ఓటమి కూటమికి సూటి ప్రశ్నలు

Sat,October 13, 2018 12:44 AM

కవ్వింపు ప్రకటనలు, నవ్వుల పాలయ్యే మాటల హోరు, మీడియాలో మిడిసిపాట్ల ప్రచారం తప్ప ఇంతవరకు (2018 అక్టోబర్ 11 వరకు) స్వరూప స్వభావాలు, రంగు, రుచి, వాసనా తేలని సోకాల్డ్ మహా కూటమి తెలంగాణ రాజకీయ రంగంలో, విశేషించి ఈ ఎన్నికల రంగంలో చివరకు ఓ రెండు మూడు రోజుల్లో ఒక మృత్పిండంగా బయటపడితే ఆశ్చర్చ పడవలసిన అవసరం లేదు. ప్రసూతికి ముందే ప్రాణగండం ఎదుర్కొంటున్న కూటమి ఇది. అరువై సంవత్సరాల ఆంధ్ర పాలన దోపిడీని తెలంగాణ ప్రజలు ఎన్నడూ మరిచిపోలేరు. నాలుగున్నర సంవత్సరాల నుంచి కేంద్రంలో, పలు రాష్ర్టాలలో అట్టర్ ఫ్లాప్ షో నడుపుతున్న బీజేపీ తెలంగాణలో కూడా తన షాప్ తెరువాలనుకుంటున్నది, గొంతెమ్మ కోర్కె అంటే ఇదేనేమో!

తెలంగాణ ఉద్యమ ప్రతీక, తెలంగాణ రాష్ట్ర సాధన పతాక, తెలంగాణ జనకోటి ఆశల పేటిక, తెలంగాణ సకలజనుల నాలిక కేసీఆ ర్‌ను ఎదుర్కోవడానికి ఒక్కరి బలం చాలదన్న భయంతో ఇవి మూడు మరో నహ్‌లాలేక దహ్‌లా పార్టీలు (జాతీయ పార్టీలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, టీడీపీ) దింపుడు కళ్లం ఆశలతో, తాత్కాలికంగా, తక్షణ అవసరాల నిమిత్తం ఒక్కటవుతున్నాయంటే రణరంగంలో ప్రవేశించడానికి ముందే అవి వాటి నిర్వీర్యతను, నిస్సహాయతను, నిస్పృ హను, పరాజయ భీతిని వ్యక్తపరుస్తున్నాయన్న మాట. అందువల్లనే వాటిది నిస్సందేహంగా ఓటమి కూటమి. ఈ మూడు కూటమి పార్టీల్లో మూడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత నాలుగేండ్ల కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో (ఇందులో రెండు లోక్‌సభ ఉప ఎన్నికలు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించాయి). ఘోర పరాజయం పాలై కనీసం డిపాజిట్లయినా దక్కించుకోలేక పోయాయన్నది కాదనలేని కఠిన యదార్థం. అయినా ఇంతకాలం కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఇతర విధాల గత నాలుగేండ్లలో కొత్త రాష్ట్రం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి, సకల జన సంక్షేమానికి అన్ని రీతుల అడ్డుపడి భంగపడ్డ మూడు పార్టీలు గోముఖ వ్యాఘ్రం వలె వేషం మార్చి కూటమి రూపంలో ఎన్నికల కదనరంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నా యి.

నాడు భారత ఘోర రణానికి ముందు ఉత్తర గో గ్రహణం సమయాన భీష్మాచార్యుడు పరిణత విజ్ఞతతో వచ్చెడు వాడు ఫల్గుణుడు గెల్తుమనంగరాదు అంటూ ఎంత సమ్‌ఝాయించి చెప్పినా దుర్యోధనాదులు వినక చెడ్డారు. ఇప్పుడు ఫల్గుణ రూపంతో వస్తున్న కేసీఆర్‌ను ఎదుర్కోవడం అసాధ్యమని తెలంగాణ ప్రజలు గొంతెత్తి చెప్పినా అహంకారం ప్రకోపించిన ఆధునిక దుర్యోధనులకు, కూటమీయులకు అర్థం కావడం లేదు. ఇంతవరకు ఎవరికి ఎన్ని సీట్లో, ఎవరు పంచవలసినవి ఎన్ని కోట్లో (నోట్ల కోట్లు సుమా-తొడుక్కునే కోట్లు కాదు) తేల్చుకోలేకపోతున్న కూటమి అగ్రజులు అప్పుడే కుర్చీలో కూర్చుంటున్న పగటి కలలు కనడం విచిత్రం. ఎన్నికల రంగంలో కూటమిస్టుల అధికారదాహాన్ని పరికిస్తుంటే మిత్రుడు యాదగిరి పదే పదే చెప్పే ఆర్తగాడికి బుద్ధి తక్కువ అన్న సామెత జ్ఞాపకం వస్తున్నది. ఒకటే ఆత్రం! ఒకటే యావ! కూటమిస్టుల కళంకిత గత చరిత్ర బాగా తెలి సిన తెలంగాణ ప్రజలు, ఓటర్లు, చైతన్యవంతులు. దుర్భర ఆంధ్రుల పాలన నుంచి విముక్తి పొంది స్వరాష్ట్రం సాధించుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డది, ఎడతెగకుండా అరువై ఏండ్లు రాష్ట్రం కోసం పోరాటం జరిపింది తెలంగాణ ప్రజలకు తెలుసు.

తెలంగాణ ప్రజల స్వరాష్ట్రం కోరిక నెరవేరకుండా ఈ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం తనదైనా ఎన్నివిధాల అడ్డుకున్నది, మోసగించింది, దగా, ద్రోహం చేసింది, కల్లిబొల్లి కబుర్లు చెప్పింది, సిగ్గూ లజ్జా లేకుండా అన్ని దశల్లో ఆంధ్ర పాలక వర్గాని కి అండగా నిలిచింది, తమ పొట్టలో పొడిచింది తెలంగాణ ప్రజలకు సాకల్యంగా తెలుసు. తెలంగాణ ప్రజలు తమ కళ్లముందు జరిగిన ఈ చరిత్రను ఎన్నడూ మరిచిపోలేరు. ఇక తెలంగాణ రాష్ట్రం రాదు అని కూటమిస్టులే ఆ రోజుల్లో పిరికిమందు నూరి పోస్తున్నప్పుడు ఎందుకు రాదో చూస్త, చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న శాంతి సమర నినాదంతో బక్క పలుచటి కేసీఆర్ వజ్ర సంకల్పం చేసి గర్జించి, పదవులు, అధికారం కోసం ఎన్నడూ రాజీ పడకుండా, పలు పర్యాయాలు పదవులను, అధికారాన్ని తృణప్రాయంగా భావించి త్యాగం చేయడం వల్ల, మడమ తిప్పకుండా పద్నాలుగేండ్లు పోరాడినందువల్ల కేంద్రం దిగివచ్చిందని, స్వరాష్ట్రం అవతరించిందని తెలంగాణ ప్రజలకు తెలుసు.

తెలంగాణ రాష్ట్రం తన నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో అసంఖ్యాక ఉద్యమకారుల అశేష త్యాగాల ఫలితంగా అవతరించినప్పుడు తన జీవితానికి ఈ విజయం చాలన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తపరిచారు. అరువై ఏండ్ల పోరాటాల ఫలితంగా అవతరించిన తెలంగాణ రాష్ర్టానికి ఆయన సమర్థ నాయకత్వం అత్యావశ్యకబని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కోరడం వల్ల ఆయన అధికారం చేపట్టారు. ఈన గాచి నక్కల పాలు కావొద్దని, అష్టకష్టాలతో అవతరించిన తెలంగాణ రాష్ట్రం నక్కలు చింపిన విస్తరి కావొద్దని, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సర్వతోముఖ అభ్యుదయం సుసాధ్యమని తెలంగాణ ప్రజలు గాఢంగా భావించారు. కేంద్ర కాంగ్రెస్ పాలకుల దుష్టబుద్ధిని, ఢోకేబాజీని, ఆంధ్ర కాంగ్రెస్ పాలకుల దురహంకారాన్ని, అన్నింటిని మించి చంద్రబాబు రాత్రింబవళ్లు నడిపిన కుట్రలను అసాధారణ చాకచక్యంతో, వ్యూహ నైపుణ్యంతో, అపూర్వ ప్రజా ఉద్యమాలతో ఎదుర్కొంటూ కేసీఆర్ అకుంఠిత దీక్షతో సాధించిన తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామిక ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించింది. రాదనుకున్న తెలంగాణ రావడం అద్భుతమే.

తాము అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ వచ్చిన తెలంగాణను గద్దల వలె కబళించడానికి కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు పార్టీ జరిపి న కుట్రలు ఫలించలేదు. కేసీఆర్ అధిగమించిన అవరోధాల్లో రెండు మొండి బండరాళ్లు రెండు కమ్యూనిస్టు పార్టీలు. చైనా కోసం తన్నుకొని విడిపోయిన పార్టీలు ఇవి. ఇక్కడ ఈ రెండు పార్టీల్లో మొదటినుంచి లీడర్లు బెజవాడ వాళ్లు. అక్కడ కూర్చొని ఇక్కడ పెత్తనం చేశారు. క్యాడర్‌లు, త్యాగాలు చేసి చచ్చేవాళ్లు ఇక్కడివాళ్లు. అక్కడి వాళ్లవి మేధావుల ఫోజులు, ఇక్కడి వాళ్లవి పోరాటాల్లో చావులు. ఈ రెండింటిలో ఒక పార్టీని (సీపీఐ) తెలంగాణ కోసం ఒప్పించడానికి కేసీఆర్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి దాదాపు నలభై సార్లు వెళ్లి అభ్యర్థించారంటే ఈ పార్టీకి తెలంగాణ ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలదోషం పట్టిన సిద్ధాంతాలను బట్టీపట్టి వల్లిస్తూ తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వ్యతిరేకించిన రెండు కమ్యూనిస్టు పార్టీలు (ఇందులో ఒకటి ఓటమి కూటమిలో భిక్షాపాత్ర పట్టి మూడు సీట్ల కోసం యాచించడం వామపక్ష ఉద్యమాలకు సిగ్గుచేటు). తెలంగాణ విషయంలో బలవంతపు బ్రాహ్మణార్థం పాత్ర నిర్వహిస్తున్నాయి. రెండింటిలో ఒకటి (సీపీఐ-ఎం) ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనీసం ఆహ్వానించకుండానే అభివృద్ధి గురించి సొల్లు కబుర్లు చెబుతున్నది. ఇదం తా నిన్నమొన్న మన కళ్లముందు జరిగిన చరిత్ర, మెహంజొదారో, హరప్పా నాగరికత, ఇక్ష్వాకుల పాలన నాటి చరిత్ర కాదు.

నాలుగున్నరేండ్ల కిందట హైదరాబాద్ రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒకవంక ప్రమాణ స్వీకారం చేస్తుండగా, తమ అరువై ఏండ్ల కల నెరవేరిందని తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుతుండగా, మరోవంక అటు గాంధీభవన్‌లో, ఇటు ఎన్టీఆర్ భవన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ప్రజల చరిత్రాత్మక పోరాటాల ఫలంగా స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు బోరున ఏడ్చినవాళ్లు, ఆ శుభ క్షణాల్లోనే తెలంగాణ రాష్ర్టానికి వ్యతిరేకంగా కుట్రలు చేసినవాళ్లు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడే మాటలను విశ్వసించడానికి తెలంగాణ ప్రజలు ఇప్పుడు నాటి అమాయకులు కారు. కేంద్రంలోని కాంగ్రెస్ పాలకులు విపరీత జాప్యం, అవహేళన చేసి ఎన్నో మెలికలుపెట్టిన పిదప (తెలంగాణ రాష్ర్టానికి కొన్ని రాయలసీమ జిల్లాలను కృత్రిమంగా అతికించే కుటిల యత్నం కేవలం కేసీఆర్ ఒక్కడి, ఒకేఒక ఒక్కడి సకాల హెచ్చరిక వల్ల భగ్నమైంది) పార్లమెంట్‌లో ఏపీ విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అక్కడే ఒక గదిలో చంద్రబాబు బీజేపీ ఎల్.కె.అద్వానీపై పడి ఏడ్చాడట. ఆ ఏడుపు ఇంకా ఆగలేదు.

ఆయన బహుశా రోదన ప్రియుడు! తాను స్వయంగా చెమటోడ్చి నిర్మించిన హైదరాబాద్ నగరం నుంచి (కుతుబ్‌షాహీల, అసఫ్‌జాహీ రాజు ల ప్రామాణిక చరిత్ర రాసిన చరిత్ర పరిశోధకులు ఇతను ఎర్రగడ్డ దవాఖాన నుంచి పారిపోయి వచ్చినవాడా అని ముక్కున వేలేసుకున్నారు!). నారబట్టలతో బెజవాడ వెళ్లిపోతున్నామంటూ చంద్రబాబు పదేపదే ఏడుస్తుంటాడు. ఆయనది నిరంతర రోదన విపంచి. కాంగ్రెస్ పార్టీతో కయ్యంతో సాధించలేకపోయిన తెలంగాణ విధ్వంసాన్ని చంద్రబాబునాయుడు కాం గ్రెస్ పార్టీతో వియ్యం వల్ల సాధించాలనుకుంటున్నాడు శకుని పాత్రతో. ఓటమి కూటమిలో ప్రధాన పాత్రధారిగా, తెలంగాణ కాంగ్రెస్ నేతలను తిరి గి తాబేదార్లుగా మార్చి అరిగిపోయిన, తుప్పుపట్టిన చక్రం తిప్పాలనుకుంటున్నాడు చంద్రబాబు. ఆంధ్ర పాలకుల ముందు తలవంచి నిలిచి, అయ్యా అయ్యా అనడం తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం నేతలకు కొత్త కాదు. తెలంగాణ పేరెత్తవద్దని శాసించిన పెద్దమనిషి చంద్రబాబు.

మరో ఆంధ్ర పాలకుడు రాష్ట్ర శాసనసభ సాక్షిగా తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను పో అని హూంకరిస్తే, తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు నోరు మెదపలేదు. ఓటమి కూటమి ముసుగులో చంద్రబాబునాయుడు దాదాగిరి నడిస్తే తెలంగాణ రాష్ర్టానికి కొత్త సమస్యలు తప్పవు. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరుగలేదని చంద్రబాబు అంటాడు. ఆయన మాటలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏకీభవిస్తారా? ఓటమి కూటమి ఈ విషయాన్ని స్పష్టం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది.

మాకు ఓట్లివ్వకపోతే తెలంగాణ రాష్ర్టాన్ని తిరిగి ఆంధ్రలో కలిపేస్తాం అని ఓ తెలంగాణ ప్రముఖ నాయకుడు రెండు సంవత్సరాల కిందట వరంగల్లు లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భాన బెదిరించాడు. ఈ బెదిరింపును ఇంతవర కు కాంగ్రెస్ నేతలెవరూ ఖండించలేదు. తెలంగాణ రాష్ట్రం గత నాలుగున్న ర సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో సాధించిన ప్రగతికి భంగం కలిగించి, ప్రత్యక్షంగా, లేక పరోక్షంగా తిరి గి ఆంధ్ర పాలనను ప్రవేశపెట్టడానికే ఓటమి కూటమి వస్తున్నదా? అరువై సంవత్సరాల ఆంధ్ర పాలన దోపిడీని తెలంగాణ ప్రజలు ఎన్నడూ మరిచిపోలేరు. నాలుగున్నర సంవత్సరాల నుంచి కేంద్రంలో, పలు రాష్ర్టాలలో అట్టర్ ఫ్లాప్ షో నడుపుతున్న బీజేపీ తెలంగాణలో కూడా తన షాప్ తెరువాలనుకుంటున్నది, గొంతెమ్మ కోర్కె అంటే ఇదేనేమో!
prabhakar

472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles