జీవించేహక్కును హరించవద్దు

Tue,December 11, 2018 12:57 AM

సైనికాధికారులు తాము చేపట్టిన చర్యలను తప్పుపడుతూ, విచారణ చేపట్టడాన్నీ, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయటాన్నీ తీవ్రంగా నిరసిస్తున్నారు. తమ పిల్లలనే తాము చంపుకుంటామా అని కోర్టుకు విన్నవించారు. కానీ వారి వాదనల్లోని అసంగతాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుని వారి వాదనలన్నింటినీ తిరస్కరించిది. అలాగే సైనిక బలగాలు చట్టానికి అతీతులుగా వ్యవహరించకూడదని కూడా స్పష్టంగా తేల్చిచెప్పింది.

సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టింది. ఈ చట్టం ఆధారంగా ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానంతో అనుమానితులను కాల్చిచంపే అధికారం ఆ చట్టం సైనిక దళాలకు కల్పిస్తున్నది. అయితే ఆ అధికారం ఉన్నదన్నంత మాత్రాన ప్రజల ను కాల్చిచంపే అధికారం పోలీసులు, సైనికదళాలకు ఇచ్చినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చాలాకాలంగా సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)పై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అనేక పౌర సంఘాలు, పౌరహక్కుల సంఘాలు ఈ చట్టం మాటున ప్రజలపై సైనిక బలగాలు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నాయనీ, బూటకపు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు తీస్తున్నారని ఆరోపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఈ చట్టం దుర్వినియోగం చేయబడుతున్నదని, ప్రజ లు అకారణంగా బలవుతున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మిలిటరీ, భద్రతా బలగాలపై మణిపూర్, కశ్మీర్, మరికొన్ని రాష్ర్టాల్లో నకిలీ ఎన్‌కౌంటర్లు చేశారన్న అభియోగంపై దాఖలైన ఎఫ్‌ఐఆర్ లను కొట్టివేయాలని 350 మంది మిలిటరీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలోనే సైనికల బలగాల అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టంపై తీర్పు చెబుతూ ఆ చట్టం ద్వారా భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలున్నంత మాత్రాన ప్రజలను బూటకపు ఎన్‌కౌంటర్ల పేర కాల్చిచంపే అధికారం ఇచ్చినట్లు కాదని చేయటం గమనార్హం.
ఈ సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టానిది సుదీర్ఘ చరిత్ర. శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడిన ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా పరిగణించి అక్కడ సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే చట్టం 1958లో భారత ప్రభుత్వం చేసింది. ఈ చట్టం కూడా తాత్కాలిక పరిస్థితుల నేపథ్యంలో అమల్లోకి తెచ్చిన చట్టంగా వివరణ ఇచ్చారు. నాటినుం చి నేటిదాకా అరువై ఏండ్లుగా ఆ తాత్కాలిక చట్టమే శాశ్వతంగా అమలు చేయటం ఆశ్చర్యమే. ఇదే సందర్భంగా మణిపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో అవి బూటకమైనవనే ఆరోపణలతో వాటిపై న్యాయ విచారణ జరుపటం సైనిక బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీస్తుందని పోలీసులు వాదించారు. కానీ సుప్రీంకోర్టు ఇలాంటి వాదనను తోసిపుచ్చింది. శాంతి భద్రతలను పరిరక్షించే పేర ప్రజలను బలి తీసుకోవటం ఆమోదనీయం కాదని అభిప్రాయపడింది. అలాగే శాంతిని కాపాడే పేర లైంగికదాడులు, దౌర్జన్యకాండ కొనసాగించవద్దని హెచ్చరించింది.

భద్రతా బలగాల చేతిలో అన్యాయంగా బలైన బాధిత కుటుంబాలు, హక్కుల సంఘాలు చట్ట అతిక్రమణ చర్యల ఉదంతాలను ఉటంకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.1979-2012 మధ్య మణిపూర్ రాష్ట్రం లో జరిగిన 1,528 కేసుల ఉదంతాలను వివరిస్తూ ఆ ఘటనలన్నింటిలో సైనిక బలగాలు అకారణంగా, చట్టవ్యతిరేకంగా ప్రజలను సమిధలను చేశారని వాపోయారు. ఈ ఘటనలన్నింటిపై సీబీఐతో విచారణ జరిపించి దోషులపై కఠినచర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు. దీం తో సుప్రీంకోర్టు సంతోష్ హెగ్డే అనే మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. అలాగే ఈ కమిటీలో మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ దేశంలో సైనిక బలగాలపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ చేపడుతుంది. ఈ కమిటీ పరిశీలనలో సైనిక బలగాలపై వచ్చిన ఆరోపణల ఫిర్యాదులన్నింటిలో ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని అభిప్రాయపడింది. దీంతో సుప్రీంకోర్టు అభియోగాలందిన కేసుల్లో పోలీసులు, తదితర భద్రతా బలగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటమే కాదు, వాటన్నింటిపై సీబీఐతో విచారణ చేయాలని నిర్ణయించింది. సుప్రీం నిర్ణయాలను బట్టి దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో పోలీసుల, సైనిక బలగాలు బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడిన ట్లు అనుకోవటానికి అవకాశం ఏర్పడింది.

సైనికాధికారులు తాము చేపట్టిన చర్యలను తప్పుపడుతూ, విచారణ చేపట్టడాన్నీ, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయటాన్నీ తీవ్రంగా నిరసిస్తున్నారు. తమ పిల్లలనే తాము చంపుకుంటామా అని కోర్టుకు విన్నవించారు. కానీ వారి వాదనల్లోని అసంగతాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుని వారి వాదనలన్నింటినీ తిరస్కరించిది. అలాగే సైనిక బలగాలు చట్టానికి అతీతులుగా వ్యవహరించకూడదని కూడా స్పష్టంగా తేల్చిచెప్పింది. అలాగే ప్రజలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన జీవించేహక్కుతో సహా ప్రాథమిక హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదని ప్రకటించింది. రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు సంక్రమించిన హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని ప్రకటించటం ఆహ్వానించదగ్గ పరిణామం.
markendeya
ఈ సందర్భంగా రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా హిట్లర్ నేతృత్వంలోని నాజీ అధికారులు వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును గమనంలోకి తీసుకోవాలి. 1945లో యుద్ధం సందర్భంగా నాజీ మిలిటరీ అధికారు లు మార్షల్ కీటెల్, జనరల్ జోడెల్‌లను అంతర్జాతీయ యుద్ధ నేరాల కోర్టులో విచారిం చి వారిని దోషులుగా తేల్చారు. వారు యుద్ధ సమయంలో అనుసరించిన అమానవీయ చర్యలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణించింది. వారు యుద్ధనేరాలకు పాల్పడ్డారని తేల్చింది. ఈ క్రమంలో వారు తమపై అధికారిగా ఉన్న హిట్లర్ ఆదేశాలను మాత్రమే పాటించామని చెప్పుకొంటూ నేరాలకు బాధ్యులం తాము కాదని వాదించారు. కానీ వారి వాదనలను అంతర్జాతీయ న్యాయస్థానం సమ్మతించలేదు. చట్టవ్యతిరేకమైనవి, అమానవీయమైనవి అయినట్టివి, అవి ఉన్న స్థాయిలోని ఆదేశాలైనా పాటించటం కూడా నేరమేనని అంతర్జాతీయ న్యాయస్థానం అభిప్రాయపడింది. నాజీలు చేసిన ఆ దురాగాతాల నేపథ్యంలోంచే న్యూరెంబర్గ్ సూత్రాల పేరిట ప్రపంచవ్యాప్తంగా పిలువబడుతున్నాయి. వాటినే భద్రతా బలగాల ఆచరణకు ఆదేశిక సూత్రాలుగా పరిగణిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మణిపూర్‌లో సైనిక బలగాలు పాల్పడిన దురాగతా లు, బూటకపు ఎన్‌కౌంటర్లపై విచారణను న్యాయమూర్తి మదన్ బి.లోకు ర్ వచ్చే నెలకు వాయిదా వేశారు. పౌర స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, హక్కులకు ప్రాధాన్యం ఇచ్చే లోకుర్ పౌర హక్కులకు ప్రాధాన్యం ఇస్తారనటంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే, గతంలో దత్తారాం సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బాల్‌చంద్ కేసులో జస్టిస్ కృష్ణయ్యర్ వాదనలు ఉండనే ఉన్నాయి. మరోవైపు అభిజిత్ అయ్యర్- మిత్రా కేసులో ట్విటర్‌లో వ్యంగ్యాత్మక పోస్ట్ పెట్టినందుకు న్యాయమూర్తి అతని కి బెయిల్ ఇవ్వటానికి నిరాకరించి జైలుకు పంపిన ఉదంతమూ ఉన్నది. ఏదేమైనా చట్టాల అమలు విషయంలో పౌరల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, భావ ప్రకటనా స్వేచ్ఛకే ప్రాధాన్యం ఇవ్వాలి.
-(వ్యాసకర్త: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి)

297
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles