బుజ్జగింపులు ఇక చాలు

Tue,March 13, 2018 11:58 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కొత్త అఫ్ఘానిస్థాన్ వివాదం పాకిస్థాన్‌ను గందరగోళంలో పడేసింది. రెండు నెలల తర్వాత కూడా ఈ మనస్థితి నుంచి బయటపడటం లేదు. అమెరికా ఉగ్రవాద పోరాటానికి తాను మద్దతు ఇచ్చానని గుర్తుచేసింది. అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా కూటమి దళాలకు పాకిస్థాన్ మీదుగా సరఫరాలు అందకుండా అడ్డుకుంటామని పాకిస్థాన్ పార్లమెంటు హెచ్చరికలు కూడా చేసింది. పాకిస్థాన్ తాలిబన్లకు ఆశ్రయం ఇచ్చినా, హక్కానీ ఉగ్రవాద సంస్థకు తోడ్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. అన్నిటికి మించి అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవలసిందిగా ట్రంప్ భారత్‌కు సూచించడం పాకిస్థాన్‌కు వణుకు పుట్టించింది. పాకిస్థాన్ రాజకీయ నాయకులు, సైనికాధికారులు, విశ్లేషకులు భారత్‌కు ట్రంప్ చేసిన సూచనను తప్పుపడుతున్నారు. అఫ్ఘానిస్థాన్‌లో భారత్ ప్రమేయం పాకిస్థాన్‌కు ప్రమాదకరమని అంటున్నారు. అఫ్ఘానిస్థాన్‌లో పెత్తనం చేయాలనే ఉబలాటం పాకిస్థాన్‌కు బాగా ఉన్నది. దీనికితోడు జిహాదీలను తురుపు ముక్కలుగా వాడుకుంటూ, భారత్‌తో కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగాలని అమెరికాను కోరుతున్నది. కశ్మీర్‌లో సంక్షోభం సృష్టించి, భారత్ నుంచి భద్రతాసమస్య ఉన్నదని చెబుతూ అమెరికాను మధ్యవర్తిగా రమ్మని కోరుతున్నది. పాకిస్థాన్ చేస్తున్న ఈ ప్రతిపాదన ప్రమాదకరమైనది.

పాకిస్థాన్ ప్రధాని షహీద్ ఖాఖాన్ అబ్బాసీ ఇటీవల విదేశీ సంబంధాల మండలిలో ప్రసంగిస్తూ అఫ్ఘానిస్థాన్‌లో భారత్ రాజకీయ, సైనిక పాత్ర ఏ మాత్రం ఉండకూడదన్నారు.అఫ్ఘానిస్థాన్‌కు భారత్ తోడ్పాటు అందించడంపై పాకిస్థాన్ గులుగుతుండటం ఇది తొలిసారి కాదు. భారత్‌కు స్థానం కల్పించకూడదని, పాకిస్థాన్ తనకు సూచించిందని అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయి గతంలో వెల్లడించారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాకు అప్పటి పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఇటువంటి సూచనలే చేశాడు. పాకిస్థాన్ నాయకత్వం తాలిబన్ నాయకులకు తమ దగ్గర ఆశ్రయం కల్పిస్తూ, ఆ ఉగ్రవాద సంస్థను భారత్‌కు, అఫ్ఘానిస్థాన్‌కు వ్యతిరేకంగా వాడుకుంటున్నది. తాలిబన్ ఎమిర్ మహమ్మద్ ఒమర్ పాకిస్థాన్‌లోనే మరణించాడు. ఆయన వారసుడైన ముల్లా అఖ్తర్ మన్సూర్ పాకిస్థాన్‌లోనే అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు. ఆయన స్థానంలో మావ్లా వీ హయిబుతుల్లా అఖున్జాదా నియామకం కూడా పాకిస్థాన్‌లోనే జరిగింది. ఇవన్నీ గమనిస్తే, పాకిస్థాన్ తాలిబన్లకు ఆశ్రయం కల్పిస్తున్నదని స్పష్టమవుతున్నది. అయినా పాకిస్థాన్ ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తున్నది. తాలిబన్ దళాలు అఫ్ఘానిస్థాన్‌లో ఉండవచ్చు, కానీ వారిని నడిపించే పెద్దలు మాత్రం పాకిస్థాన్‌లోనే ఉన్నారు. అఫ్ఘానిస్థాన్ న్యాయబద్ధమైన భద్రత పేర పాకిస్థాన్ ఏ మాత్రం సిగ్గులేకుండా ఉగ్రవాదుల ను తన ఏజెంట్లుగా ఉపయోగించుకుంటున్నది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖావాజా ముహమ్మద్ అసిఫ్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఇదే పాట పాడారు. అఫ్ఘానిస్థాన్ భద్రత కోసం కూడా ఉగ్రవాదానికి తోడ్పాటు అందించడం నేరం.

అఫ్ఘానిస్థాన్‌లో భారత దళాలు ఉండకూడదని పాకిస్థాన్ కోరుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అఫ్ఘానిస్థాన్ ఏ దేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవాలె, ఎక్కడినుంచి అభివృద్ధి నిధులు పొందాలనేది తామే శాసిస్తామనుకోవడం పెత్తందారీతనమే. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవడమే. అఫ్ఘానిస్థాన్‌కు భారత్ రెండు వందల కోట్ల డాలర్ల మేర రుణసహాయం అందచేసింది. అధికారులకు, సైన్యానికి శిక్షణ కార్యక్ర మం చేపట్టింది. ఆ దేశంలో అనేక పునర్నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టింది. అఫ్ఘానిస్థాన్‌కు దక్షిణాసియాలోనే అత్యంత పెద్ద రుణదాత భారత్. 2002 నుంచి ఇప్పటివరకు మూడు వందల కోట్ల డాలర్ల సహాయం అందించింది. అఫ్ఘానిస్థాన్ పార్లమెంటు భవనాన్ని భారతే నిర్మించింది. సాల్మా డ్యామ్ వంటి ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించింది. 2,500 కి.మీ. పొడవైన రహదారులను నిర్మించింది. వేలాది మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నది. భారీ ఎత్తున మౌలిక వసతులను సమకూరుస్తున్నప్పటికీ కూడా అఫ్ఘానిస్థాన్‌లో భారత సైనిక దళాలు లేవు. భారత్ అఫ్ఘానిస్థాన్‌లో దళాలను దింపితే రెండు వైపులా సైన్యంతో తమ పరిస్థితి అడకత్తెరలో పోకముక్కలా తయారవుతుందని పాకిస్థాన్ కాలంచెల్లిన భావజాలంతో భయపడుతున్నది. పాకిస్థాన్ ఇప్పటివరకు నాలుగుసార్లు యుద్ధాలు చేసింది. ఏ ఒక్క యుద్ధంలో కూడా అఫ్ఘానిస్థాన్ పాకిస్థాన్ వ్యతిరేకత ప్రదర్శించలేదు. భారత్ అఫ్ఘానిస్థాన్‌లో డజన్ల కొద్ది దౌత్య కార్యాలయాలు తెరిచినట్టు పాకిస్థాన్ ప్రచారం చేస్తున్నది. కానీ భారత కార్యాలయాలు పాకిస్థాన్ కన్నా ఎక్కువేమీ లేవు. ఒక రాయబార కార్యాలయం, నాలుగు కాన్సులేట్స్ మాత్రమే ఉన్నాయి. భారత్‌కు అఫ్ఘానిస్థాన్‌లో 1970 దశకంలో ఎన్ని దౌత్య కార్యాలయాలు ఉన్నాయో ఇప్పటికీ అన్నే ఉన్నాయి.

1947-48లో పాకిస్థాన్ కశ్మీర్ వేదికగా భారత్‌తో యుద్ధానికి దిగిం ది. ఈ సందర్భంగా తన సైన్యంతోపాటు పష్టూన్ యువతను కొంత మేర జిహాద్ పేర యుద్ధంలోకి దింపింది. జుల్ఫికర్ అలీ భుట్టో హయాం నుంచి జిహాదీ బలగాలను వాడుకోవడం పాకిస్థాన్ విదేశాంగ విధానం లో భాగమైంది. భుట్టో 1973లో విదేశాంగ మంత్రిత్వశాఖలో అఫ్ఘానిస్థాన్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు దావూద్ లౌకికవాద పష్టూన్‌లకు, బెలాచీ రాజకీయవేత్తలకు, వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాలని భుట్టో భావించారు. అఫ్ఘానిస్థాన్ చర్యలకు ప్రతిగా అఫ్ఘాన్ ఇస్లామిక్ దళాలను తయారు చేయమని భుట్టో తమ సరిహద్దు దళాల సైనికాధికారి బ్రిగేడియర్ నసీరుల్లా బాబర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే బుర్హానుద్దీన్ రబ్బానీ, గుల్బుద్దీన్ హెక్మత్యార్, జలాలుద్దీన్ హక్కానీ మొదలైన నాయకులను తయారుచేసింది. జలాలుద్దీన్ హక్కానీ 1973లో హెచ్‌క్యూఎన్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణా సంస్థను నెలకొల్పాడు. దీంతో ఆయన దావూద్ ఖాన్‌కు వ్యతిరేకంగా మొదటి జిహాద్ ప్రారంభించాడు. భుట్టో ఏర్పాటుచేసిన అఫ్ఘాన్ జిహాదీలు 1975లో కాబూల్‌పై రెండోసారి జిహాద్ నడిపారు.

హక్కానీలు అమెరికా సన్నిహితవర్గమని, ఆ దేశం సూచనమేరకే తాము హక్కానీలకు మద్దతు ఇచ్చామని ఇటీవల పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఖావాజా అసిఫ్ వెల్లడించారు. అయితే ఈ అఫ్ఘాన్ జిహాదీలకు పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందనేది వాస్తవం. సోవియెట్ సేనలకు వ్యతిరేకంగా తాము అఫ్ఘాన్ జిహాదీలకు మద్దతు ఇచ్చామని పాకిస్థాన్ ఇప్పటికీ చెప్పుకుంటున్నది. కానీ సోవియెట్ సేనలు రాకముందే, అప్ఘానిస్థాన్‌లోని కమ్యూనిస్టులకు, జాతీయవాదులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ జిహాదీలను తయా రుచేసింది. అఫ్ఘానిస్థాన్‌లోని సోవియెట్ సేనలకు వ్యతిరేకంగా జిహాదీలను పెంచి పోషించడానికి పాకిస్థాన్‌కు పాశ్చాత్య దేశాలు, అరబ్ రాజ్యా లు సహాయం చేశాయి. అయితే ఈ సహాయం ఆగిపోయిన తర్వాత పాకిస్థాన్ జిహాదీలకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయలేదు. పాకిస్థాన్‌లోని బెలోచీ ప్రాంతంలో ఇప్పుడు నడుస్తున్న వేర్పాటువాద ఉద్యమానికి అఫ్ఘానిస్థాన్ మద్దతు లేదు. అఫ్ఘానిస్థాన్‌లో బెలోచీ శిక్షణ శిబిరాలు ఏమీ లేవు. అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం వారికి ఆయుధాలను అందించడం లేదు. బెలోచీ వేర్పాటువాదులకు భారత్ సహాయం చేస్తున్నది. అయితే ఈ సహాయం అఫ్ఘానిస్థాన్ ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా అందుతున్నది. ఈ విషయాన్ని బెలోచీ నాయకులు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. భారత్ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏర్పడటానికి ముందే మూడు బెలోచీ తిరుగుబాట్లు జరిగాయి. అయినా పాకిస్థాన్ ప్రభుత్వం ఆంతరంగికంగా తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి అఫ్ఘానిస్థాన్‌ను నిందిస్తున్నది. పాకిస్థాన్ పెత్తనం బెలోచీ ప్రజలలో వేర్పాటువాద కాంక్షను పెంచింది.
Ali
అఫ్ఘానిస్థాన్‌లో పెత్తనం చేయాలనే ఉబలాటం పాకిస్థాన్‌కు బాగా ఉన్నది. దీనికితోడు జిహాదీలను తురుపు ముక్కలుగా వాడుకుంటూ, భారత్‌తో కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగాలని అమెరికాను కోరుతున్నది. కశ్మీర్‌లో సంక్షోభం సృష్టించి, భారత్ నుంచి భద్రతాసమస్య ఉన్నదని చెబుతూ అమెరికాను మధ్యవర్తిగా రమ్మని కోరుతున్నది. పాకిస్థాన్ చేస్తున్న ఈ ప్రతిపాదన ప్రమాదకరమైనది. ఈ విధానం ద్వారా కశ్మీర్‌లో యధాతథస్థితిని భగ్నంచేయాలని భావిస్తున్న ది. భారత్ బూచీ అనేది పాకిస్థాన్ మానసిక సమస్యే తప్ప, భౌగోళిక సమస్య కాదు. భారత్‌కు సంబంధించి, పాకిస్థాన్ భద్రతా సమస్యలు నిజమైనవే అని అనుకున్నా, భారత్‌తో సరితూగాలని కలలు కనడం మాత్రం అర్థం లేనిది. భారత్ పాకిస్థాన్ కన్నా నాలుగంతలు పెద్దది. పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విస్తరణ కాంక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ తీరదు. అందువల్ల అఫ్ఘానిస్థాన్ ఊబి నుంచి బయటపడాలనే యావతో అమెరికా కశ్మీర్ ఉచ్చులోకి దిగకూడదు. కశ్మీర్ వివాదం ఏదో అద్భుతం జరిగి పరిష్కారం అయినా, భారత్‌తో సరితూగాలనే పాకిస్థాన్ కోరిక మాత్రం నెరవేరదు. పాకిస్థాన్‌కు భారత్ నుంచి నిజంగా భద్రతాపరమైన సమస్యలు ఉంటే పరిష్కరించవచ్చు. కానీ భారత్ పట్ల కంటగింపుగా ఉన్న పాకిస్థాన్ మానసిక జాడ్యానికి మందు లేదు. దీనికి ఏ రకమైన దౌత్య పరిష్కారం సాధ్యం కాదు. అమెరికా పాకిస్థాన్‌కు స్పష్టమైన గడువు విధించి దారికి తేవాలె. జార్జి డబ్ల్యు బుష్ కాలం నుంచి ఒబామా హయాం వరకు అమెరికా పాకిస్థాన్‌లో 35 బిలియన్ డాలర్లు కుమ్మరించింది. ఇందులో ఎక్కువభాగం పాకిస్థాన్ సైన్యానికి ఉపయోగపడింది. ఈ విధమైన బుజ్జగింపుల కాలం ముగిసింది.
(వ్యాసకర్త: పాకిస్థానీ, అమెరికన్ కాలమిస్ట్ ) ది వైర్ సౌజన్యంతో..

417
Tags

More News

VIRAL NEWS