ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని పాటిద్దాం!

Fri,August 10, 2018 12:59 AM

ప్రత్యామ్నాయ పరిస్థితులు కల్పించకుండా ఏ కార్యక్రమమైనా పూర్తిగా విజయవంతం కావడం లేదు. ప్లాస్టిక్ కవర్ల నిషేధం పూర్తిస్థాయిలో విజయవంతం కావడం కోసం ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నా య ఏర్పాట్లుచేయాలి. అతితక్కువ ఖర్చుతో బట్ట, జనపనార సంచులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
Ravikanth
ప్లాస్టిక్ కాలుష్యం.. ప్లాస్టిక్ కవర్లు నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న అత్యంత ప్రమాదకర పదాలు. ప్రపంచ మానవాళి నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట ఈ ప్లాస్టిక్ కాలుష్యం. ఒకప్పుడు ఏ ప్రాం తానికి తగినవిధంగా ఆ ప్రాంతంలో తయారైన వస్తువులను వాడుకునేవాళ్లం. ప్రపంచీకరణ పేరుతో మొదలైన స్థానిక వస్తూత్పత్తి పత నం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ప్రపంచీకరణ పేరుతో అంతర్జాతీయ కంపెనీలు అన్ని వర్థమాన దేశాలకు విస్తరించాయి. మానవ వనరులు పుష్కలంగా ఉన్న మనదేశంలో కూడా ఆధునీకరణ పేరుతో ప్రపంచీకర ణ ఊపందుకున్నది. దీంతోపాటు మానవాళి జీవనవిధానంలో చాలా మార్పులు వచ్చాయి. కొత్తకొత్త ఉపాధి అవకాశాలు వెల్లువెత్తాయి. వస్తూ త్పత్తి పెరిగిపోయింది. మానవ జీవితంలో వేగం పెరిగింది. సంప్రదాయబద్ధమైన జీవన విధానం మారి వేగవంతమైన జీవన విధానంలో ప్రజలు కూరుకుపోయారు. ఒక సమయపాలన లేని జీవితం, అందుబాటులోకి వచ్చిన అన్నిరకాల వస్తువులు, మారిన ఆర్థిక వెసులుబాటు కొత్త జీవన ప్రమాణాలను తీసుకువచ్చింది. ఇదంతా నాణేనికి ఒకవైపే!

రెండోవైపు చూస్తే మనం వేసిన అభివృద్ధి అడుగుల్లో పర్యావరణ విధ్వంసమే కనిపిస్తుంది. మనిషి బతుకడానికి పర్యావరణాన్ని వాడుకోవాలి తప్పదు.. కానీ నేడు తను బతుకడానికి మాత్రమే పర్యావరణం అనుకుంటున్నాడు ఈ మనిషి. అతిపెద్ద పారిశ్రామిక కాలుష్యాలతో పాటు ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్లాస్టిక్ కాలు ష్యం దెబ్బకు భూమి, నదులు, సముద్రాలు, సమస్త ప్రాణికోటి విలవిలలాడుతున్నాయి. అతి చౌకగా రావడం, ఒకసారే వాడి పడేయడం, విచ్చలవిడిగా వినియోగం వల్ల ప్లాస్టిక్ కాలుష్యం గురించి చర్చించాల్సి వస్తు న్నది.

దాదాపు 30 దశాబ్దాలుగా విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను వాడిపడేయ డం వల్ల పర్యావరణపరంగా తీవ్ర విఘాతం కలుగుతున్నది. మారిన జీవన విధానం, నగరీకరణ వల్ల ఇంటినుంచి చేతి సంచిని తీసుకపోవడం మరిచిపోవడంతో మనం ఎలాంటి వస్తువులు కొనాలన్నా ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకువచ్చే సంస్కృతి పెరిగిపోయింది. వస్తువులే కాకుండా కూరగాయలు, కిరాణా సరుకులు, ఆహారపదార్థాలు చివరకు వేడివేడి టీ, కాఫీ ఇతర ఆహార పదార్థాలు కూడా ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళ్లడం ఒకరకంగా చెప్పాలంటే ఫ్యాషన్ అయిపోయింది. పర్యావరణవేత్తలు, వైద్యులు ప్లాస్టి క్ కవర్లలో తీసుకువెళ్ళిన ఆహారపదార్థాలను తినడం వల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయని మొత్తుకుంటున్నా ప్రజానీకానికి ఇసుమంతైనా పట్టించుకోకపోవడం శోచనీయం.
ఉదయం లేచిన దగ్గరినుంచి ప్రతి అవసరానికి ప్లాస్టిక్ కవర్లు మన జీవితంలో భాగమయ్యాయి. 50 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడటం వల్ల పర్యావరణాన్ని తీవ్రమైన విఘాతం కలుగుతున్నది. ఈ కవర్లు భూమిలో కలువవు, గ్రామీణ ప్రాంతాల్లో, కాలువల్లో, పొలా ల్లో అలాగే పడి ఉంటున్నాయి.

పట్టణాల్లో, నగరాల్లో డ్రైనేజీల్లో ఇరుక్కుపోయి నగరాల్లో కూడా వరదలకు కారణమవుతున్నాయి. గతంలో ప్రభుత్వాలు చాలా పట్టణాల్లో ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం జరిగింది. కానీ ప్రజల్లో పూర్తి అవగాహన లేకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం వల్ల చాలావరకు నిషేధం అమలుకాలేదు. దాంతోపాటు ప్రజలు కూడా బాధ్యతారహితంగా ప్లాస్టిక్ కవర్లను వాడిపడేయడం, ప్లాస్టిక్ కవర్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను, కూరగాయ వ్యర్థాలను కట్టిపడేయడం వల్ల అవి తిని అమాయకమైన జంతువులు చనిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 500 బిలియన్ల ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక నిమిషానికి ఒక మిలియన్ బ్యాగ్‌లను వాడిపడేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ కాలుష్యం సముద్రాలను తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నది. విచ్చలవిడి వినియోగం వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5.25 ట్రిలియన్ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో పేరుకుపోయాయి. దీనివల్ల ఏడాదికి ఒక లక్ష సముద్రపు జీవులు అంతమవుతున్నాయి. దాదాపు ఒక మిలియన్ సముద్రపు పక్షులు చనిపోతున్నాయి. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల సముద్రాలు వేగంగా ఆమ్లీకరణ చెందుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 200 ప్రాంతాలు డెడ్‌జోన్స్‌గా మారాయని హెచ్చరిస్తున్నారు.

ఇక మనదేశానికి వస్తే ఏడాదికి 1.5 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పోగవుతున్నాయి. దీనిలో చాలాభాగం రీసైకిల్ కావడం లేదు. మనదేశంలోని ముఖ్యమైన 60 నగరాల నుంచి రోజుకు 15,342 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోవచ్చు. ఇందులో దాదాపు 6000 టన్నుల వ్యర్థాలు ఎక్కడికక్కడే వదిలేస్తున్నారన్న విషయం సాక్షాత్తూ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలే చెబుతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు 4500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో దాదాపు 2500 టన్నులు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఉంటున్నాయి. ఈ వ్యర్థాలు నగరంలో డ్రైనేజీ పైపులైన్లలో ఇరుక్కుపోయి డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు కలిగించడం వల్ల చిన్నపాటి వర్షాల కే నగరం వరదపాలవుతున్నది.
ప్రపంచంలో విశ్వనగరంగా నిలువబోతున్న హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. గతం లో జీహెచ్‌ఎంసీ 40 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించింది. అయితే ఆ నిషేధం కాగితాలకే పరిమితమైంది. మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్ల నిషేధం గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో 2018 పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ పేరుతో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై కార్యక్రమాలు స్థిర నిర్ణయం తీసుకోవాలని సంకల్పించాయి. దీంతో మన నగరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని మరోసారి నిషేధించింది. జూలై 3న ప్లాస్టిక్ కవర్ల నివారణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించింది. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించే విషయం కూడా పరిశీలనలో ఉన్నదని మంత్రి కేటీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. మహారాష్ట్రలో పూర్తిగా ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం విధించారు.

అయితే ప్రత్యామ్నాయ పరిస్థితులు కల్పించకుండా ఏ కార్యక్రమమై నా పూర్తిగా విజయవంతం కావడం లేదు. ప్లాస్టిక్ కవర్ల నిషేధం పూర్తిస్థాయిలో విజయవంతం కావడం కోసం ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నా య ఏర్పాట్లుచేయాలి. అతితక్కువ ఖర్చుతో బట్ట, జనపనార సంచులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లు వాడకండి అంటే.. బట్ట సంచులు ఫ్రీగా ఇస్తారా..? అంటూ అలవాటు పడిపోయిన ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన, మనం నివసిస్తున్న పర్యావరణం, భూమి, దేశం, నగర పరిశుభ్రతపై ఆలోచన, పర్యావరణ పరిరక్షణ నిబద్ధత ప్రజల్లో వచ్చినప్పుడే ప్లాస్టిక్ కవర్ల నిషేధం విజయవంతమవుతుంది.
(వ్యాసకర్త: సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు)

397
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles