ఫెడరల్ ఫ్రంటే ప్రత్యామ్నాయం

Thu,May 17, 2018 01:29 AM

తెలంగాణలో అమలవుతున్న పథకాలే జాతీయపార్టీలకు గుబులు రేపుతున్నాయి. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయనకున్న భయం ఆయనకున్నది. అన్నీ కలిసివస్తే 2019 ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా మారుతుందనడంలో ఆశ్చర్యం లేదు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపో యింది. అధికారం అందుకోవాలన్న పార్టీలకు జేడీఎస్ కీలకంగా మారిం ది. ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్‌కు భేషరతు మద్దతు తెలుపగా, అతిపెద్ద పార్టీగా తమకే అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరుతున్నది. మునుముందు అక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా ఆపగలుగుతాయా? అన్న విషయాన్ని పక్కనపెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల కిందట బెంగళూరు పర్యటన సందర్భంగా వేసిన అంచనాలు, చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కీలకంగా మారుతుందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు 78 స్థానాలు వస్తే, అసలు సత్తానే చాటదన్న జేడీఎస్ 38 స్థానాలతో కీలకంగా మారింది!

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున కర్ణాటకలోని కోటి మందికి పైగా ఉన్న తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక ఆయన అనుకూల మీడియా ఒక అడు గు ముందుకేసి కర్ణాటకలో బీజేపీ ఓడిపోతుందని, అక్కడ ఉన్న తెలుగువారి వద్దకు ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతలను ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తారా అని నిలదీస్తున్నట్లు కథలు, కథలుగా వార్తలు వండి వార్చారు. ఈ మీడియా వార్తలను నమ్ముకున్న టీడీపీ నేత లు బీజేపీ మీద ఒంటికాలి మీద లేచారు. ఫలితాలు చూశాక ఇప్పుడు కళ్లు తేలేశారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గతంలో కన్నా అధిక స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. నాలుగేళ్లు బీజేపీతో అధికారం పంచుకుని ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా నాటకానికి తెరలేపిన చంద్రబాబు అక్కడి తెలుగు ప్రజలు విశ్వసించలేదని తేలిపోయింది.

ఇదే సమయంలో దేశంలో సంకీర్ణ రాజకీయాల కాలం మళ్లీ రాబోతున్న ది, ప్రాంతీయపార్టీల దయాదాక్షిణ్యాల మీదనే జాతీయపార్టీల మనుగడ అన్న కేసీఆర్ అంచనాలకు అనుగుణంగా కర్ణాటక ఫలితాలున్నాయి. ఉత్తరాదిన క్రమంగా బీజేపీ ప్రభ మసకబారుతున్నది.అత్యధిక రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చినా నోట్లరద్దుతో సామాన్యులు బ్యాంకులు అంటే భయపడే స్థాయికి తీసుకువెళ్లి, ఏటీఎంలు మూతపడేలా చేసిన మోదీ వైఫల్యాలకు లోక్‌సభ ఎన్నికల్లో సమాధానం లభిస్తుంది. కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్ సహకారంతో భావోద్వేగాలను సానుకూలంగా మల్చుకొని బీజేపీ లాభపడింది. అందుకే 36.2 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 104 స్థానాలు గెలిస్తే, 38 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ 78 స్థానాలకు పరిమితం అయ్యింది. అయితే ఈ సూత్రం లోక్‌సభ ఎన్నికల్లో పనిచేసే అవకాశం ఎంత మాత్రం లేదు. 2014 ఎన్నికలకు ముందు మోదీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ దేశ ప్రజానీకం నల్లడబ్బు వెనక్కి తెస్తారని, నోట్ల రద్దుతో ఏదో మాయ చేస్తాడని భావించారు. కానీ సామాన్యుల ఆశలకు అనుగుణంగా మోదీ ఎక్కడా పనిచేయలేదు. బ్యాంకులను కొల్లగొట్టిన వ్యాపారవేత్తలు దేశం దాటిపోయిన తీరు కళ్లముందు కనిపిస్తున్నది. వారి రుణాలను కూడా రద్దుచేసి సామాన్యుల నెత్తిన రుద్దడం మోదీ పాలనా తీరుకు నిదర్శనం.

ప్రతీ రాష్ర్టానికి ఒక్కో వ్యూహంతో దేశంలోని అన్ని రాష్ర్టాలనూ తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో మోదీ, అమిత్‌షా ద్వయం ముం దు కు వెళ్తున్నది. దాంతో పాటు బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పడకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలోనూ మోదీ ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలను పేర్లు మార్చి కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ప్రజలకు దగ్గరైన బీజేపీ, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బలపడితే తమకు ఇబ్బంది అన్న ఆలోచనలో ఉన్నది. వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఎనిమిది వేలు, రైతులకు రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, కళ్యాణలక్ష్మి పథకం లాంటి పథకాలతో సబ్బండవర్గాల అభివృద్ధికి ప్రణాళికతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ, వివిధ రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు ఇంత స్పష్టమైన ప్రణాళికతో సంపూర్ణ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన దాఖలాలు లేవు. కేసీఆర్‌కు ఈ దేశం మీద ఉన్న స్పష్టమైన అవగాహన, సమ గ్ర ప్రణాళిక ఇప్పుడు దేశంలోని ప్రజల దృష్టిని ఆకర్షిస్తే తమకు ఇబ్బందికరం అన్నది బీజేపీ ఆందోళన. ఇప్పటికే రైతుబంధు పథకం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వివిధ రాష్ర్టాల్లో అమలు కోసం అక్కడి రైతులు పట్టుబడుతున్నారు. మహారాష్ట్రలో స్వాభిమాన్ షెట్కారీ సంఘట న్ అధినేత, పార్లమెంటు సభ్యుడు రాజుషెట్టి రైతుబంధు పథకం పరిశీలించేందుకు జూన్ లో తెలం గాణలో పర్యటిస్తానని ప్రకటించారు. ఆంధ్రాలో సీనియర్ రాజకీయనేత వడ్డే శోభనాదీశ్వరరావు, రైతు సంఘం నేత, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ఈ పథకాన్ని ప్రశంసించారు.
Sandeepreddy
తాజాగా తెలంగాణలో రైతుకు జీవిత బీమా పథకం త్వరలో అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీనికి సంబంధించి బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లించనున్నది. భవిష్యత్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దీన్ని కొనసాగించేలా పకడ్బందీగా రూపొందిస్తున్నది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో పథకం రూపొందించాం. దాన్ని చట్టం గా మార్చాం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా 15 రోజుల్లోపు అనుమతులు ఇచ్చేయాలి. 16వ రోజు తరువాత అనుమతులు ఇవ్వకున్నా ఇచ్చినట్లే లెక్క. రేపు అధికారంలో మేం కాకుం డా మరొకరు వచ్చినా ఈ విధానం తప్పకుండా అమలు చేయాల్సిందే. అధికారంలో ఎవరున్నా అంతిమంగా ప్రజలకు మేలు జరగాలన్నదే మా లక్ష్యం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నదో ఆ మాటలతో అర్థం అవుతున్నది. తెలంగాణలో అమలవుతున్న పథకాలే జాతీయపార్టీలకు గుబులు రేపుతున్నాయి. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయనకున్న భయం ఆయనకున్నది. అన్నీ కలిసివస్తే 2019 ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా మారుతుందనడంలో ఆశ్చర్యం లేదు.

608
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles