కౌలు రైతు కొర్రీ సరికాదు

Mon,May 14, 2018 11:23 PM

రైతుకు ఆసరాగా ఉండేందుకు, వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చరిత్రాత్మక రైతుబంధు పథకాన్ని అభాసుపాలు చేయాలనే కుట్రలో భాగంగా ఎత్తుకున్న ఈ కౌలు రైతు కొర్రీని ఇప్పటికైనా మానుకోవాలె. లేకుంటే రైతులే స్వయంగా బుద్ధిచెప్పడం ఖాయం.
నువ్వు కొనుక్కున్న కారుకు డ్రైవర్‌ను ఎవ్వలను పెట్టుకోవాల్నో నేను చెప్తే ఎట్లుంటది.?
నువ్వు కట్టుకున్న ఇంటిని ఎవలికి కిరాయి ఇయ్యాల్నో నేను ఆదేశిస్తే ఏమంటవ్.?
నేను సంపాయించుకున్న ఆస్తిని ఎవలకు రాసియ్యాల్నో నువ్వు కోర్టుకెక్కితే ఏమంటరు దాన్ని.?
నీకు నచ్చిన మనిషిని పెండ్లి చేసుకోవాలని అవుతలోల్లను ఒత్తిడి చేస్త మా..? అట్టా చేసేటోల్లను ఏమంటం.?
అగో.. పట్టాదారు రైతు భూమ్మీద, కౌలు రైతుకు హక్కులు కేటాయించాలని, ప్రభుత్వాన్ని ఒత్తిడిచేసే ప్రయత్నం చేస్తున్న మేధావులది, పెదాలు విరిసే ఉద్యమకారులది కూడా అదే పరిస్థితి.
నీ ఇల్లును ఎవలికి కిరాయికి ఇయ్యాల్నో.. నువ్వెవల్ని పెండ్లి చేసుకోవాల్నో చెప్పినట్టే.. రైతుకు తెల్వకుంటా కౌలుదారుకు సాయంచేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నరు. కొన్ని మీడియాలు, మేధావులు.
అసలిది ఎట్లా సాధ్యమైద్దో కనీసం ఆలోచించకుండా అడ్డగోలుగా మాట్లాడేటోళ్లను ఏమనాలె.?

ప్రభుత్వమే ఒకవేల కౌలు రైతుకు ఏదన్నా డైరక్టుగా సాయం చేయాలనుకున్నదే అనుకో కార్యాచరణలో సాధ్యమయిద్దా? కౌలుదారుకే పంట సాయం చేయాలనుకో.. ఎట్లియ్యాలె.? ఎవరికి ఇయ్యాలె.?
ఆయిటికి ముందు ఇచ్చే పంటపెట్టుబడి రైతుబంధు పథకాన్ని ఒక కౌలు రైతుకియ్యాలంటే ముందస్తు రెవెన్యూ రికార్డులు మేంటేన్ చేయంది సాధ్యమైద్దా.?
పట్టాదారు రికార్డులను ప్రక్షాళన చేయడానికి వాటిని మేంటేన్ చేయడానికే అంత కష్టమైతుంటే, ఏ రోజుకారోజు మారే కౌలుదారు వివరాలను రెవెన్యూ రికార్డులు మేంటేన్ చేయాలంటే అయ్యే పనేనా.?
ఆయిటికి ముందియ్యాలంటే ఒక ఏడు ముందలినించే సదరు కౌలు రైతు వివరాలు నమోదు చేయాలె గదా. మరి అట్లా ఒక భూమికి రెండుతీర్ల రికార్డులు మేంటేన్ చేసుడు సాధ్యమైతదా.?
అసలట్ల పట్టాదారు రైతు ఒప్పుకుంటడా? తన భూమిని ఇతరుల పేరుమీద పెట్టి రికార్డులు మేంటేన్ చేస్తనంటే రైతు ఒప్పుకుంటడా.? అయినా.. ఎవరికి కౌలుకు ఇయ్యాలనేది ఎన్నేండ్లియ్యాలె అనేది రైతు నిర్ణయిస్తడా.. ప్రభుత్వం నిర్ణయిస్తదా.? ఒక్కేడు ఒకరికియ్యొచ్చు మల్లొ చ్చే ఏడు యింకోలకియ్యొచ్చు.. ఒకాయిన చేయలేక నడుమల్నే వొదలిపెట్టిపోతడు కౌలు.. ఇగ వీల్లు ఎట్లెట్ల యవ్వారాలు చేసుకుంటే అట్లట్ల రికార్డులు మేంటేన్ చేయాల్నా..? అట్లయితదా..?
ఒకసారి అఫీషియల్ రికార్డులకెక్కినంక కౌలు రైతు ఎదురుతిరిగి.. నేను నాలుగేండ్ల నుంచి ఈ భూమిని దున్నుతన్న, ఇప్పుడు పొమ్మంటే ఎట్లా.. నీను పోను.. నాకు లాసొచ్చిందనో, ఇంకోటనో పట్టాదారు రైతును తిప్పలబెడితే అప్పుడు ఎవలు బాధ్యులు.? పైసలు పంచిన ప్రభు త్వం ఏం చేయాలె.? వాళ్ల పంచాయితీ తెంపుకుంట కూసోవాల్నా.? యి గ రెవెన్యూ డిపార్టుమెంట్‌కు ఇంకో పనిలేదా.?

ఈ ఆంధ్రా మీడియా, ఆంధ్రా ఉద్యమకారులు కౌలు కౌలు అని డిమాండు చేస్తున్నట్టు గనుక ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెడితే భూమున్న రైతులు కౌలుకిచ్చుడు చేస్తరా..? ఎందుకొచ్చిన లొల్లి.. మందికిచ్చుడెందుకు మల్ల లేనిపోని లొల్లి ఎందుకు అని భయపడి అసలు భూమినే దున్నకుంట పడావుపెడితే బాధ్యుడెవరు.? అట్లా రైతులు భయపడి, వ్యవసాయ భూములన్నీ పడావుపడితే పంటల దిగుబడి తగ్గి తిండి గింజలకే ప్రమాదం రాదా.? దీనికెవలు బాధ్యత వహిస్తరు.? కౌలు ఇవ్వ డం తీసుకోవడం అనేది ఒక వ్యక్తి సొంత ఆస్తిని.. అంటే పైసలయితే అప్పుకిచ్చినట్టు, ఇళ్లయితే కిరాయికిచ్చినట్టు కదా. మరి అసొంటి వ్యక్తిగత వ్యవహారాలల్ల ప్రభుత్వం ఎట్లా జోక్యం చేసుకుంటది? ఇది కామన్‌సెన్స్ వ్యవహారం కదా.. ఇంత చిన్న లాజిక్ ఈల్లకు ఎందుకు అర్థం కావట్లేదు?
వీల్లకే కౌలు రైతుమీద ప్రేమున్నట్టుగని.. తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నట్టా.?
వ్యవసాయరంగాన్నే మొత్తంగా ఓ పాలసీగా తీసుకోని దాని అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వేరు. రైతు తనకున్న భూమిని దున్నుకోవడానికి ప్రభుత్వం తనవంతుగా పంట పెట్టుబడికి సహకరించ డం వేరు. ఈ రొండింటిని తెలివిగా కలిపి అతిక తెలివితోని జనాన్ని కన్ఫ్యూజ్ చేసే కుట్రలకు పాల్పడుతున్నరు కొందరు. అటువంటి ప్రయ త్నం వ్యవసాయరంగానికి మేలు చేయదు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం కోటి ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం, ఎరువుల సబ్సిడీ, విత్తనాల సరఫరా, వ్యవసాయాన్ని యాంత్రీకరించడం వంటి తదితర అనేక పాలసీలను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇది అటు కౌలురైతు ఇటు పట్టా రైతు మొత్తంగా వ్యవసాయరంగాభివృద్ధికి దోహదం చేస్తున్నది. అట్లనే రైతుకు వ్యవసాయం చేయడానికి వ్యక్తిగత సాయం కింద పంటసాయం కోసం ఏడాదికి ఎనిమిది వేలు అందిస్తున్నది. పాలసీ వ్యవహారం వేరు, వ్యక్తిగత సాయం వేరు. సాగునీటిని కౌలు రైతుకియ్యం అని ఎవలన్నా అన్న రా.? అది ఓవరాల్ అభివృద్ధి. ఇదెందుకు అర్థం కావట్లేదు వీళ్లకు.?

ఒకవేళ పంటసాయం పైస లు వ్యవసాయం చేసే కౌలు రైతుకు కూడా చెందాలనుకోవ డం మంచిదే. దాన్ని ప్రభుత్వంతో సహా ఎవలూ కాదనరు. కానీ అది కార్యాచరణలో తీవ్ర సమస్యలను తయారుచేస్తది. కౌలు రైతుకు సాయం అందాలని వాదిస్తున్న వాళ్లు. ఆ దిశగా రైతులను ఎందుకు చైతన్యం చేసే ప్రయత్నాలు చేస్తలేరు.? మీరు కౌలుకిస్తున్నవాళ్లకే మీరు ఎత్తుకున్న పంటసాయం డబ్బులను అందజేయాలని గ్రామాల్లో రైతులను కూడేసి కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేయండి అప్పుడు తెలుస్తది. క్షేత్రస్థాయి కష్టాలు.
ఇదంతా కేవలం ఇద్దరి నడుమ వ్యవహారం. కౌలు తీసుకునేముందు సదరు రైతును కౌలుదారు అడుగాలె. ఆయన ఏమంటడో ఇనాలె.. ఇస్తే తీసుకోవాలే, లేకపోతే వదిలిపెట్టి ఇంకోలది పట్టాలె కౌలుకు. లేదంటే ఆ ఊల్లె కౌలు రైతులందరు కూసోని ఓ నిర్ణయం తీసుకోవాలె. ప్రభుత్వం ఇచ్చిన పంటసాయాన్ని మనకు రైతు ఇస్తనంటేనే చేద్దాం లేకుంటే లేదు అనో నిర్ణయం తీసుకోవాలె. అట్ల ఇంకేదో ఉపాయం చేసుకోవాలె. నచ్చచెప్పుకోవాలె రైతుకు. కానీ దాన్నో డిమాండుగా మార్చి లొల్లి చేస్తమంటే అసలుకే మోసం వస్తది.
ఇంట్లె కిరాయికి ఇష్టం లేకపోతే ఇల్లు ఖాళీచేసి ఎల్లిపోవాలె. లేదంటే ముందుగాల్నే మాట్టాడుకోవాలె. అగ్రిమెంట్ రాసుకోవాలె. కౌలు వ్యవహారం కూడా అంతే. ముందుగాలనే అగ్రిమెంట్ రాసుకోవాలె. ఒకవేళ ముందుగాల అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఎవలు నడువకున్నా సక్క గా చేయడానికి చట్టాలున్నయి. న్యాయస్థానాలున్నయి. ఆడ తేల్సుకోవాలె. కానీ అది రెవెన్యూ డిపార్టుమెంట్‌దో, ప్రభుత్వానిదో కాదుగా పని.
ramesh-hajari
రైతుకు ఆసరాగా ఉండేందుకు, వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చరిత్రాత్మక రైతుబంధు పథకాన్ని అభాసుపాలు చేయాలనే కుట్రలో భాగంగా ఎత్తుకున్న ఈ కౌలు రైతు కొర్రీని ఇప్పటికైనా మానుకోవాలె. లేకుంటే రైతులే స్వయంగా బుద్ధిచెప్పడం ఖాయం.

601
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles