నీళ్లు సాధించడమే సారుకు నివాళి

Tue,November 13, 2018 10:59 PM

కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం అంతర్రాష్ట్ర విభాగం ఇంజినీర్లు, లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన బతికుంటే ఈ కృషిలో తాను కూడా భాగస్వామి అయ్యేవారు. ఆయన కోరిక తీర్చడమే తెలంగాణ రాష్ట్రం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి.
vidyasagar-rao
2016లో మేము అడ్వైజరీ విద్యాసాగర్‌రావు సార్‌తో సార్ మీరు నీళ్ళు నిజాలు-3 పుస్తకం తేవాలి. మేము ఎంత రాసి నా మీరు చెప్తేనే దానికి ఒక స్పష్టత, ప్రామాణికత ఉంటుంది. ప్రజలకు అర్థమయ్యేవిధంగా మీరైతేనే రాయగలుగుతారు అని అడిగాం. దానికి విద్యాసాగర్‌రావు గారు అవునయ్యా, ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది, జరుగుతున్న అన్ని ఇరిగేషన్ అంశాలపై మాకు, ప్రజలకు అవగాహన కల్పించేవిధంగా ఒక పుస్తకం రాయాలి సార్ అని అడుగుతున్నారు, కానీ నాకు ఆరోగ్య రీత్యా అప్పటంత ఓపిక ఉండటం లేదు, సాధ్యమయ్యేట్టు లేదయ్యా అన్నారు. అప్పుడు మేం, సార్ మీకు వీలున్నప్పుడల్లా మీరు చెప్తుంటే రికార్డు చేసుకుని తర్వాత దాన్ని టైపు చేస్తాం అట్లా మీకు ఎక్కువ శ్రమ ఉండదు అంటే, దానికి సరే అని ఒప్పుకున్నారు. ఆఫీసులో అయితే డిస్ట్రర్బ్ ఉంటుంది, కాబట్టి ఇంట్లోనే కూర్చుందామ న్నారు. సార్ ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే విజయ్ కుమార్‌ను తన దగ్గర పర్సనల్ సెక్రెటరీగా నియమించుకున్నారు. విజయ్‌ఆయన దగ్గర పీఎస్‌గా పని చేస్తున్నాడు కనుక విజయ్ సార్ మాటలను రికార్డ్ చేసే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. ప్రతీ ఆదివారం హబ్సిగూడలో సార్ ఇంట్లో రికార్డ్ చేయాలని సంకల్పించాం. మొదటి భాగం రికార్డింగ్ 2016, అక్టోబర్ 4న మొదలు పెడుదామని నిర్ణయం జరిగింది. ఈ రికార్డింగ్ మొదలుపెట్టడానికి ఒకరోజు ముందు సచివాలయం ఆఫీస్‌లో మాతో తన ప్లాన్‌ను వివరించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలియజేయాలి. వాళ్లు తెలంగాణ వచ్చింది ఇక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే అనుకుంటున్నారు. వాళ్లకు నీటికి సంబంధించి విభజన చట్టంలో ఏముంది? మనం అధిగమించాల్సిన అంశాలు ఇంకా ఏం ఉన్నాయి? ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతున్నది? తదితర అంశాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.

ఒక్కొక్క అంశంపై కూలంకషంగా చెప్పుదాం. అయితే మొదట ఉపోద్ఘాతంగా అన్ని విషయాలను గూర్చి కొంత అవగాహన కల్పిద్దాం. తర్వాతి భాగాలలో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగం అభివృద్ధి కోసం అనుసరిస్తున్న వ్యూహాలను, ప్రాణహిత చేవెళ్ళ, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, వరద కాలువ, కంతనపల్లి ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ ఎందుకు అవసరమైంది? వాటి వివరాలను చెబుతాను. అట్లానే కృష్ణ నదీజలాల్లో మనకు న్యాయబద్ధమైన వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు, సుప్రీంకోర్టు ముందు మన వాదనలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులో మన పోరాటం.. తదితర సంగతులు చెబుతాన న్నారు. ఆయనకు అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉన్నది, పుస్తకాలు చూస్తూ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, అనుకున్నట్టుగానే 2016, అక్టోబర్ 4న సార్ ఇంట్లో రికార్డింగ్ గంటసేపు సాగింది. మూడు నాలుగు రోజుల్లో ట్రాన్స్‌స్క్రిప్ట్ కూడా టైప్ చేసి సార్‌కు చూపించాము. దాంట్లో భాషాపరంగా చిన్నచిన్న మార్పులు సూచించారు. అయితే, సార్ ఆరో గ్యం తదితర కారణాల వల్ల ఆ తర్వాత ఆదివారాల్లో రికార్డింగ్ పరంపర కొనసాగలేదు. అన్ని అంశాలను కలిపి ఒక పుస్తకం తేవాలన్న సార్ కోరిక, మా ఆశ అట్లాగే మిగిలిపోయింది. అంతరాష్ట్ర అంశాలు, వ్యవహారాలు, ఢిల్లీలో ప్రాజెక్టుల అనుమతులు, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు, సుప్రీంకోర్టు ముందు మన వాదన లు, అఫిడవిట్ల తయారీ వంటి కీలక సబ్జెక్టులు సారు ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగేవి. ఈ అంశాలపై ఫైళ్లు ఆయన చూసిన తర్వాతనే సెక్రెటరీకి, ఆ తర్వా త మంత్రి గారి ఆమోదానికి వెళ్లేవి. సాగునీటి మంత్రి హరీశ్‌రావు గారికి విద్యాసాగర్ రావు అంటే ఎనలేని గౌరవం. మంత్రి గారంటే విద్యాసాగర్‌రావు గారికి అంతే విశ్వాసం, ప్రేమ. కాబట్టి పైన చెప్పిన అంశాలపై విద్యాసాగర్‌రావు గారిదే అంతిమ నిర్ణయంగా ఉండేది. ఇక సార్ మాతో వ్యాసం రికార్డింగ్ కంటే ముందు, మాటల సందర్భంలో చెప్పిన విషయం ఒకటి మీకు తెలియజేయాల్సిన అవసరముందని భావిస్తున్నాం. ఆయన గొప్ప మనసును అది తెలియజేస్తుంది.

నాకు ఈ జీవితంలో వ్యక్తిగతంగా ఇంకా ఏమీ సాధించాల్సిందేమీ లేదు. సమాజంలో ఒక గౌరవం గుర్తింపు ఉన్నది. ముఖ్యమంత్రి గారు నాకు ఇంత ఉన్నత పదవి ఇచ్చారు. కొత్త రాష్ట్రంలో ఇరిగేషన్ దశ-దిశలో భాగస్వామినయ్యాను. అసలైతే, ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లలో పోటీచేసి కొత్త రాష్ట్రంలో మీరే ఇరిగేషన్ మంత్రిగా ఉండాలని అడిగారు. కానీ నా ఆరోగ్య రీత్యా, స్వభావ రీత్యా నాకు సాధ్యం కాదు కాబట్టి తిరస్కరించాను. అయితే ఇరిగేషన్ శాఖకు యువకుడు, కార్యదక్షుడు హరీ శ్‌రావు మంత్రిగా రావడం తెలంగాణ అదృష్టం. ఆయన నాయకత్వంలో ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. ఈ విషయంలో నేను నిశ్చింతగా ఉన్నాను. ఇకపోతే నా వ్యక్తిగత జీవితం మీకు తెలుసు. మా అబ్బాయి మంచి ఉద్యోగంలో ఢిల్లీలో ఉన్నాడు. అల్లుడు అధికారి, కేంద్ర ప్రభుత్వం లో ఉన్నతస్థాయిలో ఉన్నాడు. నాకింకేం కావాలి? ఇక నాకున్న బాధల్లా తెలంగాణ నీటి విషయమే. గోదావరిలో నీటి వాటా విషయంలో ఇబ్బంది లేదు. ప్రాజెక్టులు కట్టుకోవాల్సి ఉంది అంతే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి హరీశ్‌రావు గారు ఆ పనిలోనే ఉన్నారు. ఇక ఉన్న ఇబ్బందల్లా కృష్ణానదీ జలాల విషయంలోనే. నాకు జీవితంలో ఉన్న కోరికల్లా కృష్ణా నీటిలో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించుకోవటం ఒక్కటే. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం అంతర్రాష్ట్ర విభాగం ఇంజినీర్లు, లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన బతికుంటే ఈ కృషి లో తాను కూడా భాగస్వామి అయ్యేవారు. ఆయన కోరిక తీర్చడమే తెలంగాణ రాష్ట్రం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి. తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యాసాగర్‌రావు తెలంగాణ ఉద్యమాని కి, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి అందించిన సేవలకు గుర్తింపుగా డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టింది. ఆయన పుట్టినూరు నల్లగొండ జిల్లా (ఇప్పుడు సూర్యాపేట జిల్లా) జాజిరెడ్డిగూడెంలో ఆయన పేరు మీద ఒక సబ్ మార్కెట్ యార్డును, వారి తండ్రిగారి పేరు మీద ఒక కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నది.
sridhar-rao
ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్, తెలంగాణ సెంటర్ వారు విద్యాసాగర్‌రావు గారి జన్మదినం నవంబర్ 14న తెలంగాణ ఇరిగేషన్ డే గా నిర్వహిస్తున్నారు. ఇది కూడా విద్యాసాగర్ రావు గారికి దక్కిన గొప్ప గౌరవంగా మేం భావిస్తున్నాం. విద్యాసాగర్ రావు గారి పేరుని చిరస్థాయిగా, సమున్నతంగా నిలబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అందుకు సహకరించిన సాగునీటి మంత్రి హరీశ్ రావు గారికి, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్, తెలంగాణ సెంటర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నీళ్ళు-నిజాలు రెండో భాగాన్ని ప్రచురించిన తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ సంయుక్తంగా నీళ్ళు-నిజాలు మూడవ భాగాన్ని కూడా ప్రచురిస్తున్నాయి. వారు ఈ పుస్తక సంపాదక బాధ్యతలు మాకు అప్పజెప్పినందుకు గర్వపడుతున్నాం. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
(నేడు ఆర్.విద్యాసాగర్‌రావు గారి జయంతి)

463
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles