ఆకలి లేని తెలంగాణే లక్ష్యం

Wed,November 14, 2018 11:01 PM

ఈ ఇంటర్వ్యూ ద్వారా కేసీఆర్ తన అంతరంగమేమిటో సూటిగా చెప్పారు. పాలకుడికి సత్సంకల్పం ఉండాలి. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉండాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధే ధ్యేయంగా కష్టపడాలి. పనులు చేసి చూపించాలి. ప్రజలను మెప్పించాలి. అప్పుడు ప్రజలే ఆశీర్వదిస్తారు. రేపటి ఎన్నికల్లో రుజువు కాబోతున్న వాస్తవం ఇదే.

గత నాలుగున్నరేండ్లలో ప్రతిష్ఠాత్మకమైన సాగునీటి ప్రాజెక్టులు, యాభై లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, రైతుబంధు పథకం కింద ఏటా రూ.8 వేల నగదు, మిషన్ కాకతీయ వంటి విలక్షణ పథకాలతో కర్షక హృదయాలను గెలుచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కీర్తి కిరీటంలో మరొక కలికితురా యి పొదగబడింది. సుప్రసిద్ధ జాతీయ ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ పురస్కారం ఈ ఏడాదికిగాను కేసీఆర్‌ను వరించింది. ఆ సందర్భంగా ఎకనామిక్ టైమ్స్ వారికి ఆయనో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన హృదయాన్ని విప్పి పరిచారు. ఏ పార్టీకైనా ఎన్నికల మ్యానిఫెస్టో భగవద్గీత లాంటిది. చిత్తశుద్ధి ఉన్న పాలకులు దాన్ని నిత్యం స్మరించుకుంటారు. సమీక్ష చేసుకుంటారు. ఏవై నా అమలుపరుచలేకపోతే అందుకు హేతువులు అన్వేషిస్తారు. అవసరమైతే మరిన్ని నిధులను సమీకరించుకుంటారు. ఒకవేళ కొన్నింటినైనా అమలుచేయలేకపోతే కారణాలను ప్రజలకు చెప్పుకుంటారు. అలాంటి చిత్తశుద్ధి కలిగిన పాలకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రస్థానం లో ఉంటారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక వాగ్దానాల్లో దాదాపు అన్నింటినీ అమలుచేయడమే కాదు, ఎన్నికల హామీల్లో లేనట్టి 76 పథకాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలుచేయగలిగింది. వాటిలో ప్రధానమైనవి రైతులకు ఏటా రెండు విడుతలుగా ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి సాయం అందించడం. ఈ పథకాన్ని కేవలం టీఆర్‌ఎస్ పార్టీ వారికే కాదు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెం దిన రైతులకు కూడా నిష్పక్షపాతంగా అందించడం జరిగింది. సాయం అందుకున్న ఆయా పార్టీల అభిమానులకే తెలుస్తుంది ఈ సత్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంక్షేమ పథకాలైనా అధికార టీడీపీ వారికి మాత్రమే అందుతాయనేది నిష్ఠూర సత్యం. కానీ, తెలంగాణలో తద్భిన్నంగా అన్ని కుటుంబాలకు అందుతున్నాయి. అలాగే పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మీ లేదా షాదీ ముబారక్ పథకాల కింద లక్షా నూట పదహారు రూపాయలు అందిస్తున్నారు. ఇంటింటికి తాగునీరు అందించడం కోసం మిషన్ భగీర థ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఈ పథకాలు ఇప్పుడే కాదు, మున్ముందు కూడా కొనసాగుతాయని కేసీఆర్ అనేకసార్లు విస్పష్టమైన హామీ ఇచ్చారు.

గత నాలుగేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. 17 శాతం ప్రగతిని సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఒక్క తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఇక విద్య, వైద్యరంగాల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. తొలి విడుతగా 663 గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. ఇటీవల ఈ వ్యాస రచయిత కొన్ని జిల్లాల్లో పర్యటించి గురుకుల పాఠశాలలను స్వయంగా పరిశీలించడం జరిగింది. కొన్ని గురుకుల పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల ను తలదన్నుతున్నాయి. విదేశాల్లో చదువుకోదలచిన వారికి ఇరువై లక్షల రూపాయల స్కాలర్‌షిప్ ఇవ్వడం జరుగుతున్నది. ఇంజినీరింగ్ కోర్సులు చదివేవారికి ఫీజు రీ యింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. తెలంగాణలోని ప్రతి విద్యార్థి అత్యుత్తమమైన విద్యను గడించి ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోని విధంగా ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా జీవించాలన్నదే తన ఆశయమని కేసీఆర్ ప్రకటించారు. ఇక వైద్యరంగంలో ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గర్భిణీలకు కేసీఆర్ కిట్ పథకం కింద రూ. 15 వేల విలువ గల వస్తువులను అందిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా వ్యాధి పరిశీలనా కేంద్రాలను నెలకొల్పారు. డయాలసిస్ తక్కువ ఖర్చులో చేయించుకునే ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల కంటే మిన్నగా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా కేసీఆర్ తమ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని కేంద్రం సరిగా అమలుచేయడం లేదని కేసీఆర్ తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. హైకోర్టు విభజనను నాలుగున్నరేండ్ల తర్వాత కూడా పూర్తిచేయలేకపోవడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. నీటి పంపకాలను విభజన చట్టం ప్రకారం చేయడం లేదని, వ్యక్తిగతంగా కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎకనామిక్ టైమ్స్ పురస్కారం తమకు దక్కడం పట్ల సంతో షం వ్యక్తంచేస్తూ ఈ పురస్కారం తనకు కాదని, తెలంగాణ రాష్ర్టానికని కేసీఆర్ వినమ్రంగా ప్రకటించారు.

భారతదేశంలో పరిపాలన కొత్త పుంత లు తొక్కాలని, సంప్రదాయ విధానాలను కాకుండా, ఆధునిక పద్ధతులతో దేశాన్ని అభివృద్ధి చేయాలని, బడ్జెట్స్ రూపకల్పన చేసే విధానం కూడా మారాలని, దేశాభివృద్ధిలో రాష్ర్టాల పాత్ర మరింత పెరుగాలని, రాష్ర్టాలకు మరిన్ని హక్కులు, స్వేచ్ఛ ఉండాలని, ప్రధాని అధ్యక్షుడిగా, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఏర్పాటుచేసుకున్న నీతి ఆయోగ్‌ను టీమ్ ఇండియాగా పిలువాలని, దేశాభివృద్ధే లక్ష్యంగా నీతి ఆయోగ్ పని చేయాలని కేసీఆర్ అభిలషించారు. తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసిన తెలంగాణ స్టేట్ ఐ పాస్ ఇండ స్ట్రియల్ పాలసీ మంచి ఫలితాలను ఇచ్చిందని, 8330 కొత్త పరిశ్రమలు తెలంగాణలో దరఖాస్తు చేశాయని, వీటిలో ఆరువేల పరిశ్రమలు ప్రారం భమయ్యాయని, తద్వారా ఎనిమిదిన్నర లక్షల మందికి ఉపాధికి దొరికిందని, వీటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలని కేసీఆర్ సగర్వం గా ప్రకటించారు. అవినీతిని తగ్గించడం ద్వారా పారిశ్రామికవేత్తలతో నమ్మకాన్ని కలిగించామని, ప్రభుత్వం ప్రారంభించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి విదేశాల్లో సైతం ప్రశంసలు లభించాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక తన ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల గూర్చి ముచ్చటి స్తూ గత యాభై రెండు మాసాల్లో రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలపాటు అందించామని, రైతు సమన్వయ సమితిలు ఏర్పాటుచేశామని, మార్కెటింగ్ కమిటీల్లో వెనుకబడిన వర్గాల మహిళలకు సమున్నత స్థానం కల్పించామని, రైతులకు సంబంధించిన భూముల రికార్డులను ప్రక్షాళన చేశామని, రైతు బీమా పథకం కింద రైతులకు రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కలిగించామని, ఆసరా పథకం కింద పింఛ న్లు అందిస్తున్నామని, మైనార్టీ సంక్షేమానికి విశేషమైన కృషి చేశామని కేసీఆర్ మెరుస్తున్న నయనాలతో చెప్పారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయేకు, యూపీఏకు మెజార్టీ రాదనీ, ప్రాంతీయ పార్టీలే కీలక భూమికను పోషిస్తాయని, తమ పార్టీకి పదహారు స్థానాలు లభిస్తాయని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. తమకు ఏ ఒక్క వ్యక్తి, ప్రాంతం పట్ల అసూయాద్వేషాలు లేవని, తెలంగాణలో జీవించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అని కేసీఆర్ మరోసారో స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నారని, ఎవరిమీదా దౌర్జన్యాలు జరుగలేదని కేసీఆర్ చెప్పారు.
m-mohana-rao
అవసరార్థులకు రుణాలు, అప్పులు ఇవ్వడాన్ని భారంగా పరిగణించరాదని, దాన్ని పెట్టుబడిగా భావించాలని కేసీఆర్ తెలిపారు. అప్పులు చేసినా, వాటిని సద్వినియోగం చేసి అభివృద్ధిని సాధించవచ్చని కేసీఆర్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా కేసీఆర్ తన అంతరంగమేమిటో సూటిగా చెప్పారు. పాలకుడికి సత్సంకల్పం ఉండాలి. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉండాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధే ధ్యేయంగా కష్టపడాలి. పనులు చేసి చూపించాలి. ప్రజలను మెప్పించాలి. అప్పుడు ప్రజలే ఆశీర్వదిస్తారు. రేపటి ఎన్నికల్లో రుజువు కాబోతున్న వాస్తవం ఇదే.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

336
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles