వైదిక విజ్ఞాన చక్రవర్తి

Sat,October 13, 2018 11:12 PM

ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలపై రఘునాథాచార్యస్వామి నిక్కచ్చిగా ఉండేవారు. భద్రాచల ఆలయ ఆచార వ్యవహారాలపై ఆరోపణలు చేస్తూ అంతరాలయంలో బైఠాయించిన శైవ పీఠాధిపతి తీరును ఆయన తీవ్రంగా అక్షేపించారు. భద్రాద్రి ఆలయంపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని, ఒక పీఠానికి అధిపతి మరో క్షేత్రానికి వచ్చి అనాలోచితంగా మాట్లాడటం సరికాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంతరాలయంలో నిరసన తెలుపడంపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
nallan
పుంభావ సరస్వతిగా, కదిలే వైదిక విజ్ఞాన సర్వస్వంగా, నడిచే ప్రాచ్య విజ్ఞాన భాం డాగారంగా, సంస్కృత ద్రావిడ వేదాంతాలకు మహాసముద్రంగా ప్రఖ్యాతి పొందిన డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి 93 సంవత్సరాల ప్రాయంలో శనివారం అక్టోబర్ 13వ తేదీ ఉదయం 7-30 గంటల సమయంలో శ్రీవైకుంఠానికి చేరారు. ఉభయ వేదాంత ప్రవర్తక అయిన రఘునాథాచార్య స్వామి తర్క, వ్యాకరణ సాహిత్య, మీమాంసాది శాస్ర్తాలను గురించి శ్రీభాష్య భగవద్విషయాది సంప్రదాయ రహస్య గ్రంథాలను గురించి లోతుగా అధ్యయనం చేసిన పండితుల్లో కనిష్ఠికాధిష్ఠితులు. శ్రీవిష్ణు సహస్రనామ స్ర్తోత్రముపై పరాశరభట్టరు రచించిన భగవద్గుణ దర్పణం అనే సంస్కృత భాష్యానికి అతి విస్తృతమైన తెలుగు వ్యాఖ్యానాన్ని కొన్నితరాలు నిలిచేలా, తలచేలా రచించి ప్రకటించారు. సత్సంప్రదాయ పరిరక్షణ సభ సంస్థకు వ్యవస్థాపకులుగా అధ్యక్షులుగా బాధ్యతలను నిర్వర్తిస్తూ శ్రీవిష్ణు సహస్రనామ భాష్యం, కేనోపనిషత్, ఈశావాస్సోపనిషద్, కఠోపనిషద్, ఆధ్యాత్మచింత, శ్రీభాష్య వివరణం వంటి మహోన్నత గ్రంథాలను సుమా రు 60కి పైగా పాఠక జనులకు హస్తభూషణంగా అందించారు. సంస్కృత విజ్ఞాన వర్ధిని పరిషత్ సంస్థను స్థాపించి వాగ్వర్థినీ సభలను 15 రోజులకొకటి నిర్వహించడమే కాక ఉత్తరరామచరితం వ్యాఖ్యానం, సుధాలహరి స్తుతిమణిమాలిక, లక్ష్మీ సహస్రమ్, విద్వన్మనోరంజిని వంటి గ్రంథాలను ప్రకటించారు. భగవత్ కైం కర్యనిధి సంస్థను స్థాపించి 28కి పైగా శ్రీరామక్రతువులను నిర్వహించి ఎన్నో దేవాలయాల జీర్ణోద్ధరణ, శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమాలను ఉభయ వేదాంత పండితులు చేపట్టారు. శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాన్ని ఏర్పాటు చేసి గత 14 సంవత్సరాలలో 40 మంది మహా పండితులను సత్కరించారు. శ్రీ పాంచరాత్రాగమ పాఠశాలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఆలయ అర్చకులుగా, యజ్ఞాచార్యులను తీర్చిదిద్దారు.

అరుదైన వ్యక్తిత్వం: సముద్రమంత జ్ఞానాన్ని సొంతం చేసుకున్న మహా పండితులుగా గుర్తింపు పొందిననూ నిరాడంబరమైన జీవనశైలితో, భక్తి, వైరాగ్యాలు సంపూర్ణంగా కలిగిన సాధుపుంగవులుగా ప్రసిద్ధినొందారు. గురువుల వద్ద అభ్యసించిన వేదాంత విద్యలను, వైదిక విషయాలను ఆచరించి చూపిన అరుదైన విశిష్ట వ్యక్తిగా చరిత్రపుటల్లో నిలిచారు. మహోన్నత సన్మానాలు, పురస్కారాలు: శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములు, 200 మంది మహా పండితులు ఐదువేల మంది భక్తులు శోభాయాత్రగా సంచరిస్తూ శ్రీమాన్ రఘునాథాచార్యుల వారిని శ్రీశ్రీశ్రీ అష్టాక్షర జీయర్ స్వామి 2006లో ఏనుగుపై ఎక్కించి (గజారోహణ) సన్మానించారు. కనకాభిషేకం, తులాభార (1999) సన్మానాలు జరిగాయి. తిరుపతి సం స్కృత విశ్వవిద్యాలయం వారు 1998లో మహా మహోపాధ్యాయ పురస్కారాన్ని అందచేశారు. 1972 రాష్ట్రపతి పురస్కారం లభించింది. 1966లో కవిశాబ్దిక కేసరి బిరుదాన్ని, మహా పండితులచే బ్రహ్మరథ సన్మానాన్ని పొందారు. అయినా ఆయన ఏనాడు గర్వాన్ని పొందలేదు. తెలంగాణ తొలి అవతరణ దినోత్సవంలో రాష్ట్రం లో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 50 మంది నిష్ణాతులకు ప్రభుత్వం పురస్కారాలు అందించగా, సంస్కృత పండితులుగా నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు కూడా ఈ అవార్డు అందుకున్నారు. అజో విభో ఫౌండేషన్ వారి జీవిత సాఫల్య పురస్కారాన్ని, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ద్వారా ప్రథమ గోపాలోపాయన పురస్కారాన్ని, శ్రీశ్రీశ్రీ రామచంద్ర జీయర్ స్వామి ద్వారా గోపాలదేశిక, కాకతీయ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్, చెన్నై విశ్వవిద్యాలయం నుంచి లైఫ్‌టైం అచీవ్‌మెంట్ వంటి అత్యుత్తమ పురస్కారాలెన్నో ఆయన పొందారు.

శలాక విద్వత్ సమర్చన, కవిరత్న పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే అత్యుత్తమ వైదిక విజ్ఞాన ఖని, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం అందుకున్నారు. అయినా నిరాడంబరంగా గ్రంథ రచన విద్యాబోధనలతో జీవితాన్ని ఒక మహావ్రతంగా కొనసాగించిన ఆధ్యాత్మిక శిఖరం రఘునాథచార్యస్వామి. వరంగల్ నగరంలో సుమారు 15 దేవాలయాలను ప్రతిష్ఠించారు. తెలంగాణలో, ఏపీలో మరెన్నో దేవాలయాలను ప్రతిష్ఠించినారు. దక్షిణ భారత దేశంలో ఎక్కడ పండిత సభలు జరిగినా అక్కడ రఘునాథాచార్య స్వామి సభాధ్యక్షులుగా ఉండవలసినదే. తమకంటే 40,50 ఏండ్ల పైబడిన వయసు కల విద్వాంసులు ఉపన్యసించే సభలకు కూడా రఘునాథాచార్య స్వామి యే అధ్యక్షులుగా వ్యవహరించేవారు. శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల లో సింహాద్రిభాన్ వైదిక కళాశాలలో అధ్యాపకులుగా ఉద్యోగ బాధ్యలను నిర్వహిస్తూ విద్యార్థులను విద్యాంసులుగా తీర్చిదిద్దడమే కాక ప్రొఫెసర్లకు డాక్టర్లకు, జడ్జీలకు, న్యాయవాదులకు, విద్యావేత్తలకు, పండితులకు శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములకు కూడా వేదాంత విద్యను బోధించి అలుపెరుగని మహా ఆచార్యునిగా ఖ్యాతినార్జించినారు. దేవాలయాలకు, వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలకు లక్షల రూపాయలను విరాళంగా సమర్పించిన వదాన్యుల ఉత్తమదాన గుణ సంపన్నులు వీరు. విజ్ఞానానికి తగిన వ్యక్తిత్వాన్ని, భక్తి వైరాగ్యాలకు వన్నె తెచ్చేవిధంగా దాతృత్వాన్ని సంపూర్ణంగా కలిగియుండి సాహితీ రంగంలో మేరు పర్వతంగా ఎదిగి విద్యానిధిగా చరిత్రలో నిలిచిన విశిష్ట వ్యక్తి, మహామనీషి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి అనడంలో రవ్వంత అతిశయోక్తి కానరాదు.

samudrala
రఘునాథాచార్యస్వామి కృష్ణా జిల్లా గుడివాడ తాలుకాలోని మోటూరులో 1926 మే ఒకటవ తేదీన జన్మించారు. 16వ ఏట వరకు తండ్రి వద్దనే సంస్కృతం అభ్యసించారు.. ఆపై 1942 నుంచి 1945 వరకు హైదరాబాద్‌లో సీతారాంబాగ్‌లోని శ్రీ వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో చదువుకున్నారు. అనంతరం 1946లో వరంగల్‌లోని వైదిక కళాశాలలో ఆచార్యుడిగా ఉద్యోగప్రస్థం ప్రారంభించారు. అదే కళాశాలలో ప్రధానోపాధ్యాయుడిగా, వరంగల్‌లోని శ్రీ విశ్వేశ్వర సంస్కృత ఆంధ్ర కళాశాల లో సంస్కృతోపన్యాసకులుగా సేవలు అందించారు. విశేషంగా 90వ జన్మదిన వేడుకలు: 2015లో రఘునాథాచార్యస్వామివారి 90వ జన్మదినోత్సవాన్ని ఆయన వద్ద శిష్యరికం చేసిన త్రిదండి శ్రీమన్నరాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, త్రిదండి శ్రీరామచంద్రరామానుజ జీయర్‌స్వామి, త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమారరామానుజ జీయర్‌స్వామివారు స్వయంగా విచ్చేసి మూడురోజులపాటు ఘనం గా నిర్వహించారు. యాదాద్రి వివాదంపై: ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలపై రఘునాథాచార్యస్వామి నిక్కచ్చిగా ఉండేవారు. భద్రాచల ఆలయ ఆచార వ్యవహారాలపై ఆరోపణలు చేస్తూ అంతరాలయంలో బైఠాయించిన శైవ పీఠాధిపతి తీరును ఆయన తీవ్రంగా అక్షేపించారు. భద్రాద్రి ఆలయంపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని, ఒక పీఠానికి అధిపతి మరో క్షేత్రానికి వచ్చి అనాలోచితంగా మాట్లాడటం సరికాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంతరాలయంలో నిరసన తెలుపడంపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
(డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామికి నివాళిగా..)

428
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles