దర్యాప్తు స్వతంత్రంగా సాగాలె

Mon,June 11, 2018 10:41 PM

పాటియాలా హౌజ్‌లోని ప్రత్యేకకోర్టు సునందా పుష్కర్ కేసులో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) 498ఏ (భర్త అతని బంధువుల నుంచి భార్యకు క్రూరత్వం) నేరాలను గుర్తించి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ కోర్టు ముందు 2018 జూలై 7న హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ మూడు వేల పేజీల చార్జిషీట్‌ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

దక్షిణ ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో 2014 జనవరి 17న సునం దా పుష్కర్ మరణించినట్టు కనుక్కొన్నారు. నాలుగేండ్లు దాటిన తర్వాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అనుమానాస్పద హత్య కేసుగా మార్పు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా ఇప్పుడు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. మరణానికి తొమ్మిది రోజుల ముందు సునంద తన భర్త శశిథరూర్‌కు నాకు బతకాలన్న కోరిక లేదు అన్న మెయిల్‌ను పంపించింది. అదే విధంగా సాంఘిక మాధ్యమంలో పేర్కొన్నది. ఈ స్టేట్‌మెంట్లను మరణ వాంగ్మూలంగా ఢిల్లీ పోలీసులు పరిగణించి చార్జిషీట్‌ను దాఖలు చేశారు. విష ప్రయోగం వల్ల, అల్పారెక్స్ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఆమె మరణించిందని అభియోగ పత్రంలో పోలీసులు పేర్కొన్నారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మిగతా ఉద్యోగుల్లా కాకుండా నిర్ణీత కాలం అయిపోగానే రావాల్సిన ప్రమోషన్ వస్తుంది. అయినా వాళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా దర్యాప్తులు చేస్తూ ఉంటారు. దీనినుంచి బైటపడినప్పుడే న్యాయపాలన దేశంలో అమలయ్యే అవకాశం ఉన్నది. సునందా పుష్కర్ కేసులో ఏం జరిగిందా అన్నది అప్రస్తుతం. కానీ పోలీసులు దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. శశిథరూర్ కేసులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఈ అభియోగాలన్నీ ఆధారరహితమైనవని, దురుద్దేశంతో కూడుకున్నవని ముద్దాయి శశిథరూర్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ద ప్రిం ట్ అన్న వెబ్‌మ్యాగజైన్ యాభై అక్షరాల సంపాదకీయాన్ని ఈ విష యం గురించి రాసింది. తన భార్య ఆత్మహత్య చేసుకునే విధంగా శశిథరూర్ ప్రేరేపించాడని అభియోగం చేయడంలోని ఉద్దేశం అతను అవతలి పక్షంలో ఉండటమే అని తన సంపాదకీయంలో పేర్కొంది. బలం ఉన్న వాడిదే రాజ్యం అన్న రీతిలో పోలీసులు ప్రవర్తిస్తున్నారని, సాంఘి క మాధ్యమంలోని, ఈ-మెయిల్‌లోని పోస్టుల ఆధారంగా పోలీసులు ఇలాంటి నిర్ణయానికి రావడం హేతుబద్ధం కాదని కూడా ప్రింట్ వ్యాఖ్యానించింది. మరణానికి ముందు మృతుడు/రాలు ఇచ్చిన స్టేట్‌మెంట్లు అవి మౌఖికమైనవి కావొచ్చు. రాత పూర్వకమైనవి కావచ్చు. అవి భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం మరణ వాంగ్మూలం అవుతాయి. ఆ స్టేట్‌మెంట్లు మరణ వాంగ్మూలమా? థరూర్ మీద సెక్షన్ 306, 498-ఏ రుజువవుతాయా లేదా అన్నది ఈ వ్యాస ఉద్దేశం కాదు. ఎం దుకంటే ఇప్పుడు ఆ విషయం కోర్టు పరిశీలనలో ఉన్నది. అంతేకాకుం డా సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. థరూర్ డిశ్చార్జి కావడానికి అవకాశం ఉందా అన్నది కూడా ఇప్పుడు అప్రస్తుతం. ఒక్క విష యం మాత్రం చర్చించాల్సిన అవసరం ఉన్నది.

పోలీసుల మీద, సీబీఐ మీద ఇతర దర్యాప్తు సంస్థల మీద తరుచూ కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. తమ ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి ఈ సంస్థలను ప్రభుత్వాలు వాడుకుంటున్నాయన్న ఆరోపణలు తరుచూ వినిపిస్తుంటాయి. సీబీఐని తమ రాజకీయ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం వాడుకుంటున్నదన్న వాదన తరుచు వినిపిస్తుంది. మొన్నటికి మొన్న కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి కొన్ని దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగిస్తుందన్న వార్తల ను మనం చూశాం. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ ఈ ఆరోపణలనే చేశాడు. మన రాజ్యాంగం, శాసనాల్లో చాలా నిబంధనలు ఉన్నాయి. అందమైన పదాలతో న్యాయపాలన (రూల్ ఆఫ్ లా) గురించి వివరించారు. ఈ అందమైన పదాలతో న్యాయపాలన రాదు. ఆ చట్టాలను మనం సరిగ్గా ఉపయోగించడం వల్ల న్యాయ పాలన వస్తుంది. న్యాయ వ్యవస్థ లాగా మాకు స్వతంత్రత లేదు. మేము మనస్సాక్షిగా పని చేయలేకపోతున్నాం అని కొంతమంది పోలీసులు తరుచూ అంటుంటారు. ఈ మాటల్లో ఏమైనా వాస్తవం ఉన్నదా? ఒక నేరాన్ని దర్యాప్తు చేసే క్రమంలో ప్రభు త్వం జోక్యం చేసుకునే అవకాశం ఉందా? లేనప్పుడు పోలీసులు ప్రభుత్వాల చెప్పుచేతుల్లో ఉన్నట్టుగా ఎందుకు ప్రవర్తిస్తారు? ఇవి సామాన్యులను ఆ మాటకొస్తే విజ్ఞులను కలవరపెట్టే ప్రశ్నలు.

ఒక నేరాన్ని పరిశోధించే క్రమంలో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు లేదు. ఇంకా చెప్పాలంటే కోర్టులకు కూడా లేదు. దర్యాప్తులను కోర్టులు పర్యవేక్షిస్తాయి. కానీ జోక్యం చేసుకోవు. కొన్ని ప్రత్యేకమైన సం దర్భాల్లో మాత్రమే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాలకు దర్యాప్తులో జోక్యం చేసుకునే అధికారం లేదు. కేసు దర్యాప్తు అనేది శాసనం పోలీసులకు ఇచ్చిన అధికారం. మరి పోలీసులు దర్యాప్తు సంస్థలు ప్రభుత్వం చెప్పుచేతుల్లో ఎందుకు ఉంటారు? దాని కి కారణాలు అనేకం. మంచి పోస్టింగుల కోసం కావొచ్చు. తాము చేసే అవినీతి బైటపడకుండా ఉండటం కోసం కావొచ్చు. ఇంకా మనకు కన్పించని ఇతర కారణాలు ఏవైనా ఉండవచ్చు. కేసు దర్యాప్తులో అనేక దశలు ఉంటాయి. దర్యాప్తు పూర్తి అయిన తర్వా త పోలీసు అధికారి కేసు గురించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా చార్జిషీట్‌ను దాఖలు చేయడమో, సాక్ష్యా లు లేనప్పుడు కేసును మూసివేయడమో పోలీసు అధికారి చేయాల్సి ఉంటుంది. దర్యాప్తు పూర్తి అయిన తర్వాత తీసుకోవాల్సిన చర్య పోలీసు అధికారి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇతరులెవరికీ ప్రమేయం ఉండదు. దర్యాప్తు చేస్తున్న అధికారి మీద అతని పై అధికారుల పర్యవేక్షణఉంటుంది.

అంతేకాని ప్రభుత్వ పర్యవేక్షణ ఉండ దు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలను, ఆదేశాలను ఈ విషయం లో పోలీసు అధికారి స్వీకరించడానికి వీల్లేదు. (ఆర్. సరళా వర్సెస్ వేలు మరి ఇతరులు, 2000 ఏప్రిల్ 13, సుప్రీంకోర్టు) సరళా కేసు లో ఈ విషయాన్ని చెబుతూ లార్డ్ డెన్నింగ్, ఆర్ వర్సెస్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ (1968(1) ఆల్ ఇంగ్లాండ్ రిపోర్టర్ 763) కేసులో ఈ విధంగా అంటాడు. కార్యనిర్వాహక వ్యవస్థలో ఎలాంటి సంబంధంలేని వ్యక్తి ఇంగ్లాండ్‌లోని కానిస్టేబుల్ ఈ విషయం చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటం లేదు. రాజ్యం దగ్గర పనిచేస్తున్న సెక్రటరీ ఆదేశాలను దర్యాప్తు విషయం లో వినడానికి వీల్లేదు. దేశంలో ఉన్న శాసనాలను అమలు చేయడమే చీఫ్ కానిస్టేబుల్, పోలీస్ కమిషనర్ విధి. కేసు దర్యాప్తు కోసం పోలీసులను పంపించే చర్యలను ఆ అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజ లు ప్రశాంతంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత వాళ్లది. అనుమానితులను ప్రాసిక్యూట్ చేయాలా వద్దా అన్న విషయాలను వాళ్లు చూడా లి. ఈ విషయంలో వాళ్లు ఎవరి సేవకులు కాదు. శాసనానికి మాత్రమే సేవకులు. ఫలానా వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయమని, చేయకూడదని చెప్పే అధికారం ఏమంత్రికీ లేదు.ఆ విధంగా ఏ పోలీసు అథారిటీ కూడా చెప్ప డానికి వీల్లేదు. చట్టం అమలుచేసే బాధ్యత వాళ్ల మీద ఉంటుంది. శాసనానికి అతను జవాబుదారీ. శాసనానికి మాత్రమే అతను జవాబుదారీ.

మన దేశంలో కూడా ఈ పరిస్థితే ఉన్నది. శాసనాలు ఆ విధంగానే ఉన్నాయి. డెన్నింగ్ చెప్పిన విషయాలను ఉదహరిస్తూ సుప్రీంకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వినిత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1998(1) సుప్రీంకోర్టు కేసెస్ 226) కేసు లో ఈ విధంగా అభిప్రాయపడింది. మన రాజ్యాంగ స్కీం కూడా ఈ విధంగానే ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా మన దేశంలో పోలీసులు ప్రభుత్వాధినేతలకు బానిసల్లాగా వ్యవహరిస్తున్నారు. శాసనబద్ధమైన ఆదేశాలను మాత్రమే పోలీసులు పాటించాలి. శాసనానికి ఏజెంటుగా వ్యవహరించాలి. అంతేతప్ప రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి ఏజెంటుగా కాదు.

mangari-rajender
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మిగతా ఉద్యోగుల్లా కాకుండా నిర్ణీత కాలం అయిపోగానే రావాల్సిన ప్రమోషన్ వస్తుంది. అయినా వాళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా దర్యాప్తులు చేస్తూ ఉంటారు. దీనినుంచి బైటపడినప్పుడే న్యాయపాలన దేశంలో అమలయ్యే అవకాశం ఉన్నది. సునందా పుష్కర్ కేసులో ఏం జరిగిందా అన్నది అప్రస్తుతం. కానీ పోలీసులు దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. శశిథరూర్ కేసులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

708
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles