ప్రతిపక్షాల అబద్ధపు మాటలు

Tue,October 9, 2018 10:52 PM

ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలను ఆకర్షించడానికి ఎన్నికల సమయంలో అన్నిపార్టీలు అనేక వాగ్దానాలు చేస్తుంటాయి. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మరింత ముందుకుపోవాలంటే ప్రజల ఆలోచన విధానంపై ఆధారపడి ఉన్నది. రెండేరెండు మార్గాలు. గత ప్రగతిని చూసి, మరింత ముందుకుపోవడమా, కొత్త వాగ్దానాలను నమ్మి మళ్ళీ కొత్తపుంతలు తొక్కుదామా? ముందుకుపోవడమా, వెనక్కు వెళ్లడమా?

తెలంగాణ అభివృద్ధి, వెనుకబాటుతనం, ప్రజల సంక్షేమాన్ని గురించి ఇంత గొప్పగా స్టడీ చేసిన మీరే ఎందుకు ప్రత్యేక తెలంగాణ గురించి ఉద్యమం చేయలేదని ఒక సందర్భంలో కేసీఆర్ జయశంకర్‌సార్‌ను అడిగితే నీలాంటి మొండివాడు, గట్టివాడు దొరుకలేదని, ఈ ఉద్యమానికి నీవే కరెక్ట్‌గా సరిపోతావని జయశంకర్ సార్ కేసీఆర్‌తో అన్నారట. ఇదెప్పుడు జరిగిందో తెలియదు. కానీ నిజానికి కేసీఆర్ మామూలు మొండివాడు కాదు, మహా మొండివాడు, గట్టివాడు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉన్న వ్యక్తి. వాదించి గెలిచే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలాంటి గుణగణాలన్నీ ఉన్న వ్యక్తితోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాగలదన్న నమ్మకం జయశంకర్ సార్‌కు ఏ క్షణాన కలిగిందో గానీ, అదే స్ఫూర్తితో జరిగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఇది ముమ్మాటికీ కేసీఆర్ వల్లనే సాధ్యమైనద నే విషయాన్నీ కాదనే వారు తమ గుండెల మీద చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉద్యమాలు నడుపడం క్లిష్టమైన పని. వేలాదిమంది నాయకులను నమ్ముకుంటూ ముందుకు కదలాలి. ఎక్కడ అడుగు జారినా అగాథంలో పడిపోతాం. వెంటనే రెండోవాడు అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా కేసీఆర్ ఉద్యమం కూడా అలాంటిదే. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులాగా ఉండి పోయింది. ప్రజల్లో ఆవేశకావేషాలు ఉన్నప్పటికీ ఎవరూ బయటపడలే దు. బయటపడిన వారిని ప్రభుత్వం తొక్కివేస్తుందనే భయం. మింగలేక కక్కలేక తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు కుమిలిపోయారు. కళ్లెదుటే తెలంగాణ ఉద్యోగాలు పక్కవాడు కొట్టుకుపోతుండటంతో గుడ్లప్పగించి చూశారే గానీ నోరుజారితే ఎక్కడ కేసులు, అరెస్టులు జరుగుతాయనే భయంతో కిక్కురుమనలేదు. సింగరేణి, ఎన్టీపీసీలోని ఎగ్జిక్యూటివ్ పోస్టు ల్లో ఎక్కువగా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే ఉన్నారన్న సత్యం అందరికీ తెలుసు.

అదేం దురదృష్టమో గానీ.. మన ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ లాంటి జిల్లాలే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం లాంటి జిల్లాలకు కూడా అన్యాయమే జరిగింది. విద్య, ఉద్యోగాల్లో కొన్ని జిల్లాలే ప్రగతిని సాధించాయి గానీ మిగతా జిల్లాలకు ఒరిగిందేమీ లేదు. ఏ కొత్త ప్రాజెక్టులు వచ్చిన, నిధులు విడుదలైనా. కొన్ని ప్రాంతాలవారు పంచుకున్నారే కానీ నాటినుంచి నేటికీ ఆ జిల్లాలు కూడా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జయశంకర్‌సార్ స్టడీచేసిన మొత్తా న్ని కేసీఆర్ శరీరంలోకి ఇంజెక్ట్ అయింది. ఆ మందు కేసీఆర్ శరీరంలోని ప్రతి భాగానికి పాకింది. అయన ప్రతీ నరనరానికి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత నిజాన్ని తెలియజేసింది. ఆయన గుండెల నిండుగా ప్రత్యేక తెలంగాణ మ్యాప్ నిండిపోయింది. అయన శరీరంలోని ప్రతీ రక్తకణం తెలంగాణను తొందరలో సాధించాలనే పట్టుదల, పోగొట్టుకున్నది ఇక చాలు. ఇంకా పోగొట్టుకోకుండా మనకు మనం విముక్తి చెందాలనే ఏకైక లక్ష్యం తో తెలంగాణ పోరాటాన్ని ఒక్కడై నడిపాడు. పదేండ్ల పోరాటాన్ని అవసరమైనపుడు కొంచెం ఉధృతంగాను, మరికొన్ని సమయాల్లో కొంచెం తేలికగాను, అత్యంత తెలివిగా, చాకచక్యంగా నడిపాడు. ఉద్యమం తేలికగా ఉన్నపుడు.. ఇంక కేసీఆర్ పని అయిపోయినట్టే అన్నారు. ఉద్యమం ఉధృ తంగా ఉన్నపుడు ఈ పట్టు ఇంకా గట్టిగా పట్టాలని కూడా అన్నారు. 20 01లో సింహగర్జన, 2002లో పల్లెబాట, 2003లో తెలంగాణ గర్జన, హైదరాబాద్ నుంచి ఢిల్లీవరకు కార్ల ర్యాలీ, అనంతరం జరిగిన జనగర్జన, సకలజనుల సమ్మె, ఆత్మ బలిదానాలు, సడక్ బంద్‌లు, మిలియన్ మార్చ్ లు, పల్లెపల్లె పట్టాలపైకి కార్యక్రమాలు, కొవ్వొత్తుల ర్యాలీలు, చౌరస్తాల్లో ధూంధాం పాటలు, నృత్యాలు, కేకలు, రోడ్లపైనే వంటావార్పులు, విద్యార్థులు రణభేరీలు.. ఒకటేమిటి, ఎన్నో జరిగాయి. ఇవన్నీ కేవలం ఏడెనిమిదేండ్ల కింద జరిగిన సంఘటనలు.

దాదాపు పదమూడున్నరేండ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ పోరులో తెలంగాణవాడే ఆత్మ బలిదానాలు చేసుకున్నాడు కానీ ఏ ఒక్కరూ మరొకరిపై దాడి చేయలేదు. పక్కింట్లో ఆంధ్ర వారున్నా వారితో ఎప్పటిలాగే సన్నిహితంగా మెదిలారు. ఇద్దరు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలాది మంది ప్రజల మనసులు గెలుచుకుని సాధించుకున్న తెలంగాణను ఎన్నికల పేరుతో ఏదేదో చెప్పుకుంటూ మళ్లీ వెనక్కు నెట్టేయాలనుకోవడం తగదు. గత నాలుగేండ్లలో టీఆర్‌ఎస్ చేపట్టిన కార్యక్రమాలు తెలంగాణ ప్రజల కోసం కాదా.. వీటివల్ల ఇక్కడి ప్రజలు ఎవరూ బాగుపడలేదా. రాష్ట్ర సొమ్మంతా నాయకులే తినేశారా. అంత అవినీతి జరుగుతున్నపుడు ఎం దుకు ప్రశ్నించలేదు. పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు వద్దనలేదు. ప్రజలకు ఎందుకు నిజాలు చెప్పలేదు. కేవలం ఎన్నికల సమయంలోనే గత నాలుగేండ్ల అవినీతి కనిపించిందా. ఇవన్నీ కేవలం ప్రతిపక్షాలే కాదు, ప్రజలు కూడా గమనించా లి. కాళేశ్వరం ప్రాజెక్టు చెడ్డదా? దేశ విదేశాల నుంచి వచ్చిన ఇంజినీరింగ్ సిబ్బంది మాటలన్నీ వేస్ట్ మాటలా? అన్నది ప్రజలు గ్రహించాలి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుకు పంట పెట్టుబడి సాయం రైతు బం ధు, పథకాలన్నీ వేస్ట్ పథకాలేనా? వీటివల్ల ప్రజలకు ప్రయోజనం అందలేదా? వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదా. హోంగార్డులకు, అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు జీతాల పెంపు అందలేదా? చేపపిల్లలు, గొర్రెల పంపిణీ ఉత్తమాటేనా.

k-manohara-chary
కేసీఆర్ కిట్ వేస్టే నా..? ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి అందటం లేదా? 4800 కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త రెవెన్యూ మండలాలు, కొత్త రెవెన్యూ డివిజ న్లు ప్రజలకు ఉపయోగపడవా? అర్చకులకు, ఇమామ్, మౌజులకు ఆర్థిక భృతి దండగేనా? డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లల్లో ఎవరూ ఉండటం లేదా? సన్నబియ్యం విద్యార్థులకు అందించడం లేదా? కంటివెలుగు వల్ల ఎవ రూ లాభపడలేదా? ఆసరా కింద ఎవరికీ పింఛన్లు రాలేదా? ఇవన్నీ ప్రజలు గ్రహించాలి. ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలను ఆకర్షించడానికి ఎన్నికల సమయంలో అన్నిపార్టీలు అనేక వాగ్దానాలు చేస్తుంటాయి. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మరింత ముందుకుపోవాలంటే ప్రజల ఆలోచన విధానంపై ఆధారపడి ఉన్నది. రెండేరెండు మార్గాలు. గత ప్రగతిని చూసి, మరింత ముందుకుపోవడమా, కొత్త వాగ్దానాలను నమ్మి మళ్ళీ కొత్తపుంతలు తొక్కుదామా? ముందుకుపోవడమా, వెనక్కు వెళ్లడమా? నిర్ణయం ప్రజల పక్షం.

608
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles