చేపల పరిశ్రమ విస్తరించాలె

Tue,July 10, 2018 10:45 PM

రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పరిశుభ్రమైన చేపల మార్కెట్లను నిర్మించి, రాష్ట్ర స్థాయిలో ఫిష్ మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించాలి. అంతేకాకుండా చేపల ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలమీద ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. అన్నింటికంటే ముఖ్యంగా చేపల ఉత్పత్తి, వినియోగం రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వాలు గుర్తించాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ దిశలో అడుగులు వేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించవలసిందే!

దేశం మొత్తంలో మాంసాహారుల జనాభా అత్యధికంగా కలిగిఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అత్యధిక పోషక విలువలను కలిగి, మానవులకు ఆరో గ్య ప్రదాయినిగా విశ్వవ్యాప్తంగా విశ్వాసం పొందిన చేపలను తినడంలో మాత్రం పూర్తిగా వెనకబడిపోయింది! చేప వినియోగం మనిషి ఆరోగ్యానికి ఉపయోగకరమని చెప్పడానికి తెలంగాణలో మృగశిరకార్తెను ఒక సెం టిమెంట్‌లా ప్రయోగిస్తున్నారు. దాదాపు 138 ఏండ్లుగా బత్తిని సోదరు లు పంపిణీ చేసే చేపమందు కోసం సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వేలాదిమంది తరలివస్తున్నారు. ఇదేరోజున రాష్ట్రమంతటా మాం సాహారులు చేపలు తినడానికి ఎగబడుతుంటారు. అయినా తెలంగాణ రాష్ట్రంలోని చేపల ఆహార వినియోగం భారతదేశ జాతీయస్థాయి సగటు వినియోగంతో పోలిస్తే మూడోవంతు మాత్రమే! అదేవిధంగా భారతదేశ జనాభాలో దాదాపు 62 శాతం మాంసాహారుల సంఖ్యను కలిగి ఉన్నప్పటికీ అంతర్జాతీయ సగటు చేప ఆహార వినియోగంతో పోల్చినప్పుడు మనదేశ సగటు చేపల వినియోగం నాలుగోవంతు మాత్రమే!

ఐరాస అనుబంధ అంతర్జాతీయ ఆహార, వ్యవసాయసంస్థ వెలువరించిన ప్రపంచ మత్స్య పారిశ్రామిక స్థితిగతుల నివేదిక 2016లో పొందుపరిచిన వివరాల ప్రకారం చేపల ఆహార వినియోగంలో అంతర్జాతీయం గా ఒక మనిషికి, ఏడాదికి 24 కిలోలు వినియోగిస్తున్నారు. భారతదేశ వార్షిక సగటు ఆరున్నర కిలోలుగా, తెలుగు రాష్ర్టాల వార్షిక సగటు వినియోగం కేవలం రెండు కిలోలుగా నమోదైంది. తెలుగు రాష్ర్టాలలో ప్రతి వెయ్యి మంది మాంసాహారుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 191 మంది మాత్రమే తరచుగా చేపల ఆహారాన్ని తీసుకుంటుంటే, పట్టణ ప్రాంతాల్లో 136 మంది మాత్రమే చేపలను ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. చేపల ఆహారం వల్ల కగిలే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన లేకపోవడం, మాంసాహారంలో సింహభాగాన్ని ఆక్రమించిన చికెన్, మటన్‌ల వలె వినియోగదారులకు సులభంగా అందుబాటులో లేకపోవడం, చేపలు విక్రయిస్తున్న ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటం, చేప ఆహారం లో విరివిగా ఉండే ముండ్లు, చేప ఆహారాన్ని తయారుచేయడంలో ఉండే అధికమైన శ్రమ, తదితర అనేక కారణాల వల్ల చేపల ఆహారం పట్ల మన దేశంలో ఆసక్తి అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. చేపల ఆహారం అధిక శాతం నమోదవుతున్న అభివృద్ధి చెందిన పాశ్యాత్య దేశాల్లో ఆధునిక ఫిష్ ప్రాసెసింగ్ విధానాలు అమల్లోకి రావడం వల్ల మన దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులకు భిన్నమైన రీతిలో చేపల ఆహారం పట్ల రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది.

అభివృద్ధి చెందిన దేశాల్లో చేపల ఆహారం పట్ల ఆదరణ పెరుగడానికి ముఖ్య కారణం వాటిల్లో లభ్యమయ్యే పోషక విలువలు, చేపల ఆహారం లో లభించే రోగనిరోధక శక్తి, పరిమితస్థాయిలో ఉండే కొవ్వు పదార్థాలు, చేపల్లో లభ్యమయ్యే ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ తదితర అంశాలపై అక్కడి ప్రజల్లో ప్రభుత్వాలు కల్పించిన అవగాహన, చైతన్యం ప్రధానమైనవి. చేపల ఆహారం వల్ల గర్భస్థ శిశువు దశ నుంచి వృద్ధాప్యం వరకు అనేక రకాలైన ప్రయోజనాలు చేకూరుతున్నాయి. గర్భిణీ స్త్రీలు చేపల ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువులో రక్తనాళాల నిర్మాణం, ఎముకల నిర్మాణం, రోగనిరోధక శక్తి తదితర ప్రయోజనాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అనేక అంతర్జాతీయ వైద్య, ఆరోగ్య సంస్థలు నిర్వహించిన అధ్యయనాలు నిరూపించాయి. చిన్న పిల్లలకు వారంలో కనీసం రెండు పూటలు చేపల ఆహారం అందించడం వల్ల జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి పెంపొందడం, కంటి చూపు మెరుగవడంతో పాటు పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగడానికి అవసరమైన పోషక పదార్థాలు అందుతాయని ఈ అధ్యయనాలు తేల్చిచెప్పాయి. చేపల ఆహారం సరైన మోతాదులో నిర్ణీత కాలవ్యవధి ప్రకారం తీసుకుంటే గుం డె జబ్బులు, రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుం డా నిలువరించేందుకు అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సం స్థ తమ నివేదికలో పేర్కొన్నది.

అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ 2016లో ప్రకటించిన నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా తలసరి చేపల ఆహార వినియోగం ప్రతి మనిషికి, ఏడాదికి 22 కిలోలుగా నమోదైంది. అయితే భారతదేశంలో మాత్రం తలసరి వార్షిక చేపల ఆహార వినియోగం ఆరు కిలోలుగా మాత్రమే నమోదు కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మరీ కనిష్ఠంగా తలసరి చేపల ఆహార వార్షిక వినియోగం రెండు కిలోలుగా మాత్రమే రికార్డయ్యింది. ప్రపంచ చేప ల ఉత్పత్తిలో సుమారు 60 శాతం చేపల ఉత్పత్తి ని సాధిస్తున్న చైనా 42 కిలో ల తలసరి వార్షిక చేపల ఆహార వినియోగం తో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తున్నది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో చికెన్ మాంసాహారం వినియోగం నమోదుకావడానికి ప్రధాన కారణాలు మన రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమ సాధించిన అభివృద్ధితోపాటు వాడవాడలా ప్రతిమూలమలుపులోనూ చికెన్ అందుబాటులో ఉండటం, చికెన్‌తో అనేక రకాలైన ఆహారపదార్థాలను సులభంగా తయారు చేసుకునేందుకు అవకాశాలుండటం, చేపల్లో మాదిరిగా ముండ్లు, వాసన లాంటి ఇతర ప్రతిబంధకాలు లేకపోవడం! అయితే ఇక్కడ కోళ్ల పెంపకంలో అనుసరిస్తున్న అనైతికమైన పద్ధతులు, చేపల పెంపకానికి వినియోగిస్తున్న దాణా, ఆహారం, ప్రేరకాలు చికెన్ ప్రియుల ఆరోగ్యా లను కబలిస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.

అందువల్ల తెలంగాణలో చేపల వినియోగాన్ని ఇతోధికంగా పెంచాల్సి న ఆవశ్యకత, అవకాశాలున్నాయి. ఇందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చేపలు విక్రయిస్తున్న ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచడం, సాధ్యమైనంతవరకు తాజా చేపలను వినియోగదారులకు అం దుబాటులో ఉంచడం, చేపల ఆహార తయారీలో అందుబాటులోకి వస్తు న్న ఆధునిక పద్ధతులైన రెడీ టు ఈట్, రెడీ టు కుక్, పద్ధతిలో అందుబాటులోకి తీసుకురావడం, చికెన్ సెంటర్లలాగా వాడవాడలా చేపల దుకాణాలను ఏర్పాటుచేసే విధంగా ప్రోత్సహించడం, మొబైల్ ఫిష్ ఔట్‌లెట్‌లను నిర్వహించడం, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం, ఫిష్ కట్టింగ్, ఫిష్ స్కేలింగ్, ఫిష్ డీబోనింగ్ లాంటి ఆధునిక యంత్రాల ను విరివిగా వినియోగంలోకి తేవడం లాంటి చర్యలకు శ్రీకారం చుట్టాలి.
Pittalaravindar
దీంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పరిశుభ్రమైన చేపల మార్కెట్లను నిర్మించి, రాష్ట్ర స్థాయిలో ఫిష్ మార్కెటింగ్ నెట్‌వర్క్ ను నిర్మించాలి. అంతేకాకుండా చేపల ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలమీద ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. అన్నింటికంటే ముఖ్యంగా చేపల ఉత్పత్తి, వినియోగం రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వాలు గుర్తించాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ దిశలో అడుగులువేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించవలసిందే!
(వ్యాసకర్త: తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపకులు)

408
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles