ఉద్యామన్ని తన కలంతో ముందుకు నడిపారు యం.యస్.ఆచార్యగారు. జనధర్మ వారపత్రిక అయిప్పటికీ వార్తా ప్రచురణలో సంచలనం కలిగించింది. తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టులు అజ్ఞాతం సాగుస్తున్న ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీసులు అడవులను గాలిస్తూ పన్నెండు మంది అమాయకులను కాల్చిచంపిన సంఘటనను గూర్చి ప్రచురించిన కారణంగా మూడు రోజుల నిర్బంధానికి గురయ్యారు యం.యస్.ఆచార్యగారు. ముల్కీ ఉద్యమం, తెలంగాణ హక్కుల ఉద్యమం, స్థానిక ఉద్యోగుల పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం (1969) మొదలైన అనేకానేకమైన ఉద్యమాల్లో తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషించింది.

ఇవేకాకుండా వరంగల్ జిల్లాల వెలువడిన జై తెలంగాణ, ప్రజా తరంగం, సృజన, అదృష్టం, మానుకోట, ఏకశిల, అగ్రగామి వంటి మరెన్నో పత్రికలు వివిధ ఉద్యమాల్లో కీలకపాత్రను పోషించాయి. నేటికీ వెలువడుతున్న పత్రికలు తమ ఉద్యమ పంథాను కొనసాగిస్తున్న తీరు మరెన్నో పత్రికలకు ఆచరణయోగ్యంగా ఉందని చెప్పవచ్చు.

386
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles