రైతుల ఆలోచనల్లో మార్పు రావాలె

Fri,August 10, 2018 01:01 AM

రాష్ర్టాన్ని రైతురాజ్యంగా మార్చి అన్నదాతలకు అండగా నిలువాలని తపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాగిస్తున్న మహాయజ్ఞం ఎన్నికల దృష్టితోనో ఓట్లు, సీట్ల దృష్టితో తలపెట్టింది కాదు. 2014 వరకూ అధికారం చెలాయించిన ఉమ్మడి పాలకులు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయాన్ని కుట్రపూరితంగా ధ్వంసంచేసి రైతులను కోలుకోని విధంగా దెబ్బతీశారు. 70 ఏండ్లుగా సాగిన పాలకుల నిర్లక్ష్యం, అతివృష్టి, అనావృష్టి వల్ల రైతుల బతుకులు కూలిపోయి ఆత్మహత్య తప్ప మరోమార్గం లేని దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి.
నాలుగేండ్ల కిందటి వరకూ ఉమ్మడి పాలకుల హయాంలో వ్యవసాయం ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నదనే విషయాన్ని రైతులు బేరీజు వేసుకోవాలె. రైతులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న ఈ సమయంలో రైతులు ప్రశాంతంగా ఆలోచించాలె. సేద్యంలో మూస పద్ధతులను విడనాడాలె.

Kanneprakar
వ్యవసాయం అంటేనే విరక్తి కలిగింది. వానలు పడుతాయో, లేదో.. ఒకవేళ పడితే విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు, ఒకవేళ ఇవన్నీ దొరికి పంటలు పండిస్తే వాటికి మద్దతు ధరలొస్తాయో, లేదోనన్న సంశయంతో రైతులు నలిగిపోతూ వ్యవసాయన్ని బంద్ పెట్టిన దుర్భర పరిస్థితిని మనం చూశాం. గతంలో తెచ్చిన బ్యాంకు అప్పులే వడ్డీల మీద వడ్డీలు పెరుగుతూ రైతులు అప్పుల పాలయ్యారు. గత పాలకుల చర్యలతో నైరాశ్యం ఆవహించిన రైతులు చివరకు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను, పంట ల సాగులో మెళకువలను కూడా పాటించడం లేదు. దశాబ్దాల కిందట వ్యవసాయం ఎట్లుండేది? ఇప్పుడెట్లుంది?. 1980వ దశకం వరకూ జూన్‌లో వానకాలం ఆరంభంలోనే కురిసే తొలకరి జల్లులతో ఉత్తేజితులయ్యే రైతులు వెంటనే దుక్కి దున్ని పెసర, మినుము, కంది, జనుము తదితర పునాస పంటలు వేసేవారు. కంది, మక్కజొన్న పంటలను ఒకే భూమి లో సాలు విడిచి సాలులో వేస్తారు. దానిలోనూ అంతరపంటగా దోసకాయ వంటి కూరగాయ విత్తనాలను కూడా విత్తుతారు.

అదే సమయం లో వరి, మిరపనార్లు కూడా పోస్తారు. వరి పండించే పొలంలోనూ, మిరప పంట వేసే మెట్టభూమిలోనూ పెసర, జనుము తదితర పునాస పంటలను వేసేవారు. మిరప పైరు, వరి నాట్లు వేసే సమయానికి పునాస పంటలు రైతు చేతికివచ్చి వారికి కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుం ది. మిరప పంట వేసే మెట్ట భూమిలో, వరి వేసే పొలంలో పునాస పం టగా వేసిన పెసర, జనుము లూటిబోయిన తర్వాత ఎండిపోయిన కట్టె ను తగులబెట్టి ఆ భూములను మెత్తగా దున్నేవారు. దీంతో అవి మరిం త సారవంతంగా మారి వరి, మిరప పంటలు అధిక దిగుబడులు రావడానికి దోహదం చేస్తుంది. అలాగే గతంలో పంటల మార్పిడి పద్ధతుల ను కూడా రైతులు అనుసరించేవారు. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వానకాలం, యాసంగి కాలం ముగిసిన తర్వాత రైతులు తమ భూముల్లో రాత్రి వేళ ల్లో గొర్ల మందను నిలుపుతుండే. అవి పెట్టే పెంట సేంద్రియ ఎరువుగా మారి భూములు సారవంతమయ్యేవి. ఇలా వ్యవసాయం ఒక పద్ధతి ప్రకారం సాగి పాడిపంటలతో రైతుల గడిసెలు కళకళలాడేవి. రైతులు ఎంతో శాస్త్రీయంగా సాగు చేయడం వల్ల ఎక్కడ చూసినా భూములు పచ్చదనంతో కన్నులవిందు చేసేది. కానీ నా చిన్నతనంలో చూసిన పచ్చదనం ఇప్పుడు మాయమైంది. నీళ్లు లేక భూములు నెర్రెలు బాసాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే 1990వ దశకం నుంచి వ్యవసాయానికి చీడపట్టింది. వాతావరణ సమతుల్యం మరింత దెబ్బతిని వానలు తగ్గిపోయాయి. చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరులు కూడా ధ్వంసమయ్యాయి. బోర్ల మీదే ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎంత లోతుగా బోర్లు వేసిన నీరు పడదు. బోర్ల ఆధారంగా సాగు చేయడానికి మరో అతిపెద్ద సమస్య కరెంట్. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీనికితోడు సేద్యానికి పెట్టుబడులు పెరిగాయి. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందక రైతులు బలవన్మరణాలకు పాల్పడాల్సిన దుర్భర పరిస్థితి కలిగింది. పంటలకు మద్దతు ధరలు ఇవ్వలేదు. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగి అవి బ్లాక్ మార్కెట్‌లో తప్ప బయట దొరుకలేదు. దీనికితోడు తీవ్ర అసహనంలో ఉన్న రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను, సాగులో మెళకువలను వదిలేశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పి డీ విధానాన్ని రైతులు పట్టించుకోలేదు. వానకాలంలో ఏ పంటలు వేయాలి, యాసంగిలో ఏ పంటలు వేయాలన్న విషయంలో రైతులు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగడంలేదు. ఈ ఏడాది ఏ పంటకు మార్కెట్లో విఫరీతమైన ధర పలుకుతుందో అదే పంటను రైతులు వచ్చే ఏడాది పెద్ద ఎత్తున వేసేవారు.

ఈ ఏడాది ఏ పంటకు ధర పలుకలేదో ఆ పంటను వచ్చే ఏడాది వేసేవారు కాదు. దీంతో ఈ ఏడాది ఎక్కువ ధర పలికిన పంటకు వచ్చే ఏడాది అనుకున్నంత ధర వచ్చేది కాదు. ఈ ఏడాది తక్కువ ధర పలికిన పంటకు వచ్చే ఏడాది విపరీతమైన ధర పలికేది. ఇలా అస్తవ్యవస్తమైన సాగు పద్ధతులతో వ్యవసాయం దెబ్బతినడానికి కొంతవరకు రైతులు కూడా కారణమవుతున్నారు. ఇప్పటికైనా రైతుల ధోరణిలో మార్పురావాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ప్రభుత్వం వ్యవసాయాన్ని సం క్షోభం నుంచి బయటపడేసేందుకు శాస్త్రీయ కోణంలో కృషిచేస్తున్నది. వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన సామాన్య రైతుగానే ఆలోచిస్తూ అన్నదాతల వెతలు తీర్చడానికి వ్యవసాయరంగానికి జీవంపోసే చర్యలు తీసుకుంటున్నారు. 70 శాతానికి పైగా ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని ఒక పరిశ్రమగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నదో అంతకు మించిన రాయితీలు రైతులకూ ఇచ్చి వ్యవసాయాన్ని ఒక భారీ పరిశ్రమగా నిలబెట్టాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే రైతులు ఏం చేస్తే బాగుపడుతారో ఆ చర్యలు తీసుకుంటున్నారు.

భూసార పరీక్షల నుంచి ప్రారంభమయ్యే వ్యవసాయ ప్రక్రియ మార్కెట్లలో మద్దతు ధరలకే పం టలు అమ్మేవరకూ రైతుల వెన్నంటి నిలిచేలా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రైతులపై భారం పడకుండా ప్రభుత్వమే భూసార పరీక్ష లు నిర్వహిస్తున్నది. రైతులకు నిత్యం అండగా ఉండటానికి 5 వేల ఎకరాలకొక అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారిని, మండలానికో అగ్రినామిస్టును నియమించింది. తెలంగాణ రాకముందు బ్రహ్మ పదార్థంగా మారి న విద్యుత్‌ను రాష్ట్రం ఏర్పడగానే అన్నిరకాల చర్యలు తీసుకొని 24 గం టల నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే వచ్చిన కరెంట్‌తో ఏ విధంగా వ్యవసాయం చేసుకోవాలనే విషయాన్ని పక్కనబెట్టి అక్కడక్కడ 24 గంటల విద్యుత్ వద్దనే చర్చను పెట్టడం దురదృష్టకరం. విద్యుత్ లేక తెలంగాణ అంధకారమవుతుందని ఉమ్మడి పాలకులు చేసిన బెదిరింపులకు భిన్నం గా రైతులకు భరోసా కల్పించిన ప్రభుత్వ చర్యలను అభినందించి ధైర్యంతో వ్యవసాయం చేసుకోవాల్సిన రైతన్నల్లో పిరికితనం పోవాలె. కానీ దానికి భిన్నంగా కొంతమంది రైతులు వ్యవసాయాన్ని రెండో ప్రాధాన్యరంగంగా చూస్తున్నట్లు కనిపిస్తున్నది. వ్యవసాయానికి ప్రత్యామ్నాయం వ్యవసాయమనే విషయాన్ని మర్చిపోతే మన ఉనికికి ప్రమాదమే.

ఇంకా విచిత్రమేమంటే ఆటోమేటిక్ స్టార్టర్లకు అలవాటు పడిన రైతులు మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ అలవాట్లను మార్చుకోవడం లేదు. వచ్చీరాని కరెంట్‌కు అలవాటుపడి వ్యవసాయమే దండ గ అనేటటువంటి పరిస్థితుల నుంచి బయటపడాల్సింది పోయి రైతు వ్యవసాయాన్ని ఒక ప్రహసనంగా మార్చి ఆటోమేటిక్ స్టార్టర్ల అలవాటుతో దగ్గరలోని టౌన్‌కో, లేదా తమ మండల కేంద్రానికో వెళ్లి నిష్ట గా, నమ్మకంగా చేయాల్సిన వ్యవసాయాన్ని నిర్వేదంతో వదిలేస్తున్నట్లు గా కనిపిస్తున్నది. ప్రభుత్వం రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి ఇవ్వడం, పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవడం, ఏదైనా పంటకు మార్కెట్‌లో మద్దతు ధర పలుకకపోతే రావాల్సిన ధర వచ్చేంత వరకూ ఆ పంటను భద్రపర్చుకోవడానికి వీలుగా దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి గోదాములను నిర్మించడం వంటి అన్ని చర్యలు తీసుకుంటున్నది. తాము ఒంటరి అనే భావన నుంచి ప్రభుత్వమే ఒక పెద్దన్నగా ఉందనే భరోసాను రైతులకు కల్పించింది.

ఇన్ని కార్యక్రమాల చేస్తున్న ప్రభుత్వానికి రైతన్న చైతన్యం కూడా తోడు కావాలె. ఉదాహరణకు అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ లక్షలాది రూపాయల నెలసరి ఆదాయాన్ని పొందుతున్న వారెందరో ఉద్యోగాలను వదిలి తమ సొంత గ్రామాల్లో వ్యసాయం ద్వారా అంతకన్న ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ ఆదర్శ రైతులుగా, మూస పద్ధ తిలో వ్యవసాయం చేస్తున్న రైతులకు సవాలుగా నిలబడుతున్నరు. ఇప్పటికైనా అన్నదాతల ఆలోచన తీరును మార్చుకోవాలె. నాలుగేండ్ల కిందటి వరకూ ఉమ్మడి పాలకుల హయాంలో వ్యవసాయం ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నదనే విషయా న్ని రైతులు బేరీజు వేసుకోవాలె. రైతులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ప్రభు త్వం ప్రయత్నిస్తున్న ఈ సమయంలో రైతులు ప్రశాంతంగా ఆలోచించాలె. సేద్యంలో మూస పద్ధతులను విడనాడాలె. కనుమరుగవుతన్న సంప్రదాయ పద్ధతులు మళ్లీ వ్యవసాయంలో కనిపించేలా రైతు దృక్పథం మారాలె. ఇప్పటికైనా రైతులు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గ్రహించి పరిమితమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి స్వీయ పర్యవేక్షణలో సంప్రదాయబద్ధం గా వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కించాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వ చర్యలకు రైతుల సానుకూల ఆలోచనలు కూడా తోడైతే తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)

321
Tags

More News

VIRAL NEWS