కరివేపాకే అతని ఆదాయం

Wed,August 29, 2018 11:23 PM

రోజుకు రూ. 800 వరకు సంపాదన
karvepaku
కరివేపాకు తోటతో ఒక రైతు మంచి లాభాలు గడిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కూలీల కొరత, కూరగాయల పంటల సాగుతో పెట్టుబడి ఎక్కువై చేసిన కష్టం కూడా దక్కకపోవడంతో వినూత్నంగా ఆలోచించాడు. కరివేపాకు తోట సాగుతో రోజుకు రూ. 800వరకు సంపాదిస్తున్నాడు. తనకు తోడుగా భార్య సహకారం తీసుకొని కూలీలు లేకుండానే పనిచేస్తూ ఖర్చులు పోను రూ. 800లను కూడబెట్టుకుంటున్నాడు. సిద్దిపేట ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి చెందిన వంగరి భాస్కర్‌కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అందులో కూరగాయల పంటలు సాగుచేసే వారు. పెట్టుబడులు ఎక్కువై కూలీల కొరతతో, చీడపీడలతో ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలయ్యేవారు. ఎంత కష్టించిన లాభాలు రాకపోవడంతో భిన్నంగా ఆలోచించి కరివేపాకు పంటను సాగు చేయాలనుకున్నాడు.

ఇందుకు గాను ఒడిషా రాజధాని భువనేశ్వర్ నుంచి కరివేపాకు మొక్కలను తెప్పించి ఎకరం భూమిలో నాటాడు. ఒక్కో మొక్కకు పొడవు రెండు ఫీట్లు, వెడల్పు నాలుగు ఫీట్ల ఎడంతో గుంతలు తీసి నాటా డు. సంవత్సరం అనంతరం కోతకు వచ్చింది. గత 12 ఏండ్లుగా కరివేపాకు పంటపై ఆదాయం పొందుతున్నారు. కరివేపాకును ఉదయాన్నే కోసి కట్టలు కట్టి వంటిమామిడిలోని రిలయన్స్ ఫ్రెష్ మార్కెట్‌లోకి తరలిస్తారు. ఇన్నేండ్లుగా పడ్డ కష్టం తీరడం తో వంగ భాస్కర్ కుటుంబం ఆనందంగా గడుస్తున్నది. తన భార్యతో కలిసి ఉదయా న్నే కరివేపాకును సేకరించి మార్కెట్‌కు తరలిస్తారు. డ్రిప్ పద్ధతి ద్వారా ఈ పంటను సాగుచేస్తున్నాడు. ఆకుల పై దుమ్ముధూళి ఉండకుండా శుభ్రం చేయడానికి మైక్రోస్ప్రింక్లర్లను ఏర్పాటు చేశాడు. డైరెక్టు బోరుతో డ్రిప్ ద్వారా నీటిని అందిస్తాడు. చెట్టు మొదళ్లల్లో చెదలు పట్టకుండా మందును అందించడానికి ఒక ట్యాంకును ఏర్పాటు చేసి దాని ద్వారానే చెట్టు మొదళ్లల్లోకి మందులను పంపిస్తాడు.

karvepaku2

సాగు విధానం

ముందుగా దుక్కిని నాలుగైదుసార్లు దున్ని చదును చేసిన అనంతరం రెండు ఫీట్లకు ఒకటి చొప్పున గుంతలు తీయాలి. వెడల్పు నాలుగు ఫీట్లు ఉండేలా చూసుకోవాలి. అందులో పశువుల పేడ, కాంప్లెక్స్ ఎరువుల ను కలిపి గుంతలో వేసి కరివేపాకు మొక్కలు నాటాలి. ఎకరానికి 2800మొక్కలు అవసరం అవుతాయి. అప్పుడప్పుడు కరివేపాకు పంటను ఆశించే పురుగుకు ఫినాల్‌ఫాస్, వేప నూనె రెండు కలిపి పిచికారీ చేస్తూ ఉండాలి. లేదా వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. పంట సంవత్సరంలో కోతకు వస్తుంది. ఈ సమయంలో పిండినల్లి అనే పురుగు ఆశిస్తుంటుంది. దీనికి గాను ప్రొఫెనోపాస్ మందును పిచికారీ చేయాలి. చెట్టు మొదల్లో చెదలు రాకుండా క్లోరోపైరిపాస్ మందును పిచికారీ ఉండాలి.

ఒక సంవత్సరం తర్వాత కోతకు వచ్చిన కరివేపాకు చెట్టు 12 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. మొదటి విడుతగా రూ. 50వేల వరకు ఖర్చవుతుంది. అనంతరం సస్యరక్షణ చర్యలు చేపడుతూ 12నుంచి 20సంవత్సరాల వరకు కూడా ఈ కరివేపాకు తోటపై దిగుబడిని పొందవచ్చు. కూలీల కొరత ఉండదు. తమ ఇంటి సభ్యులే ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు పనిచేసి మార్కెట్‌కు తరలిస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే కరివేపాకు సాగు ఎంతో బాగుందని వంగరి భాస్కర్, భార్య లావణ్యలు తెలిపారు.
- కాస సత్తయ్య, 9849236566

1469
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles