మన చైతన్యమే మనకు రక్ష

Thu,December 6, 2018 10:41 PM

తెలంగాణ కాలపరీక్షకు నిలబడిన ప్రతి సందర్భంలో ఇక్క డి ప్రజల చైతన్యమే దాన్ని నిలబెట్టింది. రాష్ట్రం సాధించుకోవడమే కాదు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఈ నాలుగున్నరేండ్లలో చాలా రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం గా నిలిచింది. అలాగే విభజన సమయంలో కొంతమంది రేకెత్తించిన భయాలన్నీ వట్టి భ్రమలేనని నిరూపించాం. వలసపాలకులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల చైతన్యం ముందు చిత్తయ్యాయి. పోరాడటం మనకు కొత్తకాదు. మన ఆకాంక్ష గురించి నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించిన వాళ్ల హేళనలు మన అనుభవంలోనే ఉన్నా యి. కాబట్టి ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఈ నాలుగున్నర ఏండ్ల కాలంలో మన ప్రయోజనాల కోసం పరితపించి, మన హక్కుల కోసం పోరాడిన వారు ఎవరో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మనల్ని కొట్టడానికి వైరిపక్షం వాళ్లు మనోళ్లనే ఆయుధాలుగా ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ సమయంలో అప్రమత్తం గా ఉండాలి. ఇంకా అనేక అపరిష్కృత అంశాల పరిష్కారాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంకా చాలా పని ఉన్నది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్నది. వీటికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన వాళ్లు ఎవరు అన్నది చెప్పనక్కరలేదు.

ఏదో మన మెప్పు కోసం కొన్ని ఆపద మొక్కులు మొక్కుతారు. కానీ వాటితో మనకు ఒన గూరేది ఏమీ ఉండదు. తాత్కాలికంగా కొంతమంది చెప్పే ముచ్చట్లు మన కడుపు నింపవు. మన కష్టాలను తీర్చవు. ఈ నాలుగున్నరేండ్ల కాలంలో మనం ఎలా ముందుకు సాగామో విదితమే. ఎలాంటి గందరగోళానికి గురికావొ ద్దు. మన చైతన్యాన్ని చూపెట్టాల్సిన సందర్భం ఇది. రాష్ట్ర సాధన సమయంలో మనం అనుసరించిన మన చైతన్యాన్ని కొనసాగించాల్సిన సందర్భం వచ్చింది. మనం తీసుకునే నిర్ణయం రేపటి భవితకు బాటలు వేస్తుంది. ఎలాంటి ప్రలోభాలకు లోనుకావొద్దు. ప్రశాంతంగా ఆలోచించి మన అస్తిత్వాన్ని చాటాలి. మన చైతన్యమే మనకు శ్రీరామరక్ష.
- ఎం. మధు, హైదరాబాద్

131
Tags

More News

VIRAL NEWS