అంగీకారమే, వేరేమార్గం లేదు

Thu,September 6, 2018 12:01 AM

డిసెంబర్ 2018 లోపు మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. అలాంటప్పుడు, తెలంగాణ శాసనసభ రద్దు చేయడమంటూ జరిగితే, ఆ రాష్ర్టాలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించడం మినహా ఎన్నికల సంఘానికి వేరే మార్గం లేదు.

చాలా మంది అంచనాల ప్రకారం శాసనసభ రద్దయి, ముం దస్తు ఎన్నికలకు పోతే, ఉత్పన్నమయ్యే ప్రశ్నలు కూడా ఆసక్తిగానే ఉంటాయి. అన్నింటికన్నా ప్రధానమైంది, ఏయే పటిష్టమైన కారణాల వల్ల సీఎం శాసనసభ రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు పోవాలనుకుంటున్నారనే విషయం. ఒకవేళ అదే నిజమైతే, సీఎం అలా చేయకూడదా? అసెంబ్లీని రద్దు చేయమని అడిగి ప్రజాక్షేత్రంలోకి పోకూడదా? శాసనసభలో తిరుగులేని పరిపూర్ణ మెజార్టీ కలిగిన సీఎం కేసీఆర్ కు, కావాలనుకుంటే, ఎప్పుడైనా సరే సభను రద్దుచేయమని, రాజ్యాంగపరంగా గవర్నర్‌ను కోరే హక్కున్నది. కాకపోతే ఆ నిర్ణయం ఆయన ఎప్పు డు తీసుకుంటారని ప్రశ్నిస్తే, సమయం వచ్చినప్పుడు అనేదే సమాధానం.

కల్లబొల్లి మాటలతో, అమలుకు వీలుకాని అబద్ధపు అసంబద్ధమైన వాగ్దానాలతో దేశంలో ఓటర్లను మభ్యపెట్టడానికి సవా లక్ష మార్గాలున్నా యి. తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇది నిరాటంకంగా కొనసాగుతున్న కఠోర వాస్తవం. ఇలాంటి కుటిల వాగ్దానాలు చేస్తున్న రాజకీయపార్టీలను కట్టడి చేయడంలో రాజ్యాంగ రక్షణ ఉన్న ఎన్నికల సంఘం కూడా దురదృష్టవశాత్తు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. చివరకి ఓటర్ బాధితుడిగా మిగిలిపోతున్నాడు. ఉదాహరణకు, దీర్ఘకాలం అధికారం అనుభవించి, ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న ఒకానొక ప్రధాన రాజకీయ పార్టీ అనుదినం అసంబద్ధమైన వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. అధికారంలోకి వస్తే, 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని, ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామని, ఒకే కుటుంబంలో ఒకటికంటే ఎక్కువ పింఛన్లు ఇప్పిస్తామని, నిరుద్యోగ భృతి మంజూరు చేస్తామని, పింఛన్ పొందడానికి వయో పరిమితి తగ్గిస్తామనీ.. ఎన్నో చెబుతున్నారు. ఇవన్నీ చెప్పేముందు వీటి అమలు సాధ్యాసాధ్యాలు కానీ, తద్వారా పడే ఆర్థిక భారానికి తగిన నిధులు ప్రభుత్వం దగ్గర ఉంటా యా? లేదా? అనే విషయంకానీ ఆ రాజకీయపార్టీ ఆలోచన చేసిందా అనేది జవాబు దొరుకని యక్షప్రశ్న. 2009 ఎన్నికల్లో కూడా అదే రాజకీయ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎన్నికల్లో గెలిచింది. చివరికి ఐదేం డ్ల పాలనలో కనీసం ఒక్క వాగ్దానాన్ని కూడా నేరవేర్చలేకపోయింది.

సిద్ధాంతాల్లేని, అనైతిక, అబద్ధపు మాటలు చెప్పే ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, బంగారు తెలంగాణ భవిష్యత్ ఏంటి? తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం ఏం కావాలి? సాగునీటి ప్రాజెక్టుల భవిత్యం ఏమిటి? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఏమైపోవాలి? రైతు బంధు, రైతు బీమా పథకాలు కొనసాగుతాయా? వందలాది ఇతర ప్రజోపయోగ పథకాల గతి ఏంటి? దీర్ఘకాలిక పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎంతో ముందుకు పయనించాల్సిన ఈ సందర్భంలో అలాంటివారి చేతుల్లోకి పోతే ఎలా? ఎలాంటి పరిస్థితుల్లోనూ అలా జరుగడానికి వీల్లేదు.

ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభు త్వం ఎంతో చేసింది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నది. అది జరుగాలంటే మళ్లీ ఆయన నాయకత్వమే కావాలి. చెప్పుకుంటూపోతే ప్రభుత్వం చేసినవెన్నో ఉన్నాయి. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి, అచిరకాలంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా మలిచింది. దీన్ని కొనసాగించడం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తప్ప ఇతరులకు సాధ్యమా? ఏక గవాక్ష పారిశ్రామిక విధానాన్ని ఇంత పకడ్బందీగా మరెవరైనా అమలుచేయగల రా? రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాల ద్వారా వ్యవసాయరంగా న్ని, రైతును ఆదుకోవాలంటే కేసీఆర్ లాంటి దార్శనికుడు కావాలి. గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థ మరింత పరిపుష్టం కావాలంటే ఎవరికి సాధ్యం?
ఏదో చేస్తామని చెప్తున్న ఈ స్వయం ప్రకటిత రాజకీయ నాయకులకు కేసీఆర్ రీ డిజైన్ చేసిన సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క ముక్కైనా అర్థమవుతుందా? అసలు ఏ ప్రాజెక్టులో ఎంత నీరు లభ్యం, ఎప్పుడెప్పుడవుతుందో వాళ్లకు తెలుసా? ఎటునుంచి నీరు ఎటువైపు పారుతుందో, నీటి యాజమాన్య విధానం ఏంటో వాళ్లకు అవగాహన ఉన్నదా? అలాంటప్పుడు ఇలా జరుగడం అవసరమా? ఎప్పటికీ అలా జరుగకూడదు. ధర్మాగ్రహంతో ప్రజల బాగోగులు పరిరక్షించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఏం చేయడానికి వీలవుతుందో అదంతా చేయడమే నాయకుల కర్తవ్యం. అదే జరుగబోతున్నదేమో తెలంగాణలో బహుశా.

ఈ నేపథ్యంలో ఎప్పుడు, ఎవరు శాసనసభను రద్దు చేయమని కోరే హక్కుందన్న ప్రశ్న వేసుకోవాలి. పాలక పార్టీ మెజార్టీ పక్ష శాసనసభ నాయకుడికి ఎప్పుడైనా సభను రద్దుచేయమని గవర్నర్‌కు సలహా ఇచ్చే హక్కున్నది. ఈ విషయంలో కొందరు ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు అర్థం లేదు. కేసీఆర్‌కు శాసనసభలో పరిపూర్ణ మెజార్టీ ఉన్నది. ఎప్పుడై నా, ఆయన కావాలనుకుంటే, సభను రద్దు చేయమని అడిగి ఎన్నికలకు పోవచ్చు.
శాసనసభ రద్దు కాగానే, కొత్త శాసనసభ ఏర్పాటు చేయడానికి ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో సంపూర్ణ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నది.
Vanam
శాసనసభ ఒక సమావేశాని కి, మరొక సమావేశానికి మధ్య ఆర్నెల్ల కంటే ఎక్కువ ఉండకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. దీనర్థం సభ సమావేశమైన, రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించడం మినహా మరో గత్యంతరం ఎన్నికల సంఘానికి లేదు. ఆ లోపుగా కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరాలి. తెలంగాణ విషయంలో కొందరు అంటున్నట్లు గుజరాత్ విషయంలో అప్పటి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయా న్ని ఉదహరించడం సమంజసం కాదు. నేటి ప్రధాని మోదీ, నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దేశంలో కనీవిని ఎరుగనిరీతిలో చోటుచేసుకున్న 2002 హింసా సంఘటనల నేపథ్యంలో 2002 జులై 19న శాసనసభను రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగింది. అప్పట్లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఎన్నికల సంఘం నిర్ణయం రాజ్యాంగ ప్రకరణ 174కు విరుద్ధంగా తీసుకోవడం జరిగింది. అల్లర్లు ఇంకా సమసిపోనందున, ఓటర్ల జాబితా తయారుకానందున, ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా లేనందున, ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని ఈసీ నిర్ణయించింది. చివరకు రాష్ట్రపతి జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు సలహాతో కథ సుఖాంతమైంది.

సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు చేయాలని భావిస్తే, అదే జరిగితే, రాజ్యాంగం ప్రకారం 2019 మార్చి నెలలో జరుగాల్సి ఉన్నా, అంతవర కు ఆపాల్సిన పని ఎన్నికల సంఘానికి లేదు. డిసెంబర్ 2018లోపు మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల ఎన్నికలు జరుగా ల్సి ఉన్నది. అలాంటప్పుడు, తెలంగాణ శాసనసభ రద్దు చేయడమంటూ జరిగితే, ఆ రాష్ర్టాలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించడం మినహా ఎన్నికల సంఘానికి వేరే మార్గం లేదు.

447
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles