‘భూమిపుత్ర’ పార్టీయే గెలువాలె

Wed,December 5, 2018 11:01 PM

తెలంగాణ అసెంబ్లీకి రేపు జరిగే ఎన్నికలో భూమిపుత్ర పార్టీయే గెలువాలి. అటువంటి పార్టీ మాత్రమే తనకు తెలంగాణ ప్రయోజనాలు తప్ప బయటివి ఏవీ లేకుండా పాలించగలదు. ఆ విధమైన పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటే. కాంగ్రెస్, సీపీఐలకు బయటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. టీడీపీ ప్రయోజనాలు అన్నీ ఆంధ్ర ప్రదేశ్ ధనిక వర్గాలదే. వీరందరితో చేతులు కలిపి టీజేఎస్ భ్రష్టు పట్టింది. కనుక, కొత్తగా ఏర్పడి ఎదుగుతున్న తెలంగాణ తన కోసం, తనకు తానుగా, నిలబడి ముందుకుసాగాలంటే కావలసింది ప్రస్తుత భూమిపుత్ర పార్టీ పాలన కొనసాగటమే. అధికారానికి వచ్చిన వెనుక గత నాలుగున్నరేండ్ల పాలనను పరిశీలించినప్పుడు, అడుగడుగునా కన్పించేది అదే భూమి పుత్ర స్వభావం. ఈ కాలంలో జరిగిన వాటితో పాటు జరుగనివీ ఉండవచ్చు. పూర్తిగా జరిగినవేగాక పాక్షికంగా అయినవి ఉండవచ్చు. ఇంకా మొదలైనా కానివీ ఉండవచ్చు. మంచితో పాటు చెడు కూడా ఉండవచ్చు. కానీ గుర్తు పెట్టుకోవలసిన మౌలికమైన వాస్తవమేమంటే, టీఆర్‌ఎస్ తన భూమిపుత్ర స్వభావానికి, ధర్మానికి, లక్ష్యాలకు భిన్నంగా ఏదీ చేయలేదు. అది రాజకీయం, పరిపాలన, అభివృద్ధి, ఇతరులతో సంబంధాల వంటివి ఏవైనా కావచ్చు. ఎవరికివారు తమ వ్యక్తిగత ఇష్టాలను ఉంచుకుంటూనే, పైన చర్చించిన అంశాల గురించి నిష్పక్షపాతంగా ఆలోచించినట్లయితే నిజం ఏమిటో గుర్తించటం కష్టం కాదు.
cm-kcr-bhumi-putra
తెలంగాణ ప్రజలు నిజాం భూస్వామ్య వ్యవస్థపైన పోరాడింది, ఆం ధ్ర రాష్ట్రంతో కలువబోమంటూ ఫజల్ అలీ కమిషన్‌కు చెప్పింది, తమ రాష్ట్రం తమకు కావాలని రెండు విడుతలుగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు జరిపింది, వీటన్నింటి ఫలితంగా 2014లో సొంత రాష్ట్రం ఏర్పడినప్పు డు ఒక భూమిపుత్ర పార్టీని ఎన్నుకుంటూ తక్కిన అన్ని పార్టీలను తోసి రాజన్నది సరిగా ఈ దృష్టితోనే. భూమికి పైన కనిపించే ఉపరితలం కాకుండా లోపల అనేక పొరలు, వాటి అడుగున లావా సముద్రం ఉన్న ట్లే, ప్రజల్లో కూడా పైకి వ్యక్తమయే మాటలు, చేతలు గాక లోలోపల ఆలోచనలు అంతరంగాలు ఉంటాయి. అవి గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును పెనవేసుకుంటూ సాగుతాయి. వీటన్నింటి రూపమే తెలంగాణ ప్రజలు ఈ రోజున 1948కు ముందటి వందల సంవత్సరాల చరిత్రకు, 1956 నుంచి గల పదుల కొద్దీ ఏండ్ల అనుభవాలకు భిన్నమైన ఒక కొత్త జీవితాన్ని కోరుకుంటున్నారు. వారు ఇప్పుడు మరొకసారి ఓటు వేయనున్న సమయంలో, గత పర్యాయం 2014లో ఎన్నుకున్న పార్టీ పరిపాలన అటువంటి కొత్త జీవితాన్ని తమకు ఇచ్చిందా లేదా అన్నది సమీక్షించుకోవటం సహజం. అప్పుడు తాము ఎన్నుకున్నది పైన అన్నట్లు ఒక భూమిపుత్ర పార్టీని, అది తాము కోరుకున్న జీవితాన్ని ఇచ్చే దిశలో ప్రయాణిస్తున్నట్లు తమ సమీక్షలో తేలినట్లయితే అదే పార్టీకి తిరిగి పరిపాలన అప్పగిస్తారు. ఒక పీడనా స్థితినుంచి బయటపడిన దేశాలు, రాష్ర్టాలలో ఎప్పుడైనా ఇది సహజమే. తమ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించిన వారికి అధికారం అప్పగించటం, వారి పరిపాలనను బట్టి తిరిగి అధికారం ఇవ్వ టం లేదా ఇవ్వకపోవటం ఎక్కడైనా జరిగేదే. ఇందుకు తెలంగాణ మినహాయింపు కాజాలదు. అటువంటి స్థితిలో రేపటి ఓటింగ్ జరుగుతున్న ది. వారు మరొకసారి భూమిపుత్ర పార్టీని ఎన్నుకోవాలా, అట్లా ఎన్నుకునేందుకు తగిన ఆమోదాన్ని ఆ పార్టీ ప్రజల నుంచి సంపాదించిందా ఏదా అన్నది ప్రశ్న.

ఒకవిధంగా చెప్పాలంటే ఈ ఎన్నిక, తెలంగాణ ప్రజ లు బయటి పార్టీల వైపు మళ్లుతారా అనేదానికన్న కూడా ఎక్కువగా, భూమిపుత్ర పార్టీ వెంట కొనసాగుతారా లేదా అన్నదే. తాము ఎన్నుకొని అధికారం అప్పగించిన అటువంటి స్వభావం గల పార్టీ నుంచి, ఆ స్వభావం లేని పార్టీల వైపు మళ్లవలసి రావటమంటూ జరిగితే, అది ఆ భూమిపుత్ర పార్టీ కన్న తమకే ఎక్కువ బాధాకరమైనది. ఎందుకంటే, ఒక పార్టీని భూమిపుత్రగా భావించటంలో చాలా చరిత్ర, ఫిలాసఫీ ఉంటాయి. దానితో మమేకత ఉంటుంది. అది దెబ్బతినే పరిస్థితి ఎదురైతే అది ప్రజల మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. ప్రజలకు అటువంటి మమేకత, కెమిస్ట్రీ బయటివి అనుకునే పార్టీలతో ఉండవు. ఈ సుదీర్ఘమైన వివరణలు అన్నీ ఇచ్చుకున్న తర్వాత, చివరగా చెప్పవలసింది రేపటి తెలంగాణ ఎన్నికలో భూమిపుత్ర పార్టీయే గెలువాలి. దీనిపై ప్రజలు తమ సమీక్ష తాము చేసుకోవటం సహజమని పైన అనుకున్నాము. అదే సమయంలో మన సమీక్ష మనం కూడా చేసుకోవలసిన అవసరం ఉంది. ముందుగా ఒక మాట అనుకోవాలంటే, గత నాలుగున్నరేండ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక భూమిపుత్ర పార్టీ ప్రభు త్వ స్వభావంతో వ్యవహరించింది. మరొకవైపు తక్కిన పార్టీలు అటువంటి స్వభావం ఏమీ లేకుండా ప్రవర్తించాయి. ఒక విధంగా ఆలోచించినప్పుడు, అటువంటి స్వభావం ఉండగల అవకాశం ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కు కాకుండా ఇతరులకు ఉండనే ఉండదు. ఇది సూత్రరీత్యా అంటున్నమాట. టీఆర్‌ఎస్ పూర్తిగా ఇక్కడి పార్టీ పుట్టుక, మనుగ డ, ఈ నేలతో, ఆ నేల మంచి చెడులతో ముడిపడి ఉన్నాయి. ఈ దేశం లో తెలంగాణ ఒక భాగం అయినందున దేశంతో సందర్భవశాత్తుగా మాత్రమే ముడి ఉంటుంది. ఆ స్థితిలో, మంచి అయినా, చెడు అయినా, మంచి చేసినా, తప్పు చేసినా, సుఖమైనా, దుఃఖమైనా ఆ పార్టీ ఈ గడ్డకు బిడ్డ వంటిది. ఇతర పార్టీలు ఆ విధంగా ఎంతమాత్రం కాదు. అవి తెలంగాణ భావోద్వేగాల్లో ఒక భాగం కాజాలవు.

పైన అన్నట్లు ఇదంతా ఒక విధంగా ఆలోచించినప్పుడు. మరొకవిధంగా ఆలోచించినప్పడు ఈ వ్యత్యాసమన్నది ఇతర పార్టీలకు పూర్తిగా తొలిగిపోకపోయినా కనీసం గణనీయంగా తగ్గిపోవాలి. కాంగ్రెస్, సీపీఐలు జాతీయపార్టీలు. అవి కట్టుబడే రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ఈ దేశంలో ఒక భాగమే గాని వేరుకాదు. రాజ్యాంగం సహకార ఫెడరలిజం గురించి చెప్తున్నది. కాంగ్రెస్ జాతీయోద్యమానికి, జాతీయ భావనలకు ప్రతీక. సీపీఐకి దేశమంతటి కార్మిక-కర్షకులు ఒకే సమానం కావాలి. కానీ ఆచరణలో ఇందుకు భిన్నంగా జరుగుతున్నది. కాంగ్రెస్‌కు తన జాతీయాధికారం, జాతీయస్థాయి ధనికవర్గాల ప్రయోజనాలు, ఆ పార్టీకి నాయకత్వం వహించే నెహ్రూ-గాంధీ కుటుంబ అధికారం తర్వాతనే ఏవైనా వస్తాయి. అందుకోసం తెలంగాణ సహా ఏ ప్రాంత ప్రయోజనాలైనా వారు బలిపెడుతారు. పెట్టారు కూడా. గత నాలుగున్నరేండ్ల కాలం జరిగింది అదే. అందుకు ఎన్ని ఉదాహరణలనైనా చూపవచ్చు. చివరకు ప్రస్తుత ఎన్నికల సమయంలోనూ వారు సీమాంధ్ర ధనికవర్గాల తెలుగు దేశం పార్టీని తెలంగాణపైన రుద్ద చూడటం అదే చెప్తున్నది. తెలంగాణకు, చంద్రబాబుకు గల బద్ధవైరం గురించి తెలిసి కూడా ఆ పనిచేయటం తెలంగాణ భావోద్వేగతకు, ప్రయోజనాలకు పూర్తి విరుద్ధం. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకు వ్యతిరేకమవుతున్నది. కాంగ్రెస్ స్వతహాగా ఇక్కడి భూమి పుత్ర పార్టీ కాదన్నది సరేసరి కాగా, ఇక్కడ ప్రయోజనాలకు కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. ప్రాజెక్టులపైన, ఉద్యోగ నియామకాలపైన కేసులు, ఇతరత్రా అభివృద్ధికి ఆటంకాల వంటివి గత నాలుగున్నరేండ్ల సవత్సరాల రికార్డు కాగా, టీడీపీతో కలిసి కూటమి ఏర్పాటు అందుకు తాజా ఉదాహరణ అవుతున్నది. ఇక టీడీపీ గురించి అయితే చెప్పనక్కరలేదు. సీపీఐ తీరు కాంగ్రెస్‌కు ఎక్కువ భిన్నంగా లేదు. సాంకేతికంగా చూసినప్పుడు టీజేఎస్ మరొక భూమిపుత్ర పార్టీ వర్గీకరణలోకి వస్తుంది. కానీ తన వ్యవహరణతో అది ఆ స్వభావాన్ని తన పుట్టుక దశలోనే కోల్పోయింది.
t-ashok
ఈ దశలోనే కోల్పోయిన తర్వాత ఇక తర్వాతి దశలలో తెచ్చుకోగలగటం పూర్తి సందేహాస్పదం. అది కూడా ఈ ఎన్నికల అనంతరం అసలు ఉనికి అంటూ నిలిచి ఉంటే. మరొకవైపున టీఆర్‌ఎస్ ఉంది. తన పుట్టుక రీత్యా, ఉద్యమకాలంలో వ్యవహరణ రీత్యా అది భూమి పుత్ర పార్టీ గాక మరొకటి కాగల అవకాశమే లేదు. అధికారానికి వచ్చిన వెనుక గత నాలుగున్నరేండ్ల పాలనను పరిశీలించినప్పుడు, అడుగడుగునా కన్పించేది అదే భూమి పుత్ర స్వభావం. ఈ కాలంలో జరిగిన వాటితో పాటు జరుగనివీ ఉండవచ్చు. పూర్తిగా జరిగినవేగాక పాక్షికంగా అయినవి ఉండవచ్చు. ఇంకా మొదలైనా కానివీ ఉండవచ్చు. మంచితో పాటు చెడు కూడా ఉండవచ్చు. కానీ గుర్తు పెట్టుకోవలసిన మౌలికమైన వాస్తవమేమంటే, టీఆర్‌ఎస్ తన భూమిపుత్ర స్వభావానికి, ధర్మానికి, లక్ష్యాలకు భిన్నంగా ఏదీ చేయలేదు. అది రాజకీయం, పరిపాలన, అభివృద్ధి, ఇతరులతో సంబంధాల వంటివి ఏవైనా కావచ్చు. ఎవరికివారు తమ వ్యక్తిగత ఇష్టాలను ఉంచుకుంటూనే, పైన చర్చించిన అంశాల గురించి నిష్పక్షపాతంగా ఆలోచించినట్లయితే నిజం ఏమిటో గుర్తించటం కష్టం కాదు. తొలి ఎన్నికలలో గెలిచిన ఒక తెలంగాణ భూమిపుత్ర పార్టీ, భవిష్యత్తు కోసం నిలదొక్కుకునేందుకు ఈ ఎన్నికలు కీలకం.

354
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles