దేశాన్ని నడుపగలిగే పాలనాదక్షుడు

Mon,March 12, 2018 11:38 PM

భారతదేశంలో కనిపించే వైవిధ్యం బహుశా ఇంకో దేశంలో లేదు. మతాలు, వాటివల్ల వైవిధ్యం అన్నిదేశాల్లో ఉన్నది. ఒకటి కంటే ఎక్కువ భాషలు అన్ని దేశాల్లో ఉన్నాయి. కానీ భారతదేశంలో కనిపించే మతాలు, కులాలు, భాషలు, సంస్కృతిలో వైవిధ్యం చాలా ఎక్కువ. ఈ దేశం బయటివారి దండయాత్రలు, పాలన వచ్చేవరకు శతాబ్దాల పాటు చిన్నచిన్న దేశాలుగా ఉండి వివిధ వంశాల రాజుల చేత పరిపాలించబడినది. విదేశీయులు రాకముందే ఇప్పుడున్న భాషలన్నీ సంపూర్ణత చెంది, తమ తమ సాహిత్య సౌరభాలతో విలసిల్లాయి. వివిధ దేశాల, ప్రాంతాల సంస్కృతి భిన్నంగా పెరిగింది.

ఆచార వ్యవహారాలు ప్రతి ప్రాంతానికీ స్థిరపడిపోయాయి. అందుకే మతాల మధ్య సంస్కృతుల్లో అంతరాలే కాకుం డా, రాష్ర్టాల మధ్య, రాష్ర్టాలలోని ప్రాంతాల మధ్య, ఒకే ప్రాంతంలో కూడా వివిధ కులాల మధ్య, వివిధ భాషలు మాట్లాడేవారి మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. మరి ఇంత వైవిధ్యభరితమైన దేశాన్ని సరి గ్గా పాలించాలంటే, సరైన దశ-దిశ ఇవ్వాలంటే ఎటువంటి నాయకుడు ఉండాలి? రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధాని చేతిలోనే పాలనా పగ్గాలుంటాయి. అంటే ప్రధానికి ఈ దేశ వైవిధ్యం గురించిన అవగాహన, సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. వాటికి పరిష్కారాలు కనుక్కోగలిగిన మేధ, వాటిని అమలుచేసే ధైర్యం ఉండాలి. ముఖ్యంగా ఏ పని ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వివరించగలిగిన నిజాయితీ ఉండాలి. ఈ గుణాలు, నైపుణ్యా లు, సమర్థతలకు తోడు విశాలత్వం, వినమ్రత, ప్రజల కష్టాల పట్ల సహానుభూతి ఉండాలి.

ఇంత వైవిధ్యం, ఇన్ని అంతరాలు ఉన్న ఈ దేశానికి ఒకే పంథాలో, పట్టు విడుపు లేకుండా స్థిరమైన వారి సొంత సిద్ధాంతాలు పాటించే రాజకీయపార్టీ పనికి వస్తుందా? ఈ దేశాన్ని పాలించగలదా? ఐదవ వంతు హిందూయేతరులు నివసించే ఈ దేశంలో సాంకేతికతను, శాస్త్రీయ దృక్పథాన్ని పక్కనపెట్టి సెంటిమెంటలిజం పెంచుతూ, ఒక మతాన్ని రెచ్చగొట్టేవారు ఈ దేశానికి మంచి చేయగలరా? బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి సామాన్య ప్రజలకు శాంతిసౌఖ్యాలు పెరిగాయా? పోనీ వారిని సమర్థిస్తున్న హిందువులకు ఒరిగిందేమిటి?దేశంలో ఉన్న వైవిధ్యాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోలేదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువైంది. 70 ఏండ్ల నుంచి ఉన్నట్టే ఉత్తర భారతీయ ప్రధానికి దక్షిణ భారతీయ సంస్కృతి, సమస్యలు కాలేదని తెలుస్తున్నది. తెలంగాణ ఏర్పాటును ఆయన తల్లిని చంపి పిల్లను తీశారని అనడం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను అవమానించడమే. వారి పోరాటాన్ని హీనపరుచడమే! అన్ని రాష్ర్టాలను సమంగా చూడవలసిన ప్రధా ని లక్షణాలు ఇవేనా? పైగా రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల అంగీకారంతో చేయవలసిన 7 మండలాలు ఆంధ్రాలో విలీనం చేయవలసిన పనిని తెలంగాణ రాష్ర్టాన్ని సంప్రదించకుండా చేయడం ప్రధాని కుంచిత బుద్ధికి నిదర్శనం కాదా? ఊరికే మాటలు చెప్పి ఎన్నికలు గెలిస్తే సరిపోదు. వచ్చిన అవకాశం ఉపయోగించుకుని ప్రజలకు నిజమైన ప్రగతి చూపిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. నిజానికి వాజపేయిని దేశమంతా మంచి, గొప్ప రాజకీయ నాయకుడి గా గుర్తించింది కానీ అఖం డ మెజార్టీ సంపాదించిన మోదీ మాత్రం ఆ ఆదరణ పొందలేకపోయాడు.

వైవిధ్యభరితమైన దేశానికి బీజేపీ అనుసరిస్తున్న సంకుచిత సిద్ధాంతాలు సరిపోవని రుజువైంది. ఇక అత్యధిక సంవత్సరాలు పరిపాలించి న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్ళటంలో ఘోరంగా విఫలమైంది. దేశంలో అవినీతి, బంధుప్రీతి పెచ్చుపెరిగి, సామాన్యుడి జీవితం దుర్భరమైపోయింది. జాతీయపార్టీగా వారు కూడా దక్షిణాది రాష్ర్టాలను పట్టించుకోలేదు. ముఖ్యంగా 2004లో రాష్ట్ర ఏర్పాటును ఒప్పుకొని ఎన్నికలు గెలిచాక తెలంగాణను మోసం చేసింది. ఈ ప్రాంత కష్టాలు, నష్టాలు ఆ పార్టీకి అర్థమే కాలేదు. ఈ అర్ధ శతాబ్దంలో పార్టీలు గా కాంగ్రెస్ కానీ, బీజేపీ గానీ దక్షిణాది రాష్ర్టాలను సరిగా అర్థం చేసుకున్నదీ లేదు, సహాయం చేసిందీ లేదు. ఇక మూడో జాతీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ. మతం గురించి అధికంగా మాట్లాడే బీజేపీ ఎందుకు విఫలమౌతుందో, కమ్యూనిస్టు పార్టీలు కూడా అటువంటి కారణానికే భారతదేశాన్ని పాలించలేరు. ఈ దేశం సంప్రదాయిక దేశం. వేల సంవత్సరాల నుంచి పాటిస్తున్న ఆచారాలు, నమ్మకాలు ప్రజలు త్వరగా ఒదులుకోలేరు. వీరు ఈ సంస్కృతిలో ఉన్న శాస్త్రీయ అంశాలను కూడా మూఢ నమ్మకాలని తాము నమ్మటమే కాకుండా జనాలను కూడా నమ్మించాలని చూస్తారు. ఇండియా లాంటి ప్రాచీన నాగరికత కలిగిన దేశంలో కమ్యూనిస్టులు ఇప్పుడే కాదు, ఇంకా వెయ్యేండ్లకు కూడా ప్రజాదరణ, గౌరవం పొందలేరు. మరి భారతదేశానికి ఎటువంటి పాలన కావాలి? ఎటువంటి నాయకుడు కావాలి?

ఒక మేధావి, ఎన్నికలు గెలువగలిగిన రాజకీయ నాయకుడు, సాహిత్యవేత్త, పండితుడు, కార్యకర్త, ప్రజ్ఞ కలిగినవక్త-ఇవన్నీ కలిగిన ఒక నాయకుడు ఉండటం సాధ్యం అన్నది ఇప్పుడే దేశం గమనిస్తున్నది. దేశానికి పనికిరాని జాతీయపార్టీలు, కేంద్రీయ పాలన మారి కేసీఆర్ లాంటి నాయకుడు సారథ్యం వహిస్తే ఒక్క దశాబ్దంలో భారతదేశం ప్రపంచ పటంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఒక గొప్ప కవి ఈ రకంగా రాశాడు యూనిటి షుడ్ నాట్ బి మిస్టేకన్ ఫర్ యూనిఫామిటీ అంటే ఏకత్వం సాధించాలంటే ఒకేలా ఉండాలని అర్థం కాదు. వైవిధ్యాలు, వైరుధ్యాలు మరిచి ఒకే దేశంలా ఉండ టం. వ్యత్యాసాలను గౌరవించటం. వివిధ మతాలు, కులాలు, జాతుల వారు సామాజికంగా కలిసిమెలిసి ఉండటం. బీజేపీ సిద్ధాంతంలాగా అందరూ హిందులవడం, ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడమూ కాదు; కమ్యూనిస్టులు బోధించేవిధంగా అన్నీ వదులుకోవటమూ కాదు. ఎవరికి నచ్చినట్టు వారు బతుకుతూ మిగతావారిని గౌరవించ టం, అభిమానించటం. నిజానికి ఈ సామాజిక సంతులత ఒకే ఒక్క రాష్ట్రంలో కనిపిస్తున్నది ప్రస్తుతం. అదే తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రికి ఈ వైవిధ్యాలను గౌరవించటం తెలుసు. 1776లో స్వాతంత్య్రం పొందింది అమెరికా. అందరూ బ్రిటిష్ విద్యావిధానంలో చదువుకొని, ఇంగ్లీష్‌ను మాతృభాషగా అంగీకరించి నా, తమ, తమ వ్యత్యాసాలను గమనించి, ప్రజాస్వామ్యం పూర్తిగా అమలుకావాలన్న తపన తోటి దేశానికి ఒక సమాఖ్య విధానం ఏర్పర్చుకున్నారు. నిజానికి వారందరూ సొంత సంస్కృతిని, భాషలను వదిలే సి, ఇంగ్లీషును మాతృభాషగా అంగీకరించిన వారు. కానీ తమ తమ రాష్ర్టాలు స్వతంత్రంగా వ్యవహరించాలని ఆశించి తగినట్టు రాజ్యాంగా న్ని రూపొందించుకున్నారు. మరి రెండు రాష్ర్టాల భాషలు కూడా ఒకటి కాని మన దేశంలో ఏం చేయాలి? ఉత్తర భారత సంస్కృతి దక్షిణ భార త సంస్కృతి వేరు. మళ్ళీ ఈశాన్య రాష్ర్టాల సంస్కృతి దీనికి భిన్నం. ప్రతి ప్రాంతంలో ఒక్కో రాష్ర్టానికి ఒక్కో భాష. ప్రతి రాష్ట్రంలో వివిధ మతాల, కుల నిష్పత్తి చాలా వ్యత్యాసంగా ఉండటం, ఇన్నిరకాల వైవిధ్యాలతో ఉన్న దేశానికి అన్నీ తన అధీనంలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం అవసరమా? ప్రాంతీయ అంశాలు అర్థంచేసుకోలేని జాతీయ పార్టీలు న్యాయం చేస్తాయా? అన్ని వనరులతో పాటు మానవవనరులు కూడా పుష్కలంగా ఉండి, 45 శాతం యువశక్తి ఉన్న భారతదేశం ఏ వనరులేని అతి చిన్న దేశాలైన మలేషియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల కంటే ఎందుకు వెనుకబడి ఉండాలి? రాష్ర్టాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటే పోటీగా ఒకదాని కంటే ఇంకొకటి బాగుపడుతుంది కదా! మరి పనికిరా ని, పనిచెయ్యలేని ఈ జాతీయపార్టీలు దేశానికి అవసరమా? భారతదేశం నిజంగా ప్రగతి చెందాలంటే, ఈ కేంద్రీకరణ సిద్ధాంతాలు పనికిరావు.

వికేంద్రీకరణ జరుగాలంటే అవి ఈ జాతీయ పార్టీలు చేయవు. వచ్చే ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు అఖండ మెజార్టీ సంపాదించి, వారిలోవారు సయోధ్య సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. పార్లమెంటులో బిల్లు పెట్టి రాజ్యాంగాన్ని ఫెడరల్ సిస్టంలోకి మార్చాలి. రాష్ర్టాలకు తగినంత స్వాతంత్య్రాన్ని కల్పించాలి. సైన్యం, విదేశాంగ విధానాల వంటివి మొత్తం దేశానికి సంబంధించినవి. కాబట్టి అవి మాత్రం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండాలి. పరస్పర పోటీలతో రాష్ర్టా లు తమతమ వనరులు పూర్తిగా ఉపయోగించుకొని స్వయం సమృద్ధి సాధించాలి. సామాజిక సంతులత పొందాలి.

ఇదంతా జరుగాలంటే కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడి వలననే సాధ్యమౌతుంది. సమస్యల అవగాహన, పరిష్కారాల సాధన, వాటిని అమలులో ైస్థెర్యం, ప్రజల సేవకుడిగా వినమ్రత, వ్యత్యాసాలు గౌరవించే సంస్కారం, మానవ కల్పిత సమస్యలకు మానవ మేధే పరిష్కారాలు చూపాలనే పట్టుదల, ఏదైనా పని మొదలుపెడితే దానిని సాధించే పట్టు దల, సమర్థత, ఇతరుల ప్రజ్ఞాపాటవాలు గుర్తించి వారిని సరైన విధంగా ఉపయోగించుకునే తెలివితేటలు, ముఖ్యంగా మానవులందరూ సంతోషంగా బతుకాలనే కాంక్ష.. ఇన్ని విశేష లక్షణాలు కలిగిన విలక్షణ నాయకుడు నేటి భారతీయ రాజకీయరంగంలో ఉన్నది కేసీఆర్ ఒక్కరే. ఒక మేధావి, ఎన్నికలు గెలువగలిగిన రాజకీయ నాయకుడు, సాహిత్యవేత్త, పండితుడు, కార్యకర్త, ప్రజ్ఞ కలిగిన వక్త-ఇవన్నీ కలిగిన ఒక నాయకుడు ఉండటం సాధ్యం అన్నది ఇప్పుడే దేశం గమనిస్తున్నది. దేశానికి పనికిరాని జాతీయపార్టీలు, కేంద్రీయ పాలన మారి కేసీఆర్ లాంటి నాయకుడు సారథ్యం వహిస్తే ఒక్క దశాబ్దంలో భారతదేశం ప్రపంచపటంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
kanakadurga

604
Tags

More News

VIRAL NEWS