రాష్ట్ర కోటాలను ఆమోదించాలె

Thu,August 9, 2018 12:25 AM

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కోటాల పెరుగుదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించటం ఏ విధంగా చూసినా సహేతుకమవుతుంది. కోటా హెచ్చింపుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిలో ఆయావర్గాల అభివృద్ధి మినహా రాజకీయం ఏమీ కాదు. నిష్పాక్షికంగా ఆలోచించగలవారు ఎవరైనా ఈ మాటను అంగీకరిస్తారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఇంతకాలం జాప్యం చేయటం సరికాదు. కనీసం ఇప్పటికైనా సత్వర నిర్ణయం జరుగగలదని ఆశించాలి.
మోదీ ప్రభుత్వం గత వారం రోజుల్లో గమనార్హమైన చర్యలు కొన్ని తీసుకుంది. మొదట ఆగస్టు ఒకటిన క్యాబినెట్ సమావేశమై ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఆమరునాడు లోక్‌సభ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. తర్వాత ఆగస్టు మూడున, ఎస్సీ-ఎస్టీలు ఎప్పటినుంచో కోరుతున్న ప్రమోషన్ కోటాకు ప్రభుత్వం అనుకూలమంటూ సుప్రీంకు నివేదించింది. తెలంగాణ అభ్యర్థన కూడా ఇదే తరహాదని వేరే చెప్పాలా?

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపును ఎందుకు కోరుతున్నదనే విషయమై వివరాలు తేటతెల్లంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు వారి జనాభా దామాషాలో ఉండాలని రాజ్యాంగమే నిర్దేశిస్తున్నది. ఆ ప్రకారం వారి జనాభాలు ఉమ్మడి రాష్ట్రంలో కన్న తెలంగాణలో పెరిగాయి. బీసీలు, బీసీ-ఇ కిందకు వచ్చే అల్పసంఖ్యాక వర్గాల పరిస్థితి కూడా అంతే. మొత్తంమీద బడుగు బలహీనవర్గాల శాతం అత్యధికంగా ఉన్న రాష్ర్టాలలో తెలంగాణ ఒకటైనట్లు సాక్షాత్తూ జనాభా లెక్కల నివేదికలే చూపుతున్నాయి. అటువంటి స్థితిలో అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరుగటం సమంజసమవుతుంది.ఈ విషయమై కేంద్రంతో పాటు, రిజర్వేషన్ వ్యతిరేకులు లోగడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముందుకు తెస్తున్నారు. రిజర్వేషన్లు అన్ని వర్గాలకు కలిసి యాభై శాతానికి మించకూడదని కోర్టు అన్నమాట నిజ మే. అందువల్ల తక్కిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని, తమ పట్ల వివక్ష చూపుతున్నారనే వ్యతిరేక భావనలు కలుగుతాయని, అదేవిధంగా జనరల్ రూపంలో ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యం తగ్గవచ్చునని న్యాయమూర్తులు అన్నారు.

కానీ కోర్టు అభిప్రాయం అంతటితో ముగిసిపోకపోవటమన్నది ఇక్కడ గమనించవలసిన కీలకమైన విషయం. ఒకవేళ రిజర్వేషన్లను యాభై శాతానికి మించి పెంచదలిస్తే అందుకు తగిన కారణాలను చూపాలన్నది కోర్టు. ఆ విధంగా ఒక వెసులుబాటును కల్పించింది. అనగా, తగిన కారణాలు ఉన్నట్లయితే రిజర్వేషన్లను యాభై శాతానికి మించి పెంచుకోవచ్చునని, ఆ చర్య న్యాయస్థానాలకు ఆమోదయోగ్యం కాగలదని సూత్రరీత్యా చెప్పడమన్నమాట. కాకపోతే అందుకు తగిన కారణాలు ఉన్నట్లు న్యాయవ్యవస్థను ఒప్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై, కేంద్రంపై ఉంటుంది. కోటా పెరుగుదల రాష్ట్ర పరిధిలో రాష్ట్రం చేసే పని అయినప్పటికీ, అందుకు జాతీయస్థితితో నూ సంబంధం ఉంటుంది గనుక కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని అనివార్యంగా కోర్టుకు తెలియజేయవలసి ఉంటుంది. కేంద్ర వైఖరి కూడా సానుకూలంగా ఉండి, రాష్ట్రం చూపే కారణాలు తగినవి అయి ఉండినట్లయితే అందుకు కాదనటం కోర్టుకు తేలికకాబోదు. ముఖ్యంగా, రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదంటూ రాజ్యాంగంలో ఏమీ లేకపోవటం ఇందుకు బలాన్నిచ్చే విషయం.

వాస్తవానికి మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి దాటకూడదనేందు కు సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ అందుకు వివరించిన కారణాలు తన విచక్ష ణ ప్రకారం ఇచ్చిన వివరణలు మాత్రమే. అదే సమయంలో, పైన చెప్పుకున్నట్లు, అందుకు ఒక మినహాయింపు వెసులుబాటును కూడా చూపిం ది. ఇక్కడ గమనించదగిన విషయాలు కొన్నున్నాయి. భారత దేశంలో చారిత్రక కారణాల వల్ల సామాజిక వివక్షలు, వెనుకబడినతనాలు, నిరు పేదరికం తీవ్రంగా ఉన్నాయని, ఈ వర్గాలన్నింటికి ముందుకుపోయే అవకాశాలు కల్పించాలని, సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని, ఆ దిశలో ఈ వర్గాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిస్తున్నది. ఇప్పుడు డ్బ్భై ఏండ్లు గడిచిన తర్వాత కూడా కొన్నివర్గాల వెనుకబాటుతనాలు గణనీయంగా ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు చూపుతున్నాయి. వాస్తవానికి రిజర్వేషన్లు యాభై శాతానికి మిం చిన సంప్రదాయం అనేక రాష్ర్టాలలో స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉంది. ఆ కాలాన్ని కూడా కలుపుకొన్నట్లయితే రిజర్వేషన్ల చరిత్ర దాదా పు 150 సంవత్సరాలది. అయినప్పటికీ అమలులో చిత్తశుద్ధి లేకపోవ టం, ఈ వర్గాల విద్య, ఉద్యోగాలు, శిక్షణలు, ఉపాధి, సామాజిక వివక్షల విషయమై తగు చర్యలు తీసుకోకపోవటం వల్ల పురోగతి తాబేటి నడకగా ఉంది. పరిస్థితి ఇది కానట్లయితే నాలుగేండ్ల క్రితం దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడే సమయానికి, రిజర్వేషన్ల కోటాలు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరవలసిన అవసరమే ఏర్పడేది కాదు.

కనుక ఇది తెలంగాణకు చారిత్రక వారసత్వ పరిస్థితి. దీనిని సరిదిద్దేందుకు రాష్ట్రం చేస్తున్న ప్రయత్నానికి కేంద్రంతో పాటు న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకొని సహకరించాలి. పైగా, బలహీనవర్గాల వారు దాదాపు 85 శాతం ఉన్న రాష్ట్రమిది. ఇక్కడ రిజర్వేషన్ కోటా పెంచమని కోరటం రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణమైనది కావటంతో పాటు ఇక్కడి ప్రజల సహజమైన, సమంజసమైన, రాజ్యాంగబద్ధమైన అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించినది. పెరిగిన జనాభా లెక్కలు కనిపిస్తున్నవే. అటువంటి స్థితిలో, సుప్రీంకోర్టు భాషలో చెప్పాలంటే, ఇంతకన్న తగిన కారణాలు ఏముంటాయి?

న్యాయమూర్తులు తగిన కారణాలు అన్నారు గానీ, ఏవి తగిన కారణాలు అవుతాయో వివరించటం గాని, కనీసం రేఖామాత్రంగా సూచించటం గాని చేయలేదు. అటువంటి స్థితిలో ఎవరైనా ఏవి తగినవి అవుతాయో తమ ఇంగితాన్ని, విచక్షణను ఉపయోగించి మాత్రమే ఒక అభిప్రాయానికి రాగలరు. విశేషమేమంటే ఈ విషయమై దేశంలో దశాబ్దాల తరబడిగా అనేక చర్చలు జరిగాయి గాని, ఏవి తగిన కారణాలు అవుతాయనే ప్రశ్నపై స్వరూప-స్వభావ చిత్రణలు జరిగినట్లు లేవు. ఇది దేశవ్యాప్తంగా ఒకే రూపంలో ఉండటం వీలు కాదు కూడా. రిజర్వేషన్లు చేయటం, పెంచటం, తగ్గించటాలను కేంద్రం తన పరిధిలో చేయగా, రాష్ర్టాలు తమ పరిధిలో చేస్తాయి. అనగా, రాష్ర్టాలు తమ వద్ద గల పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇది చట్టబద్ధంగా లభించిన స్వేచ్ఛ. అటువంటి స్థితిలో తగిన కారణాలు అనేవాటిని ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం తన పరిధిలో కనుగొనాలి. లోగడ తమిళనాడు, కర్ణాటక వం టివి చేసిన పని అదే. ఆ నిర్ణయాలపై సుప్రీంకోర్టు తుదితీర్పు ఇంకా వెలువడలేదన్నది వేరే విషయం. కాని ఆయా రాష్ర్టాలు తమ తగిన కారణాలను తాము కనుగొన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ప్రస్తుతం తెలంగాణ చేసిన పని కూడా అదే.
Ashok
కేసీఆర్ కొంతకాలంగా అంటున్నట్లు, రిజర్వేషన్ల శాతాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ర్టాలకు ఉండాలి. యాభై శాతం కోటా పద్ధతిని రద్దుచేయాలి. ఇది ఆయా రాష్ర్టాల సామాజిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునే ఫెడరల్ స్వేచ్ఛ అవుతుంది. అటువంటి స్థితిలో రెండు ప్రశ్నలు తలెత్తుతాయన్నది నిజం. ఒకటి, కోటాల పరిధిలోకి రాని ఇతర సామాజిక వర్గాల స్పందనలు. రెండు, రిజర్వేషన్లు యథేచ్ఛగా ఇవ్వటం వల్ల పరిపాలనా సామర్థ్యం దెబ్బతింటుందనేది. ఈ రెండు కూడా కోటా హెచ్చింపును ప్రతిపాదింంచే సమయంలో ఆయా రాష్ర్టాలు పరిగణనలోకి తీసుకోవలసిన, తీసుకోగల విషయాలు. ఏ ప్రభుత్వం కూడా ఇత ర వర్గాలతో సమతుల్యత లేనివిధంగా, పాలనా సామర్థ్యం దెబ్బతినేవిధంగా బుద్ధిపూర్వకంగా అటువంటి నిర్ణయాలు తీసుకోగలదని భావించలేము. అట్లా చేయటం తన పతన పత్రాన్ని తానే రాసుకోవటం అవుతుంది. కనుక ఆ విచక్షణను, నిర్ణయాన్ని రాష్ర్టాలకు వదలాలి. ఇందులో ఇంకొక మాట ఉంది. కోటా యాభై శాతానికి మించిన తమిళనాడు (69 శాతం) కన్న అట్లా లేని రాష్ర్టాలలో పరిపాలన సమర్థంగా ఉందని, స్వాతంత్య్రానికి ముందు అనేక రాజ్యాలు, రాష్ర్టాలలో యాభై శాతం దాటినప్పుడు అధ్వాన్నంగా ఉండేదని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా?

చర్చిస్తూ పోతే ఇటువంటి ప్రశ్నలు అనేకం ముందుకు వస్తాయి. మోదీ ప్రభుత్వం గత వారం రోజుల్లో గమనార్హమైన చర్యలు కొన్ని తీసుకుంది. మొదట ఆగస్టు ఒకటిన క్యాబినెట్ సమావేశమై ఎస్సీ, ఎస్టీ చట్టా న్ని యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఆ మరునాడు లోక్‌సభ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. తర్వాత ఆగస్టు మూడున, ఎస్సీ-ఎస్టీలు ఎప్పటి నుంచో కోరుతున్న ప్రమోషన్ కోటాకు ప్రభుత్వం అనుకూలమంటూ సుప్రీంకు నివేదించింది. తెలంగాణ అభ్యర్థన కూడా ఇదే తరహాదని వేరే చెప్పాలా?

356
Tags

More News

VIRAL NEWS