గరిక మైదానం నవ్వు..

Mon,February 22, 2016 03:50 AM

కాశీం కవిత్వం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. ఉద్యమ బంధాల్ని రక్తబంధాల కన్న గాఢంగా
ప్రేమించేటట్లు చేసింది. రాజేయటమే జీవితమైనప్పుడు రహస్యమెందుకుంటుంది. విముక్తి కవిత్వాలు
రాయాల్సినదెంతో ఉన్నది. సంకెళ్ల సవ్వడిలో మన కలాలను ముంచి రాద్దాం.

కాశీం కవిత్వం సహజంగా కురిసే వర్షంలా ఉంటుంది. పారే నదిలా ఉంటుంది. మొలకెత్తే విత్తనంలా ఉంటుంది. పంటపొలం లా ఉంటుంది. ఆయన కవిత్వంలో తేమ ఎక్కువ. ఇరవై ఏళ్ల బట్టి రాసిన ఆయన కవిత్వమంతా ఒకచోట పోగుచేసి కాశీం కవిత్వం పేరుతో ఒక ఆంథాలజీ వచ్చింది. ఇందులో ప్రధానంగా విప్లవ కవిత్వం, తెలంగాణ ఉద్యమ కవిత్వం పెనవేసుకొని ఉన్నాయి. కదంతొక్కుతూ సాగిన కవితలు ఉద్యమకారుల్ని, ముఖ్యంగా ప్రజల్ని ఆలోచింపజేస్తాయి. కవిగా కాశీం కవిత్వం చేసే పని ప్రజ ల్ని ఉద్యమోన్ముఖుల్ని చేయడమే.

కాశీం పాలమూరు జిల్లాలో పేద మాదిగ వంశంలో జన్మించి తన బాధల కన్నా, తన కుటుంబ బాధల కన్నా, ప్రజలే, ప్రజల బాధలే, పోరాటాలే ప్రధానమనుకుని విరసం కవి అయ్యాడు. నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న, తెలంగాణ ఉద్యమాలు-పాట, తెలంగాణ సాహిత్య వ్యాసాలు, పొలమారిన పాలమూ రు, గుత్తికొండ, మానాల, ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం పరిశోధనా గ్రంథం వంటివి తెలంగాణ ప్రజల్ని మేల్కొల్పడానికీ, చైతన్యపరచడానికీ, కార్యోన్ముఖుల్ని చేయడనికి దోహదపడ్డాయి.

కవనయోధుడు కాశీం కవిత్వం తెలంగాణ ప్రజల కలలు ఫలింప జేసే కవిత్వమే. జమ్మిచెట్టు మీది ఆయుధాల్ని తెలంగాణ ఉద్యమానికి అందించడమే కాదు, కవిత్వం నిండా నింపాడు. తెలంగాణ కన్నీళ్లను కలంలో నింపడం ద్రోహమైతే నేను రాజద్రోహం చేయడానికి సిద్ధంఅని కాశీం కవిత్వం నేర్పుతుంది. మట్టి మను షులకు కవిత్వాన్ని పంచుతుంది. ఆయన కవిత్వం మేల్కొన్న చెట్టులా వికసించిన పువ్వులా గరిక మైదానం నవ్వులా ఉంటుం ది. నెత్తుటి సంతకాలు లేని వసంతాన్ని కలలుకనే పోరుతల్లి పాలమూరు బిడ్డగా పాలమూరు ప్రజల కన్నీళ్లను కవిత్వం చేశా డు. మానాల గ్రామాన్ని దేశపటంపై చూపుడు వేలుతో భద్రంగా చెక్కిన శిల్పం నిండా కవిత్వమే ఉన్నది. ఆయన వెలుతురు తాగిన సూర్యునిలా తెలంగాణ పుష్పించాలనీ అగ్నిశిరస్సును రాజేశాడు.

భగ్నమైన జగిత్యాల స్వప్నాల్ని పల్లెపల్లెనా చల్లాడు. ఆయన వెలివాడ స్వప్నం చేతికొక బలపం ఇవ్వబట్టే తెలంగాణ తలరాతను మార్చే ఆయుధంగా నడవగలిగాడు.నా తెలంగాణ ఎర్రమన్నుతో అలికిన ఇడుపులవాసన చూసి, రచ్చబండ బొడ్రాయి దాటి, ఊరి పొలిమెర్లో పగోడి రహస్యం చెప్పాలని పరుశురాముడి కోసం ఎదురుచూస్తోందని పౌరాణిక ప్రతీకను ఆధునికం చేసి చెప్పాడు.
తెలంగాణ ఉద్యమంలో సాగిన ఆత్మహత్యలన్నీ హత్యలే. సీమాంధ్ర పాలన మనకిచ్చిన కానుకలు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల పర్వం కాశీం తట్టుకోలేక గాయపడ్డ కన్నీళ్లు, రెప్పల కమురువాసన బొట్లుబొట్లుగా రాలిపడుతున్న ముద్దలు, ఉదయించని సూర్యునిపై వేలాడుతున్న స్వప్నాలను జ్ఞాపకం తెచ్చుకుని కుమిలి కుమిలి ఏడ్చాడు.

రాలిపడుతున్న మాంసం ముద్దలకు నాలుగక్షరాలు నేర్పే చట్టవ్యతిరేకి కావడానికి సిద్ధమయ్యాడు. బిడ్డలారాఊరులు వెలిగించిన రణభూమిలో పొద్దు ఆత్మహత్య చేసుకోలేదు. నిప్పురవ్వ చెట్టుకు వేలాడలేదు. వెలుగు పావురాలు పురుగుల మందు తాగలేదు. బిడ్డలారా! మీరు తెలంగాణలో పుట్టారని మర్చిపోవద్దనివిజ్ఞప్తి చేశాడు. కాశీం కవిత్వంలో అమరులైన వాళ్ళు నక్షత్రాలై సంభాషిస్తారు. తెలంగాణ ఉద్యమంలో రాలిపోయిన బెల్లిలలిత, ఐలన్న, శ్రీకాంత్, సుదర్శన్ ఒకరేమిటి ఎందరో కనిపిస్తారు.


ఆకు రాలుతూ వసంతాన్ని వాగ్దానం చేస్తుందనే కవి దృక్పథం తెలంగాణ ఉద్యమానికి ఓ దారి చూపింది, బాట వేసింది. ముళ్ల నూ, రాళ్లనూ ఏరివేసే గుణాన్ని నేర్పింది. కలాన్ని కత్తిగా మలచి దాన్ని కవిత్వరూపంలో పెట్టడం వల్ల విప్లవ సాహిత్యం, తెలంగాణ సాహిత్యం ఏమేరకు అడుగు తీసి అడుగు వేసిందో కాశీం కవితా సంపుటాలకు దీర్ఘ కవితలకు ముందుమాటలు రాసిన నందిని సిధారెడ్డి, ఎండ్లూరి సుధాకర్, వరవరరావు, జి.కళ్యాణరావు, దార్ల వెంకటేశ్వరరావులు రాసిన పీఠికలు చదివితే ఆయన కవిత్వలోతూ వస్తురూపాల సారం బోధపడుతుంది.

కాశీం కవిత్వం నాకు చదివినంతసేపే కాదు, ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా వెన్నెల వెలుగుల్ని తాగించింది. ఆయన మేఘానికి వేలాడుతున్న రైతు శవాన్ని కవిత్వం చేసి కవిత్వానికి కన్నీళ్లు పెట్టించాడు. ఉద్యమంలో బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లుల కన్నీళ్లు కూడా బిందువులై కవితాక్షరాల్ని తడిపేశాయి. తెలంగాణలోని కృష్ణమ్మలు, గోదారమ్మలు, తుంగభద్రమ్మలు తలవాకిటి దీపాలెందుకు పెట్టా యో చదువుతుంటే శరీరం ఓవిల్లంబుగా మారి వణికిపోతుంది. తెలంగాణ ముఖచిత్రమంతా నిషిద్ధ దుఃఖంతో ఎందు కు ముడిపడి ఉందో కాశీం కవిత్వం వేమన పద్యాల్లా విప్పిచెప్పగలిగింది.

కాశీం యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడం వల్ల తరగతి గదిలో విద్యార్థులను మంత్రముగ్దుల్ని చేసినట్లే ఆయన కవిత్వం మనల్ని చేస్తుంది. ఆయనకు డప్పు జన్మనివ్వడం వల్ల చర్మానికున్న ధ్వనితత్వం కవిత్వమై మన హృదయాన్ని స్వరపరచగలిగింది. పిట్టలు పిట్టగూళ్ళు కట్టుకున్నట్లు కాశీం కవిత్వం ఉద్యమాల గూళ్లు ఎట్లా కట్టుకోవాలో నేర్పుతుంది. కాశీం కవిత్వం గురిచూసి కొట్టాల్సిన చోట ఎట్లా కొట్టాలో నేర్పుతుంది. మనుషులు. కన్నీళ్ళు తుడుచుకుంటూ, నెత్తరులేని సంతకాల కోసం వెతుకులాటే, కాశీం కవి త్వం అని కళ్యాణ రావు అంటే, హృదయవిదారక వలస చావులు, ఉత్తేజాన్నిచ్చే విప్లవపోరాట సంప్రదాయాలు కాశీం కవిత్వంలో ప్రకృతిలో బీభత్సమూ, సౌందర్యమూ కలనేతగా కనిపించే దృశ్యాల వలె పాలమూరులో కలగలసి ఉన్న తత్వం కాశీం కవిత్వానికుందని వరవరరావు అన్నారు.

అతని జీవితమే అతన్ని ఇంతటి స్థాయికి తెచ్చిందని ఎండ్లూరి సుధాకర్ అంటే, నందిని సిధారెడ్డి ఆయన కవిత్వంలో అడుగుపెడితే అక్షరాలు తిరగబడుతున్న అలజడినీ, ఇగం పట్టిన పనిముట్టు మంట కాగుతున్న ఇగురం ధ్వనిస్తుందనీ ఆయన అనుభవం మన అనుభవంలోకి కవిత్వం ద్వారా ప్రవేశింపగలిగాడన్నారు. వరవరరావు అన్నట్లు కాశీం కవిత్వంలో ప్రకృతిలో బీభత్సమూ, సౌందర్యమూ కలనేతగా కనిపించే దృశ్యాల వలే ఆయన కవనాక్షరం రూపుదిద్దుకుంటుంది. కాశీం కవిత్వం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. ఉద్యమ బంధాల్ని రక్తబంధాల కన్న గాఢంగా ప్రేమించేటట్లు చేసింది. రాజేయటమే జీవితమైనప్పుడు రహస్యమెందుకుంటుంది. విముక్తి కవిత్వాలు రాయాల్సినదెంతో ఉన్నది. సంకెళ్ల సవ్వడిలో మన కలాలను ముంచి రాద్దాం. ఉద్యమ ప్రయాణం ఇంకా సుదీర్ఘంగానే ఉంది. మనకు విరామం లేదు, వెనుకడుగు లేదు.

655
Tags

More News

VIRAL NEWS