మనకాలపు అద్భుతం కాళేశ్వరం

Tue,June 12, 2018 10:52 PM

రాబోయే కాలంలో తెలంగాణలో ఒక కొత్త ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. ఈ అవకాశం కూడా మరెంతో దూరంలో లేదనిపిస్తున్నది. త్వరిగతిన రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టును చూస్తుంటే అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ పట్టుదలకు ఇంజినీర్ల పనితనాన్ని అభినందించకుండా ఉండలేం. పూర్తిగా తెలంగాణ సీనియర్ రిటైర్డ్, జూనియర్ ఇంజినీర్లు రాత్రింబవళ్లు చేస్తున్న కృషికి తెలంగాణ రైతాంగం వాళ్లకు రుణపడి ఉంటుంది.
Kaleshwaram-project
అద్భుతమైన మానవ నిర్మిత కట్టడాల్లో సందర్శనా పరమైనవే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ప్రజలకు మేలు చేసే అద్భు త పనితనంతో నిలిచిపోయే వాటిలో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిపోతుంది. కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, కొన్ని లక్షల మందికి తాగునీరు అందించే ఈ అద్భుతం త్వరలో తెలంగాణలో ఆవిష్కృతం కాబోతున్నది. దేశంలోనే కాకుండా ఆసియా దేశాల్లోనే ఇలాంటి ఒక ప్రజోపయోగకర నిర్మాణం జరుగలేదనేది నిపుణుల అభిప్రాయం. మొత్తంగా 1832 కిలోమీటర్లు సాగే ఈ ప్రాజెక్టు నీటి పారుదల మొత్తం ఎత్తువైపు ప్రయాణిస్తుంది. నీరు పల్లమెరుగుననేది ప్రకృతి చెప్పిన సత్యం. కానీ నీరు ఎదురెక్కి కొన్ని వేల మంది ప్రజల ఆర్థిక స్థితిని బాగు పరుస్తుందనేది తెలంగాణ ఇంజినీర్లు నిరూపించబోతున్న సత్యం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి విషయంలో అనేక మందిలో అనే సందేహాలుండేవి. ఈ గందరగోళం రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా కొంత ఉండేది. కానీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఒక్కొక్కటిగా నిర్మితమవుతున్న పనులను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వాన్ని నిలుపుకొని అభివృద్ధి దిశలో సరైన ప్రయాణం చేస్తున్నదనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్తు సంస్కరణ, ఇంటింటికి నీరందించే మిషన్ భగీరథ, గ్రామ వ్యవసాయాన్ని కాపాడి గ్రామాల ఆర్థిక పరిపుష్టికి తోడ్పడే మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలతో పాటుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది చరిత్రలో నిలిచే ఒక గొప్ప ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనా. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ నిపుణులు రూపొందించిన ఈ ప్రాజెక్టు రాష్ర్టాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసి తెలంగాణ రైతులకు తరతరాలుగా నిలిచిపోయే వనరుగా మిగిలిపోతుంది. ప్రకృతి వనరులను మానవుడు వినియోగించడం అనేది ఈనాటిదేం కాదు. అం దుకు కావలసిన పాఠాలు కూడా మనిషి ప్రకృతి నుంచే నేర్చుకున్నాడు. కానీ నీటిని కొన్ని వేల కిలోమీటర్ల మేరకు ఎత్తువైపు మళ్లించడం అనే ప్రకృతి నేర్పని ఈ పాఠాన్ని మనిషి తన మేధను మదించి నేర్చుకున్నాడు.

అంతేకాకుండా అలా ఎత్తుమార్గం వైపు నీళ్ళను తీసుకొని వెళుతున్నప్పుడు అడ్డు వచ్చే ఎత్తైన కొండలను తొలిచి 203 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని దీనికోసం నిర్మించారు. కాళేశ్వరం దగ్గర ఇటు గోదావరినది, అటు మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రాణహిత కింద మేడిగడ్డ దగ్గర నీటిని తోడి ఎదురెక్కించి తిరిగి గోదావరి నదిలోకి నింపుతూ అలా నిండిన నీటి ని కన్నాల, అన్నారం, సుందిళ్ల మొదలైన ఎత్తిపోతలతో రామగుండం దగ్గరి శ్రీపాద ప్రాజెక్టు నింపి మళ్ళీ అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు పారించడం అనేదిఈ నైపుణ్య నిర్మాణాన్ని చూడకముందు ఇదంతా ఏదో ఊహాతీతమైనదిగానూ, ఒక యానిమేషన్ చిత్రం లాగానూ తోస్తుంది. మొత్తం 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ప్రజల తాగునీరు కోసం 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీరు అందించే ఈ భారీ ప్రాజెక్టును కళ్ళారా చూశాకా నమ్మకుండా ఉండలేని పరిస్థితి. అంతేకాకుండా తెలంగాణవాసులకు ఎప్పు డూ ఎండిపోయి ఉండే ఇసుక మేటల, పిచ్చిమొక్కల గోదావరి ఇప్పుడు 150 కిలోమీటర్ల పొడవునా నిండుగా నీటితో కళకళలాడుతూ ఏడాది పొడవునా కనిపించే అవకాశం ఉన్నది.

ఈ సుందర దృశ్యం శాశ్వతంగా నిలిచిపోయే కాలం మరెంతో దూరంలో లేదనిపిస్తున్నది. దీనిలో గోదావరి పరిసరాల్లో పర్యావరణం వెల్లివిరుస్తుంది. కొన్నిరకాల రవాణాలు కూడా జలమార్గం గుండా మొదలయ్యే అవకాశాలు ఉన్నందున కొంత వ్యాపార రవాణా జరిగే అవకాశం ఉంటుంది. 150 కిలోమీటర్ల పొడవు నీరు నిలిచి ఉండటం వల్ల చేపలు లాంటి ఆహార ఉత్పత్తులు పెంపొందించుకునే అవకాశం ప్రజలకు దక్కుతుంది. తద్వారా ఆ ప్రాంతాల్లో కొత్త వ్యాపారావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉన్నది. సముద్ర తీర ప్రాంత ప్రజలకు మాత్రమే అవకాశం ఉన్నా కొన్ని ఉపాధిమార్గాలు ఈ నీటి నిలువ వల్ల గోదావరి తీర ప్రాంత ప్రజలకు కూడా అందే అవకాశం ఉన్న ది. గోదావరి నుంచి పంట చేలను తడిపే వేల కిలోమీటర్ల ఈ నీటి ప్రయాణంలో అక్కడ కూడా నీటిని నిలువ చేస్తూ పంటలకు అందించే ఆలోచనను నిపుణులు చేశారు. అందుకోసం ఇప్పటివరకు 5 జలాశయాలు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటుగా మరో 19 జలాశయాలను నిర్మిస్తున్నారు. ఈ జలాశయాల నిలువ సామర్థ్యం పాతవి, కొత్తవి కలిపి మొత్తం గా 152 టీఎంసీలుగా ఉంటుందనేది అంచనా.

దీనితో ఆయా జలాశయాల చుట్టుపక్కల భూములన్నీ పంటలకు అనువుగా మారిపోయి, రైతు జీవితాన్ని మార్చివేసే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టులో ఒనగూడే మరో ముఖ్యమైన ప్రయోజనం తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌కు తాగునీరు లభించడం సంవత్సర పొడవునా నీటికి కరువులేని కాలాన్ని ఊహించుకొని హైదరాబాద్ వాసులు సంతోషపడుతున్నారు. అంతేకాకుండా ఇంకా అనేక పట్టణాలకు ఈ అవకాశం దక్కనున్నది. 16 టీఎంసీలు పరిశ్రమలకు వినియోగించ డం ద్వారా పరిశ్రమలు చాలావరకు నీటి సమస్య నుంచి బయటపడ్డట్టే. నీరు లేక వ్యవసాయం అనుకూలించని గ్రామాల్లోని ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లడం అనే విధానం తెలంగాణలో ఉన్నదే. ఇప్పుడు వ్యవసాయానికి నీటి లభ్యత కారణంగా వలసలు పోయే అవకాశం ఉండకపోవచ్చు. ఉపాధి కోసం వలసలతో వెలవెలబోయిన గ్రామీణ ప్రాంతాలు మళ్లీ నిండుగా కనిపించవచ్చు. మొత్తంగా తెలంగాణ గ్రామీణ ముఖచిత్రాన్ని ఈ ప్రాజెక్టు మార్చివేసే అవకాశాలున్నాయి.
cheman
రాబోయే కాలంలో తెలంగాణలో ఒక కొత్త ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. ఈ అవకాశం కూడా మరెంతో దూరంలో లేదనిపిస్తున్నది. త్వరిగతిన రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టును చూస్తుంటే అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ పట్టుదలకు ఇంజినీర్ల పనితనాన్ని అభినందించకుండా ఉండలేం. పూర్తిగా తెలంగాణ సీనియర్ రిటైర్డ్, జూనియర్ ఇంజినీర్లు రాత్రింబవళ్లు చేస్తున్న కృషికి తెలంగాణ రైతాంగం వాళ్లకు రుణపడి ఉంటుంది. తెలంగాణ రైతు కళ్లలో ఆనందాన్ని చూడాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయానికి రైతు రుణం తీర్చుకునేందుకు ఇదే అవకాశంగా భావించి పనిచేస్తున్న ఇంజినీర్లు వేలాది మంది శ్రామికులు అభినందనీయులు. కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశంలో ఒక కొత్త చర్చకూ, కొత్త అభివృద్ధి నమూనాకు మార్గదర్శం కాబోతున్నది. మొత్తంగా తెలంగాణ దేశానికి ఒక దిక్సూచీ కాబోతున్నది.

1253
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles