ప్రతిభతో ఎదిగిన ప్రకాశితుడు

Fri,December 7, 2018 12:43 AM

తృప్తిగా కాళ్లు చాపుకొని విశ్రాంతి తీసుకునే నాయకుడు కాదు కేసీఆర్. యాగం చేసినంత నిష్టగా,నిబద్ధతగా, రాష్ర్టాన్ని పాలిస్తున్నాడు. ప్రపంచం నిబిడాశ్చర్యంతో చూసే విధంగా తెలంగాణ గౌరవాన్ని నిలబెడుతున్నాడు. తమ కోసం ఆరాటపడే నాయకుణ్ణి జనం వదులుకోరు. తమ గుండెల్లో పచ్చబొట్టుగా ముద్రించుకున్నారు.

నీళ్లు లేక చేన్లు, చెలకలు నెర్రలు బారి, తిండిలేని కడుపులతో ఎట్లనో బతుకాలి కదరా అని గుండెలవిసే దుఃఖాన్ని దాచుకొని బొంబాయి బస్సులెక్కి జనం పయనమైన పాలమూరు జిల్లా ఇప్పుడు ఆస్థితి దాటింది. ఒకప్పుడు ఈ జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకున్నాడు. ఊళ్ళల్లో, వాడల్లో వృద్ధులు తప్ప యువకులు కనిపించేవాళ్ళు కాదు. దత్తత తీసుకోవడం తప్ప దయచూపని నాయకత్వం ముగి సి, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన మూడేండ్లలో పొలాలు పచ్చబడటం ప్రారంభమైంది. సంక్షేమ కార్యక్రమాలతో ఊళ్ళు నిలదొక్కుకోవటం, వలసలు తీసుకెళ్లే బస్సులు తిరుగు మొహం పట్టాయి. ఉత్తుత్తి దత్తతలు తీసుకోవడం కాదు, దార్శనికత కావాలి. చెయ్యాలనే తపన కావాలి. దశాబ్దాల తరబడి సాధ్యం కానిది ఈ మూడున్నరేండ్లలో ఎలా సాద్యమైంది?
మూడున్నరేండ్లని ఎందుకన్నానంటే ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాకా ఐఏఎస్‌లను కేంద్రం కేటాయించలేదు. ఏ కార్యక్రమం చెయ్యాలని ప్రభుత్వం తలపెట్టినా ఐఏఎస్‌ల ద్వారానే అమలవుతుంది. పథకాలు, అమలుచెయ్యాలన్న ఉత్సాహం ఎంతవున్నా కాలూ, చెయ్యి ఆడని పరిస్థితిలో నాయకత్వానికి విలువైన ఒక ఏడాది వృథా అయ్యింది. కేవలం మూడున్నరేండ్లలో ఇన్ని పథకాలను పరుగులు పెట్టించడం సాహసమే. పాలనా యంత్రాంగం మీద నాయకుడికున్న పట్టుకు ఉదాహరణ ఇది.

తెలంగాణ గుండె జెండా అయిన మెగా ప్రాజెక్టు కాళేశ్వరాన్ని ఆపాల ని, అనుమతులు రాకుండా కాంగ్రెస్, చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టినా మూడేండ్లలో ముగింపు దశకు రాబోతున్నదంటే నాయకత్వానికి ఎంత అంకితభావం వుండాలి. దేశంలో వందేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పాలనలో ఎక్కడైనా ఇంత వేగంగా కట్టిన ప్రాజెక్టు ఉన్నదా? పోలవరం ప్రాజె క్టు ఎందుకు నత్తనడకన సాగుతున్నది. ప్రాజెక్టులను షో కేసుల్లో వుంచి దశాబ్దాల తరబడి దాని పేరు చెప్పి ఓట్లు గుంజడానికీ, అంచనాలు పెంచి కమీషన్లు తినడానికి వాడుకోవడం తప్ప చిత్తుశుద్ధి ఎక్కడేడ్చింది? డిజైన్ మార్చి కమీషన్లు తిన్నారని రాహుల్ అంటున్నాడు. కాంగ్రెస్ కాలంలో ప్రాజెక్టుల పేరు మీద రాష్ట్రం నుంచి కమీషన్లు సూట్‌కేసుల రూపంలో ఢిల్లీ కి అందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని మర్చిపోలేకపోతున్నాడు. తనకు దక్కవలసింది దక్కట్లేదని బాధ తట్టుకోలేక కమీషన్ అనేమాట ను పదే పదే వాడుతున్నాడనిపిస్తున్నది. ఉన్నదంతా కుమ్మరించి నిర్మించుకొంటున్న తెలంగాణ కలల సౌధం కాళేశ్వరం దానిమీద ఈగ వాలినా ఇక్కడి ప్రజలు సహించరు. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొనే దేవాలయం మన కాళేశ్వరం. దొంగ డిజైన్లతో ఎన్నటికీ పూర్తికానివ్వని దొంగల దోపిడీకి అడ్డుకట్ట వేయడమే నాయకుడు రూపొందించిన కొత్త డిజైన్. మన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రాజెక్టు అది. ఆంధ్రలో గోదావరి జిల్లాల్లో ప్రజలు ఇప్పటికీ గోదావరి ఆనకట్ట కట్టిన కాటన్ దొర ఫొటోలను పూజ గదిలో పెట్టి దండం పెట్టుకుంటారు. కాళేశ్వరం ఫలాలు అందుకున్నాక తెలంగాణ ప్రతి ఇంట శాశ్వతంగా కేసీఆర్ పటం పెట్టుకొని పూజించే రోజులు ముందున్నాయి. తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచే పేరు కేసీఆర్. లక్షలాది రైతు కుటుంబాలలో దీపం పెట్టే ప్రాజెక్టు అది. మీకు ఓటువేసి, మీకు పాలన ఇచ్చి కాళేశ్వరాన్ని చేజార్చుకునే మూర్ఖులు కాదు మా రైతులు. అన్నం పెట్టేవాడి చెయ్యి నరికే మూర్ఖులం కాదు.

ఇక్కడేదో జరిగిపోతుందని పెడబొబ్బలు పెడుతున్న చంద్రబాబు అనుభవజ్ఞుడివని పక్క రాష్ట్ర ప్రజలు గెలిపించి పాలించమని అధికారమిస్తే.. ఏం జరుగుతోందక్కడ. కిందినుంచి పైదాకా అవినీతి. నమ్మకంతో గెలిపించిన ప్రజలు అవినీతి గురించి విసిగిపోతున్నారు. దోచుకొమ్మని వదిలేశారని ఆయన పార్టీవాళ్ళే గుసగుసలాడుతున్నారు. ఇసుక దందాలో నేరస్థుల్ని పట్టుకొని నిలదీసిన మహిళా ఉద్యోగిని ఎంత హింసించారో, బెదరగొట్టారో లోకమంతా చూసింది. చివరికి బది లీ ఆమెకు మీరిచ్చిన బహుమతి. మరి, ఇక్కడ అదే ఇసుక దందాలో వేల కోట్ల అవినీతిని అరికట్టి, 20 వేల కోట్లు ప్రభుత్వ ఖాజానాకు మళ్లించిన వ్యక్తిని సమ ఉజ్జీగా పక్కనే కూర్చోబెట్టుకొని పదిమందికి పరిచయం చేస్తు న్న వ్యక్తి మా ముఖ్యమంత్రి. ఇదే మీకు, మీకూ తేడా.అక్కడ చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితుల్ని వదిలిపెట్టి ఇక్కడేం చెయ్యాలని వచ్చినట్లు? క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో అర్థం అవుతున్నదా? టీడీపీ కి చాలా బలముందని ఇక్కడ మీరు నిలబెట్టినచోట.. ఇన్నాళ్ళూ తిట్టుకున్న వాళ్లకు ఓటెయ్యాలని ఎలా చెబుతామని కాంగ్రెస్ కార్యకర్తలూ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉండి కాంగ్రెస్ వాళ్లను అర్థించడమేంటని టీడీపీ కార్యకర్తలూ స్తబ్ధుగా నిరాశగా ఉన్నారు. నాయకులు వాటేసుకున్నంతమాత్రాన జనం కలిసిపోరు. ఓటు వేయాల్సి న తటస్థులు ఎక్కువ మంది నైరాశ్యంలో ఉన్నారు. అంత అనుభవం ఉం డీ ఇంత చిన్న లాజిక్ అర్థం కాకపోవడం చిత్రం. పైగా మీరు సెటిలర్స్ కారు- సిటిజన్స్ అని కేటీఆర్, మీరు హైదరాబాదీలుగా గర్వంగా బతుకండి అని కేసీఆర్ ప్రకటించారు. ప్రశాంతంగా ఉన్న బతుకుల్ని ఎవరూ పోగొట్టుకోరు. కొత్త సమస్యలు కొని తెచ్చుకోరు. హైదరాబాద్‌లో కట్టుకున్న ప్యాలెస్ లాంటి ఇంట్లో చంద్రబాబు కూడా ఉండవచ్చు. మా ఇం ట్లో పుల్లలు పెడితేనే అభ్యంతరం.
suneetha
2004లో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చాక అనుకూల టీవీ ఛానెల్ ఒకటి చంద్రబాబును ఇంటర్వ్యూ చేసింది. అక్కడ మీరు సీఎం అయ్యా రు.., ఇక్కడ కూడా కేసీఆర్ సీఎం అవుతున్నారు.. అనగానే, ఇక్కడ కూడా మేమే వస్తాం ఈ ప్రభుత్వం ఎంత ఇంకో ఆరు నెలల్లో మేమే అని మీ సమాధానం. ఆశ్చర్యపోయాను ఎలా అని. ఆ తర్వాత మీ క్రూర ఆలోచనకు రూపమిచ్చే క్రమంలో గవర్నమెంట్‌ను పడగొట్టడానికి కుట్ర పన్ని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొన డం మొదలుపెట్టే పనిలో మీరు వాడిన రేవంత్‌రెడ్డి దొరికిపోయాడు. ప్రజ లు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మూణ్ణాళ్లలో పడగొట్టి పైశాచికానందం పొం దాలనుకున్న మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత వుందా?కేసీఆర్ నా దగ్గర పనిచేశాడు, ఎదిగాడు అని పదే పదే అనడం తెలంగాణ ప్రజలను అవమానించడమే. ఎవరి దగ్గరా జీతానికి చేరలేదు. ప్రజ లు, గౌరవించి, ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని పంపిన నాయకుడు కేసీఆర్. ప్రతిభతో ఎదిగిన స్వయం ప్రకాశితుడు. 1998లో చంద్రబాబు విజయానికి కేసీఆర్ నిర్వహించిన వ్యూహాలు, తన వాగ్దాటితో ద్వితీయశ్రేణి నాయకులను ఉత్తేజపరిచే ఉపన్యాసాలు, ప్రజల్లోకి ఉత్సాహంగా పంపించిన ట్రైనింగ్ క్లాసుల నిర్వహణా అని టీడీపీ పార్టీ పెద్దలు అనేకసార్లు చెప్పకునేవారు. నాకు తెలిసి అప్పుడే మొదలైంది ఈర్ష్య. అప్పటినుంచే అవమానాలకు గురిచేయడం మొదలైంది. ఇప్పటికీ మీకు ఆ జాడ్యం వదల్లేదు. కేసీఆర్‌కు ప్రజల్లో ఇంత పేరు వస్తుంటే మీకు నిద్ర పడుతుందా? మా ప్రజలు కూడా తెలివైన వాళ్లు మంచి నాయకులను గుండెల్లో పెట్టుకుంటారు. రాష్ట్రం వచ్చింది కదా.. తృప్తిగా కాళ్లూ చాపుకొని విశ్రాంతి తీసుకునే నాయకుడు కాదు కేసీఆర్. యాగం చేసినంత నిష్టగా, నిబద్ధతగా, రాష్ర్టాన్ని పాలిస్తున్నాడు. ప్రపంచం నిబిడాశ్చర్యంతో చూసే విధంగా తెలంగాణ గౌరవాన్ని నిలబెడుతున్నాడు. తమ కోసం ఆరాటపడే నాయకుణ్ణి జనం వదులుకోరు. తమ గుండెల్లో పచ్చబొట్టుగా ముద్రించుకున్నారు. ఆ పచ్చబొట్టు సాక్షిగా.. బలంగా, దృఢంగా, నిశ్చింతగా కారు గుర్తుకు ఓటు వేసి తమ భవిష్యత్తును నిలబెట్టుకుంటారు. కారుకూతలు కూసే వాళ్ల ను కారు కింద తొక్కేస్తారు. ఇది నిశ్చితం..! దటీజ్ తెలంగాణ!!

316
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles