బాబు నిరాశ సహజమైనది

Wed,October 10, 2018 11:04 PM

ఎవరి ప్రయోజనాలు వారివి అయినప్పుడు అందుకు తగినవిధంగా ఎవరి వ్యూహాలు వారికి ఉండటం సహజమైన విషయం. అదేవిధంగా, ఆ వ్యూహాలు నెరవేరటం సంతోషాన్నీ, నెరవేరకపోవటం అసంతృప్తినీ కలిగించటం కూడా సహజమైన విషయమే. కనుక, అంతిమ విశ్లేషణలో ఎవరేమి అన్నా అందుకు వారిని నిందించవలసింది ఏమీ లేదు. కానీ, తన వ్యూహం నెరవేరేవిధంగా వ్యవహరించనందుకు కేసీఆర్‌ను చంద్రబాబు నిందించటంలో నిజాయితీ ఏమిటో బోధపడదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు గత శనివారం నాడు అమరావతిలో మాట్లాడు తూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని తాను అక్కడి ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడైన కేసీఆర్‌కు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఆ విధంగా చేసినట్లయితే తెలుగువారికి దక్షిణాదిన పైచేయి లభించి జాతీయస్థాయిలో కూడా బలమైన శక్తి కావచ్చున ని అన్నట్లు వివరించారు. దానిపై ఆలోచించి చెప్పగలమన్న కేసీఆర్, వారం రోజుల తర్వాత అందుకు నిరాకరించారని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలని సూచించినట్లు కూడా చెప్పారు. టీఆర్‌ఎస్ కాదన్నందువల్లనే తాము కాంగ్రెస్ కూటమిలో చేరామనటం తన ఉద్దేశం. టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నదనే మాటలు కొద్ది నెలలుగా వినవస్తున్నాయి. కాని తమ మధ్య ప్రైవేట్‌గా ఏమి జరిగిందన్నది చంద్రబాబు, కేసీఆర్‌లలో ఎవరో ఒకరు ఈ మాత్రమైనా బహిరంగంగా వెల్లడించటం ఇది మొదటిసారి. ఇప్పటికైనా అన్ని విషయాలు ముందుకువచ్చాయో, ఇంకా ఏమి మిగిలి ఉన్నాయో మనకు తెలియ దు. చంద్రబాబు చెప్పిన దానిపై కేసీఆర్ స్పందించినట్లయితే మరికొంత తెలుస్తుంది. దానినట్లుంచి, చంద్రబాబు మాటలను బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్నున్నాయి. అందులో మొదటిది, అసలు పైవిధంగా పొత్తు ప్రతిపాదన చేయటంలో తన ప్రయోజనాలు, వ్యూహం ఏమిటి? ఇక్కడ మూడు కన్పిస్తున్నాయి. ఒకటి, తెలంగాణలో నానాటికి క్షీణిస్తున్న టీడీపీ ఉనికిని కాపాడుకోవటం. రెండు ఇక్కడి విజయాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరికొంత చేయి తిప్పుకోవటం. మూడు, ఈ రెండు విజయాలను వచ్చే సంవత్సరపు లోక్‌సభ ఎన్నిక ల ఫలితాలను బట్టి జాతీయస్థాయిలో తనకు అనుకూలంగా వ్యవహారం సాగించుకోగలగటం.

ఇంతకూ తెలంగాణలో టీడీపీకి ఓట్లయినా, సీట్లయినా విభజనానంతరం దేనికి? టీడీపీ తనను తాను జాతీయపార్టీగా ప్రకటించుకుంది. అటువంటి గుర్తింపు ఎన్నికల సంఘం నుంచి రావాలంటే ఒకటికన్న ఎక్కువ రాష్ర్టాల నుంచి నిర్ణీత స్థాయిలో ఓట్లు, సీట్లు తప్పనిసరి. 2014 ఎన్నికల్లో ఆ షరతు తెలంగాణలో నెరవేరింది. తర్వాతి పరిణామాలను బట్టి అది అనుమానాస్పదంగా మారింది. కనుక, ఏమి చేసైనా ఎవరితో కలిసి అయినా ఆ మేరకు ఓట్లు, సీట్లు సంపాదించాలి. లేనట్లయితే, తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎటుపోయినా టీడీపీకి జాతీయపార్టీ గుర్తింపు ఉండదు. చంద్రబాబు గుర్తింపు పొందిన జాతీయ అధ్యక్షుడు కాకుండాపోతారు. ఒకసారి తెలంగాణలో ఆ స్థితికి చేరితే ఇక భవిష్యత్తులో అది లభించటం సందేహాస్పదమే.

చంద్రబాబు శనివారం రోజున పైకి ఏమి చెప్పినప్పటికీ, రాజకీయ చదరంగపు ఎత్తుగడలు ఇంతకన్నా భిన్నంగా ఉండేందుకు వీలులేదు. ఈ సందర్భంలో, ఆయన పైకి అన్న మాటలను మరొకసారి చూద్దాం. తెలుగువారు ఒక్కటైతే దక్షిణాదిన పైచేయి, జాతీయస్థాయిలో ప్రభావం చూపవచ్చునన్నవి తన మాటలు. ఇవి పైకి వినేందుకు ఎంతో బాగానే ఉంటాయి. కానీ అర్థం చేసుకునేందుకు ఎక్కువ లోతులకు వెళ్లవలసిన అవసరం లేదు. దక్షిణాదిన పైచేయి అంటే ఏమిటి? ఎందుకోసం? ఎంత ఆలోచించినా బోధపడదు. దక్షిణాదిన గల తమిళ, కన్నడ, మలయాళీల మధ్య జాతి వైరాలు, రాజకీయ స్పర్థలు, ఆర్థిక వైరుధ్యాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయనుకుంటే అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగిన దశాబ్దాల కాలంలో ఏ విధంగా నెరవేరాయి? అందువ ల్ల సీమాంధ్ర పాలకుల ద్వారా తెలంగాణకు ఒనగూరిన లాభాలేమిటి? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి పరిపాలన, అభివృద్ధి, భవిష్యత్తు వారిది అయిన స్థితిలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య తెలంగాణలో (ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాదు మరి) మాత్రం ఎన్నికల పొత్తు కుదిరితే అసలు రెండు రాష్ర్టాలలో దేనికైనా సరే పరిపాలనాపరంగా, అభివృద్ధి పరంగా ఒనగూరే ప్రయోజనం ఏమిటి? ఆ విధంగా దక్షిణాదిన తెలుగువారిది పైచేయి అయ్యేది ఏ విధంగా? ఇది చంద్రబాబు సవివరంగా చెప్పి, అందులో సహేతుకత ఉన్నట్లయితే, ఎవరైనా ఆలోచించేందుకు ఒక ప్రాతిపదిక అంటూ ఉంటుంది. ఇంతవరకైతే అదేమీ లేదు మరి. అటువంటి స్థితిలో రెండు పార్టీల పొత్తును కేసీఆర్ అంగీకరించినా తెలంగాణ ప్రజలు ఆమోదించగల స్థితి లేదు. రెండవది, తెలుగు వారికి జతీయస్థాయిలో సానుకూల స్థితి ఏర్పడటం. దీని అర్థమేమిటో కూడా తెలియటంలేదు. రెండు రాష్ర్టాలు ఉమ్మడిగా ఉండి, ప్రయోజనాలు ఉమ్మడివి అయినట్లయితే ఆ బలంతో కేం ద్రం నుంచి గరిష్ఠంగా సాధించుకోవటం అంటూ ఉంటుంది.

కానీ రాష్ట్రం, దానితో పాటు ప్రయోజనాలు చీలిపోయినప్పుడు ఈ మాట తాత్పర్యమేమిటి? కలిసి పోటీ చేస్తాయనుకుంటే, ఎన్నికల తర్వాత కృష్ణా, గోదావరి జలాలపై కలిసి ఒకే వైఖరి తీసుకోగలవా? వివిధ తెలంగాణ ప్రాజెక్టులపై తమ అభ్యంతరాలను చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకుంటారా? హైకోర్టును సత్వరమే వేరుపరుచుకుంటారా? ఇవి కొన్ని ఉదాహరణ మాత్రమే. అందువల్ల, టీడీపీ అధ్యక్షునికి నిజాయితీగానే ఇటువంటి ఉద్దేశాలు ఉంటే, తెలంగాణను గత నాలుగేండ్లుగా ఏయే విషయాల్లో అనవసరంగా సమస్యలకు గురిచేస్తూ వచ్చారో ఆ మొత్తం జాబితాను తయారుచేసి, వాటన్నింటిపై వైఖరిని మార్చుకోవా లి. రెండు తెలుగు రాష్ర్టాలు భౌగోళికంగా తిరిగి ఏకం కావటం అసాధ్యమైనా, కనీసం ఇరువురి మధ్య కెమెస్ట్రీకి ఒక ఆరంభం జరుగుతుంది. తెలుగువారిది దక్షిణాదిన పైచేయి కావటం, జాతీయస్థాయిలో శక్తివం తం కావటం అనేదానికి ఆధారం ఏర్పడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇటువంటి మౌలిక అంశాల పట్ల ఆసక్తి లేదు. దృష్టి అం తా తెలంగాణపై నెగెటివ్‌గా ఉంటుంది. చివరకు తమ నిజమైన ప్రయోజనాలు అనుకునే నీళ్ల వంటి అంశాలతో నిమిత్తం లేని సెక్రటేరియట్ భవనాలకు తాళాలు, హైకోర్టు విభజనకు అడ్డంకుల వంటి విషయాల్లో సైతం ఆయనది నిష్కారణమైన నెగెటివిజమే. సమస్యలను కూర్చుని పరిష్కారమని చెప్తూ కేంద్ర హోంశాఖ వద్ద, రాష్ట్ర గవర్నర్ వద్ద మొక్కుబడి సమావేశాలు జరుపటం, తిరిగి అదే వైఖరి కొనసాగించటం చంద్రబాబు తీరు. వీటన్నింటి మధ్య ఎన్నికల పొత్తు ఎందుకోసం? ఎవరికోసం? పైగా ఎంతో అమాయకంగా, తాను సఖ్యతను ప్రతిపాదిస్తే కేసీఆర్ కాదన్నారని నమ్మించజూసారాయన.
tankashala-ashok
ఇంతకూ తెలంగాణలో టీడీపీకి ఓట్లయినా, సీట్లయినా విభజనానంతరం దేనికి? టీడీపీ తనను తాను జాతీయపార్టీగా ప్రకటించుకుంది. అటువంటి గుర్తింపు ఎన్నికల సంఘం నుంచి రావాలంటే ఒకటికన్న ఎక్కువ రాష్ర్టాల నుంచి నిర్ణీత స్థాయిలో ఓట్లు, సీట్లు తప్పనిసరి. 2014 ఎన్నికల్లో ఆ షరతు తెలంగాణలో నెరవేరింది. తర్వాతి పరిణామాలను బట్టి అది అనుమానాస్పదంగా మారింది. కనుక, ఏమి చేసైనా ఎవరితో కలిసి అయినా ఆ మేరకు ఓట్లు, సీట్లు సంపాదించాలి. లేనట్లయితే, తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎటుపోయినా టీడీపీకి జాతీయపార్టీ గుర్తిం పు ఉండదు. చంద్రబాబు గుర్తింపు పొందిన జాతీయ అధ్యక్షుడు కాకుండాపోతారు. ఒకసారి తెలంగాణలో ఆ స్థితికి చేరితే ఇక భవిష్యత్తులో అది లభించటం సందేహాస్పదమే. ఇదిగాక ఇతరత్రా మరికొన్ని స్థానిక, జాతీయ స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు కేసీఆర్ ముందుకు తమ ప్రతిపాదనను తెచ్చారు తప్ప, అరువైయ్యేండ్లలో చేజేతులా ధ్వంసం చేసిన తెలుగుజాతి ఐక్యతపై కొత్తగా ప్రేమ పుట్టుకువచ్చి కాదు.

496
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles