కర్ణాటకలో తేలిన మూడు అంశాలు

Thu,May 17, 2018 01:31 AM

కర్ణాటకలో చివరికి ఎవరి ప్రభుత్వం ఏర్పడినా, ఎన్నికల ఫలితాలు మాత్రం మూడు విషయాలను స్పష్టం చేస్తున్నాయి. మొదటిది, అయిదేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, బీజేపీ బలం గణనీయంగా పెరుగగా, జేడీ(ఎస్) తన బలాన్ని ఇంచుమించు నిలబెట్టుకోవడం. రెండవది, అధికారంలో ఉన్న ఎవరినైనా అభివృద్ధి, ప్రజల సంతృప్తి మాత్రమే నిలబెట్టగలవు తప్ప రకరకాల ఎత్తుగడలు కావన్నది. మూడవది, దేశ రాజకీయాలు క్రమంగా బీజేపీ వర్సెస్ ఫెడరల్‌శక్తుల రూపాన్ని తీసుకుంటున్నాయన్నది.
బలహీనపడిన ఒక సెంట్రలిస్ట్ పార్టీ స్థానంలో మరొక సెంట్రలిస్టు పార్టీ వేగంగా ప్రవేశిస్తున్నది. కాంగ్రెస్ వంటి తప్పులే తను కూడా చేస్తున్నది. ఇండియా వంటి మహా వైవిధ్య దేశంలో పేర్లు ఏవైనా, రూపాలు ఏవైనా, ప్రాతినిధ్యశక్తులు ఏవైనా, కేంద్రీకృత ధోరణలకు-ఫెడరల్ ధోరణులకు మధ్య వైరుధ్యాలు-సంఘర్ణణలు క్రీస్తు పూర్వ కాలం నుంచే ఉన్నాయి. వాటి ఫలితాలను చరిత్ర నమోదు చేసింది. అదే చరిత్ర దృశ్యాలను అవే శక్తులు పునరావిష్కరిస్తున్నాయి కావచ్చు.


ఇప్పుడు ఈ మూడింటిలో ఒక్కొక్క విషయాన్ని చూస్తే.. సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా సొంత మెజారిటీతో అయిదేండ్ల పాటు పరిపాలించింది. తాజా ఎన్నికల్లో సీట్లు 122 నుంచి 54 తగ్గి 78కి పడిపోయాయి. ఓట్ల శాతం 36.59 నుంచి 38కి పెరుగటాన్ని చూపి కాంగ్రెస్ సంతృప్తి చెందవచ్చు. ఓట్లు 1.41 శాతం పెరిగినా సీట్లు 54 తగ్గటం ఏమిటి? ఇందులో మిస్టరీ ఏమీ లేదు. ప్రధా న పార్టీలు మూడు కాకుండా ఇతరులు అనబడేవారికి 2013లో 23.33 శాతం ఓట్లు రాగా ఈసారి 7.44 శాతానికి తగ్గాయి. అట్లా తగ్గిన 15.89 శాతం ఇతరుల ఓట్లలో కాంగ్రెస్‌కు 1.44 శాతం మాత్రమే రాగా, అధిక శాతం బీజేపీకి లభించాయి. కనుక ఓట్ల శాతం 2013 కన్నా ఇప్పుడు 1.41 పెరుగటంలో కాంగ్రెస్ సంతృప్తిపడగలిగింది ఏమీ లేదు. తగ్గిన ఇతరుల ఓట్లలో అత్యధికం బీజేపీవైపు మళ్లటం గురించి వారు విచారించాలి. ఆ విధంగా కాంగ్రెస్‌కు ఇది ఏవిధంగా కూడా వివరించుకోలేని స్పష్టమైన ఓటమి.

అదే సమయంలో ఇందులో సరిగా అర్థం కానిది ఒకటుంది. సిద్ధరామ య్య పాలన పట్ల యాంటీ-ఇన్‌కంబెన్సీ అనదగ్గది పెద్దగా ఏమీలేదన్న ది అందరు విశ్లేషకులు, సర్వేయర్లు చెప్పిన మాట. ముఖ్యమంత్రి అభ్యర్థుల సర్వేలలో తనకే మొదటిస్థానం లభిస్తూ వచ్చింది. ఆయన పథకా లు అనేకం మంచి జనాదరణను పొందాయి. అవినీతి ఆరోపణలు అం టూ ఏమీ లేవు. ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా అందరికీ గౌరవాదరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇదంతా ఎన్నికలఫలితాలలో ఎందుకు కన్పిం చలేదు? ప్రస్తుతానికి తోస్తున్నది మాత్రం ఒకటున్నది. ప్రజల ఓటు తీరు ను (ఎలెక్టోరల్ బిహేవియర్) ప్రభావితం చేసేవి అనేకం ఉంటాయి. పైన పేర్కొన్న సిద్ధరామయ్య పాజిటివ్ లక్షణాల వంటివి తప్పకుండా ప్రధానమైనవే. కానీ అదే సమయంలో ఇతర అంశాలు కూడా ఉంటా యి. కర్ణాటక ఎన్నికలు అనండి లేదా మరొకటి అనండి, ఒక నిర్దిష్ట సందర్భంలో పాజిటివ్ లక్షణాలు ఎంత ప్రభావితం చేస్తాయి? లేదా ఇతర అంశాలలో ఏది, ఎంత వరకు ప్రభావితం చేస్తుందనేది ఆ సందర్భపు పరిస్థితులను బట్టి ఉంటుంది. ఆ విధంగా కర్ణాటకలో ఏమి జరిగిందన్నది అధ్యయనం చేయవలసిన విషయం.

అయితే అన్ని అంశాల ను దృష్టిలోకి తీసుకుని వ్యవహరించటం సమర్థ నాయకత్వం చేయవలసిన పని. అందులో కాంగ్రెస్ పార్టీ, సిద్ధరామయ్యల వైఫల్యం ఉన్నది. అంతేకాదు. తన పాలనలో వ్యక్తిగతంగా తన నాయకత్వంలో పాజిటివ్ లక్షణాలు తగినన్ని ఉన్నట్లు నమ్మితే వాటి గురించే నొక్కి చెప్తూ, తిరిగి అధికారమిస్తే మరింత మంచిపాలన పలాన విధంగా ఇవ్వగలనని ఒప్పించటానికి బదులు, అంతకుమించి ఇతర ఎత్తుగడలు రకరకాలుగా చేయటం బెడిసికొట్టినట్లు అనిపిస్తున్నది.

కాంగ్రెస్‌ది ఎంత స్పష్టమైన పరాజయమో, బీజేపీది అంత స్పష్టమైన విజయం. ఆ పార్టీ ఓట్లు 2013లో 19.89 శాతం కాగా, ఇప్పుడు 16.35 శాతం పెరిగి 36.24 శాతానికి చేరాయి. సీట్లు 40 నుంచి 64 పెరిగి 104 అయ్యాయి. అతిపెద్ద పార్టీగా ఏర్పడి, మెజారిటీకి 8 సీట్ల దూరంలో ఆగింది. ఇవన్నీ అసాధారణమైన పెరుగుదలలు. 2013-2018 మధ్య 2014లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. వాటితో పోలిస్తే ఓట్ల శాతం 7.13, అసెంబ్లీ ఆధిక్యతలు 28 తగ్గిన మాట నిజం. అప్పటి అసెంబ్లీ ఆధిక్యతలు 132 అయినందువల్లనే కావచ్చు బీజేపీ నాయకత్వం ఈసారి దాదాపు అన్ని సీట్లలో గెలువగలమని అంచనాలు వేసిం ది.

కానీ 2014 నాటి నరేంద్రమోదీ ప్రభావం తర్వాత కాలంలో దేశమంతటా తగ్గుతున్నతీరు కనిపిస్తున్న వాస్తవం. అదే ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తేలింది. లేనట్లయితే, మోదీ ఉధృతికి కాంగ్రెస్ వైఫల్యాలు తోడై, బీజేపీకి 2014 లోక్‌సభ నాటి 132 అసెంబ్లీ ఆధిక్యతలు ఇంకా పెరిగి 150 దాటవలసింది. ఆ విధంగా చూసినప్పుడు, బీజేపీకి సొంతబలం, పలు వ్యూహాలు ఎంత కలిసి వచ్చాయో, కాంగ్రెస్ వైఫల్యాలు అంతగా కలిసి వచ్చినట్లు చెప్పాలి. పోతే, మొత్తం కర్ణాటకలో భౌగోళిక ప్రాంతాలు ఆరున్నాయి. అవి బెంగళూరు, మధ్య కర్ణాటక, కోస్తా కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక, దక్షిణ కర్ణాటక. ఈ ఆరింటిలోనూ కాంగ్రెస్, బీజేపీలు విస్తరించి ఉన్నాయన్నది ఒక వాస్తవం. బలాబలాలు ఒకో ఎన్నికలో ఒకో విధంగా కొంత అటు ఇటు అవుతున్నా ఇరువురూ స్థిరంగానే ఉన్నారన్నది మరొక వాస్తవం. అనగా, బలమైన మూడవ పార్టీ అయిన జేడీ (ఎస్)ను అట్లుంచితే, కాంగ్రెస్-బీజేపీల మధ్య రాజకీయ వైరం పూర్తిగా అటు ఇటు అనదగ్గట్లు తేలేది కాదు. ఈలోగా ఇరువురి మధ్య దోబూచులాటలు సాగుతుంటాయి. జేడీ(ఎస్) వైఖరి కూడా అందులో పాత్ర వహిస్తుంటుంది.

జేడీ(ఎస్)కు పాత మైసూరు-వొక్కళిగల పార్టీ అనే ముద్ర ఉన్నప్పటికీ మొత్తం ఆరు ప్రాంతాల్లోనూ సీట్లు లభించటం గమనించదగ్గది. ఈ పరిస్థితి ఇప్పటిదే గాక గతంలోనూ ఉన్నది. ఓట్ల శాతం కూడా ఆరు ప్రాం తాల్లోనూ తగినంత ఉన్నది. ఆ సంఖ్యలన్నింటి వివరాలలోకి ఇక్కడ వెళ్లలేం గానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీట్లు 2013 నాటి 40 కన్నా రెండు మాత్రమే తగ్గి 38 దగ్గర నిలిచాయి. ఓట్ల శాతం తగ్గుదల 1.87. రెండు పెద్ద పార్టీలను, జాతీయ పార్టీలను, ఒక ప్రధానమంత్రి పార్టీని, ఒక ముఖ్యమంత్రి పార్టీని, ఆ రెండింటి ధనబలాలను తట్టుకుంటూ జేడీ(ఎస్)ఈ విధంగా తన బలాన్ని నిలబెట్టుకోగలుగటం మామూలు విషయం కాదు. ఇతరత్రా రాష్ట్రంలో, దేశంలోని పరిణామాలు, సమీకరణాల మధ్య కింగ్ మేకర్ లేదా కింగ్ వంటి కీలకమైన స్థానంలో ఆ పార్టీ ఈరోజున నిలువగలిగింది. ఆ పార్టీ స్వభావాన్ని, భౌగోళిక పునాదులను గమనించినప్పుడు, ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే సూచనలున్నాయి. తన రీతిలో తానుగా అది ఒక ఫెడరల్ శక్తి. నిజానికి కర్ణాటకలో అది ఒక్కటే ఫెడరల్ ధర్మం గల పార్టీ.

ఇప్పుడు రెండవ విషయానికి వస్తే.. ఓటర్లను ఓటింగ్ సమయంలో, ప్రజలందరినీ అన్నివేళలా ప్రభావితం చేసేది, సంతృప్తిపరిచేది సక్రమమైన అభివృద్ధి, ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన మాత్రమే. ఇందు కు ఆయావర్గాలను బట్టి, కారణాలను బట్టి కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. నూటికి నూరు శాతం అభివృద్ధి, సంతృప్తి అనేది ఏ పాలకునికి, ఏ సైద్ధాంతిక వ్యవస్థకూ సాధ్యమయ్యేది కాదు. కనుక మనం మాట్లాడుతున్నది స్థూలమైన అర్థంలోనే. అటువంటిది చేయని పాలకు లు, చేయలేనివారు తాము చేసిన దానిపట్ల తమకే నమ్మకం లేనివారు, చేసిన దానితో ప్రజలను మెప్పించలేమనే సందేహాలు కలవారు మాత్ర మే ఎన్నికల సమయంలో రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతుంటారు. అందులో సిద్ధరామయ్య ఏమిటన్న పూర్తి పరీశీలనలు మనకు లేనందు న ఆయన విషయం వదలివేద్దాం. కానీ సాధారణంగా ఆలోచించినా, తాత్కాలికంగా ఏవో అసాధారణ పరిస్థితులు ఏర్పడకపోయినా, ఇతర త్రా మాత్రం అభివృద్ధి-ప్రజల సంతృప్తి, ప్రజాదరణ అన్నవి పైన పేర్కొ న్న సూత్రాలపైనే ఆధారపడి ఉంటాయి. ఇది ఇక్కడ కొత్తగా కనుగొని చెప్తున్న మాట కాదు. అందరూ గుర్తుంచుకోవలసిన విషయం.
Takashala
మూడవ విషయానికి వస్తే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారు ఒక దశాబ్ద కాలాన్ని వదిలివస్తే, తర్వాత కాంగ్రెస్ ఒక సెంట్రలిస్టు శక్తిగా రూపుదిద్దుకున్నా కొద్దీ, 1970లు వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ ఫెడరల్‌శక్తులు అనే పరిస్థితి ఏర్పడింది. ఈ రెండింటి మధ్య వైరుధ్యాలు, సంఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి తన స్వీయ వైఫల్యాలు కూడా తోడు కాగా తీవ్రంగా నష్టపోయింది. ఫెడరల్ పార్టీల మద్దతు లేనిదే కేంద్రంలో అధికారం లభించని స్థితిలో వారికి తానే మద్దతునివ్వటం, తిరిగి మోసం చేయటం వంటివి చరణ్‌సింగ్, చంద్రశేఖర్‌ల విషయంలోజరిగి, తానే ఆ పార్టీల మద్దతు తీసుకోవటం 2004తో మొదలైంది. 2004, 2009 లో కాంగ్రెస్ సీనియర్ భాగస్వామిగా యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడగా, రాగల 2019 ఎన్నికల తర్వాత తాను జూనియర్ భాగస్వామిగా మారి అయినా సరే బీజేపీని ఆపేందుకు మానసికంగా సిద్ధపడుతున్న సూచనలున్నాయి. ఇదీ ఒక సెంట్రలిస్టు పార్టీ పరిణామక్రమం. అందుకు ఒక కొనసాగింపే కర్ణాటకలో 78 సీట్లు గెలిచినా తాను, 38 స్థానాలు వచ్చిన జేడీ(ఎస్) అనే ప్రాంతీయ పార్టీకి జూనియర్ భాగస్వామి అయేందుకు సిద్ధపడటం.

బలహీనపడిన ఒక సెంట్రలిస్ట్ పార్టీ స్థానంలో మరొక సెంట్రలిస్టు పార్టీ వేగంగా ప్రవేశిస్తున్నది. కాంగ్రెస్ వంటి తప్పులే తను కూడా చేస్తున్నది. ఇండియా వంటి మహా వైవిధ్య దేశంలో పేర్లు ఏవైనా, రూపాలు ఏవైనా, ప్రాతినిధ్యశక్తులు ఏవైనా, కేంద్రీకృత ధోరణలకు-ఫెడరల్ ధోరణులకు మధ్య వైరుధ్యాలు-సంఘర్ణణలు క్రీస్తు పూర్వ కాలం నుంచే ఉన్నాయి. వాటి ఫలితాలను చరిత్ర నమోదు చేసింది. అదే చరిత్ర దృశ్యాలను అవే శక్తులు పునరావిష్కరిస్తున్నాయి కావచ్చు.

776
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles