భారత్ వ్యూహం ఎట్లా ఉండాలె?

Tue,June 12, 2018 10:51 PM

అంతర్జాతీయ రాజకీయాల్లో మార్పు వస్తున్నది. అమెరికా ఇప్పటికే సుస్థిరమైన అగ్రరాజ్యం. కాగా చైనా అగ్రరాజ్యంగా ఎదుగుతున్నది. రెండింటి మధ్య ఘర్షణ అనివార్యం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో రెండు పెద్ద రాజ్యాల మధ్య గ్రేట్ గేమ్ సాగబోతున్నది. ఈ నేపథ్యంలో భారత్ అనుసరించవలసిన వైఖరి ఎట్లా ఉండాలె? ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని ఎట్లా పెంచుకోవాలె?

అంతర్జాతీయ నియమాలను ఆశ్రయించడానికి బదులు బల ప్రదర్శన సాగుతున్నదని ప్రధాని మోదీ జూన్ ఒకటవ తేదీనాడు షాంగ్రీ లా డైలాగ్ సదస్సులో అభిప్రాయపడ్డారు. మార్గెంథో అనే అంతర్జాతీయ రాజకీయవేత్త అభిప్రాయం ప్రకారం- ప్రపంచ రాజకీయాల్లో ప్రాబల్యం కోసం పాతులాట ప్రధానాంశం, కాదనలేని అనుభవం. భౌగోళిక రాజకీయాలు, స్థానం కోసం, అధికారం కోసం పోరాటం మూలం గా వివిధ దేశాల మధ్య నిరంతర ఘర్షణ తలెత్తుతున్నది. ఒక అంతర్జాతీయ రాజకీయవేత్త అభిప్రాయం ప్రకారం- ఆసియా భద్రతకు సంబంధించి చైనా ఆందోళనకరంగా తయారైంది. ఏదైనా కొత్త రాజ్యం ఎదుగుతూ ఉం టే, అంతకు ముందే స్థిరపడి ఉన్న రాజ్యంతో ఘర్షణ తలెత్తుంది. ప్రాచీన గ్రీసులో ఏథెన్స్ వృద్ధి చెందుతుండటంతో, స్పార్టాలో ఆందోళన తలెత్తుతుంది. దీంతో రెండు రాజ్యాల మధ్య సుదీర్ఘ యుద్ధం సాగుతుంది. ఇప్పు డు అమెరికా, చైనా పరిస్థితి ఇట్లానే ఉన్నది. ఒకదానిని మరొకటి చక్రబంధంలో ఇరికించే ప్రయత్నం సాగుతున్నది.

జాతీయ ప్రవర్తన, నైతిక ైస్థెర్యం, దౌత్య ప్రమాణాలు, పాలన, సైనిక సన్నద్ధత మొదలైనవి ప్రాబల్యాన్నిపెంచుకోవడానికి ఉపయోగపడుతయి. ఇండో పసిఫిక్ ప్రాంతం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రాబల్య శక్తుల మధ్య మరో గ్రేట్ గేమ్‌కు వేదికగా మారుతున్నది. భౌగోళిక రాజకీయ కోణంలో చూస్తే - భారత తీర ప్రాంతం-దక్షిణ ద్వీపకల్పం హిందు మహా సముద్రంలోకి చొచ్చుకుపోయి ఉంటుంది. ఈ ప్రాం తంలో భారత్ తన ప్రాబల్యాన్ని నిర్మించుకుంటే, అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతుంది.

శతాబ్దం కిందట, సముద్రంపైనా, యూరేషియా ప్రధాన భూభాగంపై ఆధిపత్యం ప్రధానమని వ్యూహకర్తలు చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండో పసిఫిక్ శతాబ్దం నడుస్తున్నది. ఇక్కడ- ఆల్‌ఫ్రెడ్ థేయర్ మహన్ అనే వ్యూహకర్త దేశానికి నావికాదళం కీలకమని ప్రతిపాదించాడు. శాంతి సమయంలో వాణిజ్యపరంగా కానీ, యుద్ధ సమయంలో కానీ సముద్రంపై ఆధిపత్యం దేశ ఔన్నత్యానికి కారణమవుతుందని ఆయన అన్నారు. కానీ మాకిండర్ అనే భౌగోళిక రాజకీయ వేత్త మాత్రం తీర ప్రాంతం కాకుండా ప్రధాన భూభాగంపై ఆధిపత్యమే దేశానికి అవసరమని అభిప్రాయపడ్డాడు. నిజానికి ఈ రెండు భౌగోళిక రాజకీయ సిద్ధాంతాలు చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ) లో ఉన్నాయి. చైనా వ్యూహంలో యూరేషియా ప్రధాన భూభాగం, హిందు మహా సముద్రం - రెండూ ఉన్నాయి.

ప్రధాని మోదీ షాంగ్రి లా డైలాగ్ సదస్సులో పరోక్షంగా చైనా చేపట్టిన బీఆర్‌ఐని ప్రస్తావించారు. ఇటువంటి ప్రాజెక్టులు సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు అనుగుణంగా ఉండాలని సూచించారు. సంప్రదింపులు, సత్పరిపాలన, పారదర్శకత, గిట్టుబాటు, సుస్థిరత, ఆయా దేశాల సాధికారత ఈ ప్రాజెక్టులకు ప్రధానాంశాలుగా ఉండాలని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులు ఆయా దేశాలను రుణ భారంలో ముంచెత్తకూడదని కూడా ఆయన హెచ్చరించారు. ప్రధాని మోదీ మాటలను అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ మరింత వివరించి చెప్పారు. అమెరికా హవాయీలోని తమ నావికా దళ పసిఫిక్ కమాండ్ పేరును ఇండో పసిఫిక్ కమాండ్‌గా మార్చింది. పుష్కలమైన వనరులతో నిండి ఉన్న దక్షిణ చైనా సముద్రాన్ని చైనా సైనికమయం చేసిందని మాటిస్ విమర్శించారు. ఇతర దేశాలను వేధించడానికే ఈ చర్యలు తీసుకున్నదని తప్పు పట్టారు. ఇటీవల కింగ్‌డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత్ చైనా చేపట్టిన బీఆర్‌ఐని ఆమోదించలేదు. ఈ సదస్సులో భారత్ మాత్రమే ఈ ప్రాజెక్టుకు మద్దతు పలకలేదు. ట్రంప్ ప్రభుత్వం సూత్రబద్ధమైన వాస్తవికతను అనుసరిస్తున్నదని, వ్యూహాత్మక వాతావరణాన్ని స్పష్టంగా గుర్తిస్తున్నదని మాటిస్ అన్నారు. 21వ శతాబ్దంలో ఆయా దేశాల మధ్య పోటీ ఉండటమే కాదు, అది పెరుగుతుందని ట్రంప్ ప్రభుత్వం గుర్తించింది.

ఇండో పసిఫిక్ ప్రాంతం అన్ని దేశాలకు అందుబాటులో ఉండాలని అమెరికా అంటున్నది. దీని వల్ల అమెరికా దాని మిత్ర దేశాలు నావికా బలగాలను మోహరించుకోగలవు. అంతర్జాతీయ నిబంధనలను కాపాడుకోగలవు. అమెరికా, దాని మిత్ర దేశాలు అనుసంధానం కలిగి ఉండాలనేది ప్రధానాంశం. చట్టబద్ధ పాలన, పౌర సమాజం, పారదర్శక పాలన మొదలైన పదజాలాన్ని అమెరికా వాడుతున్నది. ఇది చైనా ఆర్థిక అభివృద్ధికి మసిపూసే వాదన. చైనాను దృష్టిలో పెట్టుకొని చేసే వ్యాఖ్యలు. ఆగ్నేయాసియా దేశాల కూటమిని ఈ ప్రాంత సుస్థిరతకు వాడుకోవాలనేది అమెరికా లక్ష్యం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్‌కు ప్రధాన పాత్ర అప్పగించాలనేది కూడా అమెరికా ఉద్దేశం. ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల ఆసియా పవర్ ఇండెక్స్ 2018 నివేదికను విడుదల చేసింది. ఆర్థిక వనరులు, సైనిక పాటవం, తట్టుకునే శక్తి, భవిష్యత్ పోకడలు, దౌత్య ప్రాబల్యం, ఆర్థిక సం బంధాలు, రక్షణ సంబంధాలు, సాంస్కృతిక ప్రాబల్యం మొదలైన ప్రాతిపదికల ఆధారంగా ఈ సంస్థ ఒక దేశ బలాన్ని గణిస్తుంది. ఈ లెక్కన మొత్తం బలాల ర్యాంకింగ్‌లో అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. జపాన్ మూడవ స్థానంలో, భారత్ నాలుగవ స్థానంలో ఉన్నా యి.

చైనా , భారత్ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నది. చైనా ఆర్థిక వనరులు ఎక్కువగా కలిగి ఉండటం వల్ల తేడా ఎక్కువగా ఉన్నది. చైనాతో పోలిస్తే, జపాన్, భారత్ 33 పాయింట్ల తేడాతో ఉన్నాయి. ఈ జాబితాలో బంగ్లాదేశ్ బలహీన దేశంగా పద్దెనిమిదవ స్థానంలో ఉన్నది. జపాన్, బంగ్లాదేశ్ మధ్య ఎంత పెద్ద తేడా ఉన్నదో, చైనాకు జపాన్, భారత్‌కు మధ్య అంత వ్యత్యాసం ఉన్నది. ఈ నేపథ్యంలో భారత్ విదేశాంగ విధానంలో అమెరికాతో భాగస్వామిగా ఉండటం కీలకమైన అంశం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో సమతుల్యం సాధించాలంటే, అమెరికా- భారత్ వంటి రెండు ప్రజాస్వా మ్య దేశాల మధ్య బహుముఖమైన వ్యూహాత్మక సంబంధం అవసరం. కానీ భారత్‌కు అమెరికాతో సంబంధం ఒక్కటే సరిపోదు. చైనాతో సంబంధాల ను పటిష్టం చేసుకోవడం కూడా అవసరం. వూహాన్ ఇష్టాగోష్టి ఈ నేపథ్యం లో జరిగిందే. చైనాతో పాటు ఇరాన్, రష్యా వంటి దేశాలతో దృఢ సంబంధాలు భారత్‌కు అవసరం. సైనిక, ఇంధన రంగాలలో ఈ దేశాల సహకారం అవసరమవుతుంది. ఆసియాలో భారత్ తన భవిష్యత్‌ను రూపు దిద్దుకోవాలంటే, అమెరికా అనుబంధం మాత్రమే సరిపోదు. అమెరికా దృష్టిలో- చైనా ఆసియాలో ఆధిపత్య శక్తిగా అవతరిస్తున్నది.

ఇది ప్రాంతీయ భద్రతలో, వివాద పరిష్కారంలో అసమతుల్యాన్ని సృష్టిస్తుంది. అప్రజాస్వామిక, ఆధిపత్య రాజకీయ శక్తులకు ప్రోత్సాహమిస్తుంది. ఈ అమెరికా దృక్పథంతో భారత్ ఏకీభవిస్తుంది. దీంతో పాటు భారత్ కోణం కూడా ఉన్నది. పొరుగు దేశాలతో సమస్య ఉన్నది. చైనాతో సరిహద్దు వివాదం రగులుతున్నది. ఆంతరంగికంగా అభివృద్ధి గతిశీలత ఉన్నది. ఈ కారణాల వల్ల అమెరికా, చైనా దేశాలతో సంబంధాలను సరళరేఖ గీసినట్టు కాకుండా, అటూ ఇటుగా సరళంగా చూడాలె. భారత్ ఇటీవలికాలంలో తూర్పు దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకునే వ్యూహాన్ని చేపట్టింది. కానీ ఆయా దేశాలలోని సమాజాలతో సంబంధాలను పటిష్టం చేసుకోవడం జరుగలేదు. ఈశాన్య రాష్ర్టాలు, అండమాన్ నికోబార్ దీవులను పునాదిగా చేసుకొని ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకోవాలె. 1945లో కె.ఎం.ఫణిక్కర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినవి. మలాకా జలసంధి మొసలి నోరు వంటిది. మలయా ద్వీపకల్పం పై దవడ అయితే, సుమత్రా కొన కింది దవడ. సుమత్రా జలసంధి, మలాకా జలసంధిలో ప్రవేశాన్ని నికోబార్ నియంత్రించాలె.
nirupama-rao
భౌగోళిక రాజకీయాల్లో పాబల్యం, పలుకుబడి రెండు కీలకమైనవే. భార త్ తన శక్తిని మించి ప్రభావాన్ని చూపగలదు. ఆసియా ప్రాబల్యం సూచిక ప్రకారం- ప్రాబల్యం, పలుకుబడి వేర్వేరు అంశాలు. అయితే తనకున్న వనరులను ఆసియాలో ప్రాబల్య శక్తిగా మార్చుకోవడం ఎట్లా అనేది భారత్ ముందున్న సవాలు. జాతీయ ప్రవర్తన, నైతిక ైస్థెర్యం, దౌత్య ప్రమాణాలు, పాలన, సైనిక సన్నద్ధత మొదలైనవి ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతయి. ఇండో పసిఫిక్ ప్రాంతం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రాబల్య శక్తుల మధ్య మరో గ్రేట్ గేమ్‌కు వేదికగా మారుతున్నది. భౌగోళిక రాజకీయకోణంలో చూస్తే - భారత తీర ప్రాంతం-దక్షిణ ద్వీపకల్పం హిందు మహా సముద్రంలోకి చొచ్చుకుపోయి ఉంటుంది. ఈ ప్రాం తంలో భారత్ తన ప్రాబల్యాన్ని నిర్మించుకుంటే, అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతుంది.
(రచయిత్రి: మాజీ విదేశాంగ కార్యదర్శి, రాయబారి)
(ది వైర్ సౌజన్యంతో..)

625
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles